Pages

Wednesday, June 3, 2015

హరాజీకా - 10 జీవిత వైఫల్యపురస్కారము

హరాజీకా - 10

జీవిత వైఫల్యపురస్కారము

అయ్యొయ్యో .. మీరు పొరపాటు పడలేదండీ ! హెడ్డింగ్ సరిగానే చదివారు. విషయమేమిటంటే….

రాజమండ్రిలో ప్రస్తుతం నాగదేవి టాకీసుగా ఉన్న సినీమా హాల్ ఒకప్పుడు రామా టాకీస్ గా పిలవబడేది. దాని ఎదురుగా ఉన్న ‘Y’ jn.లాంటి రోడ్ పాయింట్ దగ్గరనుంచి, ఎదురుగా గౌతమి లైబ్రరీ వైపుకాక, కుడి వైపు యాంగిల్ లో ఉన్నవీధిలోకి వెళ్లితే  -  అక్కడ ఎడమ చేతి వైపు కనబడే  ఎత్తైన మేడింట్లో మేం కొన్నాళ్ళున్నాము. అప్పటికి నాకు అయిదేళ్లుంటాయేమో ? అక్కడుండగానే ఒకసారి నన్నూ, ఒక ఏడాది చిన్నదైన మా మేనకోడల్ని పూలూ, జాంపళ్లూ ఇస్తానని చెప్పి ఓ  దొంగాడు పట్టుకుపోయాడు. త్రిప్పి త్రిప్పి, మా మేనకోడలి చెవులకున్న బంగారు రింగులు - చాక చక్యంగా లాగి, మమ్మల్నిద్దర్నీ సాయంత్రానికి కోటగుమ్మం దగ్గర వదిలేసి, జనంలో కలసిపోయాడు.. ఎలాగో ఇంటికి చేరాము. బంగారం పోయినందుకు కాదు కాని, ఆ దొంగాడితో చేసిన నా సంవాదానికి మా వాళ్లు చాలా ముచ్చట పడేవారు. మా తాతగారొకాయన ఎప్పుడు కలసినా నాచేత ఆ కథంతా చెప్పించుకుని, నా ముద్దు పలుకులకు  (అప్పట్లో మరి చిన్నవాణ్ణి కదండీ.. ముద్దుగానే ఉంటాయిగా) అభినందించేవారు.

సీతంపేటలో మా బాబాయిగారుండేవారు. ఒకసారి మా పెద్దన్నయ్య (బాబాయిగారబ్బాయి) మా ఇంటికి వచ్చాడు. అతనితో ఆడుతూ, మా గుమ్మంలో ఉన్న ఇనప స్తంభం మీద పడ్డాను. నుదురు చిట్లింది .. చాలా రక్తం వచ్చింది. ప్రక్కవీధిలో డాక్టర్ గారనుకుంటా కుట్లు వేశారన్నారు. నా నుదుటిమీద ఆ మచ్చ నేటికీ ఓ విజయపతాకలాగా ప్రకాశిస్తూనే ఉంది. ఇంకో తమాషా ఏమిటంటే నేను ఏ స్థంభం మీద పడ్డానో, ఆ స్థంభం ఇప్పటికీ అలాగే ఉంది. కావాలనుకున్నవాళ్లు వెళ్లి చూడవచ్చు. (ఎవరు చూస్తారులెండి )

అక్కడనుంచి శ్రీరామనగర్ కు  నాన్నగారు మకాం మార్చారు. తాటాకు పాక. అయినా  ఇది స్వంతం. 1949లో మా చుట్టుప్రక్కల పది ఇళ్లకన్నా లేవు. చక్కటి గాలీ వెలుతురూ. ఆహ్లాదకరంగా ఉండేది..1400 గజాల స్థలంలో పడమర వైపు మేడ కడదామని, శంకుస్థాపన చేసారు నాన్నగారు. ఇల్లు ప్రారంభించలేదు కాని, దానికోసం తీసిన గొయ్యి. అలాగే ఉండిపోయింది. వర్షానికి నీరు చేరి సగానికి నీరు నిండింది. ఆటలాడుతూ, ఆ ఆటల మత్తులో ఆ గోతిలో నీళ్లలో  పడ్డాను.  తలకి  దెబ్బ తగలకుండానే, దెబ్బకి దిమ్మెక్కిపోయింది. జలగండం తప్పిందని, బ్రతికి బయట పడ్డానని అందరూ సర్టిఫై చేశారు.

