గురువయ్యూర్....2.
క్షేత్రదర్శనం-2
( రెండవ భాగము. )
(తృప్తిగా స్వామి దర్శనము.)
పఠంతో నామాని - ప్రమదభరసింధౌ
స్మరంతో రూపం తే - వరద ! కథయంతో గుణకథాః
చరంతో యే భక్తా - స్త్వయి ఖలు రమంతే పరమమూ -
నహం ధన్యాన్ మన్యే - సమధిగత సర్వాభిలషితాన్.
గురువయ్యూర్ దేవుడు.. గురువాయురప్ప.
చతుర్భుజుడైన నారాయణుడు. చిన్న విగ్రహము.
ఈ అర్చామూర్తిని స్వయముగా వైకుంఠనాధుడే బ్రహ్మదేవుని కోరికమేరకు, బ్రహ్మకు ఇచ్చాడని ఐతిహ్యం.
బ్రహ్మదేవుని నుండి సుతపుడు అను మహర్షికి, తర్వాత కశ్యప ప్రజాపతికి ఆయనద్వారా క్రమంగా వసుదేవునికి వచ్చి ..
ఆయా కాలాలో అర్చించబడింది.
శ్రీ కృష్ణుడు ద్వారకలో ప్రతిష్టించి అర్చించాడు.
యుగాంతంలో ద్వారక మునిగిపోయే సమయంలో ఈ అర్చామూర్తిని ఉద్ధవునికిచ్చి “దేవగురువు బృహస్పతి ద్వారా దీనిని ఒక పవిత్ర క్షేత్రంలో ప్రతిష్టింపజేయమని” శ్రీకృష్ణుడు ఆదేశించాడు.
గురుడు వాయుదేవుని సహకారముతో, పరమేశ్వరుని సూచనమేరకు, పరశురామ క్షేత్రమైన అప్పట్లో అంబాపురం గా పిలువబడే ఈ క్షేత్రంలో ప్రతిష్ట చేసారు.
గురువు, వాయువు ప్రతిష్ట చేయుటచే స్వామి ‘గురువాయురప్ప’ గా పిలవబడుతున్నాడు. క్షేత్రం గురువాయుపురమయింది. అదే ఈ గురువయ్యూర్..
ప్రక్కన ‘రుద్రతీర్థం’ అనే పుష్కరిణి. అందులో శివుడు చాలా కాలము తపస్సు చేసాడట. ఈ పుష్కరానికి ఈ ప్రక్క గురువాయురప్ప, ఆ తీరాన మమ్మియూర్ లో పరమశివుడు కొలువైనారు. మమ్మియుర్ లోని శివుని చూడకుండా గురువయ్యూర్ యాత్ర పూర్తికాదని చెప్తారు. అవకాశము లేనివారు గురువయ్యూర్ దేవళములో ఉన్న భగవతి అమ్మ ఆలయమునుండి ఈశాన్యదిశగా తిరిగి మమ్మియూర్ శివునికి భక్తితో అంజలి ఘటిస్తారు. అక్కడ ఆ సూచనతో బోర్డ్ కూడా పెట్టారు.
అశ్వద్ధామ వేసిన బ్రహ్మశిరోనామాస్త్రం ఉత్తర, గర్భవిచ్చిత్తి చేయబోతుంటే ..
‘గతాగత ప్రాణుండై శిశువు చింతించు సమయాన’.... “గదజేబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబునన్ దుర్భయప్రదమై వచ్చు శరాగ్ని దుత్తుమురుగా భంజించి రక్షించు సదయుడు..”... అలా పరీక్షిత్తును రక్షించిన వాసుదేవుడు. దేవకీ, వసుదేవులకు జన్మించి దర్శనమిచ్చిన “...శంఖ చక్ర పద్మ విలాసుడు, గంఠ కౌస్తుభ మణి కాంతి భాసుడు, కృపావిశాలుడూ ….” ఆ చతుర్భుజుడైన శ్రీ మన్నారాయణమూర్తియే ..
ఇప్పుడు “శిరమున రత్న కిరీటము, కరయుగమున శంఖచక్ర ఘన భూషణములు, ఉరమున వజ్రపు బతకము దాల్చిన” గురువాయూర్ పురనాథునిగా గురువయ్యూర్ లో దర్శనమిస్తున్నాడు.
