Pages

Wednesday, April 1, 2020



శ్రీ రామ నవమి


                                                                                          --- దినవహి  వేంకట  హనుమంతరావు
శ్రీ రామ నవమి - అభిజిత్ లగ్నం - వాడ వాడలా ఆనందోత్సవములు - సీతారాముల కళ్యాణం.
రాణ్మౌని వెంట నడచిన కోదండ పాణి మిథిలానగరానికి  చేరారు.. శివధనుర్భంగమయింది.
సీతారాముల వివాహోత్సవం. 


అయోధ్యనుండి దశరథుడు ఆనందంగా తరలి వచ్చాడు.,,,,
చలువ పందిళ్లు, విశాలమైన మంటపాలు. వివిధ పరిమళాలతో గుబాళించు పుష్ప మాలికల
అలంకారాలు, మామిడి తోరణాలు, నూతన వస్త్రాలతో శోభిల్లు నగరవాసులు, పట్టు చీరలు కట్టి,
సిగలో పూదండలు ముడిచి, పసుపు పారాణితో నిండైన కుంకుమ బొట్టుతో శోభాయమానముగా
కదలి వచ్చు ముత్తైదువలు… పెళ్లి సందడి మొదలయింది.


‘యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితైః
బ్రాతృభిః సహితో రామః కృత కౌతుక మంగళః…’  
సర్వాలంకరణ శోభితుడై సుముహూర్త సమయానికి శ్రీరాముడు కళ్యాణ వేదికకు వచ్చాడు. 
వేద వేదాంగ పారంగతులైన విప్రవరులు - వశిష్ట మహర్షి, శతానందుల ననుసరించి వేదమంత్రాలు
పఠింపగా, మంగళ వాయిద్యములు మారుమ్రోగగా, ఆనందము వెల్లి విరియ.... జనక మహీపతి.... 


“తతస్సీతా సమానీయ సర్వాభరణ భూషితామ్........” 
సర్వభూషణాలంకృత యైన సీతను తీసికొని వచ్చి అగ్నిహోత్రం దగ్గర 
శ్రీరామునికభిముఖంగా కూర్చుండ జేసి… 


“ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా…
పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా
ఇత్యుక్త్వా ప్రాక్షిప ద్రాజా మంత్రపూతం జలం తదా..” 
అంటూ సీత చేతిని రాముని చేతిలో ఉంచి మంత్ర జలములతో సీతను రామునికిచ్చాడు.


“దహరంబు కరుగ కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెలియ” అంటారు త్యాగయ్య.
జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మ రాగాయితా
న్యస్తా రాఘవమస్తకే తు విలసత్కుంద ప్రసూనాయితాః
స్రస్తాః శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయితాః
ముక్తా స్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః


శ్రీ సీతారాముల వివాహమందలి తలంబ్రాల ముత్యములు శుభము నిచ్చునవి యగుగాక అంటూ
వేదజ్ఞులు ఆశీర్వదిస్తూ స్వస్తి పలకడంతో పెళ్లి వేడుక పూర్తి అవుతుంది.


వాడ వాడాలా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. నిత్య స్మరణీయం
సీతారాముల దాంపత్యం. వారి కళ్యాణ వైభోగం మరల మరల చూడాలని, 
మళ్ళీ మళ్ళీ వినాలని ఈ పర్వదినం కోసం మనమందరమూ వేయికనులతో ఎదురు చూస్తూ
ఉంటాము. భద్రాద్రిలో జరిగే కళ్యాణోత్సవము స్వయంగా చూడలేని వారి కోసం రేడియోల కాలం
నుంచి లబ్ధ ప్రతిష్టితులైన కవులూ పండితులూ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తుంటే చెవులారా వీక్షించే
వారము.  ఆ తర్వాత బుల్లి తెరపై వ్యాఖ్యానం… నయనానందకరంగా చూస్తూ… శ్రవణానందకరంగా
ఆస్వాదించే వారము.... కొందరైతే ఇంటి పురోహితుల బ్రహ్మత్వంలో వారి వారి గృహాలలో కళ్యాణము
జరిపించుకోవడం, అదీ వీలుకాని వారు శక్తి కొలదీ సీతారాములకు పూజాదికములు జరుపుకుని
వేదవిదులను దక్షిణ తాంబూలాలతో సత్కరించడం మనకు తెలుసు.