మన ఇళ్లల్లో ఆ రోజుల్లో - వచ్చిన ఉత్తరాలు పదిలపరచుకోడానికి, ఒక తీగ ఉండేది. దానికి అడుగున ఒక ఫ్లాట్ చెక్క ఉండేది. దానివల్ల ఉత్తరాలు క్రిందకు జారిపోవన్నమాట. తీగ మొదట్లో మొన దేరి ఉండేది, ఉత్తరాలు సులువుగా గుచ్చుకోడానికి. ఓ రోజు ఉత్తరం గుచ్చే సంబరంలో .. ఉత్తరం గుచ్చుతుంటే ఆ తీగ చూపుడువేలిలో గుచ్చుకుపోయింది. నా లేత చేతి వేలులో అట్నుంచి ఇటు వచ్చేసింది. రక్తం కారింది. మా ఇంటి దగ్గరనుంచి ఆర్యాపురం అంటే సుమారు రెండు కిలోమీటర్లు వస్తే కాని, హాస్పిటల్ లేదు. సీతంపేటలో డాక్టర్ గారి ఇల్లు వుంది, కాని ఆ టైములో డాక్టర్ గారు హాస్పిటల్ లోనే ఉంటారు. మా చుట్టాలబ్బాయి నన్ను భుజానికెత్తుకుని (అప్పుడు బరువు తక్కువవాణ్ణికదా) ఆర్యాపురం పరుగెత్తాడు. [అప్పటికి సైకిల్ రిక్షాలు లేవు, లాగుడు రిక్షాలే .. అవీ మా మారుమూల పేటల్లోకి తరచు రావు.. గమనించగలరు.]
దాక్టర్ గారు ముందు సైకిల్ షాపుకి పంపారు, తీగలో అటూ ఇటూ ఉన్న ముక్కలు కటింగ్ ప్లేయర్ తో కట్ చేసాక, ఆయన చిన్న సైజ్ ఆపరేషన్ తో తీగ సాంతం లాగేసి, కట్టు కట్టారు. “తీగకు ఉత్తరం గుచ్చరా అంటే తీగనే గుచ్చుకున్నావు, ఘటికుడివిరా” అని ముద్దు చేసారు.. డాక్టర్ గారు. ఆయన నాన్నగారి స్నేహితులు కూడా..

