Pages

Saturday, February 6, 2016

రాజమండ్రి - 12




హై స్కూల్ రోజుల్లోకి
---డి.వి.హనుమంతరావు


మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కాని నా పోస్ట్ లకు మంచి స్పందన వచ్చేస్తోందండి. ఎందుకంటే చదివినవారు, వారి వారి చిన్నతనాలలోకి వెళ్ళిపోయి వారికి పరిచయమైన రాజమండ్రిని గురించి ఆవిష్కరించమంటూ ఆదేశిస్తున్నారు. అలాగే తమ గత కాల స్మృతులను స్మరించుకుంటున్నారు.. అంచేత మీరు నేను చెప్పేది నమ్మి తీరాలి. నమ్మక చేసేది లేదు .. అనకండేం, పాపం నేను బాధ పడతాను…  అని చెప్పడానికే ఈ స్వాత్కర్ష.


హైస్కూల్లో చదివే రోజుల్లో జూన్ వచ్చిందంటే ఒక థ్రిల్ …  మా స్కూల్ పుష్కర్ ఘాట్ దగ్గర.. మునిసిపల్ హై స్కూల్. -----పురపాలక సంఘోన్నత పాఠశాల … [ఇదివరకు ఎపిసోడ్స్ లో ఇది ప్రస్తావించానేమో తెలియదు.. అప్పుడు కుర్రవాణ్ణే కాని ఇప్పుడు పెర్ర వాణ్ని కదా  ఛాదస్తం ..]  


