Pages

Thursday, September 19, 2013

గు రు వ య్యూ ర్


గు రు వ య్యూ ర్ - 1
  క్షేత్రదర్శనం


(జులై నెలలో కేరళలో ఉన్న గురువయ్యూర్ క్షేత్ర దర్శనం కోసం బయలుదేరాము. . అక్కడకు వెళ్లాలనుకున్నది మొదలు,  తిరిగి ఇంటికి వచ్చేవరకూ ఎంతోమంది సహకరించారు.. అదంతా భగవత్కృపగా భావిస్తూ ఆ ఆనందానుభూతులను మీతో పంచుకోవాలని ఇలా వ్రాస్తున్నాను.


****       ******    ***********        **************         **************             **************

(గురువయ్యూర్ చేరడం.. సెటిల్ అవడం..)




“సాంద్రానం దావబోధాత్మక మనుపమితం కాల దేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్య ముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానమ్ ।
అస్పష్టం  దృష్టమాత్రే పునరురు  పురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం
తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ ॥ “




‘శ్రీ మన్నారాయణీయము’  ప్రవచనము  చెప్తున్నప్పుడు గురువుగారు (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు) గురువయ్యూర్ గురించి చెప్పారు. తరవాత గురువుగారు  ఒక సందర్భం లో ‘నారాయణీయం’ పారాయణ ఆరోగ్యప్రదమన్నారు.. గురువుగారి సందేశము మనస్సుకు అంటింది. హైదరాబాదు మా  అమ్మాయి దగ్గరకి వెళ్లినప్పుడు, ‘నారాయణీయం’ పారాయణ చేసి సైనిక్  పురిలో ఉన్న గురువాయురప్ప ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నాను. హైదరాబాదు సైనిక్ పురిలో ఆ ఆలయం చాలా బాగుంది. చక్కటి వాతావరణంలో నిర్మలంగా,ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ విష్ణుసహస్రం చదవగలగడం స్వామి కృప. మనస్సులో గురువయ్యూర్ వెళ్లాలనే
తలపు అప్పుడే  అంకురించింది.
మనస్సునిండా గురువయ్యూర్ చూడాలన్న కోరికతో హైదారాబాదు నుండి ఇంటికి - రాజమండ్రి - చేరాను.  
మన ఆర్తి స్వామికి చేరితే చాలు .. ఇంక ఆయనే చూసుకుంటాడు. అదో ధైర్యం.  .. నాకు కిరాణా ఇచ్చే
షావుకారుగారు ఆధ్యాత్మిక చింతన పరిపూర్ణంగా కలవాడు. నా ఆలోచన ఆయనకు చెప్పాను. ఇటువంటి భక్తుల చెవులద్వారానే కదా భగవంతుడు వినేది. వెంటనే ఈ మిత్రుడు స్థానికంగా ఉన్న తన  మిత్రుడు ఒకాయనకు  
ఫోన్ చేసి రప్పించాడు. ఆ వచ్చినాయన కేరళకు చెందినవారు. రాజమండ్రిలో స్థిరపడ్డారు. ఆయన
మరోభగవద్భక్తుడు.

రెండురోజుల్లో, ఆయన నాకు గురువయ్యూర్ క్షేత్ర దర్శనానికి .. ఏ రైలు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, వసతి సౌకర్యం, భోజన సదుపాయం. .. అన్నీ వివరిస్తూ ఒక లిస్ట్ ఇచ్చేరు.ఆ కాటేజీల ఫోన్ నెంబర్లతో సహా ఆ లిస్ట్ లో  వ్రాసారు.  పైగా అక్కడ జరిగే సేవలు, చూడవలసిన ప్రదేశాలు అన్నీ వివరించారు. ఆ మరునాటినుంచి నాకు ఫోన్ చేసి రిజర్వేషన్ అయిందా ఎప్పుడు ప్రయాణం అంటూ వెంటబడి మరీ వాకబు చేసేవారు.సరే! నెట్ (కంప్యుటర్) ముందర కూర్చున్నాను. త్రిసూర్ మీదుగా వెళ్లే ఏ ట్రైన్ అయినా ఎక్కి , త్రిసూర్ దిగి అక్కడనుంచి బస్సు..  నలభై నిముషాల దూరంలో గురువయ్యూర్. డైరెక్ట్ ట్రైయిన్ లో టికట్టు దొరకలేదు. అంచేత  రాజమండ్రి నుండి మద్రాసు అక్కడనుండి త్రిసూర్. రైలు రిజర్వేషన్ చేయించాను.సరిగా మేం  బయల్దేరే రోజు…  కాంగ్రెసు పార్టీ తెలంగాణ కు తాము  అనుకూలమంది. అది మనకు ప్రతికూలం అయింది. కోస్తాలో అంతా  స్వచ్చందంగా బంద్ లు మొదలెట్టారని టి.వి.లో వార్తలు. మా  పిల్లలు రిస్క్ తీసుకోవద్దని మాకు ఫోనులు. స్టేషన్ దాకా వెళ్లడానికి  ఆటోలు ఉంటాయో వుండవో .. టెన్షన్. స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ ఒకాయన మా బంధువు. అతనికైతే తెలుస్తుంది కదా అని  ఫోన్ చేసా.. మద్రాసు వైపు వెళ్లే రైళ్లకు రిస్క్ లేదు అని భరోసా ఇవ్వడమే కాకుండా,  తన కారులో స్టేషన్ కు తీసుకు వచ్చికంపార్ట్ మెంటు  లోపల లగేజి అదీ సర్ది .. టాటా చెప్పాడు.