హై స్కూల్ చదువు మొదలైంది. మా క్లాస్ మేట్ కు ఆ రోజుల్లోనే  పెళ్లి నిశ్చయించారు.  పెళ్లి ధవళేశ్వరంలో. సైకిళ్ల మీద వెళ్దామని నిర్ణయించాము. అంత దూరం సైకిల్ మీద వెళ్ళడం ఓ థ్రిల్. మిత్రులము నలుగురైదుగురం అద్దె సైకిళ్ళ మీద బయల్దేరాం. దారిలో మరో మిత్రుడ్ని పికప్ చేసుకుని  నా సైకిల్ పై ఎక్కించుకోవాలి. అతనికోసం ఆగాలి కదా, .. సైకిల్ బ్రేక్ వేసాను, అంత దూరం సైకిల్ ప్రయాణం అని ఆనందంలో దిగేటప్పుడు, ఒక చేతితో హేండిల్ బార్ పట్టుకొని, మరో చేత్తో సీటు పట్టుకున్నాను. అదో ఫీట్ .. ఎవరో చేస్తుంటే చూసాను. అప్పటికే సీటు కవరికీ - సైకిల్ కీ బంధం తెగిపోయిందిలా ఉంది, సీట్ చేతిలోకి వచ్చేసింది, సైకిల్ బాలన్స్ కాలేదు.. నేలమీద పల్టీలు కొట్టాను. బుర్ర చితికింది.. రక్తం .. రక్తం… నలుగురూ లేవదీసారు. డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లారో మరేం చేసారో తెలియదు. కట్టు కట్టబడింది.  ఇంటికెళ్తే, ఇంకేమన్నా ఉందా, పెళ్ళికెళ్ళ లేదేమని మొదలెట్టి, విషయం గ్రహిస్తారు అమ్మా  నాన్నగారూ. అందుకని రాత్రి పెళ్లైయ్యాక వస్తే - వచ్చేటప్పటికైతే, నిద్రలో ఉంటారు కనుక ఫరవా ఉండదని, పెళ్లికెలాగో ఓలాగ వెళ్లడమే మంచిదని నిర్ణయించి, పెళ్లికెళ్లాను. నాకు  మిత్రుల సపోర్ట్ కూడా ఉందికదా. తమాషా ఏమిటంటే ఆ పెళ్లికి వచ్చిన వారిలో  నా లాంటి క్షత గాత్రులు ఇంకా ఒకరిద్దరున్నారు అని తెలిసింది. ముహూర్త బలం .. అని వెటకరించడం సరికాదు, ఎందుకంటే  .. ఆ మిత్రుడు ఆరోగ్యంగ, చాలా కాలం కాపురం చేసి,  ఎమ్.ఆర్వో గా రిటైర్ అయి ఈ మధ్యనే పోయాడు. భార్య కొద్ది కాలం ముందు ముత్తైదువగా కాలం చేసింది. నిజానికి నేను ఎంత బాగా  సైకిల్  త్రొక్కగలిగినవాణ్ణయినా, అప్పుడు మాత్రం ఫెయిల్ అయ్యాను.

43ఏళ్లకు, కంటికి సైట్ .. అప్పటిదాకా ఉన్న చూపు తగ్గి, అద్దాల అవసరం వచ్చింది. బ్యాంక్ ఉద్యోగం. ఇంకో నాలుగైదేళ్లకు బి.పి వచ్చింది. ఆ రెండూ రివార్డ్సే .. కాని బ్యాంక్ వారు పాతికేళ్ళు .. బాగా పనిచేసావని, [చేసానో లేదో తెలియదు కాని], ఓ వేయిరూపాయలు ఇచ్చి,  ఏమన్నా కొనుక్కోమన్నారు... అదే నా చేతినున్న ‘ఆల్విన్’ రిస్ట్ వాచ్. వాచీల కొట్టువాడు
రు.1100 చెప్తే .. బ్యాంక్ వాళ్లు ఇంతే ఇచ్చారని, మిగతా వందరూపాయలకు ఏవో జోకులు చెప్పి తెచ్చుకున్నాను. నా పనికి మెచ్చి ఇచ్చామని బ్యాంక్ చెప్పినా ..  ఆవాచీచూసినప్పుడు  నాకు - కంటికి వచ్చిన అద్దాలు, వంటికి వేసుకునే బి.పి మాత్రలు …ఆ టిక్ టిక్ సౌండ్ లో క(వి)నపడ్తాయి.