అయితే ఈ సంవత్సరం కరోనా అనే మహమ్మారి విశ్వవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది.
తనకనుకూలమైన ఉపాధులలో ప్రవేశించి వారి జీవితాలతో ఆడుకుంటున్నది. జనాలను
భయపెడ్తున్నది. పాలకులు ఈ వైరస్ నివారణ చర్యలో భాగంగా కొన్ని ఆంక్షలు విధించడం వలన
బయటికి తిరగలేని పరిస్థితి. బహిరంగ ప్రదేశాలలో జన సమూహములు కూడదన్నారు.
దేవాలయములలో ఏ ఉత్సవాలు జరిగే పరిస్థితిలేదు. కనుక నిరాడంబరంగా కళ్యాణం
జరిపించమన్నారు. పురోహితులు కూడా గృహస్తులకడకు వచ్చే పరిస్థితి లేదు.


అయినా నిరాశ పడనక్కర లేదు.. ఆడంబరంగా చేసే కళ్యాణోత్సవమైనా… నిరాడంబరంగా చేసే
ఇంటిలోని పూజయినా ఆ లీలామానుష విగ్రహునికి ఒకటే. ‘రేపు నీకు యువరాజుగా పట్టాభిషేక’
మని తండ్రిగారన్నపుడెలా ఉన్నాడో, ‘నేటినుంచి వనవాస’మని  ‘అది తండ్రిగారి మాట’ అని
తల్లి చెప్పినపుడూ అలాగే ఉన్నాడు. ‘ద్యుతిమాన్, ధృతిమాన్’ - అదీ శ్రీరామచంద్రుడు. 


కనుక గురుదేవుల  ఆజ్ఞానుసారము మన మన ఇళ్లలోనే పూజ చేసుకుందాము..
ఆ లీలా మానుష విగ్రహుని లీలగా ఈ ప్రస్తుత పరిస్థితిని భావిద్దాము. “చుట్టూ ఉన్న ప్రపంచాన్ని
చూసే దృష్టి మార్చుకో. చూపు లోపలికి త్రిప్పు.” అంటున్న రామసందేశాన్ని గ్రహిద్దాము.
హృదయ పీఠంపై ఆత్మారాముని ఆహ్వానించి. శక్తి రూపంగా ఉన్న సీతమ్మను ఆయనకు
వామాంకం పైఁ ధ్యానిద్దాము. ఆదిశేషుని అంశతో … పరబ్రహ్మమే లక్ష్యంగా పయనించే
కుండలినీ శక్తి… సుమిత్రానందనుడు ఒకప్రక్క.,  శంఖం పూరిస్తూ వేదనాదం వినిపిస్తూ
భరతుడూ.. అరిషడ్వర్గములను నిర్మూలించే శత్రుంజయుడు శత్రుఘ్నుడూ.. ప్రాణశక్తిగా
సంచరించే అనిల కుమారుడూ. సేవచేస్తుండగా.. ఇంద్రియానీకము దేవతా బృందమై
పరివేష్టితమవగా భక్తి నిండిన నేత్రద్వయము సకల నదీ జలముల వర్షింపగా శ్రీ రామ పట్టాభిషేకం
ఆనందంగా అంతరంగ పీఠిపై జరుపుకుందాము. శ్రీరామానుగ్రహము పొందుదాం. 


రామచంద్ర చరితా కథామృతం, లక్ష్మణాగ్రజ గుణానుకీర్తనమ్, 
రాఘవేశ తవ పాదసేవనం, సంభవంతు మమ జన్మ జన్మని.


“ఓ రామచంద్రా! నీ చరిత్ర కథ యను అమృతమును, 
ఓ లక్ష్మణాగ్రజా! నీ గుణ కీర్తనమును, 
ఓ రాఘవేశా! నీ పాద సేవయునూ 
నాకు బ్రతి జన్మమందూ సంభవించుగాక…”

---000---

No comments: