Pages

Friday, September 5, 2014

రాజమండ్రి-7 -- రాజమండ్రిలో అప్పట్లో నేను పోషించిన హోటల్స్ …


రాజమండ్రిలో అప్పట్లో నేను పోషించిన హోటల్స్ …  


ఆ రోజుల్లో  మా వయసు వాళ్లం హోటల్ కు వెళ్ళాలంటే స్వతంత్రంగా వెళ్ళేవాళ్ళం కాదు.. నాకైతే పెద్దవాళ్ళకు తెలుస్తే ఏమన్నా అంటారేమో అని భయం ఉండేది.. .. వారేమనకపోయినా కూడా ..ఆ భయం ఉన్నా 
హోటల్స్ ను నా శక్తిమేరకు పోషించాను..

కాతేరు రోడ్ పై లింగంపేట దగ్గరగా ఒక చిన్న హోటల్ ఉండేది చాలా కాలం క్రితం.. అక్కడకి మా దగ్గర పని చేస్తున్న నాగేశ్వరరావు తీసుకెళ్లి మొట్టమొదటిసారి  సాంబారు ఇడ్లీ ఇప్పించాడు.. అది నా హోటలేంగట్రం. .. పులుసుతో  ఇడ్లీ తిండం అప్పట్లో అర్థం కాలేదు.. పొంగులొస్తున్న వేడి వేడి పులుసుతో ఇడ్లీ నోట్లో పెట్టుకోగానే మూతి కాలి పోయింది, ఆ వేడికి .. ఆ తర్వాత తెలిసింది .. దాన్ని పులుసు అనకూడదు .. సాంబారు అనాలి అని.

తర్వాత కొంచెం పెద్దయ్యాక  ఎప్పుడైనా మధ్యాహ్నం కారియర్ లేపోతే.. ఇడ్లీ మాత్రమే తిను, అడ్డమైనవీ తినకు అని అమ్మా నాన్నగారు - మరీ మరీ చెప్పి ఓ బేడ ఇచ్చే వారు. పుష్కరఘాట్ లో మా స్కూల్ ఉండేది. ఇప్పుడు శివుని విగ్రహం ఉన్న చోట ఒక కాకా హోటల్ ఉండేది. అక్కడ అర్థణాకు రెండు ఇడ్లీ ఇచ్చేవారు.. పచ్చి మిరపకాయ చట్నీవేసేవాడు.. చాలా బాగుండేది.. 

ఆ తర్వాత యస్.యస్.యల్.సీ లోకి వచ్చాక .. అంటే 1957 మార్చ్ లో పరీక్షలప్పుడు… రెండు పూటలా పరీక్షలుండేవి. [ఇప్పుడున్న Xత్  క్లాసుకన్నా తర్వాత క్లాస్ యస్.యస్.యల్.సీ. అదయ్యాక మాతోపాటే పి.యు.సి ప్రారంభమైంది. ఇప్పుడు 10త్ తర్వాత రెండేళ్ల ఇంటర్ వచ్చేసింది..] అప్పుడే కోటగుమ్మందగ్గర ఇప్పుడు తుమ్మిడి రామ్ కుమార్ బట్టల షాపున్నదగ్గర ‘లక్ష్మీ కేఫ్’ అని ఒక కొత్త హోటల్ ప్రారంభించారు.. ఆ పరీక్షలు వారం రోజులూ మధ్యాహ్నం అక్కడ టిఫిన్ తినమని ఇంట్లో డబ్బులిచ్చేవారు. ఆ హోటల్ బయట బోర్డు మీద… ఇక్కడ వెన్నతో కాచిన నేయి వాడబడును.. కాదని ప్రూవ్ చేస్తే రు.116/- బహుమానం అని ఉండేది. నిజంగానే ఇడ్లీ కారప్పొడి తింటే మూడు గరిటల నెయ్యి వేసేవాడు.. ఎంత బావుండేదో… ఈ హోటల్ కు కాలేజీలో చదివే టప్పుడు, ఉద్యోగంలేక బేవార్స్ గా తిరిగేటప్పుడు కూడా  రెగ్యులర్. దోసె వేసేవాడండీ … అబ్బబ్బా ఏంటేస్టండీ బాబూ… అందులోకి కొబ్బరి చట్నీ, అల్లం చెట్నీ  ప్లస్ సాంబారు.. అన్నీ చాలా టేస్టీగా ఉండేవి.. చపాతీ కుర్మా.. అక్కడ ఆ వెజిటబుల్ కుర్మా వాడు చేసే విధానమే స్పెషల్ … దోసెకి మాత్రం డిమాండ్ ఎక్కువ. 