షుగర్ షురూ అయిందని ఆ మధ్యనే వైద్యులు శలవిచ్చారు. వాకింగ్ చేయమంటూ సలహా ఇచ్చారు. ఎలాగా పింక్ కార్డ్ వాళ్లం కనుక షుగర్ కొంటే ఖరీదే. కనుక షుగర్ కొనడం తగ్గించొచ్చు. అలాగ్గానే బంతి భోజనాలలో వడ్డించేవాడు తినేవాడికన్నా ఎక్కువ మొహమాట పడి ఎలాగూ  స్వీట్ వెయ్యడు. అంచేత ఆ బాధా లేదు.  షుగర్ వాళ్ళ ఏదో బాధ ఉందనుకోలేదు - కాని, మీకు సుగరొచ్చింది ..మీరు  షుగర్ తినకండీ అని ఇంటా బయటా అంటూంటే,  అదిగో సరిగ్గా అప్పుడేచాలా బాధ కలిగేది. పైగా  స్వీట్ మీద మోజు పెరుగుతుంది కూడా . దాంతో తినాలనే కుతి పెరుగుతుంది. కాని అర్థాంగి .. స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టేసింది. ఆవిడ పతిభక్తి అలాంటిది. ప్రొద్దున్నే విదౌట్ సుప్రభాతం సాంగ్, వాకింగ్ కి వెళ్లండంటూ లేవగొట్టేస్తుంది.  చీకటి ఉండగానే వాకింగ్ మొదలు పెట్టి, సూర్యోదయం అయేటప్పటికి వాకింగ్ పూర్తి చేసి ఇంటికొచ్చేస్తూ వచ్చాను. వచ్చాక సంధ్యావందనం, పూజాదులు. ముసలితనం వచ్చాక కదా మురహరి గుర్తుకొచ్చేది. కొన్ని రోజులు బాగానే ఉంది. శీతాకాలం వచ్చింది. స్వెటర్, మంకీ కేప్, చేతిలో టార్చిలైట్ .. బందోబస్తుగానే బయల్దేరి, జనం తక్కువగా ఉన్న రోడ్ లోంచి ప్రశాంతంగా నడచుకుంటూ అరగంట నడిచి కాలేజ్ గ్రౌండ్స్ కు చేరా .. కొంచెం ముందుకెళ్ళి సెంట్రల్ జైలు వైపు తిరిగి వెనక్కి వస్తానన్నమాట .. అప్పటికి 1గంట నడచిన పుణ్యం దక్కుతుంది. సకాలంలో ఇంటికొచ్చి సంధ్యావందనం చేస్తే ఉత్తమ గతులు కలిగే పుణ్యం కూడా వస్తుంది.. అన్నమాట. కాలేజ్ ఆర్ట్స్ బ్లాక్ ముందరనుంచి వెళ్తూ, ఆ కాలేజ్ లో చదివిన రోజులు తలచుకుంటూ, నడుస్తున్నాను .. నా ఆలోచనల్లో నేనుండి చేతిలో ఉన్న టార్చ్ లైట్ వేసుకోవడం మరచిపోయాను… అసలే చీకటి… పైగా వయస్సు.. కాళ్లకు కళ్లుండవుగా, అందుకని వాటికి కనపడదు. … ఆలోచనలకు బ్రేక్ పడింది, .. స్పీడ్ బ్రేకర్ .. కాళ్లకు తగిలి, వయసు బాలన్స్ చేయక పోడం వలన, ఆ చీకట్లో బోర్లా పడ్డాను. ముక్కు క్రింద - పై పెదవి చితికింది. నడిచిన ఉత్సాహం ఆ రోజు టార్గెట్ పూర్తి  చేయడానికి ఉత్సాహ పడుతోంది .. వయసు లేవ నీయటం లేదు. చేతికి వేడి రక్తం తగిలింది-(ఈ వయసులో ఉడుకు రక్త మేమిటి, చోద్యం కాకపోతే అనకండి. , నడచి నడచి ఉన్నానుగా అప్పటికే, అందుకని వేడెక్కింది). నెమ్మదిగా లేచా .. ముక్కులోంచి బొటబొటా నెత్తురు చుక్కలు పడుతున్నాయి … సరే - వదిలేయండి … ఆ దెబ్బ రెండు మూడు నెలలు బాధ పెట్టింది. ఇప్పటికీ అక్కడ ఏ కుట్లు వేయకపోయినా, ఆ రోజునుంచి మానేసిన వాకింగ్ వ్యాయామానికిగుర్తుగా… కుట్లు వేసినట్టే మచ్చ వుంది.