స్కూల్ అసెంబ్లీ లో…  అప్పటి మా క్లాస్ మేట్ - ఇప్పటి యాక్టర్ -  జిత్ మోహన్ మిత్రా,  వాళ్ల అన్నయ్య కుమార శర్మ (ఇప్పుడు నిజామాబాద్ లో ఆడిటర్)తో కలసి  
“పురపాలక సంఘోన్నత పాఠశాలా..”  అంటూ  మా స్కూల్ గొప్పతనం శ్లాఘిస్తూ, మా తెలుగు మాస్టారు చిన్మయ బ్రహ్మంగారు వ్రాసిన గీతాన్ని రోజూ పాడేవారు.   ఆ స్కూల్ ఉన్నచోటును ఇప్పుడు మునిసిపల్ వాటర్ వర్క్స్ వారు ఆక్యుపై చేసారు. గోదావరి ఒడ్డునే స్కూల్. గోదావరికి జూన్ నెలలో కొత్త నీరు తగులుతుంది. గోదావరి గాలులు పడమటనుంచి నగరాన్ని తాకుతాయి. కొంచెం  చలిగా కొంచెం వెచ్చగా వీచే గాలులు మేనికి తాకగానే విద్యార్థులకు కొత్త సంవత్సరపు సందడి మొదలైపోయిందన్నమాట… అప్పుడు అకడమిక్ యియర్ అంటే జూన్ నుంచి ఏప్రిల్ వరకూ… ఏప్రిల్ లో పరీక్షలు అయిపోవడం, రిజల్ట్స్ వచ్చేయడం అయిపోతుంది.. పాసై జూన్ నెలలో కొత్త క్లాసులోకి వెళ్లిపోతాం. కొన్ని పాత ముఖాలు కనపడవు .. కొన్ని కొత్త ముఖాలు వస్తాయి … కొత్త పుస్తకాలు, వాటికి కొత్త అట్టలు,  కొత్త బట్టలు, కొత్త జోళ్లు అన్నీ కొత్త కొత్త గా ఉంటాయి. ఇప్పటికీ జూన్ నెల .. గోదావరి గాలి ఒంటికి తాకగానే  మనసు చిన్నతనపు రోజులకు పరుగులు తీస్తుంది. ఆ వాతావరణం గుర్తుకొచ్చేస్తుంది. మా హైస్కూల్ కు పెద్ద ప్లేగ్రౌండ్  .. మధ్యలో రాజ రాజ నరేంద్రుని కాలం నుంచీ తపస్సు చేసుకుంటున్న ముని పుంగవుల్లా పెద్ద పెద్ద చెట్లు … అక్కడక్కడ క్లాస్ రూమ్ లు.. ఈ బిల్డింగ్ చరిత్రలో చెప్పబడే చిత్రాంగి మేడఅని  ఒక ఐతిహ్యం .. మా స్కూల్ ఆవరణలో  ఒక రాతి శాసనం కూడా ఉండేది అని గుర్తు. ఆ రాతి శాసనపు రాయికి దగ్గరగా మునిసిపల్ కుళాయి ఉండేది .. ఏనుగు ముఖంలాంటి ముఖంతో పెద్ద ఇనప కుళాయి అది. నీళ్ళు తిప్పుకోడానికి పెద్ద చెవి (లివర్) . అది నొక్కితే నీళ్లు వచ్చేవి. ఎందుకు చెప్తున్నానంటే అలాంటివి  ఇప్పుడు మ్యూజియం లో కూడా కనపడవు. గత  చరిత్రకు గుర్తుగా మా స్కూల్ బిల్డింగు ఎత్తైన కట్టడాలతో ఉండేది . , గుమ్మాలు కూడా చాలా ఎత్తుగా ఉండేవి. వాటిల్లో మా యస్ యస్ ఎల్ సి క్లాసులు ఉండేవి. దానిప్రక్కనే హెడ్ మాస్టారి రూమ్.  అక్కడ పోర్టికో .. దానిపైన బాల్కనీలా ఉండేది. నేనూ రామం అక్కడ కూర్చుని మా ఇంటి దగ్గర ఇచ్చిన కేరియర్స్ విప్పుకుని అన్నాలు తినేవాళ్లం. వాడికి ఇంటి దగ్గర్నుంచి నాలుగు గిన్నెల కారియర్ వచ్చేది. నేనైతే ఇంటిదగ్గర్నుంచి, రెండు గిన్నెల కారియర్ మోసుకుపోయేవాణ్ణి. వాడికి తరచూ, నాకప్పుడప్పుడు ఏమైనా కొనుక్కోడానికి ఇంటి దగ్గర డబ్బులిచ్చేవారు. అవి పుచ్చుకుంటే గేట్ అవతలకు పోతే  సోములు ఐస్ బండి,, మామ్మదగ్గర వేరుశనగ ఉండలు, కొబ్బరి నౌజులు… వేసవి వచ్చిందంటే సీమ సింతకాయలు, రేగి ఒడియాలు… వర్షాకాలంలో తియ్యటి బత్తాయి జామల సైకిళ్లు.. ఎక్కడో అక్కడ, ఇద్దరం కలసి తినేవాళ్లం. మా బాబాయిగారబ్భాయి కూడా మాతో కలసేవాడు. వాడు రెండేళ్లు జూనియర్. తిన్నాక మధ్యాహ్నం లంచ్ టైములో ఆడుకోడమో … ఆ పెద్ద చెట్ల మొదళ్లలో .. బలమైన వేళ్లు ఏర్పరచిన సీటుల వంటి వాటిపై కూర్చుని కబుర్లు చెప్పుకోడమో….. ఆ రోజులే వేరండి.


ప్రతి సంవత్సరమూ శలవుల తర్వాత స్కూల్ కు వెళ్లడంలోని థ్రిల్ ….  ఎప్పుడో పోయింది. …ఇప్పుడంతా  స్టడీ అవర్స్, పరీక్షలవగానే నెక్స్ట్ ఇయర్ పాఠాలు మొదలెట్టేయడం.. స్కూల్ కంటిన్యూ అయిపోవడం… ..
శలవుల్లో తాతగారి ఊర్లకు  వెళ్ళడాలు లేవు, ఆత్మీయతలు పంచుకోడం.. ప్రకృతిని ఆస్వాదించడం.. ప్రకృతి ఒళ్లో ఆడుకోడం లాంటివి ఇవేవీ పిల్లలకు తెలియకుండానే పెరుగుతున్నారు.. పెద్దయ్యాక చేసే  కంప్యూటర్ ఉద్యోగాలు కూడా ఉన్న కాస్త సుఖాన్ని దూరం చేస్తున్నాయి. శలవుల్లో ఇళ్ళ కొచ్చినప్పుడు కూడా ఆ పెట్టె  ముందేసుకుని కొడుకులు కూర్చుంటారు.. టి.వి.పెట్టె ముందు పెద్దలు కూర్చుంటారు.. పిల్లలకు ఆండ్రాయిడ్ ఫోనులు గేములు ఉండనే ఉన్నాయి.. మన  సరదాలు, అనురాగాలు ఆ పెట్టెల్లో పెట్టేస్తున్నాము. సరే…


వర్షాకాలంలో గోదావరికి ఎగువన వర్షం పడిందంటే గోదావరికి వరదలొచ్చేవి. రాజమండ్రిలోని విశాలమైన అఖండ గౌతమి శోభ రాజమండ్రికే స్వంతం. అందునా పుష్కరాల రేవులో మెట్ల మీంచి చూస్తే , అప్పట్లో ఇసుక మేటలు కూడా ఉండేవి కావేమొ.. అబ్బా. .ఏమందమండీ బాబూ ? పాత రైలు బ్రిడ్జ్ {అంటే హేవలాక్ బ్రిడ్జ్} మొదటి స్థంభం మీద నీటి మట్టం సూచించడానికి  అంకెలుండేవి. ఆ వరదల సీజనులో రోజూ వరద లెవెల్ చూసి, ఆ విషయాలు డిస్కస్ చేస్తూ స్కూల్ కు వెళ్ళే వాళ్లం.. స్కూల్ కు టైమయిపోతున్నా, భుజాన పుస్తకాల సంచి దిగలాగుతున్నా, చేతిలో లంచ్ కెరియర్ భారంగా ఉన్నా, ఇంట్లో బలవంతంగా ఇచ్చిన గొడుగు ఇబ్బంది పెడ్తున్నా అదో పనిగా -- గోదావరి లెవెల్ చూడాల్సిందే. వర్ణించి స్కూల్లో మిగతా పిల్లలకీ,  కథలుగా ఇంటి దగ్గర అమ్మా నాన్నలకు చెప్పాల్సిందే.వరదనీటిలో  పెద్ద పెద్ద దుంగలు అడవుల్లోంచి కొట్టు కొచ్చేవి.. అవి పట్టుకు రావడానికి కొందరు వెళ్తూ ఉండేవారు. వారు రేకుతో చేసిన లావుపాటి గొట్టం లాంటిది, ముందర వైపు వంపు తీరి, ఉన్న ఒక సాధనాన్ని ఉపయోగించి వెళ్లేవారు. నీటిలో తేలుదుంది. దానిమీద పడుకుని ఈత కొట్టుకుంటూ వెడతారన్న మాట. దాన్ని గుర్రం అంటారు. గట్టు మీంచి దుంగను పోల్చుకోవడం, ప్రవాహానికి వాలుగా ఈత కొట్టుకుంటూ వెళ్తే కాని ప్రవాహంలో కొట్టుకుపోతున్న కర్ర అందదు. (రన్నింగ్ సిటీ బస్సులో ఎక్కడానికి మనమూ బస్సుతో పాటు పరిగెత్తినట్టన్నమాట. ) అది పట్టుకుని ప్రవాహాన్ని ఎదుర్కొంటూ ఎప్పటికో గట్టుకొచ్చేవారు. అప్పటికి వారు బయల్దేరిన గట్టు దగ్గరనుంచి కొన్ని కిలోమీటర్ల క్రిందకు వెళ్లిపోయేవారు. ఒక్కోప్పుడు, ఆ దుంగ విలువైనది అవ్వచ్చు, కాకపోవచ్చు పాములు గట్రా ఉండొచ్చు .. ఆ రిస్క్ లన్నీ పడేవారు.. అది మనకేల .. వాడు వెళ్లినంత మేర కనిపించినంత వరకు చూడ్డం, మాకదో వినోదం ఆ సీజనులో. మరీ చిన్న పుల్లలకోసం గట్టుదగ్గరే కొందరు ఉంది కలెక్ట్ చేసేవారు.


