Pages

Friday, June 23, 2023

  అప్పట్లో BLITZ' అని ఓ వీక్లీ వచ్చేది. ఇపుడు వస్తోందో లేదో తెలియదు.

   అందులోనే అనుకుంటా

'I don't know son' అని ఓ feature వచ్చేది.. అది గుర్తులో పెట్టుకుని వ్రాసింది..

****


నాకు తెల్వదు నాన్నా—-

రచన డి.వి.హనుమంతరావు

23-06-23



'నాన్నా! ఋతుపవనాలు అంటే యేమిటి నాన్నా?.'

"అంటే.. ఋతు పవనాలు అంటే…ఊ… 

యెందు కొచ్చిందిరా, నీకా డౌటు?"

'ఆదే నాన్నా! నైరుతి ఋతుపవనాలు.. వస్తున్నాయి, వచ్చేసాయి.. ఆగిపోయాయి… అంటూ ఒకటే గోల. అంటే యేమిటి అని'

"ఆ.. అంటే నైరుతి ఋతుపవనాలు వస్తే వర్షాలు పడతాయి.."

'ఎవరు చెప్పారు?'

"వాతావరణం శాఖ వారు"

'వాళ్ళెవరూ?'

"వర్షాల గురించి చెప్పే వారు"

'మరి రాలేదేం?'

"నాకు తెల్వదు నాన్నా."

*************



'నైరుతి అంటే యేమిటి నాన్నా?'

"ఓ దిక్కు"

'తూర్పు పడమర నార్తు సౌతుల్లో లేదు మరి?'

"అంటే - నైరుతి అది ఓ మూల"

'గుర్తొచ్చింది నాన్నా! ఆ మూల బరువు పెట్టావు కదా'

"యస్!"

'దొడ్లో చెట్టు కొట్టించి షెల్ఫ్ చేయించి ఆ మూల పెట్టావు కదా?'

"అవును నాన్నా, బరువు పెట్తే మనకు మంచి జరుగుతుందని.."

'అంటే చెట్లన్నీ కొట్టేసి నైరుతిలో అందరూ బరువులు పెట్టేస్తే మంచి జరిగి పోతుందా నాన్నా?'

"అది - నాకు తెల్వదు నాన్నా"


                                                                **********


'నైరుతి ఋతుపవనాలు వచ్చేది కేరళలో ముందు కదా నాన్నా'

"అవును కదా"

'అక్కడ చెట్లు యెక్కువనా'

"అయి ఉండొచ్చు"

'ఇక్కడ ప్రతి సంవత్సరం మన నాయకులూ, వాళ్ళూ చెట్లు నాటుతారు కదా?'

"అవును నాన్నా! వనమహోత్సవ దినం చేస్తారు"

'ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా యెప్పటి నుంచో లక్షల్లో మొక్కలు నాటుతున్నారేమో కదా'

"అవునూ"

'మరి అవన్నీ పెరిగి.. ఈ పాటికి బోల్డు వనాలు అయి పోవాలి కదా?'

"నిజమే"

'అలా పెరిగిన మొక్కలు యేవీ కనపడవేం నాన్నా?'

"నాకు తెల్వదు నాన్నా".


***************


*************




***************


Thursday, June 1, 2023

                 ----:  ‘చెత్త’ ఆలోచన  :----


                                     రచన : డి.వి.హనుమంత రావు 

                                                               9949705166 


ఉదయాన్నే అపార్ట్మెంట్ వాచ్ మన్ నోటీస్ పట్టుకొచ్చాడు - నేను అది చదువుతూంటే - 

“సాయంత్రం మీటింగ్ ఉందిటండి, తప్పక రమ్మనమని ప్రెసిడెంట్ గారు చెప్పారం”డని, నోటితో కూడా చెప్పాడు. 

“అదేమిటయ్యా? నాలుగు రోజులక్రితమే కదా అయింది. మెయింటెనెన్స్ పెంచుతూ తీర్మానం కూడా చేసారు. మళ్ళీ మీటింగేమిటయ్యా ?”

“మరేనండి! ఇది ‘చెత్త’ మీటింగ్ అనుకుంటానండి” అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు 

వాచ్ మన్.