రూమ్ లో స్నానాదికములు పూర్తి చేసుకుని, స్వామి దర్శనానికి లైనులో నించున్నాము. జనం బాగానే ఉన్నారు. మడత మడతలుగా వరుసలు, మొదట ఒక వైపుకి, మరల రెండో వైపుకి అలా అటూ ఇటూ కదులుతూ, మహా ద్వారము గుండా, లోపలకి ప్రవేశించాము. పద్దతిగా జనాన్ని వదలడమువలన ఎక్కడ తోసుకోవడం, తొక్కుకోవడం అనుభవమవలేదు. లైనులో వున్నవారు - విష్ణుసహస్రము కాని, నారాయణీయము కాని, ఇంకా ఏవేవో పుస్తకాలు చదువుతున్నారు. కొందరు “నమో నారాయణా “ అంటూ భక్తి ప్రకటిస్తున్నారు. మేము కూడా మా దగ్గర ఉన్న నారాయణీయము ఒక్కొక్క శ్లోకము అర్థంతో చదవడము మొదలెట్టాము .. రెండుగంటలకన్నా తక్కువ వ్యవధిలో దర్శనము పూర్తి చేసుకుని బయటికి వచ్చాము. దర్శనము తృప్తిగా లేదు. “ఇన్ని ఏర్పాట్లు చేసుకుని మేం వస్తే ఇంతేనా మాకు ప్రాప్తం” అని స్వామితో మౌనంగా చెప్పుకున్నాము.. విన్నాడా అన్నట్టుగా తర్వాత దర్శనాలు ఒకదానికన్నా ఒకటి ఆనందాన్ని కలిగించాయి.
గురువయ్యూర్ లో ’నిర్మాల్య దర్శనము’ చాలా ముఖ్యమని చెప్పారు. తెల్లవారఝామున మూడుగంటలకు ఆ దర్శనానికి అనుమతిస్తారు. ఆ దర్శనం చేసుకోవడానికి ఒంటిగంటకే వరసలు కట్టేస్తారు. మేము వెళ్లిన మూడో రోజు ఆ నిర్మాల్య దర్శనానికని మేమిద్దరమూ తెల్లవారుఝాము ఒంటిగంటకు లేచి, ఒంటిగంటన్నరకు స్నానాలు చేసేసి లైనులోకి వెళ్లాము. మేము వెళ్లేటప్పటికే యాభై అరవై మంది అప్పటికే లైనులో ఉన్నారు.. ఆడవారికి (బహుశా ఒంటరిగా వచ్చినవారు అయి వుంటారు) వేరే లైను ఉంది. కుటుంబాలతో వచ్చిన వారు మా లైనులో ఉన్నారు. రెండు గంటలు దాటుతుంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన నారాయణీయం శ్లోకాలు స్పీకర్ లో శ్రవణానందముగా వినిపిస్తుండగా లైనులు కదిలాయి .. “శ్రీ కృష్ణం శరణం మమ” అని వినిపిస్తుండగా మహా ద్వారం సరిగా మూడు గంటలకు తెరిచారు..క్రమంగా గర్భాలయము చేరి, స్వామిని దగ్గరనుంచి చూసాము. అదొక అద్భుత దర్శనము,
ఆనందమై పోయింది. నిర్మాల్యమంతా తీసేసిన మూల విరాట్టు.. స్నానానికి సిద్ధమైన పసిపిల్లవాని రూపంలో నేత్రానందముగా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయన్న మాట. ఈ స్వామికి తైలాభిషేకం కూడా రోజూ చేస్తారట.
గురువయ్యూర్ ఆలయంలో పరిశుభ్రత, ఆచారము చక్కగా పాటిస్తారు. ప్రధాన అర్చకుణ్ణి ‘మేల్ శాంతి’ అంటారు. ఆ తర్వాత హోదాలవారిగా మిగతా అర్చకులు ఉంటారు. ‘మేల్ శాంతి’ మాత్రమే మూలవిరాట్ కు అర్చన చేస్తారు. ఆయన ఆరు నెలలకోసారి మారతారు. కావాలంటే కొన సాగవచ్చునట. అర్చనచేసిన కాలములో అంటే ఆరునెలలు ఆయన ఆలయములోనే ఉండాలి. కఠిన బ్రహ్మచర్యదీక్షలో ఉండాలి. ఆ యా సేవల నడుమ ఆలయ ప్రాంగణంలో ఓ మూల ఆయన విశ్రాంతిగా కూర్చుని ఉంటారు.. మన గమనించి చూడవచ్చు. సన్నగా ఎర్రగా, తెల్లటి పంచె పొందిక గా కట్టుకుని, చూడగానే నమస్కరించాలనిపించే విధంగా ఉన్నారు ఆ ‘మేల్ శాంతి’.
