రాజమండ్రి - స్మార్ట్ సిటీ …
రచన: డి.వి. హనుమంతరావు
అప్పుడే వర్షం వెలిసింది. అని సంబరపడుతున్నాను..
“ఏమండీ .. కందిపచ్చడి చేస్తాను.. కారం లేని ఎండు మిరపకాయలు తెండి”అంది .
“మిరపకాయలంటే కారం కోసమేగా.. కారం లేకుండా ఎలా ఉంటాయోయ్ ?” కొంచెం ఇదయ్యాను.
“మీదో మట్టి బుర్ర .. “ అని మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని
“ఎందుకుండవ్ ? మీకేం తెలుసు ? ఉంటాయ్. వెళ్లి తెండి“అంది
నాది మట్టిబుర్ర అన్నప్పుడు .. కామోసు అనుకున్నా కాని మంగళ సూత్రాలు కళ్లకద్దుకున్నాక నా బుర్ర గట్టి పడ్డట్టనిపించింది
“ఇదిగో, ఇక్కడున్నట్టు రావాలి, వెడల్పుగా,లావుగా నల్లగా ఉంటాయి, అవిఅయితే కారం ఉండవు. జాగ్రత్తగా చూసి తెండి .. లేపోతే ఏవో ఒకటి అంటకట్టేస్తాడు, మీరసలే ఓ మాలోకం.. ఉంటే కూరొడియాలు కూడా తెండి ”
“బాగుంటుందోయ్, వంకాయ పచ్సిపులుసా? అందులో వడియాలు చాలా బాగుంటాయ్, మా అమ్మ చేసేది కూడాను.”
“మీది మతిమరుపు మేళం.. నేనూ చేసాను, మరిచిపోతారు” ..
మంగళ సూత్రాలు తీసింది కాని, మరీ అంత పెద్ద తప్పుకాదనుకుందో, లేక ఇందాకటి కళ్లకద్దుకోడానికి దీనికీ సరిపెట్టేసిందో కాని.. ఇప్పుడు మాత్రం ...కద్దుకోకుండానే లోపలెట్టేసుకుంది.
సరే బయల్దేరాను.. దేవీ చౌక్ దాకా వెళ్దామని .. మా అపార్ట్ మెంట్ ఉత్తర ముఖంగా ఉంటుంది. .. కాంపౌండ్ లో ఉన్న మా ఆంజనేయస్వామికి ఒక మ్రొక్కు మ్రొక్కి , నేను సాధారణంగా ఈశాన్య దిక్కుగా బయల్దేరి తూర్పుకి తిరుగుతాను..విజయంతో తిరిగి రావాలని… అదో సెంటి మెంట్ .. అలాగే కొంచెం దూరం వెళ్లి రైట్ కు తిరిగాను.. అంటే బాల విజ్ఞానమందిర్ వీధిలోకి.. అలావెళ్తే అక్కడో రాజకీయ నాయకుడి ఇల్లు ఉంది. ఆ ఇంటి మీదుగా వెళ్తే గణనాయకుడి గుడి వస్తుంది. స్కూటర్ దిగకుండానే అక్కడ శిరస్సు వంచడం ఓ అలవాటు. ..కానీ ఈలోగా కారంలేకుండా ఉన్న మిరపకాయలు, వీలైతే పచ్చిపులుసులోకి కూరొడియాలు తేడానికి కార్యార్థినై వెళ్తున్న నన్ను .. ఒక రక్షక భటుడు అటకాయించాడు..