మేం చదువుకునే రోజుల్లో టెక్స్ట్ బుక్స్ అన్నీ ప్రైవేట్ వాళ్ళవే .. ప్రతి స్కూల్ వాళ్ల వాళ్ల కమిటీలు సిఫార్స్ చేసిన పబ్లిషర్ దగ్గర పుస్తకాలు కొనుక్కోమని ఉత్తర్వులు జారీ చేసేది.. ఇంక ఇంట్లో వాళ్ళిచ్చిన డబ్బులు జేబులో వేసుకుని పుస్తకాల షాపుల చుట్టూ  తిరగడం.. స్టాక్ రాలేదంటే మళ్లీ మళ్లీ తిరగడం.. ఈ తంతు జులై ఆగస్ట్ దాకా డేకేది. వర్షాకాలం మొదలై పోయేది.. వర్షం పడ్డప్పుడు ప్రక్క కొట్లలో దూరుతూ, రానప్పుడు ముందుకు సాగుతూ… పుస్తకాలకోసం వేట, కొన్న పుస్తకాలు తడవకుండా భద్రపరుచుకుంటూ… పరిస్తితులను ఎదిరించడం తెలిసేది కాదు.. పరిస్తితులకనుగుణంగా పోవడమే …  ఇంట్లో కూడా అన్నప్పుడు డబ్బులు అన్ని కుటుంబాలలోనూ ఉండేవి కావు. ఆదాయాలు తక్కువ -- ఖర్చులు ఎక్కువ. ఆ బాధలు అర్థం చేసుకోలేని వయస్సు.. మన పంతం మనదే.. మన కోపాలు మనవే. కాని ఒకటి..  పెద్దల్ని ధిక్కరించడం ఉండేది  కాదు, వారు కాదంటే ఆపని అసలు చేసేవాళ్లంకాదు. నచ్చకపోతే కళ్లనిండా నీరు.. మౌనం అంతే .
రామా అండ్ కో, వేంకట్రామా అండ్ కో అన్న పబ్లిషర్స్ పుస్తకాలు ఎక్కువగా సిఫార్స్ చేసేవారు.. వాటి షాపులు రాజమండ్రీలో ఉండేవి .. ఇంకా కొన్ని షాపుల వాళ్ళు ఈ పుస్తకాలు కూడా తెచ్చేవారు. అవి వెతుక్కుంటూ పోయే వాళ్లం. రౌతు బుక్ డిపో, కాళహస్తి తమ్మారావు, ఇవికాక ఓరియంట్ లాంగ్ మాన్ ..
పుస్తకాలు లేకపోతే కొందరు సౌమ్యంగా చెప్పేవారు. మళ్లీ అడిగితే విసుక్కొనే వారు.. ప్రొద్దున్నించీ పని చేసిన బాధ వారిదికదా పాపం.. మాకు చిన్నతనం..
కాలేజీలో చదివే రోజుల్లో అయితే  .. ఒక్కో పుస్తకం ఆంధ్రా బుక్ హౌస్ అనే షాపు లో మాత్రమే దొరికేది. అది ఆషా రెస్టారెంట్ సెంటర్ (ఇప్పుడు డీలక్స్ సెంటర్)లో ఉండేది. ఆ షాపాయనకు కోపం ఎక్కువ. మా కాశీ ఆయన్ని తాగుబోతోడనే వాడు. కళ్లు ఎర్రగా ఉండేవి. లేదని చెప్పడంకూడా చాలా కోపంగా చెప్పేవాడు.  ఎక్సర్ సైజు బుక్స్ అయితే కె.యన్ రావు, అతని షాప్ ఇష్టపడేవాళ్లం. అతని పేరు కూర్మాల నారాయణ రావు. పుస్తకం మీద అతడి ఫోటో ప్రింట్ చేసి ఉండేది. ఇదికాక  మాజేటి సూర్యప్రకాశ రావు.. ఎలిఫెంట్ మార్క్ పుస్తకాలు. సింగల్ రూల్స్, డబల్ రూల్స్, బ్రాడ్ రూల్స్ అంటూ  రక రకాలు. అప్పుడన్నీ ఇంక్ పెన్నులే. రూపాయిన్నర పెడ్తే రెండూ, మూడూ పెన్నులు. ఇంక్ రాజమండ్రిలో తయారయ్యేది. ఐడియల్ ఇంక్ అని ఆకుల సుబ్బారావుగారి మార్క్ .. ఒక్కోప్పుడు అర్థణా ఇస్తే పెన్ను నిండా ఇంకు పోసే షాపులుండేవి. అది కొంచెం పల్చన. నీళ్లు కలిపేసేవారు. బిజినెస్ అప్పుడూ, ఇప్పుడూ ఒకటే… నెక్ దగ్గర ఇంకు కక్కేవి.. (ఈ పారిభాషిక పదాలు ఇప్పుడు తెలియవేమో- అర్థం చేసుకోండి). దానికి లోపల సబ్బో , గ్రీజో రాయాలి. పైగా నిబ్, అంటే పాళీ, నాల్క - రెండూ చక్కగా పెట్తేనే ఇంక్ పేపరు మీద పడకుండా వ్రాయగలుగుతాం. అందుకని అప్పుడప్పుడు అవి మారుస్తూ ఉండాలి.. అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు ఆ ఫౌంటెన్ పెన్నులతో వ్రాయలేం.. ఆ పెన్నులకు రత్నం పెన్ వర్క్స్, రాజమండ్రికే కాదు దేశంలోనే ఫేమస్, అలాగే గైడర్, లీడర్ అని కంపెనీలుండేవి. వీళ్లదగ్గర గోల్డ్ నిబ్ తో కూడా పెన్నులుంటాయి. ఇవి కాక పైలట్, పార్కర్ పెన్నులు ఇతర కంపెనీలవి కొంచెం కాస్ట్ ఎక్కువ.