ఆలయ ప్రవేశము హిందువులకు మాత్రమే. మగవారు విధిగా ధోవతి కట్టుకోవాలి, పైన ఉత్తరీయము ఉండవచ్చు. పాంటులూ, బనీనులు చొక్కాల వంటివి అనుమతించరు. లుంగీలాగా పంచె కట్టవచ్చు కాని, గళ్లలుంగీలు పనికి రాదు. ఆడవారు సాంప్రదాయ దుస్తులనే ధరించాలి. ప్యాంటులు పైన లుంగీలు కట్టుకున్నవారు, తెల్లదొరలు ఎక్కడా కనపడలేదు.
‘శ్రీ వెల్లి’ .. స్వామి ఊరేగింపు. చాలా బాగుంటుంది. ఇక్కడ తిరువీథి ఉత్సవమది. ఆ ఉత్సవాన్ని మూడు సార్లు చూసే అదృష్టం కలిగింది.ఆ ఊరేగింపు ముందు “మేల్ శాంతి” నడుస్తారు. ఆయన మడికి భంగముకలుగకుండా రక్షణ వలయముగా అర్చకులు చుట్టూ ఉంటారు. ఆయన ముందు పవిత్రజలాలను బలిపీఠంపై జల్లి నివేదన చేస్తారు. ఆలయం నలుమూలలా ఉన్న బలి పీఠాలపై జలం జల్లి పూలు పెడ్తారు . ఆయన వెనక నాదస్వరాది వాద్యములు వాయిస్తూ కళాకారులు. వారి తర్వాత ఆంగ్ల అక్షరము z ఆకారములో వంచబడిన వెండి ఊచలకు, వెండి జ్యోతులు తగిలించుకుని ఆ దీపాలతో మడిగా పది పదిహేను మంది బ్రాహ్మణులు.. ఆ వెనుక రాచ ఠీవితో .. మందగమనంతో స్వామి ఆస్థాన కరీంద్రుడు కదలుతాడు. . దానిపై ఉప పురోహితులు స్వామి బంగారు ఉత్సవ మూర్తి ని పట్టుకుని, కూర్చుని ఉంటారు. చిన్న విగ్రహము. చూడముచ్చటగా ఉంటుంది. ఆ మదగజము ముచ్చటగా కదులుతుంటే “హరే రామ, హరే కృష్ణ” అంటూ వెనుకగా భక్తజనము కదులుతారు. ముమ్మారు ప్రదక్షిణాగా సాగిన తర్వాత ఆలయ ప్రవేశ ద్వారంవద్దకు రాగానే, ఆ మహా గజము వినయంగా కాళ్ళు మడచి కూర్చుంటుంది. స్వామి ఏనుగుమీద నుంచి దిగి ఆలయ ప్రవేశం చేస్తారు. ఊరేగింపు పూర్తిఅయ్యేవరకూ లోపలకి ఎవరినీ అనుమతించరు.
ఈ శ్రీవెల్లి ఉత్సవంలో --హరే రామ, హరే కృష్ణా అంటూ ఒకసారి భక్తజనంలో కలిసి గజేంద్రుని అనుసరించాము. , మరొకసారి ముందునుంచి చూసాము, ఇంకొకసారి ఉత్సవమూర్తి ఆలయ ప్రవేశంచేస్తుంటే .. ఆలయ ప్రవేశద్వారం దగ్గర ఉండడంవలన స్వామిని దగ్గరనుంచి చూసే అదృష్టం కలిగింది.
తులాభారము.. కోరికసిద్ధించిన భక్తులు వివిధ వస్తువులతో తులాభారము చేసుకుని స్వామికి సమర్పించుకుంటారు.. చాలా మట్టుకు వస్తువులు నిర్ణయించిన ధరకు దేవస్థానం ఏర్పాటుచేస్తుంది. పసి వారికి అన్నప్రాసన చేసే పధ్ధతి కూడా ఉంది.