మద్రాసులో ఉన్న మా మిత్రుడొకాయన ఎందుకో నాకు ఫోన్ చేస్తే మద్రాసువస్తున్నా అని మాటల్లో అన్నా.. అలా చెప్పగానే ఆనందంతో  తన ఇంటికి రమ్మని గట్టిగా చెప్పాడు. మద్రాసులో ఉదయం దిగ్గానే వాళ్లింటికి  వెళ్తే
భార్యా భర్తలు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు.ఆ సాయంత్రము మద్రాస్-అల్లెప్పీ ఎక్స్ ప్రెస్  లో  త్రిసూర్ బయల్దేరాం.  ట్రైనులోకి డిన్నర్ ప్యాక్ కూడా  ఇచ్చారు.. మా ఇద్దరికీ అప్పర్ బెర్త్ లు. వయస్సు రీత్యా ఎక్కడం కొంచం కష్టమే మరి.. ఎదురుగా ఉన్నవాళ్లనడుగుదామంటే మన ఇంగ్లీషు వాళ్లకి అర్థం కాదు, వారి భాష మనకి అసలర్ఠం కావటం లేదు.
మా సమస్యను అర్థంచేసుకున్నారు లావుంది, ఎవరితో ఏంచెప్పారోతెలియదు కాని, మాకిద్దరికీ లోయర్ బర్త్ లొచ్చాయి.

కేరళ రాష్ట్రంలో ఉన్న గురువయ్యూర్,ట్రివేండ్రం వంటివి  ఇదివరలో చూసాం.. కాని గోడ ముట్టుకున్నట్టే.
యాత్రాస్పెషల్స్ వారితో  రావడం .. వాడు చూపినవి చూడ్డం .. పరుగెత్తడం.. అలాగన్నమాట… …
సరే .. ట్రైన్..  త్రిసూర్ చేరడానికి ఇంకా టైముంది… అప్పుడప్పుడే  తెల్లారుతోంది.  కంపార్ట్ మెంట్ తలుపు
దగ్గరనుంచుని, ఆ ప్రభాత వేళ, చిరుగాలులు శరీరాన్ని తాకుతుంటే, ఇటూ అటూ ఉన్న పచ్చటి ప్రకృతిని చూడడం 
ఓ మధురానుభూతి. పశ్చిమ దిశాధిపతి అనుగ్రహించిన వర్షపుజల్లులతో తడిసిన చెట్లూ,చేమలూ ఉదయ కాంతులతో మెరిసిపోతుంటే చూడ్డానికి రెండు కళ్లూ  చాలవనిపించింది. ప్రతి ఇల్లూ చెట్ల మధ్యనే కట్టుకున్నారు. ఎక్కడచూసినా చక్కటి పచ్చదనం.  చెట్లు పెంచారు…అందుకని వర్షాలు కురుస్తున్నాయి, వర్షాలు కురుస్తాయి  అందుకని చెట్లు పెరుగుతాయ్.ప్రతి వర్షాకాలంలోను మనదేశంలో మొట్టమొదటిగా అక్కడ ప్రకృతి, వరుణదేవునికి  ముందు స్వాగతం పలుకుతుంది. కేరళరాష్ట్రాన్ని నైఋతి ఋతుపవనాలు.. తాకితేనే కదా మనకు వర్షాలొచ్చేది.  నేను చూసిన ప్రాంతంలో ఇంకా అపార్ట్మెంట్ కల్చర్ అంతగా వచ్చినట్టు లేదు. ప్రతి ఇంటికీ డాబా/టెర్రేస్ పై  రేకులు/బంగాళా పెంకులు ఉపయోగించి ఇంగ్లీష్ అక్షరం ‘A’ షేప్ లో పందిరిలా వేసారు .. దానివలన మూడు ఉపయోగాలు… 1.వర్షపు నీరు జారిపోతుంది, డాబా లీక్ అనే సమస్య రాదు. 2. దానిక్రింద చిన్న వర్షాలకు భయపడకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు. 3. వేసవిలో పై గదులు కూడా చల్లగా ఉంటాయి. ఇలా చేయడంవలన మనకున్న బాధలు వీళ్లకుండవేమో అనిపించింది.

