Pages

Tuesday, November 25, 2014

“భారతవాసి”




“భారతవాసి”
   
రచన : డి.వి.హనుమంత రావు

సెంటర్ లో చాలా కోలాహలంగా ఉంది. .. ఓ ప్రక్కగా స్టేజ్ , షామియానా ... కెమెరాలు వేళ్లాడేసుకుని కొందరు, పెద్ద పెద్ద సంచులు భుజాన వేళ్లాడేసుకుని వీడియో వాళ్లు  కొందరు.. సందడి సందడిగా ఉన్నారు. వచ్చిన వాళ్లందరూ నీటుగా డ్రెస్సయి వచ్చారు.. దూరంగా కొందరు కానిస్టేబుల్స్ కబుర్లూ కథలూ చెప్పుకుంటూ నించొని ఉన్నారు. ఇంకో పది నిముషాలలో  ఎమ్.ఎల్.ఏ గారు, ఎమ్.పీగారూ రానున్నారని - గంట నుంచి మైకులో ప్రతి అయిదు నిముషాలకు ప్రకటిస్తున్నారు. వారు ప్రకటించినప్పుడల్లా వాచీలున్నవాళ్లు - వాళ్ల వాళ్ల  వాచీలు చూసుకుంటున్నారు. నిర్వాచీతులు టైమెంతైందని ప్రతి అయిదు నిముషాలకు ప్రక్కనున్న  వాచీ ఓనరులను
అడుగుతున్నారు. ఆ ప్రక్కనే, రక రకాల ఫోజుల్లో ఉన్న మోడీగారి ఫోటోలు, గుండూ , కర్రా, కళ్లజోడూ (గాంధీ గారనుకుంటా)ఉన్నాయన ఫోటోలు రెడీ చేసి ఉన్నాయి. ఆ ప్రక్కనే పాతబడిపోయిన వల్లభాయ్ ఫోటోట - గుర్రం మీద ఠీవీగా దర్జాగా స్వారీ చేస్తున్న శివాజీ గారట .. ఆయన బొమ్మా ఉన్నాయి. ఇప్పుడీ క్రొత్త ప్రభుత్వం వచ్చేదాకా - రక రకాల గాంధీ చిత్రాలు, వారి బొమ్మలే కాని, ఇవన్నీ చూడకపోవడం వలన గుర్తు పట్టలేకపోతున్నాం ఇప్పుడు క్రొత్తగా చూస్తున్న పాత ప్రముఖుల్ని. ఈ హడావుడి అంతా ఇలా ఉండగా.....  

సడెన్ గా “దొంగ .. దొంగా” అని కేకలు…
“ఎక్కడెక్కడ” అని పొలికేకలు,
రక్షక భటుల బూట్ టక టకలు …
వాళ్ళ వెనకాల కెమెరాలు .. వారితో కెమెరాలు తగులుకున్న భుజాలు ..ఆ వెనుక భుజాలు గల ఆసాములు … పరుగెత్తారు. కొందరు హీరోల్లా దొంగని పట్టడానికి పరుగెత్తితే,
“ఇలా వస్తే పట్టుకుందాంలే, ఎందుకు రిస్క్” అని కొందరు ఇక్కడే ఉండిపోయారు ..
ఈ లోగా అవకాశాన్ని అంది పుచ్చుకుని 64 కళల్లో దొంగతనంకూడా ఒక కళ అని గ్రాంధిక ఉపన్యాసం కొందరు  ఇస్తుంటే,
తమ తమ  జీవితాలలో దొంగ.. దొంగల కథలు -అనే అంశం మీద  అగ్రాంధిక ఉపన్యాసం కొందరు ఇచ్చేస్తున్నారు.