‘వాచ్ మన్ ఓవర్ చేస్తున్నాడేమిటోయ్’ మా శ్రీమతి వైపు చూస్తూ అనబోతే … 

“రెండు రోజులనుంచీ మునిసిపాలిటీ వారు ‘చెత్త’ పట్టు కెళ్ళటం లేదుటండి, అందుకని ఎవరూ  క్రిందకి  ‘చెత్త’ తేవద్దూ, కలక్టింగ్ బిన్నుల దగ్గరకూడా  పెట్టొద్దూ” అని, “వాచ్ మన్ చెప్పా”డంటూ - ‘మన పనిమనిషి చెప్పిందండి” అని మా  శ్రీమతి వివరించి చెప్పింది. 

సరే సాయంత్రం మీటింగ్ —-

“ప్రతినెలా ఈయవలసిన ‘చెత్త ఫీస్’ ఈయటం లేదుకనుక, ఆ ‘చెత్త’ రుసుము  ఇచ్చేదాకా, దానితో పాటు పాత ‘చెత్త’ బాకీలు కూడా ఇచ్చేదాకా - మీ ‘చెత్త’ మాకక్కరలేదు, ఆ ‘చెత్త’ మేం తీసుకెళ్ళము. మీ ‘చెత్తేదో’ మీ దగ్గరే ఉంచుకోండి” అని అన్నారు చెత్త వారు - కనుక  ఇప్పుడు ఏమి చేయాలో ఆ ‘చెత్త’ గురించి గౌరవనీయ సభ్యులు ఆలోచించవలసిన” దని ప్రెసిడెంట్ గారు తన సహజ హాస్య ధోరణిలో చెప్పారు. ఇదేదో ‘చెత్తలో’ మీటింగ్ కాదు, సీరియస్సే అని అర్థమైంది.  ‘చెత్త’ అని దేనినీ తీసిపారేయలేము కదండి. దేని విలువ దానిదే.. కదా! అలా అని ‘చెత్త’ను పెట్టిలో పెట్టి   దాచుకోనూ లేము -  నిజమే కదండీ మరి. 

 

చిన్నతనాలలో  -, బావి దగ్గర రెండు చేదల నీళ్ళు తోడుకుని నెత్తిమీద గుమ్మరించుకుని, హాయిగా స్నానం చేసి, హడావుడిగా ఒక అగరొత్తు త్రిప్పి దేవునికో నమస్కారము భక్తిగా సమర్పించుకొని - రొటీన్ కు పరుగెత్తే వాళ్ళం. సాయంత్రమయ్యేసరికి ఆరుబయట మంచాలు వేసుకుని హాయిగా స్వచ్చమైన గాలి పీలుస్తూ, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ - అమ్మ కలిపిపెట్టే గోరు ముద్దలు తిని పెరిగాము. ఉద్యోగాలు, జీవితంలో మంచి చెడ్డలు అనుభవించి - రిటైరయ్యాము. ఓ అపార్ట్మెంట్ కొనుక్కొని, ‘రామా’ ‘కృష్ణా' అంటూ  కాలక్షేపం చేస్తున్నాము. రెక్కలొచ్చిన పిల్లలు ఉన్న ఊరు ఒదిలి – ఎక్కడో అక్కడ వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇద్దరమే ఉన్నాం కనుక ఇండివిడ్యువల్ హౌసెస్ లో సెక్యూరిటీ తక్కువ కనుక, అక్కడ ఒకరికొకరు దూరం దూరంగా ఉంటారు కనుక - బాగా  ఆలోచించి - ఇక్కడైతే ఒకళ్ళకొకళ్ళు సాయంగా  ఉంటారని  అపార్ట్మెంట్ వాసాన్ని ఎంచుకున్నాము. బాగానే జరుగుతోంది. 


ఇపుడు ఇంటింటా, వీధి వీధీ ‘చెత్త’ ‘చెత్త’ అంటూ చెత్త సవ్వడే  ప్రతిధ్వనిస్తున్నది. ఏ పెళ్లి కెళ్ళినా పేరంటానికి వెళ్ళినా ‘చెత్త’ కబుర్లే. మంచి కెళ్ళినా చెడు కెళ్ళినా ‘చెత్త’ ఊసులే! 

