హరాజీకాలు - 9
నలభై ఏడే ళ్లయింది మరి.....
సరిగా 47 ఏళ్ల క్రితం ఈరోజుల్లోనే మా బ్యాంకు వారి ‘క్లెరికల్ ఇండక్షన్ కోర్స్’ ట్రైనింగ్’కు రావలసిందిగా నన్ను పిలిచారు. కాకినాడలో ట్రైనింగ్. నెలన్నర రోజులు. కాకినాడ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచి వెనక వైపు మా ట్రైనింగ్ సెంటర్. బ్యాంకులో చేరిన కొత్త. అంటే కాలరు ఎత్తుకు తిరిగే రోజులన్నమాట. ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు వంద రూపాయలు అలౌన్స్ గా ఇచ్చేవారని గుర్తు. కాకినాడలో మా పిన్ని గారింట ఉండి ట్రైనింగ్ కు వెళ్లే వాణ్ణి. ఎందుకంటే మా సెంటర్ రెసిడెన్షియల్ కాదు. . హైదరాబాదు సెంటర్ కు , తర్వాత రోజుల్లో విజయనగరం సెంటర్ కు ఈ సదుపాయం ఉండేది. ఉదయమే మా కజిన్ నేనూ ఇంట్లో బయల్దేరి దారిలో ఏ కాకా హొటల్ లోనో బ్రేక్ ఫాస్ట్ లాగించేవాళ్లం. ఓరోజు నేనూ, ఓరోజు అతనూ బిల్లు కట్టాలి. అదీ ఒప్పందం. కాకినాడలో చాలా కాలం అర్థణాకొక ఇడ్డెను దొరికేది. అలాగనే వెన్నతో పెసరెట్ ఒక స్పెషాలిటీ. కాకినాడలో పెసరట్ల సందని ఉండేది. ఆ సందులో చాలా ఇళ్ల ముందు పొయ్యి పెనం పెట్టుకుని, పెసరట్లు వేసేవారు. అక్కడ ఎప్పుడు తిన్న గురుతులేదు. ఒక్కోప్పుడు బ్యాంకు కేంటీన్ లో తినేవాళ్లం. మా కజిన్ తన పనిమీద తాను వెళ్లేవాడు. తరచు సినీమాలకు పోయేవాళ్లం.
ట్రైనింగ్ బోరుగానూ, హుషారుగానూ మిక్చర్ గానూ ఉండేది.
అక్కడ ఉండగానే ఓ సారి ఉప్పాడ బీచ్ విజ్ఞాన యాత్రకు వెళ్లాము.... ఉప్పాడ సముద్రం … గొప్ప రోరింగ్ సీ. గొప్ప శబ్దంతో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటాయి. ఆ అల్లకల్లోలంగా ఉన్న సముద్రం మీద నావలో వెళ్లడం ఒక థ్రిల్. అక్కడ తిండీ, ఎంటర్ టైన్ మెంట్ .. ఆ ప్రోగ్రామ్ మిత్రుడు శ్రీరామారావు చక్కగా నిర్వహించాడు. అప్పుడు ట్రైనింగ్ లో పరిచయమైన అతడు ఇప్పటిదాకా మైత్రి కొనసాగిస్తున్నాడు. శ్రీరామారావు సామర్లకోట బ్రాంఛిలో చేసేవాడు. . కాకినాడ అతడి స్వస్థలం. గొప్ప డేరింగ్ ఫెలో (ఫెలో అంటే కాని ఇక్కడ ఊపు రాదు. శ్రీ రామారావుగారు మన్నింతురుగాక) స్పోర్ట్స్ మీట్స్ లో పాల్గొనడానికి, రన్నింగ్ ప్రాక్టీస్ చెయ్యడానికి కాకినాడ నుంచి సుమారు 8 మైళ్లు సామర్లకోట దాకా పరిగెత్తేవాడాయన. జై ఆంధ్రా మూవ్ మెంట్ లో ఒకసారి కాకినాడలో చాలా పెద్ద మీటింగ్ .. పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది నాయకులు వచ్చారు. జనం విపరీతంగా వచ్చారు. ఎక్కడా నిలబడడానికి కూడా స్థలం లేదు. అప్పుడు తాను వాలంటీర్ కాకపోయినా, చేతిలో ఒక కర్ర పట్టుకుని జనాన్ని అదుపుచేస్తున్నట్టుగా నడుస్తూ, నన్నూ మా అన్నయ్యను స్టేజి దాకా లాక్కు పోయి, అక్కడ వి.ఐ.పిల రోలోకూర్చోపెట్టాడు. అదీ
శ్రీ రామారావు. ఇతనే నాకు 7 అంగుళాల నేరో కట్ పాంట (టెర్రికాట్) కుట్టించుకోమని ఎంకరేజ్ చేసి అలవాటు చేసాడు. అప్పుడు అది ఫేషన్. ప్రస్తుతం తన పిల్లల దగ్గర యూ.యస్ లో ఉన్నారు.
