హనుమజ్జయంతి … దుర్ముఖినామ సంవత్సర విశాఖ బహుళ దశమీ భౌమవాసరం (31-06-2016)
[హనుమజ్జయంతి శుభ పర్వదినాన బ్లాగుమిత్రులందరికీ శుభాకాంక్షలతో...]
అందరికీ ఆనందమిచ్చే ఆంజనేయ
సీ॥ రాముడానతి జేయ రయమున లంకకు
పయనమై వెడలిన వాయుపుత్ర
సీతను వెదకి జూచి, యశోక వన మంద
సురుల గూల్చితివీవు సుందరాస్య
దశకంఠు నెదురుగా దర్పముతో నిల్చి
బుద్ధి తెలిపితీవు బుద్ధిమంత
అందమైన పురము నగ్ని కాహుతిజేసి
రాముని జేరిన రామభక్త
తే.గీ. సతిని గూర్చి విన్న విభుడు సంతసించె
సీత కడగె భయము నీవు చెంతనుండ
కపులు మోదమందిరి నిన్ను గాంచినంత
హర్షమొసగితి వందరకాంజనేయ !
పంచముఖాంజనేయునికి శిరసా వందనములు
సీ॥ గరుడ జవంబున కడలిపై పయనించి
లంక జేరితీవు లాఘవమున
దంష్ట్రి తొల్లి వెదకి ధరణి జూచిన తీరు
గాలించి యవనిజ గాంచితీవు
నరహరి వైరిని నాడు చంపిన భంగి
కూల్చితి వసురుల గోళ్ల జీల్చి
వాగధి దైవమా వాజిముఖుని యట్లు
పలుకుతీరు తెలియు వాగ్మివీవు
తే.గీ. దివ్యమైన శివుని తేజమున వెలుగు
వానరకులదీప్తి వాయు సుతుడ
వేద తత్త్వ రూప విజయ హనుమ
భక్తితోడ నతులు పవన తనయ
[ఈ రెండు కుసుమాలు స్వామి చరణాలకు సమర్పితం …
వీడి చేత స్వామి వ్రాయించుకున్నవీ పద్యాలు ]
No comments:
Post a Comment