Pages

Saturday, May 9, 2015

హరాజీకాలు - 8---నటజీవితం - అరంగేట్రం

హరాజీకాలు - 8






నటజీవితం -  అరంగేట్రం
---డి.వి.హనుమంతరావు.


విశాఖజిల్లా పాయకరావు పేటలో  ఉద్యోగరీత్యా  కొన్నాళ్లున్నాను. . ప్రక్కనే తుని. రెంటికీ మధ్య తాండవ నది. దానిపై బ్రిడ్జ్. నదికి అటు వైపు ఉన్న- పాయకరావుపేట - విశాఖజిల్లా, ఇటువైపు ఉన్న - తుని, తూ.గో.జిల్లా. నేను మకాము తునిలో ఉండి రోజూ పాయకరావుపేట ఉద్యోగానికి వెళ్ళేవాడిని. అంటే రెండు జిల్లాలు మారేవాణ్ణన్నమాట. పిల్లలు తునిలో ఓ ప్రైవేట్ స్కూల్లో చదివేవారు. ఆ స్కూల్ కు మంచి పేరుంది. దానిక్కారణం ఆ స్కూల్ కరస్పాండెంట్ అని చెప్పక తప్పదు. మంచి కార్యసాధకుడు. పైకి అమాయకంగా కనిపించినా,  తన పని సాధించుకుంటాడు.


కొంచెం ముందురోజులకు  వెళ్తే.. తునిలో పబ్లిక్ పరిచయాలు నాకు ఈయనతోనే ప్రారంభం. ఓ సాయంత్రం నేను బయటికి వెళ్తే  ఈయన దారిలో కలిసాడు. ఆయన కూడా  అప్పటికి నాకు తెలియని వ్యక్తులు ఇద్దరున్నారు.
“రండి రావుగారు, కాసేపు కబుర్లు చెప్పుకుపోదాం” అంటూ ఆ ప్రక్కనే ఉన్న ఓ దేవాలయపు మంటపానికి దారి తీసాడు. మా మధ్య మాటలు అలా కుర్రకారు వారి చేష్టలు .. వాటిమీదకు పోయాయి.  
“పిల్లలు పాడైపోతున్నారండీ, అస్తమానం సినీమాలు, హోటల్స్ .. ఒక్కనిముషమైనా ఇంట్లో ఉండరు .. ఏంచదువుతారో ఏమిటో?” అన్నారు ఒకరు.
“రోజూ సాయంత్రమయ్యేసరికి హోటల్, శలవొస్తే సినీమా … ఏంటో పాడైపోతున్నారండీ” అని వాపోయడొకాయన.  [ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అప్పుడింకా పెద్దలకు తెలియకుండా హోటల్ గోఇంగ్ లు, విచ్చలవిడిగా సినీమాలు లేవు. ఒకరకమైన కట్టుబాట్లలో ఉండేవారని, అదీ కాక ఈ కథా కాలం  డెబ్భైయోవ సంవత్సరం చివరి భాగంలోది. ముచ్చట్లు అంతకన్నా పాతవి కనుక, ఇంకా ఇంటర్ నెట్ లు, పబ్ లు, క్లబ్ లు, పిజ్జాలు, నూడిల్స్, బర్గర్ లు … ఇలాంటి కల్చర్ కు విద్యార్థి లోకం అలవాటు పడలేదు. ముఖ్యంగా తుని లాంటి టౌన్స్ లో. - అర్థం చేసుకోండి]
నిజం చెప్పాలంటే, మేమూ కాలేజి డేస్ లో మరీ కాకపోయిన .. కొంతవరకైనా, హోటల్ వాసన తెలిసినవాళ్లమే, సినీమాలు చూసినవాళ్లమే .. కాని ఇప్పుడు కొంచెం పెద్ద మనిషి తరహాగా ఉండాలిగా. అప్పుడు నేనన్నాను.
“అంత ఠంచ్చన్ గా సాయంత్రం అయ్యేసరికి హోటల్ కు ఎందుకు వెళ్తారో చెప్పనా” అన్నాను ..  
“చెప్పండి” అంటూ  ఉత్సాహపరిచారు అక్కడున్నవారు.
“కందులు వేయించి, పప్పు చేసి శుభ్రపరుస్తారు కదా, అప్పుడు వచ్చిన పొట్టు, కొంత కందిపప్పు నూకతో కలిసి కమ్మగా ఉంటుంది.. పశువులు పగలంతా మేతకెళ్లొచ్చే టైముకి కుడితిలో ఈ కందిపొట్టు కలిపి రెడీగా ఉంచుతారు. పశువులు దానిపట్ల మక్కువతో పరుగు పరుగున ఇళ్ళకొచ్చేస్తాయి. అదిగో ఆ కందిపొట్టు హోటల్ వాళ్లు సాంబారులో కలుపుతారట. {ఇది నిజమో కాదో నాకు తెలియదు, ఐ గాట్ నో ప్రూఫ్}. మనం కూడా ఆ సాంబారు మీద మక్కువతో కుడితి మరిగిన పశువుల్లాగా హోటల్ కు పోతామన్నమాట…” అని చెప్పగానే జోకును మనసారా ఎంజోయ్ చేసారు మిత్రులు ఐనవారు, కాబోయేవారు.
“టిఫిన్స్ అంతంత రేట్స్ ఏంటండీ” అంటూ మరోసారి వాపోయారు…
“అయ్యా! ఇక్కడ ఒకవిషయం గమనించాలి, రేట్ దోసెలో కంటెంటుకి, పెట్టిన ఇడ్లీలసంఖ్యకూ  కాదు.. తక్కువ మినప్పిండితో ఇడ్లీ పడిపోకుండా ప్లేటులో ఎలా పెట్టాడన్న వాడి నైపుణ్యానికి. .. ప్రొద్దున్న ఒక చెమ్చా దోసెపిండి కాలే పెనం మీద వేసి సాయంత్రందాకా దోసెలు పెనం మెదనుంచి తీసే వాడి ప్రతిభకు .. నిజంగా ఎన్ని డబ్బులిస్తే సరిపోతుందండీ వాడి పనితనానికి, వాడి స్కిల్ కు“ .. అనగానే అన్ని బాధలూ మరచి ఆనందంగా హాయిగా
నవ్వుకున్నారు - మిత్రులు . ఆ రోజు పరిచయం అయిన షుగర్ కేన్ ఇన్స్పెక్టర్ గారు, సుమారు ముప్ఫై అయిదు - నలభై  సంవత్సరాలైనా  మా స్నేహాన్ని ఇప్పటికీ ఆత్మీయంగా మధురంగా కొనసాగిస్తున్నారు. మరి షుగర్ కేన్ అంటేనే మధురం కదా…