చిత్త శుద్ధి కొరకు ఉదయమే స్నానమయ్యాక కొద్ది సేపైనా జపమో, మంత్రమో, పూజో, పునస్కారమో ఒక అలవాటుందనుకోండి,  ఇపుడు మన పూజా ఫలంగా  చెవులకు వినపడేవి , 


అప్సరసల అందెల రవళులు కాదు - ఒకప్పుడు  ప్రిస్టీజీ కుక్కర్ విజిల్స్ వినపడేవి. లెక్కెట్టి శ్రీమతికి  చెప్పే బాధ్యత, అవసరాన్ని బట్టి స్టవ్ కట్టాల్సిన బాధ్యతా – పురుష పుంగవులదే కదా మరి.    ఇపుడు వాటిని మించి  చెత్త లారీల హారన్ మ్రోతలు, ‘చెత్త, చెత్తండీ’ అంటూ చెత్తకోసం కేకలూ. 


ముక్కుకు సోకేవి  నందన వనంలోని కల్పవృక్ష కుసుమాల పరిమళాలు కాదు - 

మరుగుతున్న సాంబార్ వాసనలు, కమ్మటి తాళింపు ఘుమ ఘుమలూ ఒకప్పుడు, - ఇపుడు  ఫ్యాక్టరీలనుంచి వచ్చే కెమికల్ వాసనలు.. కుకర్ టైముకి కట్టని పు.పుంల తప్పిదానికి, మాడిన పప్పు వాసనలూ …


గంధర్వ గానాలు పోయె  - ‘పాలూ’ అంటూ పాలబ్బాయి, ‘పేపర్’ కేకలు సోకాయి … తోపాటు  - తడి చెత్తా, పొడి చెత్తా అంటూ వారి విజ్ఞప్తులు.  


పాచిపోయిన అన్నం, మిగిలిపోయిన కూరలు, పాన్ పరాగ్ పేకెట్లు, గుట్కా కవర్లు,గాజు పెంకులు… ఇలా చెత్తా చెదారమంటూ చెవిలో మైకు పెట్టి, అపార్ట్మెంట్ దగ్గరే మకాం పెట్టి మరీ చెప్తుంటే – దేవునికి, తెలిసి చేసే పూజతో పాటు, తెలియకుండా ఈ ‘చెత్త’ విధానం కూడా పూజతో కలిపి చెప్పేప్రమాదం ఉంటుంది.  కుళ్ళిన కూరగాయలు, కోడిగుడ్డు పై పెంకులు, మరోటి మరోటి వినపడితే  - దైవధ్యానానికి కూర్చున్న ఆ పు.పుం  ప్రాణాయామం చేయకుండానే ముక్కు మూసేస్తాడు - అధికార కరుణా కటాక్ష సిద్ద్యర్థం, తడి చెత్తా పొడి చెత్తా వేరు చేయవయ్యా స్వామీ అని  భగవంతుణ్ణే అడిగేస్తాడు …. క్షమస్త్వత్త్వం భగవాన్ ! 