ఇలా దొంగకోసం వెళ్లినవాళ్లు.. ఆ వెనుకనే వెళ్లిన కెమెరాలు, కెమెరాల తాలూకు భుజాలు, భుజాల తాలూకు ఆసాములు అందరూ తిరిగి వచ్చారు. వారితో ఒక యువకుడు, సామాన్యంగా ఉన్నాడు. మామూలు బట్టలు కట్టుకున్నాడు. కూడా వచ్చాడు. అతగాడి ముఖంలో ఏ విధమైన భయమూ  లేదు..

“ఎందుకు చేసావీ పని” అడిగారు
“మంచి పని అనుకుని చేసాను”అన్నాడు.
“దొంగతనం మంచి పనా”అడిగారు
“ఎవరన్నారు”
“నువ్వంటున్నావు కదా?”
“నేనలా అనలేదు. నేను చేసిన పని మంచి పని అంటున్నా”
“ఎలా అవుతుంది ..మేమింత భారీ ఏర్పాటు చేసుకున్నాము ఓ ప్రక్క” అన్నారొకరు
“మరో ప్రక్క ఇంతమంది ఆల్ రెడీ వచ్చేసా(ము)రు..” అన్నారు మరొకరు
“అటు ప్రక్కనుంచి ఎం ఎల్ ఏ, ఎమ్.పి గారులు వచ్చేస్తున్నారు..”అన్నాడు  అటుప్రక్కాయన ..
“ఇంతకీ ఏమెత్తుకు  పోయాడండీ ..” ఇందాకణ్ణించీ  రిస్క్ తీసుకోకుండా గట్టు మీదే  ఉన్నాయన అన్నాడు..
అప్పుడు ఈ కార్యక్రమ నిర్వాహకుడు గొంతు సవరించుకుని చెప్పబోయాడు..
“మైకులో చెప్పండి .. అందరికీ వినపడుతుంది..” అన్నారొకరు
“ఎవరు విన్నా భయం లేదు, నేనేమన్నా తప్పు పని చేసానా.. మైకులో కాపోతే కొండెక్కి అరవండి, నా కేమిటి భయం” అన్నాడు దొంగగా నేరారోపణ చేయబడ్డ వ్యక్తి.
“ఇక్కడకు మా ఆహ్వానం మన్నించి విచ్చేసిన మిత్రులకి నమస్కారం” మొదలెట్టాడు నిర్వాహకుడు
“వేదిక మీదున్న ఎమ్.ఎల్.ఏ గార్కీ.....”
“వేదిక ఎక్కడుందిరా, ఎమ్.ఎల్.ఎ ఎక్కడున్నాడు.. సోది  ఆపి ..అసలు ఏమెత్తికెళ్లాడు.. అది చెప్పు”అన్నాడొకడు ..
“నన్ను మధ్యలో ఆపకండి .. ఫ్లో ఆగిపోతుంది… “
“ఫ్లో అక్కరలేదు .. స్లోగా మాట్లాడు చాలు”అన్నారొకడు.
“సరే ఐతే చెప్తాను వినండి .. ఇవ్వాళ కార్యక్రమంకోసం .. ఆ కార్యక్రమం జయప్రదం అవ్వాలని, ఫోటోల్లోనూ, వీడియోలోనూ కలర్ ఫుల్ గా కనపడాలని బోల్డు తట్టలతో రంగు రంగుల చెత్త తెప్పించి పోసాము.. మనం ఎంతో కష్టపడి సేకరించిన ఆ కలర్ ఫుల్ చెత్తంతా ఈ వ్యక్తి పట్టుకుపోతున్నాడు.. తట్టల్లోకి ఎత్తి మరీ పట్టుకు పోతున్నాడు.. రెడ్ హాండెండ్ గా దొరికిపోయాడు…ఇప్పుడేం చేద్దాం .. ఇతణ్ణి  శిక్షించాలా వద్దా… చెప్పండి.”
“శిక్షించాలి.. శిక్షించాలి” అంటూ కొందరరచారు