ఆ కరస్పాండెంట్ గారు-- స్కూలు ‘పేరెంట్స్ అసోసియేషన్’ లో మమ్మల్ని ముఖ్య సభ్యులుగా చేసారు. నాకు అప్పటికి 36 సంవత్సరాల వయస్సు, షుగర్ కేన్ ఇన్స్పెక్టర్ గారు  నాకన్నా కొంచెం పెద్ద. గౌరవనీయమైన ఉద్యోగాలు మావి అని పెద్దవాళ్లను కమిటీలో పెట్టుకుంటే స్కూలుకు గౌరవమని, మమ్మల్ని పెట్టాడాయన. మాది కొంచెం ఉడుకు రక్తం ..  మేమిద్దరం కలిస్తే .. సందడే సందడే .. ప్రథానప్రతిపక్షంలా కరస్పాండెంట్  అవునన్నది కాదనడమే మా లక్ష్యం,.
ఏది రైటో, ఏది రాంగో మాకు అంతగా ఆలోచించేవాళ్లము కాదు.  .. మీటింగుల్లో కరస్పాండెంట్ గారు మాత్రం ముఖంనిండా నవ్వు పులుముకునేవారు తప్ప మనసారా నవ్వేవారా అంటే అనుమానమే.                                     


ఓ సారి, “పిల్లలకు పుట్టినరోజులకి ఇళ్లకు గ్రీటింగ్స్ ఏదైనా చిన్ని కానుక పంపుదామనుకుంటున్నాను” అని  ప్రొపోజల్ పెట్టాడు..
“మీ అభిప్రాయం చెప్పండి” అని జనరల్ బాడీని అడిగాడు.
నిజానికి చాలా మంచి ఆలోచనే ఆలోచిస్తే.. బాగుందని చాలా మంది ఓటేసారు..
“ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్” అన్నాను..
“ఏమి”టన్నారు  కరస్పాండెంట్ గారు.
“మా ఇద్దరి పిల్లల పుట్టినరోజులు సమ్మర్ హాలిడేస్ లో వస్తాయి, నాకు కిట్ట”దన్నాను.
ఘొల్లు మని నవ్వులు, అందరు ముక్త కంఠంతో వద్దన్నారు.
తర్వాత మళ్లీ మమ్మల్ని కన్విన్స్ చేసి, ఆ ప్రపోజల్ ను యాక్ట్ గా పాస్ చేసాడాయన. అదే కార్యసాధకుడి లక్షణం.
పేరెంట్స్ డే చేసి, ఫంక్షన్ చేద్దామన్నారు ఓసారి. సరే అన్నాము. అయితే ఎవరో ఎమ్.ఎల్.ఏ ని పిలుస్తానన్నారు
చీఫ్ గస్ట్ గా ..
“నతింగ్ డూఇంగ్..రాజకీయ నాయకులొద్దు. అంతకీ కావాలంటే వచ్చిన పేరెంట్స్ లో ఒక వృద్ధుడినో, లేక మంచి ఉద్యోగస్తుడినో పిలుద్దామని మా ఆలోచన.” అని మేమన్నాము.
ఇంత మంచి ఫంక్షన్ కు నలుగురూ వస్తారుకదా, అలాంటప్పుడు  ఏ ఎమ్.ఎల్.ఏనో పిలిఛి గౌరవిస్తే, తమ స్కూల్ భవిష్యత్ దృష్ట్యా బాగుంటుందని అతని యోచన. మన ఫంక్షన్ క్రెడిట్ ఆతడు పట్టుకుపోవడమేమిటని మా ఆలోచన. తనకు అనుకూలంగా ఉన్న టీచర్స్ చేత, కొందరి పెద్దల చేత మాకు రాయబారాలు సలిపారు .. కరస్పాండెట్ గారు. చివరికి మోర్నింగ్ ఫంక్షన్ మా పేరెంట్స్ పరంగానూ, ఈవెనింగ్ పబ్లిక్ ఫంక్షన్ .. ఆయనిష్టం అని సెటిల్ చేసాం… మార్నింగ్ ఫంక్షన్ కు తుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎ.డి.బి. బ్రాంచ్ మేనేజర్ (ఆయన ఒక పేరెంట్) విశిష్ట అతిథి. సాయంత్రం తుని బుల్లిబాబుగారు, అప్పటి ఎమ్.ఎల్.ఏ ఆత్మీయ అతిథి.