రోజులు మారాయి, వనరులు పెంచుకోడానికి ‘చెత్త’ ఆలోచన వచ్చింది మేధావులకి.. ఉన్నవారికీ, లేనివారికీ కుటుంబాలలో వద్దన్నా పెరిగేది ‘చెత్త’ అని ఆ ‘చెత్త’కు కూడా విలువ ఉంటుందని , ఆ  విలువ తెలిసినవారై ‘చెత్త’మీద దృష్టి పెట్టారు చెత్తాధికారులు. ‘చెత్త’లోంచి విద్యుచ్చక్తి – దానితో వెలిగే పొయ్యిలు, వీధి దీపాలు…ఇలా ఎన్నెన్నో వెలుగు చూసాయి.  .. అంతెందుకండీ - విదేశాలలో చూడండి, ఉదయాన్నే పుర్ర చేయి వాటం వాడైనా, కుడి చేతి వాటం వాడైనా సరే, ఎడం చేత్తో బ్రీఫ్ కేసో, లాప్ టాపోపట్టుకుని — ఆఫీస్ టైము అయిపోతున్నాసరే - యార్డ్ అంతా నడచి, పెద్ద చెత్త డబ్బాలో తను పవిత్రంగా కుడిచేత్తో మడిగా పట్టుకొచ్చిన చెత్త మూటను వేసి, అప్పుడు తన కారు దగ్గరకి పోయి డోరు తీసి, దేవుని ఫోటోలో మెరిసిపోతున్న దేవుని కాళ్ళు కుడిచేత్తో ముట్టుకుని కారు స్టార్ట్ చేస్తాడు. అంతేకాదు, రోడ్ మీద ‘చెత్త’ మరీ ఎక్కువైతే, అది ఎత్తడానికి, ఉన్నతోద్యోగులు కూడా ముందుకొచ్చి సాయపడతారు.  మన ఎన్ ఆర్ ఐ లైనా సాయ పడాల్సిందే .. తప్పదు మరి. అది అంతే. ఇంతకీ నే చెప్పొచ్చే దేమంటే,  దేశవిదేశాల తెలివైన వారే, అక్కడున్న మనవారితో సహా ‘చెత్త’ను గుర్తించారు స్మీ అని చెప్పడమే. 


అప్పట్లో పన్నులు కడ్తే చాలు అందులో ఈ ‘చెత్తలూ గిత్తలూ’  [ప్రాస కోసం వాడబడింది కోపగించుకోవద్దని గిత్తలకు విజ్ఞప్తి]  కొట్టుకుపోయేవి. చూస్తే మనకు పన్నులు అంతగా వెనుకటి తారీఖుతో పెంచినా  - అవి ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నాయట పాపం. అలాంటపుడు మరి వారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. మనది  ప్రజాప్రభుత్వము కనుక   మనప్రజలే ప్రభుత్వానికి సహకరించాలి. మన డబ్బులతో అయినా సౌకర్యములు కల్పిస్తున్న యాజమాన్యమునకు ఈ  చెత్త పన్నులు + సంబంధిత ఇతర సుంకములూ  వెంటనే చెల్లించాలి కదండీ మరి.. మనం ఇచ్చే పన్నులతో పాపం వాళ్ళు బ్రతుకుతూ, ఉద్యోగస్తులను బ్రతికిస్తూ మనకొరకు మనుగడ సాగిస్తున్నారు పాపం.. ఉద్యోగులంటే మన ప్రజలే కదండీ. ఆ మాటకొస్తే ప్రభుత్వమంటేమాత్రం - ప్రజలే కదుటండీ!  ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పటుచేసుకున్నదే  కదా !!!



అంచేత తెలియ జేయునదేమనగా ‘చెత్త’ ఆలోచనలు మాని ‘చెత్త’ గురించి ఆలోచించండి. 



 

Friday, May 26, 2023

నేను 'నే' నైతే


     ‘నేను’ ‘నే’ నైతే 

రచన: డి.వి.హనుమంతరావు
‌‌(‌26..05..2023)
    

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము ఉదయాన్నే భక్తి ఛానల్ లో చూడడము ఒక అలవాటు.  బంగారు వాకిలి తలుపులు తీసేటప్పటికి ఎదురుగా నిలుచుని, రెండు చేతులూ దోయిలించి, అశ్రుపూరిత నయనాల  ఆ దివ్యమంగళ విగ్రహము నిత్యమూ - బుల్లి తెరపై దర్శించుకోగలగడం - ఆయన కరుణే కదా అనిపిస్తుంది. ఆ కాసేపూ తిరుమల కొండపైనే, ఆనందనిలయంలోని  అంతరాలయంలోనే, స్వామి సమ్ముఖానే, ఉన్నాననిపిస్తుంది…. ఆ అనుభవము నిజమైతే ఎంత బాగుంటుందో అని కూడా అనిపిస్తుంది!  ఆ కృపా సముద్రుని దయ లేక అంత భాగ్యము కలిగేనా !!!