ఇంతలో .. బాగా తలపండి, పంట జుత్తు రాలినాయన కలుగజేసుకుని…
”ఇంతకీ ఆ చెత్త ఏంచేద్దామని పట్టుకెళ్తున్నాడు - అది అడగండి ..” అని ఖళ్ళు ఖళ్ళు దగ్గాడు.. పెద్దవాణ్ణని తెలియజేయడానికేమో ..    
“ఏముంది, పొరుగు రాష్ట్రాలకి అమ్మేస్తాడు.. అక్కడ చెత్త దొరక్క ఇలాంటి కార్యక్రమాలు తక్కువ చేస్తున్నారు కదా.. “ అన్నారొకడు.
“మనం బాగు పడిపోతామేమోనని ఏదో విదేశీ కుట్ర తాలూకు ఏజెంటేమో” అన్నారొకడు
“ఇప్పుడు ఎమ్.పీగారూ, ఎమ్.ఎల్.ఏ గారు వచ్చేస్తే ముహం ఎలా చూపించాలి,
ఫోటో గ్రాఫుల వాళ్లు ఫోటోలు తీస్తామంటే…  చెత్తలేని ముఖాలతో ఎలా నించుంటాము” అని వాపోయారు.. నిర్వాహకులు.
ఈలోగా ఆ పెద్దాయన మళ్లీ కలుగజేసుకుని, లేని జుట్టు తడుముకుని
“ఏమబ్బీ ఎందుకు చేసావీపని?” అని అడిగాడు.అడిగి ఖళ్ళు ఖళ్ళు దగ్గాడు.
అప్పుడు దొంగగా ఆరోపణ చేయబడిన వ్యక్తి గొంతు సవరించుకుని
“ఒక ప్రక్క మోడీ గారేమో ‘స్వచ్చ భారత్’ ‘స్వచ్చ భారత్’ అంటూ చెవిదగ్గర ఇల్లు కట్టుకుని, ఇల్లేంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుని మరీ అరుస్తున్నారు.. నిజమే మన ఇల్లు మనం శుభ్రం చేసుకోపోతే ఎవరు చేస్తారు? దీనికోసం ఎవరి కోసమో ఎందుకెదురు చూడాలి? అని ఆలోచించి ఎక్కడ చెత్త కనపడ్డా ఎత్తి పారేస్తున్నాను.. ఇక్కడ చెత్త కనపడింది, తట్ట కూడా కనపడింది.. మునిసిపాలిటీ కుండీ కూడా  కనపడింది … ఎత్తి అందులో వేసేసాను..
మీరు నన్నేదో చెత్త చెత్తగా తిట్టేస్తున్నారు ..
చెత్త ఎత్తి శుభ్రం  చేసిన నేను ‘దొంగనా’…
మీటింగ్ కోసమని చెత్త పోగేస్తున్న మీరు ‘దొరలా’ ? ..
ఏంటో అంతా చెత్త చెత్తగా ఉంది .. వెళ్లండి ..
వెళ్లి అక్కడ ఉన్న మునిసిపల్ కుండీ ప్రక్కకు లాగితే మీక్కావలసినంత చెత్త… చెత్త… చెత్త….”
అంటూ తానూ కలలు గంటున్న “స్వచ్చ భారత్” వైపు కర్తవ్యాతా నిష్టతో - స్వచ్చమైన ఆలోచనతో కదిలాడు
భారతవాసి. ..

 







 

2 comments:

Anonymous said...

మీ "భారత్ వాసి "సామాన్యుడు"(RK గారి Common మాన్)
లాగా వర్ధిల్లాలి .ఈ థీమ్ బావుంది .ఇలాంటి సంఘటనలు "భారత్ వాసి సిరీస్" గా మీ column మొదలు పెట్టండి

janaa said...

భారతవాసి కధనం "పుణ్య్ భూమి" ని మెరిపించింది. బ్లాగు.బ్లాగు....జనార్దన్