ఖంగుతిన్నాను. మరీ రాజమండ్రిలో ఓ మూలకున్న మా శ్రీరామనగర్ లోకి రక్షక భటులు రావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆరా తీసా.. ఊళ్లోకి పర్యటనకు వచ్చిన ఓ మంత్రిణిగారు పాపం ఇడ్లీ తినడానికి ముచ్చట పడ్డారు .. ఓ రెండు ఇడ్లీ వాచ్ మన్ తో తెప్పించుకు తినొచ్చుగా .!..లేపోతే ఏదో హోటల్ లోకి మారువేషంలో వెళ్లి తినొచ్చు కదా, ఆవిధంగా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఒక జత ఇడ్లీలు తిండానికి ఎన్ని డబ్బులిస్తున్నారో తెలిసేది…
ఠాఠ్ ! అలాక్కాదు, మా ఇంట్లో ఇడ్లీ వేడిగా వేయిస్తానని (వేయించడం అంటే వేపుడు కాదుఅని మనవి, అదీ కాక ఇడ్లీ వేయిస్తే బాగోదు కూడాను ..) .. బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని గణనాయకుని వీధిలో ఉన్నసదరు రాజకీయ నాయకుడుగారు మంత్రిణి గారిని ఆహ్వానించారు.. ఆ జత ఇడ్డెన్ల కోసం పాపం సదరు ఆవిడ వీరింటికి వచ్చారు.. సదరు ఆవిడ సదరు జత ఇడ్డెన్లూ తింటుంటే ఎలా ఉంటుందో చూడాలని చోటా నాయకులు, కార్యకర్తలు వచ్చారు. ఇడ్లీ చల్లారకుండా మన పేపర్లో ఆ న్యూస్ రావాలంటూ వివిధ పేపర్లవాళ్లు పంపించిన విలేఖర్లు వచ్చారు.. ఆ ఇడ్లీన్యూస్ బాగా కవర్ చేస్తే ఇక్కడ మంత్రిగారికి తినడానికి ఇడ్లీ కనపడకపోయినా అక్కడ అన్ని టి.విల్లోనూ గ్రాఫిక్స్ ఉపయోగించి ఆవిర్లొచ్చే ఇడ్లీలా తర్జుమా చేసి వేడిగా కనపడేటట్లు కవర్ చేయడానికి టి.వి వాళ్లొచ్చారు. ఇడ్లీ తింటున్న మంత్రిణిగార్ని- అభిమానించే ప్రజలు చూడకూడదని, ఆ ఇడ్లీ నేపథ్యంలో (టి.వి. భాషొచ్చేస్తోందిరోయ్ ) ఏ అవాంచనీయ సంఘటనలు జరక్కుండా పోలీస్ బందో బస్తన్నమాట ఇది … నేను అట్టి విషయ సేకరణలో ఉండగా, చేతిలో లాఠీతో ఆ ప్రక్క వీధికి అన్నట్టు నన్నయ్య వీధిలోకి నన్ను మళ్లేసాడు రక్షక భటుడు.
సరే ఆ వీధిలోకి స్కూటర్ తిప్పి సాయిబాబా గుడి దాకా వెళ్లకుండానే.. ఎవరో చెప్పారు.. ఎదర రోడ్డు అడ్డంగా తవ్వేసారట అని. ఎందుకటా అని క్వచ్చిస్తే (సారీ ఇంగ్లీష్ లో బాంటుందని ఇలా వ్రాసా ) .. ప్రశ్నించా…కార్పొరేషన్ కు క్రొత్త ప్రభుత్వం, క్రొత్త పుష్కరాలు, క్రొత్త ఫండ్స్ అందుకని క్రొత్త పైపు లైనులు వేస్తున్నారట.... అన్నారు.
“అదిరిందయ్యా చంద్రం.. “అని నాకు నేనే జోకు వేసుకుని ప్రక్కవీధిలోకి తిరిగా…
అక్కడ పాత ప్రభుత్వం వారు వేసిన పాత పైపులైను లీక్ అయి పుష్కలంగా నీరు బయటికొచ్చేసి, గోదావరి నదిలా పొంగిపొర్లుతోందని,.. అడ్డంగా గొయ్యి తీసి .. అందులోకి దిగి మరీ రిపేర్ చేస్తున్నవారు కనపడ్డారు..
ఏంచేస్తాం .. ప్రక్క వీధిలోకి త్రిప్పి కొంచెం వెళ్ళగానే బి.యస్.యన్.యల్ వారు ఎదిగిన చెట్లు దూరశ్రవణం యొక్క ప్రగతికి నిరోధకాలని కొట్టేసి .. ట్రాఫిక్ నిరోధకాలుగా రోడ్డుకి అడ్డంగా వేసారు.. కొమ్మలు చేవదేరి ఉన్నాయి. రిస్క్ తీసుకోవడం క్షేమదాయకం కూడా కాదు. ఈ వయసులో ఎముక- ‘...విరిగిపోతే అతకదు మల్లా’ అని మూగమనసులోని పాటలో ఆలోచించినవాడినై ప్రక్కవీధిలోకి తిరిగా, సారీ త్రిప్పా స్కూటర్ ..
ముందు ఓ పెద్ద పంది, దానివెనకాల ఆ పందిని తరుముతూ అంతే పెద్ద శరీరంగల ఒక ఆసామీ చేతిలో ఉరితాడులావేసిన కర్రతో పరుగెడుతూ అడ్డం పడ్డాడు .. తప్పించుకుంటూ ఉంటే కూడా పిల్ల పందులు బిల బిలమంటూ వచ్చేస్తున్నాయి… వాటిని తప్పించుకోడానికి స్కూటర్ కొంచెం కష్టపడి నిల దొక్కుకుంది. గవర్నమెంట్ మారాక మా వీధుల్లో పందులు కొంచెం విచ్చల విడిగానే తిరుగుతున్నాయి. సరే ఆ రాజకీయాలు, గొడవలూ మనకేల? పవిత్రమైన ఓటేసేసాం.ఓటు హక్కు వినియోగించేసుకున్నాము,,మిగతా విషయాలు మనకవసరమా చెప్పండి .. మళ్ళీ ఇంకో ప్రక్కకి తిప్పా..
ఇంతలో ఫోన్ మ్రోగింది..
“హలో”
“హలో”
“మీరేనా ఎక్కడున్నారు?”
“దార్లో ఉన్నాను”
“ఇవతల పచ్చడి ఆగిపోయింది.. తొందరగా రండి, మళ్లీ కరెంట్ పోతుంది’
“కరెంటాఫీసుకు ఫోన్ చేయ లేదా మరి.. :
“ఆ వెటకారమా, .. మీరొచ్చాక చంద్రబాబు నాయుడికి ఫోన్ చేద్దురుగానిలెండి .. నోరు మూసుకుని రండి త్వరగా “,..
మంగళ సూత్రాల చప్పుడు వినపడింది.. పాపం అద్దుకుంటున్నట్టుంది, ఎంతైనా పతివ్రతగదా..
మా ఆవిడ మాటలు, దానితో మంగళ సూత్రాల చప్పుడు అన్నీ ముందు కుడి చెవిలోంచి, తర్వాత ఎడమ చెవి దగ్గరున్న ఫోన్ లోంచి సైమల్టేనియస్ గా వినపడుతున్నాయి, స్టీరియో అఫెక్ట్ తోటి..
“అయినా ఇక్కడున్నట్టు రమ్మన్నానుగా ఇంతసేపు ఏంచేస్తున్నారు?” అని ముందు కుడి చెవిలోనూ, తర్వాత ఎడమ చెవిలోని ఫోన్ లోనూ .. స్టీరియో…అఫెక్ట్ తో మాట్లాడింది మా ఆవిడ..
చుట్టు చూసా .. జ్ఞానోదయం అయింది… నాకు ప్రక్కన మా అపార్ట్ మెంట్ ‘సాయి అభయ ఎంక్లేవ్’ దర్శన మైంది ..
“అయినా ఇక్కడున్నట్టు రమ్మన్నానుగా …”
“ఇక్కడున్నట్టే ఉన్నానోయ్ …”
ఏ వీధిలోంచి .. ఏ వీధిలోకి తిరుగుతున్నానో తెలియక .. అలా అలా తిరిగి
ఇంకా ఇక్కడే ఉన్నట్టున్నాను..
[స్మార్ట్ సిటీ కాబోతున్నరాజమంద్రిలో ఒక అనుభవం .. సరదాకొంచెం కలపి]