ఆనాటి  వేదిక మీదనే  నా నట జీవితానికి అరంగేట్రం.. భమిడిపాటి కామేశ్వరరావుగారి నాటిక..భజంత్రీలు. అందులో నేను హీరో ఫ్రెండ్ ను. నాతోనే సీన్ ప్రారంభం. ఏదో ఉత్తరం. అది చదువుతున్నట్టుగా నిలుచుని ఉంటే సీన్ మొదలవుతుంది. ఉత్తరం పైకి పట్టుకున్నా.. కానీ చేతులు వణుకుతున్నాయి.. ఆ తర్వాత సీన్ లో .. విషయం హీరో తాతో తండ్రికో వినిపిస్తాను. ఆయన నమ్మనంటాడు. అప్పుడు నేను ఉత్తరం చూపాలి. ఆ తాతో తండ్రో వేషం ఇందాకా ప్రస్తావించిన బి.ఎమ్ గారు వేసారు. నమ్మనంటే ఉత్తరం చూపిద్దామని నేననుకుంటే, ఆయన నమ్మినట్టు ఏమీ అనకుండా అలా కుర్చీలోకి చూస్తూ ఉండిపోయాడు.. ఇక నా పరిస్థితి ఆలోచించండి. తర్వాత ఏంచెయ్యాలో తెలియదు. అనుభవం లేదు కదా.. నేను గుటకలు మింగుతున్నానని ఆయనకు తెలిసి.. లేచి “నేన్నమ్మనయ్యా” అన్నాడు. “హమ్మయ్య” అని నిట్టూర్చి నేను కంటిన్యు చేసా.. తర్వాత చాలా నాటికలు వేసాను..టి.వి.సీరియల్స్ చేసాను. హాస్యరచనలు చేసాను, వాటిలో నటించాను కూడా .  నా నటనకు కూడా  అభిమానులున్నారు. కళాతపస్వి అయితే ఒక సీరియల్ లో నా మాడ్యులేషన్ బాగుందని కితాబిచ్చారు కూడా .. .

పేరెంట్స్ లో ఈ స్కూలు పట్ల కొన్ని కంప్లైంట్స్ కూడా ఉండేవి. మా దృష్టికొచ్చినవి, మరి కొన్ని, కొంత నాటకీయత కలిపి ఒక ఆడియో డ్రామా తయారు చేసాం. అందులో ప్రధాన పాత్రధారులం మేమే. ఆయన గొంతు నేను ఇమిటేట్ చేసాను. రికార్డింగ్ చేసి ఆయనకే వినిపించాం. ఆయన నవ్వుతూ తీసుకున్నాడు కానీ .. నవ్వుతూనే తీసుకున్నాడా అన్నది అనుమానం. అయితే మా మైత్రి కొనసాగింది..అది ఆయన గొప్పతనం.       

2 comments:

Raj said...

అంకుల్, ఆ రోజులు తలుచుకుంటే చాలా సంతోషంగా వుంటుంది.. మెమొరబుల్ రోజులు అవి. మనం అందరు వొక ఫ్యామిలీ లా కలిసి వుండేవాళ్ళం. మన ఫ్యామిలీస్ కలిస్తే ఇంకా ఆ రోజు నవ్వులతోనే భోజనం అయిపోయేది.

అన్నట్టు ..... మా చిన్నప్పుడు రికార్డు చేసిన ఆ నాటకం CD లోకి మార్చాలి అంకుల్. అది వొక బ్యూటిఫుల్ మెమరీ.. :)

చాలా మంచి బ్లాగ్ రాసారు అంకుల్. చాలా సంతోషం. వుంటాను.....

మీ ,
కోకా నీలకన్థ రజనికాంత్ .

హనుమంత రావు said...

రజని, నువ్వు ఓపిగ్గా నేను వ్రాసినది చదివానంటే చాలా సంతోషమైంది. మీ నాన్నగార్ని కలసిన మొదటిరోజుల గురించి వ్రాసానిందులో. నువు చెప్పినట్టు ఆ రోజులు తలచుకుంటే ఈ రోజుకీ ఆనందం కలుగుతుంది. మరవలేని రోజులవి. నాన్నగారు నా పోస్ట్ చూసారా ?ఏవన్నారు?