సరే! మళ్లీ వెనక్కి వద్దాం... నేనైతే ఇంకో డిపార్ట్ మెంట్ లో చేసివచ్చాను కాని, చాలామంది ఫ్రెష్ ఫ్రం కాలేజీ ఆ అల్లరి లక్షణాలూ ఉండేవి.
ఆ సంవత్సరం బ్యాంక్ వైల్డ్ ఎనిమల్స్ కాలెండర్ వేసింది.నెలకోజంతువు బొమ్మతో ఆకర్షణీయంగా ఆ కాలెండర్ చాలా బాగుండేది. మా క్లాస్ రూమ్ లో గోడకి తగిలించారు. మాతో పనిచేస్తూ ట్రైనింగుకు వచ్చిన వ్యక్తొకతను లావుగా పొట్టిగా ఉండేవాడు. మనిషిలో ఏదో స్వార్థం, నలుగురితోనూ కలవకపోవడం కుర్రకారుకి ఇబ్బంది పెట్టేది. ఆ కాలెండర్ లో రీనో (ఖడ్గ మృగం) ఉన్న నెల సంబంధం లేకపోయినా, ప్రతిరోజు పైకొచ్చేటట్టు పెట్టేవాడొకడు. క్లాసుకి రాగానే ఇందాకటి కొలీగ్ ముందు కాలెండరే చూసేవాడు ..కోపమొచ్చేసేది. ‘ఎవడిలా పెట్టా’డని, అది ఏదో కక్షతో మార్చేసేవాడు. క్లాసులో గోల. మళ్ల్లీ మర్నాడు మామూలే .. వాళ్లు పెట్టడం వీడు ఉడుక్కోడం ..
మాకు స్టేజ్ ఫియర్ పోవాలని, ఏదో టాపిక్ మీద స్పీచ్ తయారు చేసుకొచ్చి మాట్లాడమనేవారు. మేము బుద్ధిగా ప్రిపేర్ చేసి, అందరి ముందూ ప్రెజెంట్ చేసేవాళ్లం. ఆదిశేషు అని గుంటూరు సైడునుంచి వచ్చిన కొలీగ్. ఆతను “నేటి సినీమాలు” అన్న టాపిక్ మీద వ్రాసాడు. పాటలలో అర్థంలేని పాటలు ఎలా వుంటాయో చెప్తూ ఆ పాటలన్నీ తన కంఠంతో పాడే వినిపించేవాడు. ఇబ్బంది పడి .. బాస్.. “యు నీడ్ నాట్ సింగ్ ద ఎంటైర్ సాంగ్ మిస్టర్ ఆదిశేషు , జస్ట్ టెల్ ది ఫస్ట్ లైన్”అంటే …
“అసలు నా ప్రెపరేషన్ అంతా సాంగ్స్ అండీ. విదౌట్ సాంగ్స్ ఐ కాంట్ టాక్” అనేవాడు.
ఏం చేస్తారు పాపం బాస్.. యస్ అనడం తప్ప … ఇలా సందడి సందడిగా ట్రైనింగ్ ప్రోగ్రాం గడిచేది.
ఇంచుమించు ఉన్న 30మందిలో సగానికి పైగా పెళ్లికాని కుర్రాళ్లే . మాలో పెళ్లికొడుకులెవరైనా ఉండకపోతారా అని ఆడ పిల్లల తండ్రులు వచ్చి ఎంక్వైర్ చేసేవారు కూడా.