సీమ సింతకాయలు కనబడ్డాయంటే .. మార్నింగ్ స్కూల్స్ అని నేను లెక్కేసే వాణ్ణి. ప్రొద్దున్నే వెళ్లడం బానే ఉండేది కాని, ఎండన పడి రావాలి. అక్కడికీ మాస్టర్ లు చెప్పేవారు. ఇంటికి స్ట్రైట్ గా పొండి అని. అదీకాక ఆకలి నక నక లాడేది. ఆపుడు స్నాక్స్ అంటూ ఏమీ ఇవ్వడాలు లేవు. ప్రొద్దున్నే చద్దన్నమో, తరవాణీ అన్నమో తినేయడం, పోడం… అంతే … వర్షాకాలం అయితే… కంటిన్యూ క్లాసులు .. రెండు పూటల క్లాసులు కలిపేసి మధ్యాహ్నం వదిలేసేవారు..

ఆ రోజుల్లోకి ఒక్కసారి తీసుకెళ్ళిపోయే టైమ్ కాప్స్యూల్ ఉంటే బాగుణ్ణనిపిస్తుంది కదా.. అలా అని మన ప్రస్తుత ఫించనుకు ముప్పు రాకూడదండోయ్…

8 comments:

Radhika Rao said...

పాత జ్ఞాపకాలు బహు రుచి గా ఉంటాయి కదా హనుమంతరావు గారూ.నేనూ పురపాలక సంఘ పాఠశాల విద్యార్ధి నే.దానవాయిపేట.మీ కాంటెంపరరీ.మా ఫ్రెండ్ శివనాధ శాస్త్రి మీ క్లాసే అనుకొంటా.మీ ముచ్చట్లు చదివి నేనూ చాలా ముచ్చట పడ్డా.అప్పుడు లెక్కల టెక్స్ట్ బుక్స్ కవిరాజా పబ్లికేషన్స్ తులసీ గణితం షాడే స్కూల్ స్టోర్స్ లోనే దొరికేవి.గేటుదగ్గర హెడ్మిస్ట్రెస్ పర్మిషన్ కోసం ఎండలో పడిగాపులు పడడం ఇంకా
గుర్తుంది.

T S MURTY said...

CHINNA NATI TEEPI JNAPAKALNI CHAKKAGA TELIYAPARICHARU DVH garu. bahu dhanyavadamulu.
మధురం మధురం ఆ చిన్న నాటి తీపి గుర్తులు. తిరిగి రాని బాల్యం. నెమరు వేసుకుని ఆనందించటం ఉత్తమం కదా!

srinivasrjy said...

మీరు వివరిస్తున్న శైలి బాగుంది .. ఆ ఆంధ్రా బుక్ హౌస్ ఇప్పటికీ డీలక్స్ సెంటర్ లో ఉంది కదూ

chandu said...

well written sir. reminded me of my childhood memories

హనుమంత రావు said...

i sincerely thank Shri Murty,Shri Radhika Rao, Shri Srinivas, Shri Chandu who expressed their satisfaction for my post..Thank u sirs.

BANDA said...

Enjoyed the Golden Memories of School days. Thank you Sir.

Unknown said...

Enjoyed the presentation. I could recollect the elephant tap and the lever of those days as it was there in my Grand mothers' house at INNESPETA. Totally your presentation is AWESOME.

హనుమంత రావు said...

thank you sri banda.. and sriramarao garu..