కేశ ఖండన
రచన:డి.వి.హనుమంతరావు.
[గుర్తుందండీ.. హరాజీకా అంటే ఏమిటో మీకు తర్వాత చెప్తానన్నాను కదా..జంధ్యాల వారు చెప్పినట్లు నేను మాట మీద నిలబడే వ్యక్తిని. తర్వాత తప్పక చెప్తాను. అయినా హరాజీకా అంటే తెలియకపోయినా చాలా మంది చదివి స్పందిస్తున్నారు కదా.. మీరు కూడా అలా స్పందించండి …స్పందిస్తారు నాకు తెలుసు.]
===========
“ప్రొద్దున్నే బయల్దేరా రెక్కడికి?”
అనుకున్నంతపనీ అయ్యింది. అర్థాంగి దృష్టిలో పడకుండానా.. అబ్బే కొస్చనే లేదు...
“ఏదో అలా వాకింగ్ కి… అయినా పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదని పెద్దలంటారు.”
సంజాయిషీ లా గోడకేసి చూసి చెప్పా..
“ఆ పెద్దలేం అన్నారో నే వినలేదు కాని, మీ వాటం చూస్తే వాకింగ్ లా లేదు.. అయినా రోజూ సాయంత్రం కదా వెడుతున్నారు, ఇలా ప్రొద్దున్నే బయల్దేరారేంటా అని. .. “
కూపీ లాగుతొందిరోయ్ దేవుడా..
“నిజమే, కాని ప్రొద్దున్న వెడితే బోల్డు విటమినులు దొరుకుతాయట”
“రోడ్డు మీద రాశులు పోసి, మీకోసం పారేసుకుంటారా, దొరకడానికి …. “
“లేదోయ్ .. ఆ విటమినులు పొట్టకు మంచిదట..”
“అంటే పొట్ట పెరగడానికా.. తగ్గ డానికా … ఇంతకీ ఎవరు చెప్పారుట, గోదావరొడ్డున మూలికలమ్మే వాడేనా ?”
“ఇదిగో లక్ష్మీ .. ఇలా వెటకారం చేస్తే నాక్కోపం వస్తుంది”
నాకేం ఉద్ధరింపుట అని అనేస్తేందేమో, మీరందరూ చూస్తున్నారు కూడాను అని భయపడ్డా
అపుడే కాఫీ త్రాగి వచ్చింది కదా .. అలా అనకుండా, నవ్వుతూ, గోముగా అడిగింది..
“శ్రీవారు, ఎక్కడికమ్మా వెళ్తున్నారు “ అని.
భయపడుతూనే చెప్పా…
“కట్టింగ్ కి” … అంతే లక్ష్మికి కోపం వచ్చేసింది.
“ఇప్పుడేమంత పెరిగిపోయింది, అయినా మొన్నే కదా గొరిగించుకొచ్చారు.. అప్పుడే తొందరేంటి.”
“గుండైతే గొరిగించు కోడం అంటారు, క్రాఫింగ్ అయితే కటింగ్ అనాలి”
అని చెప్దాం అనుకున్నా.. అబ్బే అనుకున్నాను. .. అంతే.
“మొన్నేమిటి లక్ష్మీ, నీకు స్నానం అయిన రోజు చేయించుకున్నాను, మరి నిన్ననే గా… ”
మధ్యలోనే కట్ చేసి
“నోరు మూసుకోండి, వెధవ లెక్కలు మీరునూ”
సిగ్గు ప్లస్ కోపం ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.
““మీకేం మతి లేదు.. పదిరోజులలో, మా చెల్లెలింటిలో సత్యనారాయణ వ్రతం. మనం వెళ్లాలి కదా, అక్కడకీ బోడి మొహంతో వస్తారా.. ఇప్పుడొద్దు” అంది.
“దేవానంద్ కైనా, మన్మధుడికైనా హెయిర్ కట్టింగ్ చేయించుకున్న వారం రోజులదాకా బాగుండదని శాస్త్రం చెప్తోందోయ్. అంతేకాని, మరీ పదిహేనురోజులదాకా అని ఎక్కడా లేదు”
అని నాకున్న శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉటంకించాను.
“దేవానంద్ కు దేవపురుషులకూ ఆ లెక్కలు.. మీకు నెలదాకా వచ్చే సమస్యే లేదు. అందుచేత .. ససేమిరా”
“అప్పటికి.. వారం రోజుల్లో కొత్తిమీర మడిలా జల జలా వచ్చేస్తుందోయ్ .. అయినా ముళ్ళపూడి వారన్నట్టు, (అప్పట్లో) బడిపంతులుద్యోగి జీతమా పెరక్కపోవటానికి”అని తెలుగులో అని,
మరల ఇంగ్లీషులో…
“See mrs. lakShmi rao, my experience says and also with the statistics available with me, I say…”
అని చెప్ప బోయా..
“సీ మిస్టర్ రావ్ లక్ష్మీ.. గో టూ హెల్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్,”
అని తెల్గు స్క్రిప్ట్ లో ఇంగ్లీష్ లో ఏకి పాడేసింది. అంటూ ముక్తాయిపుగా ..
“అయినా సరే నేనొప్పుకోను… మీరు డిప్ప చేయించుకుని, ఆ డిప్ప మొహం వేసుకుని మా వాళ్లింటికొస్తారు. ఉన్న నాలుగు వెంట్రుకలూ టెలిఫోన్ స్థంభాల లాగా లేచి నించుంటాయి, అవి మీకు దువ్వెన్నకు లొంగవు. ఆ హడావుడిలో మీ నెత్తిన చవురు పెట్టడానికి నాకు తీరికుండదు.. మా వాళ్ళందరూ .. కోరస్ లో “..సొగసైన క్రాఫు చెరిగిపోయే, నగు మోము చిన్న బోయే”అని రేలంగి పాత సినిమాలో పాడిన పాటను, క్రొత్తగా హం చేస్తున్న ఫీలింగ్, మీ కేమో…. కాని నాకు వచ్చేస్తుంది. అంచేత మళ్ళీ ససేమీరా... “అంది.
“అబ్బే అదా.. కొబ్బరి నూనె రాయడం పెద్ద సమస్యేమిటి.. వాళ్ల పని పిల్ల చేత రాయించుకుంటాను..”
“ఇలాంటి వెధవ్వేషాలేస్తారనే, మా చెల్లెలు ఆ పనిమనిషిని మాన్పించేసింది. .. ఇప్పుడున్నది వయసు మళ్లినావిడ”
అదేం పోయ్ కాలం అని అనుకోబోయా.. కాని ఈలోగా మా ఆవిడ
“అయినా ఇప్పుడు సమస్య కొబ్బరి నూనె రాయడం కాదు..”
“పోనీ మీ చెల్లెలింటికి ఈ డిప్ప మొహంతో నేనురాను లే..”
“మరి ఏ మొహం పెట్టుకొస్తారు, మీకున్నది ఆ ఒక్క మొహమే కదా “
ఇంత సీరియస్ పరిస్థితుల్లోనూ .. ఓ యబ్బో సెన్సాఫ్ హ్యూమర్ అంటే ఇదే కామోసు.
అయినా ఎవరికైనా ఏ మొహమైనా ఉండేది .. ఒక్క మొహమే కదా.. ఇది కూడా స్వగతమే …
“అదికాదోయ్ .. నువ్వెళ్లి ఎంచక్కా వ్రతం చేయించి వచ్చేస్తావని ..”
“మీరు నా పాతివ్రత్యాన్ని శంకిస్తున్నారు.. నేనెప్పుడైనా అలా వెళ్లానా.. “
అని మంగళ సూత్రాలను కళ్లకద్దుకుంది.
కళ్లల్లో నీళ్లు కూడా మెరిసాయి..
మరేం చేస్తాం … సెంటిమెంటు..
నా కర్థం కాని విషయం .. ఆవిడెప్పుడైనా నాతో వస్తుందేమో కాని,ఎప్పుడూ పుట్టిళ్లకు ఒంటరిగా వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తుంది. ఇంత టెన్స్ గా వాతావరణం ఉన్నప్పుడు మళ్లీ ఇలా అడిగానంటే … ఆవిడ కన్నీటి మేఘాలు ఏ గంటలోనో వర్షించి, ముసురులా పట్టుకోవచ్చని గ్రహించిన వాడినై , కేశఖండన పోస్ట్ పోన్ చేసి.. తువ్వాలుచ్చుకుని, బాత్ రూమ్ లోకి కదిలా…
ఏం చేస్తాం ముచ్చటి పడి పెళ్లి చేసుకున్నాక, ముచ్చటైన మీ జుత్తు కటింగ్ చేయించుకోడానికి కూడా మీకు అధికారం లేదు. .
ooooOOOoooo