                                                      ********************  

పూర్వాద్రిపై అరుణోదయం. బాలార్కుడు  తన కాంతి కిరణాల మెలమెల్లగా విశ్వమంతా వ్యాపింప జేస్తున్నాడు. పునుగూ పిట్టా ప్రత్యక్ష భగవానునికి స్వాగత గీతాలు పాడాలని గొంతు సవరించుకుంటున్నాయి. తరుశాఖల పైనుండి వీచే చల్లటి గాలుల సవ్వడులు -  వేదనాద ధ్వనుల ప్రతి ధ్వనిస్తున్నాయి. ఊర్ధ్వ పుండ్రములతో, శిఖోపవీతములతో, ధవళ వస్త్రములతో, హరినామ స్మరణతో  - బ్రహ్మ వర్చస్సుతో  అర్చక స్వామి మాడ వీధుల గుండా  కదలి వస్తున్నారు. మనసున సప్తగిరి వాసుని తలపు నిండగా, భక్తి తేజముతో వదనము భాసింప, సన్నిధి గొల్ల వారికి ముందుగా నడుస్తున్నారు. ఆతడి భుజములపైనున్న స్వర్ణ పేటికలో ‌‌‌‌‌‌‌‌‌‌‌

భద్రంగా ఉన్నాయి - బంగరు వాకిలి బీగములు ..  


మంగళ తూర్యనాదములు  -  వేద పఠనములు - పసిడి పళ్ళెరముల మంగళ ద్రవ్యములు. వాతావరణము శోభస్కరముగా భాసిస్తున్నది. ముందుగా పెద్ద ముత్తైదువ ముందుకి నడచి, గర్భగుడి ముంగిట అందముగా రంగవల్లులు తీర్చిదిద్దింది. ఆ శోభ తిలకిస్తున్న శ్రీనివాసుని దయా దృష్టులనే - తన భావనలో  - కనుల నింపుకుని ప్రక్కకు జరిగింది. ఆలయ అధికారుల పర్యవేక్షణలో, ద్విజ బృంద శ్రేణుల ముఖతా తొలిపలుకులు  నినదింప, మంగళ వాద్యముల మ్రోగగా, అర్చక స్వామి చూస్తుండగా సన్నిధి గొల్ల - బంగరు పేటికలోని బీగముల గ్రహించి, విధి నిర్వహణలోనున్న అర్చక స్వామికి అందిస్తారు. వారు తాళపుకప్పల తొలగింప, సన్నిధి గొల్ల - తన వామ హస్తములోని  కాగడా వెలుగులీన, కుడి చేతితో బంగరు వాకిలి మెలమెల్లగా తెరచి, దక్షిణ  పాదము సుకుమారంగా, సవ్వడి లేకుండా లోపల పెట్టగానే.. నీల మేఘ శ్యాముడు, మందస్మిత వదనారవిందుడు – కరుణా సముద్రుడు - దివ్య మంగళ విగ్రహుడు – కనుల కందని ఎత్తు స్వామి - సన్నిధిగొల్ల కనులలో నిలబడి - కృపా వర్షము కురిపిస్తాడు. ప్రథమ దర్శన భాగ్యము నిత్యమూ పొందే సన్నిధి గొల్ల భాగ్యమే భాగ్యము .. ఆ అదృష్టమబ్బిన వంశములో జన్మమే జన్మము…


తాను విధి నిర్వహణకు వెళ్ళాలి. భక్త జనుల క్రమపద్ధతిలో నడిపించాలి. విధులలోకి వెళ్లేముందు, ఒక్కసారి, కనులారా శ్రీవారిని దర్శించుకుని, స్వామి అనుమతి గొని, ఆనందంగా విధుల నిర్వహిద్దామని నిలచి యున్నాడు ఆలయ సిబ్బందిలోని ఆ ఉద్యోగి. తాళములు తెరిచారు, సన్నిధి గొల్ల ప్రథమ దర్శనానికి వెళ్ళారు, ఇక వాకిలి తలుపులు తెరుస్తారు, స్వామి దర్శన భాగ్యము తనకు కలుగబోతోందని ఆనందోత్సాహముతో ఆ ఉద్యోగి మురిసిపోతున్న తరుణంలో - కార్యనిర్వహణ బాధ్యతలో ఉన్న మరో ఉద్యోగి - ఇతడికి కర్తవ్య బాధ్యతను గుర్తు చేసి, దర్శనము కొరకు ఆశపడే ఆ ఉద్యోగిని కదలిపొమ్మని సైగ చేసాడు.  స్వామి దర్శనము పొందలేక, విధి నిర్వహణను కాదనలేక, వెళ్ళలేక వెళ్ళలేక, వెనక్కి వెనక్కి చూస్తూ కదిలాడు అ ఉద్యోగి. 


నిత్యమూ నీ సన్నిధిలోనే ఉన్నా, సదా నీ సేవలోనే ఉన్నా, నీ కరుణ లేక నీ దర్శనము కాదుకదా స్వామీ. రెప్ప వేయక నిన్ను చూద్దామంటే రెప్ప పాటు కల్పిస్తావు… మనసు నిలిపి నీ మూర్తిని దర్శిద్దామంటే విషయాలవైపు మనసును త్రిప్పేస్తావు. అవీ, ఇవీ అపుడే వినపడతాయి చెవికి. ఏవేవో సువాసనలు పోటునుండి నాసికకు అప్పుడే తగులుతాయి. ప్రక్కవారి రాపిడులు దేహాన్ని ప్రక్క దారులు పట్టిస్తాయి. ఆలోచనలు గుంపులు గుంపులుగా మనసును క్రమ్మేస్తాయి. కనులారా నిను దర్శించి, కనులు గట్టిగా మూసి, మనసున నిన్ను  కట్టగలిగితే …

ఆలోచనలు పారిపోతాయి…

అపుడు మనసు శూన్యమౌతుంది.

ఆ మనసంతా నీవే అవుతావు. 

ఇక ఉన్నదేదీ? - లేనిదేదీ?

నేను నీలో జేరి 'నే'నవుతావు -

ఒకటి గా మిగిలిపోతావు

***** ***** ***** *****


Thursday, March 30, 2023

శ్రీ రామనవమి శోభకృత్ {2023}

  

    శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మము


రచన: దినవహి వేంకట హనుమంత రావు. 



కం. హరితత్త్వము గూటి పఱచి,

నరునిగ భువిపై నయమున నడచితివే, కిం

కరులకు శాపము బాపగ,

హరిమూకల సాయముగొని యచ్యుత రామా!


తన నారాయణత్వాన్ని దాచిపెట్టి నరునిగా మనమధ్య తిరిగిన వాడు శ్రీ రాముడు. 


'రా' 'మ'  - ఈ రెండక్కరములు చాలు - భవసాగరము దాటడానికి. 

కం.      రామా రామా రామా

           రామా యనుచహము రేయి రాజీ వాక్షా!

           రామా! నిన్నే దలతును

           నామము భవజలధి దాట నావయె రామా!  


ఆ సలలిత రామ నామ జపసారము కాశికాపురి నిలయునకు తెలియునట. కాశీలో మరణించిన వారికి శివుడుపదేశించే తారక మంత్రమదే!


ద్వి. శ్రీ రామ మంత్రము శివుడిచ్చు కూర్మి,

తారకమగునది తరియింపజేయ!

'శ్రీ రామ రామ’ అంటూ ఆ మంత్రాన్నే ఈశ్వరుడు - అమ్మ భవానికి ఉపదేశించాడు. పైగా సహస్రనామతత్తుల్యము అనికూడా చెప్పాడు. 


అష్టాక్షరి - నారాయణ మంత్రంలో 'రా' ప్రాణాక్షరము. అది తీసేస్తే అర్థం మారిపోతుంది. అలాగే పంచాక్షరి - నమశ్శివాయలో 'మ' కూడా.. ఆయా మంత్రాల లోని ప్రాణాక్షరాల సంపుటి 'రామ' - ఆ రెండు మంత్రాల ప్రాణమూ - సారమూ  రామ.… అని పెద్దలు చెప్తారు. శివకేశవుల అబేధము కూడా ఇక్కడ సూచితమౌతున్నది. 