మేము ట్రైనింగ్ లో ఉండగా ఉగాది వచ్చింది. శలవు. మర్నాడు శనివారం శలవు పెట్టుకుంటే ఆదివారము కలిసి వస్తుంది. దూరప్రాంతాలనుండి వచ్చిన మిత్రులు తమ తమ ఇళ్లకు వెళ్లడానికి శనివారం శలవు కావాలన్నారు. మాది రాజమండ్రి .. అయినా నాకూ శలవు కావాలని లీవ్ లెటర్ ఇచ్చాను. అందరికీ ఇవ్వడానికి శనివారం క్లాస్ ఉంటుంది ఇవ్వనన్నారు ఇన్స్ట్రక్టర్. కుర్రాళ్లు పట్టు పట్టారు. మెరిట్స్ ఆఫ్ ది కేస్ ..అవసరాన్ని బట్టి ఇస్తాను అన్నారు గురువుగారు. దూరంగా ఉన్నవారికి మంజూరు చేసి. “నీ కెందుకు” అని నన్న డిగారు .. వెంటనే “పెళ్లి చూపు” లన్నాను.. ఘొల్లు మన్నారు మిగతా వారు. ఏదో సరదాగా అన్నాననుకుని. అప్పటికే విషయం నేను బాస్ కు చెప్పేసాను, ఆయనా ఓ నవ్వు నవ్వి నాక్కూడా మంజూరు చేసారు . (నాకొచ్చిన సంబంధం- ఇందాక ప్రస్తావించిన ఆడపిల్లల తండ్రులద్వారా కాదండోయ్.. మా చుట్టాల ద్వారా వచ్చింది.) అలాగ ఉగాదికి రాజమండ్రి వెళ్లి ఆ మరునాడు నేనూ, అమ్మా,నాన్నగారూ, మా అన్నయ్యగారబ్బాయి( చిన్నకుర్రాడు). ఏలూరు వెళ్లాము. యస్.ఐ గారమ్మాయిని చూసాం .. ఆవిడే కదా మరి పెళ్లికూతురు. అమ్మా నాన్నగారూ ‘యస్’ అన్నారు. నేను ఏమీ అనకుండా వచ్చేసాను. ట్రయినింగ్ దిగ్విజయంగా పూర్తయింది. మరల బ్యాక్ టూ పలాస. నాన్నగారు నన్ను ఉత్తరాలలో నా అభిప్రాయం అడగడం మొదలెట్టరు. ఒక శుభ ముహూర్తాన ‘మీ ఇష్టం’ అన్నాను. ఆ మాట నా అభిప్రాయాన్ని గౌరవంగా నాన్నగారికి చేరవేసింది. తర్వాత కొద్దికాలం సైలెంట్ .. నెలాఖరుకు ముందే బ్యాంకులో జీతాలిచ్చేవారు. ఆ నెలజీతం తీసుకున్నాను .. ఇంటికి పంపవలసినది పంపేసాను. హోటల్ వారికి డబ్బు కట్టేసాను. నెలంతా టిఫిన్ కాఫీ, భోజనం అరువులో పెట్తాడు ఫర్వాలేదు. కొద్ది డబ్బులు సినీమాలకు వాటికీ ఉంచాను. అటువంటి సమయంలో.. ఒకటో తారీఖున టెలిగ్రాం నాన్నగారి దగ్గర్నుంచి. “మారేజ్ ఫిక్సుడు .. స్టార్ట్ ఇమ్మీడియేట్లీ “. అర్థం కాలేదు. కాస్సేపటికి దేవాదిలో ఉన్న మా మేనమామ గారబ్బాయి.దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. నువ్వు వెంటనే ఇక్కడకు వచ్చేయ్ . ఇక్కడ్నుంచి మనం వెళ్దాం అని. బయల్దేరాను. దేవాదినుంచి, అక్క (మేనబావ భార్య) నేనూ అరసవెల్లి - అన్నవరం బస్సులో బయల్దేరి, అన్నవరం మీదుగా కాకినాడ చేరాం. బావ ఏర్పాటుతో నాకు అక్కడ కావలసిన బట్టలు కొని, అక్కడే శ్రీరామారావు చెప్పిన టైలర్ కు(ఫామస్ - బెంగుళూర్ టైలర్స్ అనుకుంటా) ఇచ్చాము. అక్కడనుంచి రాజమండ్రి చేరాను. నాన్నగారి మీద, అమ్మ మీదా గుస్సా అయ్యాను. అంత సడన్ ఏమిటని. మంచి ఎండలు .. పెళ్లి పనులు. శుభలేఖలు ప్రింటింగ్ .. డిస్ట్రిబ్యూషన్ .. ఇంటికి రంగులు వేయించడం .. బజారు సామాన్లు అన్నీ ఇంచుమించు నేనే .. నాన్నగారు పెద్దవారు. నేనే ఆఖరువాడిని. అన్నయ్యలు ఉద్యోగరీత్యా శలవులు పెట్టుకు రాలేరు. ప్రైవేట్ బస్సులో పెళ్ళికి ఏలూరుకు తరలి వెళ్లాం. ఏలూరు కన్యకా పరమేశ్వరీ కళ్యాణ మంటపంలో పెళ్లి . వైభవంగా జరిగింది. చిన్న చిన్న పేచీలు, అలకలు, సమర్థింపులు. అదో ఆనందం.. అటూ ఇటూ కూడా స్పోర్టివ్ గా తీసుకుంటే అవి మధుర జ్ఞాపకాలు.
ఇంతకీ పెళ్లి రోజు ఎప్పుడో చెప్పలేదు కదూ… ఈరోజే .. 11 మే … 47 ఏళ్లక్రితం మే,11 - 1968న నా పెళ్లయింది. .. అందుకునే కదా ఈ తొందర. ఆడ-పిల్ల విజయలక్ష్మి … ఈడ-కొచ్చి హనుమంతరావుకు
జీవితసహధర్మచారిణి అయ్యింది.