తర్వాత వీళ్లే పంచవటీ హోటల్ ప్రారంభించారు.. అందులో ఎ.సి రూం ఓ ప్రత్యేకాకర్షణ. లక్ష్మీకేఫ్ కన్నా రేట్లెక్కువ. కానీ టేస్టీ ..ఈ హోటల్ ప్రస్తావన ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చిలో కనపడుతుంది.

ఆ కోటగుమ్మందగ్గరే జైహింద్ కేఫ్ … 
ఆ ప్రక్కన వెల్ కం హోటల్ .. ఈ రెండూ కూడా ఇరవై నాలుగ్గంటలూ పనిచేసేవి.. ఎందుకంటే అప్పట్లో గోదావరి స్టేషన్ కు రైలు ట్రాఫిక్ ఎక్కువ, అలాగే అక్కడ ఇల్లీగల్ ట్రాఫిక్ కూడా ఎక్కువ అనేవారు. దానా దీనా బేరాలు బాగుంటాయి కదా మరి.. ?

అలా మార్కెట్ వైపుకు వెళ్తే .. బాటా షూ కంపెనీ దగ్గర లక్ష్మీ విలాస్ హోటల్ .. అది సాంబార్ ఇడ్లీకి ఫేమస్. మేం స్కూల్లో చదువుకునే రోజుల్లో మా మాష్టార్లు ఇక్కడనుంచి మా చేత టిఫిన్స్ అవీ తెప్పించుకునేవారు.. పెద్దపిల్లాడు వెళ్తుంటే సాయంగా మా లాంటి కుర్రగాళ్లం వెళ్లేవాళ్లం. గురు శుశ్రూష అన్నమాట. ఈ హోటల్కు బయటికి రెండు గుమ్మాలుండేవి .. మధ్యలో ప్రోప్రైటర్ ఇన్నమూరి చెంచయ్యగారు కూర్చుని బిల్లులు తీసుకునే వారు.. ఆయన మునిసిపల్ వైస్ చైర్మన్ గాకూడా ఉండేవారు.. కొందరు ఆయన  కన్నుగప్పి  డబ్బులీయకుండా వెళ్ళిపోయేవారని అనేవారు.

కొంచెం ముందుకెళ్తే నల్లమందు సందులో అనుకుంటా .. మా టైపు ఇన్స్టిట్యూట్ ఉండేది. దానికెదురుగా కోదండ రామా విలాస్ .. పి.యు.సి డెక్కాక టైప్ నేర్చుకునేవాణ్ణి అప్పుడోసారి అక్కడ మరో ఇద్దరు మిత్రులతో వెళ్లాను.. పూరి కూర .. వాసన అలా చేతులకుండిపోయింది. ఇంట్లో తెలిస్తే .. అమ్మో ఇంకేమన్నా ఉందా.. భయం.. ముగ్గురం పరీక్షలు పోయి.. దేశోద్ధరణకోసం టైపులో చేరిన వాళ్లమే.. ‘ముండా దేవుడు ముగ్గుర్నీ కూర్చా’డనీ మాలో ఒకడు కామెంట్ చేయడం ఇంకా గుర్తు..అతడే ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో మాకెదురుగా ఫ్లాట్ లో ఉంటున్నాడు. 
అది దాటి ముందుకెళ్తే విశ్వభవన్ .. అది కోదండ రామా విలాస్ వారిదే .. పెద్ద హోటల్ .. రుచికరంగా ఉండేవి పదార్థాలు..

హైస్కూల్ ,కాలేజీ రోజుల్లో ఇంతవరకే మన సామ్రాజ్యం..కాలేజీలో కూడా మాధవరావు కాంటీన్, భాస్కరరావు కాంటీన్ .. మేము భాస్కరరావు కాంటీన్ కు అలవాటు పడ్డాం. అయితే మాధవరావు కాంటీన్ కు మంచి పేరుండేది.  
డిగ్రీ మూడేళ్ళు అయి .. ఒకటి రెండు దండయాత్రలు చేసి .. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఉద్యోగం .. ఆల్కాట్ గార్డెన్స్ లో గవర్న్ మెంట్ సా మిల్లులో ఉద్యోగం..

ఉదయమే ఇంట్లో అమ్మ వేసిన వాసినపోలు వేడి వేడి గా తిని, 7-30కి సైకిల్ ఎక్కేవాణ్ణి . మధ్యాహ్నం క్యారియర్ వచ్చేది. మధ్య మధ్యలో .. మా మిల్లుకి దూరంగా ఓ శెట్టి గారు హోటల్ పెట్టారు.. బాగుండేది కాని, పైసలెక్కువ ..తప్పకపోతే  అక్కడకు వెళ్లేవాళ్లం. ఆ తర్వాత మా మిల్లు ఎదురుగా రామారావు హోటల్ వచ్చింది. హోటల్ అంటే ఓ పాక. బానే చేసేవాడు. తర్వాత ఆ రామారావే, మా మిల్లులో క్యాంటీన్ పెట్టాడు. మా ఉద్యోగం సాయంత్రం అయిదు, ఆరూ .. ఆ టైములో ఇళ్లకుబయలుదేరేవాళ్లం..

దారిలో అయిదు బళ్ల మార్కెట్ దగ్గర ఎల్లోరా హోటల్ .. దాని ప్రొప్రైటర్ ఏలూరి సూర్యారావు .. కమ్యూనిస్ట్ లీడర్ ..వీళ్లబ్బాయి వెంకటేశ్వరరావు, కార్పరేటర్ గా ఈ మధ్య చేసారు..  ఆ హోటల్లో ఒక దోసో, చపాతీయో తిని కాఫీ త్రాగి సైకులెక్కేవాళ్లం.ఈ హోటల్ లో సింగిల్ కాఫీ ఇచ్చేవారు.. అంటే ఇద్దరు వెళ్లి ½ అనకుండా ఒకరికే హాఫ్ కాఫీ అన్నమాట .. హాఫ్ రేటుకే. అర్థరూపాయికూడా అక్కర్లేకుండా దోసె, కాఫీ తాగగల్గేవాళ్లం .. అక్కడనుంచి సైకిలెక్కితే పేపర్ మిల్లు దగ్గర మా ఇంటికొచ్చేటప్పటికి కర కరా ఆకలేసేది.. సైకిల్ శ్రమ, వయస్సు.. అంతేగా మరి.

ఒక్కోప్పుడు .. ముఖ్యంగా బుధవారాలప్పుడు శాంతి నివాస్ కు వెళ్లేవాళ్లం. ఈ హోటల్ వరదరావు ఫామిలీ వాళ్లది. వరదరావుగారి హోటల్ అప్పట్లో.. అంటే ఇంకా ముందు కాలంలో మాడరన్ హోటల్ గా చాలా ఫేమస్. ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు శ్రీ కమలాకర్ తండ్రిగారు వరదరావు. కమలాకర్ గారబ్బాయి యోగీశ్ కూడా మంచి మృదంగ విద్వాంసుడు. వారిదే ఈ శాంతినివాస్ ఆ హోటల్ మెయిన్ రోడ్ లో వైగ్రాం రోడ్ మొదట్లో ఉండేది.. అక్కడ సాయంత్రం రోజుకో రకం టిఫిన్ ఉండేది. అక్కడ బోర్డ్ మీద వ్రాసేవారు.. బ్రెడ్ జామ్, పూరి కూర, బోండా సాంబార్, నెయ్యీ కారప్పొడీ ఇడ్లీ .. ఇలా … నాకు అవన్నీ ఇంటిపేర్లు పెట్టుకున్న టిఫిన్స్ లా కనిపించేవి.. అదే చెప్పుకుని నవ్వుకునే వాళ్లం.. బుధవారం బోండా సాంబార్. మిరియం వేసి మినప్పిండితో బోండావేసి .. దానిమీద కరివేపాకు కాడ కనపడేట్టు సాంబారు పోసి, వేడి వేడిగా ఇచ్చేవాడండి . అది ఎంత టేస్టంటే అది తినడంకోసం బుధవారం అక్కడికి పోయేవాళ్లం .. అర్థం చేసుకోండి మరి. ఒగేల్ గ్లాసులతో మంచినీళ్ళు ఇచ్చేవాడు.. ఆ గ్లాసులు అప్పట్లో ఫేమస్.

మా మామయ్య వచ్చినప్పుడనుకుంటా మాడరన్ హిందూ హోటల్ కు వెళ్లేవాణ్ణి.. చెన్నపట్నం కల్చర్ కనపడేది. రాజమండ్రి అంటే వరదరావు ఇడ్లీ చాలా ఫేమస్. ఆ ఇడ్లీ ఇక్కడ దొరికేది. ఇత్తడి గ్లాసులూ,కప్పులు .. కాఫీ పోసి గ్లాస్ బోర్లిస్తే … గ్లాస్ సరిగా తీయలేకపోతే వేడి కాఫీవళ్ళంతా పడుతుందన్నమాట. ఉప్మాలో ఉప్మాకు సరిపడా బంగాళాదుంప కూర ఇచ్చేవాడు. రెండూ కలిపి తింటే కడుపు నిండిపోయేది.
ఈ వరదరావుగార్కి .. గోదావరి స్టేషన్ కాంటీన్, రాజమండ్రి స్టేషన్ కాంటీన్, కోర్టుల్లో కాంటీన్ ..శాంతి నివాస్, శ్రీనివాస్, సుఖనివాస్ లాడ్జ్ .. ఇవన్నీ ఉండేవి.

దాని ప్రక్కనే ఆషారెస్టారెంట్.. ప్రొప్రైటర్ కు బ్రాకెట్ ఆటలో డబ్బులు కలిసొచ్చాయని  ఈ హోటల్ పెట్టాడనేవారు.. ఆ హోటల్ కు ఎక్కువ వెళ్లే వాణ్ని కాదు.

ఇవి కాక ఒరిస్సా వైపునుంచి వచ్చిన వాళ్లు , ఊళ్లో రెండు మూడు చోట్ల ఫాన్సీ షాప్ తో పాటు హోటల్ రన్ చేసేవారు .. వాళ్లు చైనా గూడ్స్ కూడా అమ్ముతుండేవారు..
ఈ సర్కి .. ఈ పోస్ట్ జాగ్రత్తగా చదివిన రాజమండ్రి వాసులకు అప్సరా హోటల్ ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఫారెస్ట్ ఉద్యోగం అయ్యాక రెండేళ్లు నేను రాజమండ్రి వదిలేశా .. పలాసాలో స్టేట్ బాంకులో ఉద్యోగం వచ్చింది..
అక్కడనుంచి 1970లో ఇక్కడకి బదలీ పై వచ్చి కోర్టుల వెనకాల మెట్టమీద ఉన్న స్టేట్ బాంక్ మెయిన్ బ్రాంచిలో జేరా.. ఇప్పుడు ఆ బ్రాంచి కంబాల చెరువుదగ్గరకు వచ్చింది ..

ఇప్పుడు రిలయన్స్ ఉన్నచోట హోటల్ శ్రీనివాస్ ఉండేది. అది కూడా వరదరావు గ్రూప్ వారిదే . సర్వర్స్ టిప్పుసుల్తాన్ లై కస్టమర్ సర్వీస్ అతిగా చేయడం వలన అది క్రమేణా మూతపడింది .. అక్కడకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఉండగా కూడా వెళ్లేవాణ్ణి ..

గోదావరీ స్టేషన్ కు ఆ ప్రక్క అప్సరా హోటల్ .. అక్కినేని నాగేశ్వరరావుగారు ప్రారంభం చేసారు.. మొదలెట్టాక ఇక్కడ లాన్ టెన్నీస్ పోటీలు, కృష్ణన్ వంటి ప్రముఖులు వచ్చేవారు.. లాడ్జింగ్ ఉండేది.సినీమాలవాళ్ళు దిగేవారు.. హైదరాబాదు వెళ్లే బస్సులన్నీ ఇక్కడాగేవి.. ఎదురుగా లాన్స్ లో కూడా సర్వీస్ ఉండేది.. డూక్ బాక్స్ .అదో ఎట్రాక్షన్ .. కావలసిన పాటకు డబ్బులేసి వినే సదుపాయం.. పాట ఇంట్రస్ట్ కన్నా బాక్స్ ఇంట్రస్ట్ .. రిక్షాలు కట్టించుకుని కేవలం టిఫిన్స్ తిండంకోసం ఫామిలీస్ తో వచ్చి తిని, రిక్షాలలోఇళ్లకు వెళ్లేవారు .. పుష్కారాలప్పుడు .. యమా రష్. రోజుకూడా కొన్ని సమయాలలో సీట్ కష్టమయ్యేది.  టిఫిన్స్ కూడా బాగుండేవి .. ఎ.సి.వై రెడ్డి గారు ప్రప్రైటర్ .. పెర్సనల్ అటెంక్షన్ పే చేసేవారు.. ఆయన తర్వాతి రోజుల్లో రాజకీయాలలో కూడా ఉన్నారు. అప్పట్లో రూపాయి పెట్తే టిఫిన్ అండ్ కాఫీ వచ్చేది.

మేము అక్కడ బ్రాంచిలో పనిచేస్తుండగానే మా బ్రాంచి కంబాల చెరువుదగ్గర స్వంత బిల్డింగ్స్ లోకి మారింది.. అప్పుడు దేవీ చౌక్ దగ్గర అంబా భవన్ .. అక్కడ టిఫిన్స్ బాగానే ఉండేవి.. అంతకన్నా ప్రొప్రైటర్ గారు ఎర్రగా బంగినపల్లి మామిడిపండులా బాగుండేవారు.. తర్వాత మాకు స్వంతంగా కాంటీన్ వచ్చేసింది.. అప్పుడప్పుడు బయట హోటళ్లకు వెళ్లేవాళ్లం.

ఆ తర్వాత నేను రాజమండ్రి నుంచి ఉద్యోగరీత్యా బయటకు పోయి మరల 86లో వచ్చాను.. వాతావరణం మారింది..

7 comments:

Dinavahi Murali said...

about rjy hotels and tiffins in those times....really fantastic...Apsara hotel I was thinking how Babai forgot, and its Idly, music etc...I found in your article. In those days Lalitha mahal Deluxe Hotel were also famous and in Market area ie in Bazaar one tiffin hotel is famous...still it is in the same place. What about these days.. Curry points, pizza points, noodle centres, chat bhandars. Thank you Babai

Sri said...

Kodandarama Vilas Proprietor Daughter naa Inter, Degree classmate. Santhi Nivas Maa nannagaru tarachu thisukuni vellevaru when we were Kids. Appatlo inko hotel vundedi miku guthundo ledo Deluxe Hotel, Pedda Aratikayi bajji famous akkada. RJY food capital annacchu innovation wise. Thanks for sharing your fond memories with us.

VENKAT said...

నమస్తే అండి. మన రాజమండ్రి గురించి వీడియో టేపు రి వైండ్ చేసి చాల బాగా చూపించారు. నేను కూడా రాజమండ్రి వాడినే, ఉద్యోగం కోసం దేశ దేశాలు పట్టి తిరగాల్సి వస్తోంది ఇప్పుడు. మేము మా చిన్నప్పుడు ఇన్నిస్పేట్ లో గోల్డెన్ కేఫ్ లో టీలు, డీలక్స్ హోటల్లో టిఫిన్లు...వెలగ బెట్టాము... హిందూ సమాజం మా అడ్డా గా ఉండేది షటిల్ ఆడుకోవడానికి...త్యాగరాజ ఉత్సవాలకి.

అదేదో ఒక పద కవితలో చదువుకున్నట్టు...మీరు మీ బాల్యం ఖాతా లోంచి ఒక చెక్కు రాసి హాయిగా మాకు కూడా కాస్త పంచి ఇచ్చారు.

Unknown said...

ఈ సారి మీరుచెప్పిన వాటిలో మిగిలినవి చూడటానికి ప్రయత్నిస్తాను. మధుర స్మృతులు తీపి గురుతులు అందించినందుకు ధన్యవాదములు. పూర్వం రాజమండ్రి రోడ్డుపక్క పెసరట్ల జోరు కనిపించేదనుకుంటాను.

హనుమంత రావు said...

dear nagesh, lalitha mahal is for veg.meals.Asha restnt renamed as Deluxe hotel. I think the hotel u referred in Bazar is Bhimas was not there when I was in Bank.dear Srizzler, thank u for responding & sharing ur.memories, dear sri venkat,Golden cafe is known for its irani chay, i think..dear prasad garu, if u make it convenient to visit our place, i will certainly show you many more places of interest. I THANK ONE AND ALL WHO APPRECIATED MY POST ON RJY.. THANK U ALL ...

Anonymous said...

అందుకనే ఓ మాట అంటూ ఉంటాను చదివితే హనుమంత రావు గారి బ్లాగ్ చదవండి .ఒక్కసారిగా సంతూర్ సబ్బు వాడకుండానే వయసును దాచుకోవచ్చు అని.ఎంచేతంటే మన అప్పటి రాజమండ్రి కబుర్లు అందించి మన చిన్నప్పటి విశేషాలు గుర్తుకు తెస్తున్నారు .అందువల్ల మనమంతా ఉషారుగా ఉంటున్నాము .

మీరు ఉదహరించిన మన వూరి హోటల్స్ అన్నిటికి మనమంతా రాజ మహారాజ పోషకులమే.
కోటగుమ్మం దగ్గర పంచవటి మనకు సమావేశ వేదిక .తరువాత వచ్చిన అప్సర హోటల్ రెడ్డి గారు మనకు VVIP సర్వీస్ ఏర్పాటు చేసే వారు
బావుంది హనుమంత రావు గారూ.అలనాటి సంగతుల మీ బ్లాగ్ .వ్రాస్తూనే ఉండాలి ఇలాగే .

హనుమంత రావు said...

thank u sastry jee.. memories of those days give us boost which is the secret of our energy.. yes..