కం.  ఇనుడొక బీజము 'రేఫ'గ,

       అనలుడు కలియగ 'అ' కారమందున యికహా

       సనుడు 'మ'బీజముగా నిను

       గనెదము బీజాక్షరముల కాంతిని రామా!     

సూర్య అగ్ని చంద్రుల బీజాక్షరముల సంపుటియే 'రా మ' నామమని శాస్త్ర వచనం.


ఆ మంత్రాన్ని పట్టుకుని హనుమ శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటాడు. 

"ప్రభు ముద్రికా మేలి ముఖ్ మాహీ జలధి లాంఘ్ గయే…"

రామనామాంకిత అంగుళీయకము పట్టుకుని పయోధి దాటిన మేటి.


"జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలాః.." అంటూ రామలక్ష్మణులకు సుగ్రీవునకూ జయమని జయఘోష సలుపుతూ తానొక్కడూ, ఎంతోమంది మహావీరులైన  రాక్షసులను హనుమ సంహరించాడు. 

రామమంత్రం జపించి విభీషణుడు లంకేశ్వరుడయ్యాడని హనుమాన్ చాలీసా అంటోంది. 'శ్రీరామ' అని వ్రాసిన శిలలు సాగరంపై తేలితే  సేతు నిర్మాణం జరిగింది.

మతంగమహాముని ఆనతిమేరకు శబరిమాత రామనామ చింతనతో రామదర్శనం పొంది రామానుగ్రహం పొందింది. సప్తర్షులు చేసిన రామ నామోపదేశంతో సిద్ధి పొందిన ఆదికవి వాల్మీకి అజరామరమైన శ్రీమద్రామాయణ మహా కావ్యాన్ని లోకానికి అందించాడు. 


ఇంటి ద్వారంలో దీపముంచితే ఇంటా బయటా వెలుగు ప్రసరించినటుల నాల్క చివర 'రామ'నామ ముంచితే, అంతశ్శుద్ధికూడా జరిగి ఆ అనంత తత్త్వము తెలుసుకోగల మంటారు.


ఆ.వె. గడపమీద దీపకళికనుంచి నటుల,

నాల్కచివర రామనామముంచు,

చిత్తశుద్ధి చేసి, జీవుని ముక్తికి 

దారిజూపు రామతారక మదె!


దశరథమహారాజు పుత్రకామేష్టి చేసిన తర్వాత యాగఫలముగా ముగ్గురు రాణులూ నలుగురు పుత్రులను ప్రసవించారు. కులగురువులు వశిష్ట మహర్షి వారికి పేర్లు పెట్టారు - రామ భరత లక్ష్మణ శతృఘ్నులని.

'రామ' రెండే అక్షరాల పేరు జ్యేష్ట కుమారునిది. 

'రామ' అంటే అందర్నీ ఆనందింప చేసేవాడని అర్థంచెప్తారు. 'రామా' అని పలికితే ఆనందం. 'రామా' అని మనసులో అనుకుంటే ఆనందం.  'రామా' అంటూ ధ్యానిస్తే ఆనందం. 'రామా' అని కీర్తిగానం చేస్తే ఆనందం. "ఆనందం" అంటే …. ఆనందమే బ్రహ్మమని వేదం చెప్తోంది. అందుకని - "రామా యన బ్రహ్మమునకు పేరు" - అంటారు త్యాగయ్యగారు. 


కం.      అరయగ తత్త్వము - బ్రహ్మము,

           సరయూ తటిని జనియించె సత్యము నిల్పన్,

           సురవైరిఁ జంపి లీలగ,

           ధరపై ధర్మము నిలిపిన దశరథ రామా!      


రామా అంటే వేదములో చెప్పబడిన నామమే.. ఆ బ్రహ్మమే… నరునిగా అవతరించాడు.

కం.   వేదముల మెలగు నామము,

        వేదశిఖల వెలుగు తత్త్వ విజ్ఞానమిదే!

        వేదములే  నీ రూపము,

        వేదము తెలుపు నిను వేదవేద్యా రామా!     


–శ్రీసీతారామచంద్ర పరబ్రహ్మణే నమః–