ఈ మధ్య లెఫ్ట్ ఫోర్ ఆర్మ్ దగ్గర నొప్పి .. హిందీ సినీమాలో ఫైట్ చేయని విలన్ కె.యన్.సింగ్ ఉండేవాడు.. అతని  లాగా దాని మీద నాజూకుగా రాస్తుంటే సెమనగానే ఉంటోంది.. కాని నా కుడి చెయ్యి నాకు  తెలియకుండా ఆ నొప్పిని పట్టుకోడానికి, అలా భుజంమీదకు ప్రాకుతూ పోతోంది. . ఆ తర్వాత మెడక్రింద నొప్పి. రాత్రిళ్ళు నొప్పితో మెలకువ వచ్చేస్తుంది. భయంకరమైన ఆలోచనలు. ఎవర్నైనా లేపాలా వద్దా.. లేపితే అందరూ నిద్రలో ఉంటారు లేస్తారా.. లేవకపోతే.. అమ్మో, ఇంతకీ ఈ నొప్పి భుజానిదా కొంపదీసి గుండెదా.. ఓరి దేవుడోయ్ .. రామా రామా, అంటూ రామనామం బలవంతంగా చేసుకుంటూ అలా నిద్రలోకి జారుకున్నాను. లేచాక డాక్టర్ గారి దగ్గరకి పరుగెత్తా…x-రే తీసారు.. వెన్ను పొజిషన్ బాలేదు. అర్జంట్ గా కాలర్ వేయాలన్నారు .. వెయ్యకపోతే - ఇంతే సంగతులన్నారు.. మళ్లీ భయం.. మెడికల్ షాప్ కు వెళ్లాను. కంఠాభరణం తగిలించాను. అక్కడ కూర్చున్న ఓ ఆగంతకుడు .. కాలర్ అనుభవం ఉందిలా ఉంది.. నువ్వు పెట్టుకున్న పొజిషన్ తప్పు అని నా కాలరు సర్ది, సరిగా పెట్టాడు.. మొత్తానికి కాలర్-- కొత్త రివార్డ్ వచ్చింది. కాలర్ ఎత్తుకు తిరిగే నేను, ఈ కాలర్ తో తల దించుకోవలసి వచ్చింది. ఇప్పుడు వెనకాల ఉన్నవారిని చూడాలంటే మెడ త్రిప్పితే సరిపోదు.. ఈ హ. రావు మొత్తంగా  తిరగాలి తోకమీద వాలిన ఈగను పట్టుకోడానికి తిరిగే శునకం లాగా..  

జీవితంలో ఏదైనా సాధిస్తే నిజంగా అంత గొప్పవాళ్ళం మనమైనప్పుడు .. జీవిత  సాఫల్య పురస్కారం [LIFE TIME ACHIEVEMENT AWARD] ఇస్తారు. కాని మనం, అంటే నేను అంత కాదు కదా,  కొంచెం కూడా గొప్పవాణ్ణి కాదుగా? నాకు నేనే ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఇవన్నీ ఎవర్డ్సే .. పురస్కారాలే .. ఎటొచ్చీ ఇవి జీవితంలో గొప్పవి సాధించినప్పుడు వచ్చినవి కావు.. అల్లరికి, అలవాటుకీ, అసమర్థతకు వచ్చినవి అందుకనే హోల్ సేల్ గా ఇవి జీవితవైఫల్యపురస్కారాలని  ముద్దుగా - నే - పెట్టుకున్న పేరు.

3 comments:

Unknown said...

మీరు నడక మానివేసినా హరాజికాలు రాయడం మానుకోవద్దు.

హనుమంత రావు said...

నా నడక మానేసినా, కలం నడచినంత కాలం వ్రాసే ప్రయత్నం చేస్తాను.. అభినందన సందేశం ! బాగుంది.

Vinjamuri Venkata Apparao said...

అద్బుతం..మీ K.n.Singh ఫైట్ చెయ్యని విలను బాగున్నాడు.
అయ్యా నేను మీ రామా టాకీసు లో ప్రేమ (Bhnumathi..Anr)1951 lo chhosanu..
memu appudu kovvuru lo unde vaallam... maa choottalu Gadepalli Sitha Ramyyagaru
undevaru.. akkade Cherukupalli Bhirava sastry gari manavadu ippudu maa alludu.