సుఖంగా త్రిసూర్ చేరాము.. లగేజ్ ఎక్కువ.. రాత్రి ప్రయాణములో పరిచయమైన జంట, మా సామానులు ప్లాట్ ఫాం మీద దింపి, మాకు వీడ్కోలు చెప్పి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఆయన పేరు మాథ్యూస్, ఆమె మరియమ్మ.

పోర్టర్ సాయంతో లగేజ్ బయటికి తెచ్చి,  గురువయ్యూర్ కు టాక్సీ అడిగితే- ఎక్కువ అడుగుతున్నాడేమో  
అనిపించింది.  తటపటాయిస్తుంటే, ఒక అమ్మాయి కనపడింది. ఆమెను పలకరించా.. ఆమె కూడా గురువయ్యూర్ వెళ్తున్నానంది. టాక్సీ షేర్ చేసుకుందామా అంటే సంతోషంగా ఒప్పుకుంది. అలా షేర్…  టాక్సీ వాడు ఒప్పుకోనన్నాడు. 
వెంటనే ఆ అమ్మాయి, తనతో వస్తున్న అమ్మగారిని లగేజీని మా దగ్గరపెట్టి, బయటకు పోయి ఒక టాక్సీ తెచ్చింది ..
దారి పొడుగుతా కబుర్లు చెప్తూ చాలా స్వల్ప కాలంలో ఆత్మీయంగా అయిపోయింది.. మేము ఏమేమి చూద్దామనుకుంటున్నామో అడిగింది. “చాముండేశ్వరి దేవి “ ఆలయం చాలా మహిమగలదని, అది కూడా
చూడమంది. తానొచ్చి తీసుకెళ్లి అన్నీ చూపిస్తానంది. గురువయ్యూర్ చేరగానే, ముందు ‘కౌస్తుభం’ కు వచ్చి,
మమ్మల్ని దింపి రెసెప్షన్ వాళ్లు తనకు తెలుసని చెప్పింది. వాళ్లతో వీరు నా స్నేహితులు,చాలా  జాగ్రత్తగా
చూసుకోమని చెప్పి అప్పుడు వెళ్లింది. తను చెన్నై లో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నది. తన వాళ్లతో
తమ పండుగ - రంజాన్ -  జరుపుకోవాలని అమ్మా నాన్నల దగ్గరకి వచ్చింది.

‘గురువాయుర్ దేవస్వాం’ వారి నిర్వహణలో ‘కౌస్తుభం’, ‘పాంచజన్యం’ కాటేజీలు. నేను ‘కౌస్తుభం’  లో బుక్ చేసుకున్నాను. వారం రోజులకు ముందుగానే సొమ్ము పంపించేసాను. చక్కటి రూమ్, డబుల్ బెడ్, గీజర్, సదుపాయాలతో నీట్ గా ఉంది. ఎలక్ట్రికల్ స్టౌ, గ్రైండ్ చేసిన కందిపప్పు, (తొందరగా ఉడుకుతుందని),  పెసర పప్పు,  
ఇన్ స్టాంట్ కాఫీ, వేయించిన పోపు, ఒకటి రెండు పచ్చళ్లు పట్టుకుపోయాం.  పాలు కూరగాయలు కొనుక్కునే వాళ్లం. గిన్నెలో పాలు కాచి కాఫీ తాగేసాక, ఆ గిన్నె కడిగేయడం రైస్, ఆ అన్నం ఇంకోగిన్నెలోకి తీసి, కూర ఉడక పెట్టి పోపు జల్లడం, … పప్పు, పులుసు, రసం అన్నీ చేసేసిదావిడ. తమాషా ఆ వారం రోజులూ మేము నూనె అస్సలు వాడలేదు.. అయినా చక్కగా తిన్నాము. ఏదైనా అలవాటును బట్టే కదా..


                                                                                                                          (to be continued.)





2 comments:

రవి said...

బావుంది. రెండు వారాల క్రితమే నేనూ గురువాయూర్ కు వెళ్ళి వచ్చాను, మా ఇంటి వాళ్లతో కలిసి. ఆన కోట్టై, మమ్మియూర్, చావక్కాడు బీచ్ ఇవీ చూశారా?

Anonymous said...

మీ గురువాయుర్ పర్యటన విశేషాల మొదటి భాగం చాలా బాగుంది మరి రెండో భాగం
ఎప్పుడో ?.