ఈ స్వామి అనుగ్రహముంటే ఎలాంటివ్యాధిఅయినా నయమవుతుందన్నది సత్యము. నారాయణ భట్టాద్రి అనే ఒక మహానుభావుడు పది హేనవ శతాబ్దంలో తన గురువుగారికి కర్మవశాత్తు కలిగిన పక్షవాతరోగాన్ని తనకు సంక్రమింప జేసుకుని, తననుండి ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి ఈ స్వామిని ఆశ్రయించాడు. రోజూ ఇక్కడ “రుద్రతీర్థం”లో స్నానంచేసి, స్వామి ఎదురుగా కూర్చుని భాగవత కథను వేయి శ్లోకాలలో వ్రాసి స్వామికి వినిపించేవాడు. పూర్తయ్యేటప్పటికి నారాయణాద్రి రుగ్మత పూర్తిగా తగ్గిపోయింది. గర్భాలయములో నారాయణాద్రి కూర్చుని భాగవతం వ్రాసిన పదేశాన్నిసూచిస్తూ ఒక శిలాఫలకము కనబడుతుంది. అతడు వ్రాసిన గ్రంధము “శ్రీమన్నారాయణీయం”. వివిధ భాషలలో వ్రాసిన భావార్థంతో అది లభ్యమవుతున్నది.
నారాయణాద్రి అనే మహాకవి నారాయణుని గురించి వ్రాసి ఆ నారాయణీయునికే వినిపించిన మహా మహిమాన్విత గ్రంధమది. నిత్యమూ అది పారాయణచేసేవారెందరో ఉన్నారు. ఒకరోజు, నేనూ, మా శ్రీమతీ చెరో పుస్తకమూ పట్టుకుని ఆసాంతమూ చదివి స్వామికి నివేదించుకున్నాము.
ప్రాంగణంలోనే ఒక చోట బల్లపై శరీరంలోని వివిధ అంగముల వెండి రూపులు ఉంచారు. ఏ అవయవమునకైనా అనారోగ్యము కలిగితే, దానికి సంబంధించిన రూపు అడిగితే అక్కడ ఉన్న ఆసామీ మనకు ఇస్తాడు. అది తీసుకుని మన సమస్య స్వామికి నివేదించుకుని మనకి తోచిన సంభావన అక్కడున్న హుండీలో వేస్తే చాలు. ఇంత ఇవ్వాలి -- ఇంతే ఇవ్వాలి--- అనే ప్రశ్నలేదు. అక్కడేకాదు ఆ ఆలయములో ఎక్కడా “డబ్బు” పెట్టమనే వారెవ్వరూ కనపడలేదు. వి.ఐ.పి.లు - ప్రత్యేక దర్శనాలు లేవు.. స్వామికి అర్చనలు అవుతూ ఉంటాయి, దర్శనాలు అవుతూ ఉంటాయి.
ఒకరోజు ఆయన ఎదురుగా కాస్సేపు నిలబడాలనే కోరిక బలంగా కలిగి, అలాంటి సేవ ఉందా అని అడిగితే లేదన్నారు.. ఆ మర్నాడు మేము సీనియర్ సిటిజన్స్ లైనులో లోపలకి వెళ్లాము. ప్రత్యేక సమయాలలో సీనియర్ సిటిజన్స్ ను అనుమతిస్తారు. ఆ లైనులోకి వెళ్లడమే, వయస్సు ప్రూఫ్ పట్టుకెళ్లాంగాని, ఏ చెకింగూ లేదు. ఆ నిజాయితీ మనకుండాలి. ఆ లైనులో గర్భగుడిలోకి వెళ్ళాము . అప్పుడే తిరువీధి నుండి స్వామి వేంచేసారు.వెండి జ్యోతులు పట్టుకు ముందునడచిన వారిని ముందు దర్శనానికి అనుమతించారు.. ఆ సమయానికి మేము స్వామికి ఎదురుగా వచ్చాము. మా ముందు ఒక మంటపము, అక్కడనుంచి స్పష్టంగా స్వామి కనపడుతూ ఉంటారు. అక్కడ మమ్ము నిలబెట్టేసారు.. ముందువారు కదిలెదాకా..కుడి వైపు తిరిగి,అలా ఎడమ వైపు,మళ్లీ ఎడమవైపు వెళ్తే స్వామికి ఎదురుగా దగ్గరగా వెళ్తామన్నమాట. అదేకదా నిన్న మేము కోరుకున్న దర్శనం. ఎంత దయ స్వామిది అనిపించింది. ఆయన అనుగ్రహముతో పది పదిహేను నిముషాలు ఆయన్ని ఆనందంగా చూసే భాగ్యం కలిగింది, కోరుకున్న విధంగా.. తీరుబడిగా… తృప్తిగా దర్శించుకున్నాము.
(మూడో భాగం త్వరలో )