----: ‘చెత్త’ ఆలోచన :----
రచన : డి.వి.హనుమంత రావు
9949705166
ఉదయాన్నే అపార్ట్మెంట్ వాచ్ మన్ నోటీస్ పట్టుకొచ్చాడు - నేను అది చదువుతూంటే -
“సాయంత్రం మీటింగ్ ఉందిటండి, తప్పక రమ్మనమని ప్రెసిడెంట్ గారు చెప్పారం”డని, నోటితో కూడా చెప్పాడు.
“అదేమిటయ్యా? నాలుగు రోజులక్రితమే కదా అయింది. మెయింటెనెన్స్ పెంచుతూ తీర్మానం కూడా చేసారు. మళ్ళీ మీటింగేమిటయ్యా ?”
“మరేనండి! ఇది ‘చెత్త’ మీటింగ్ అనుకుంటానండి” అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు
వాచ్ మన్.
‘వాచ్ మన్ ఓవర్ చేస్తున్నాడేమిటోయ్’ మా శ్రీమతి వైపు చూస్తూ అనబోతే …
“రెండు రోజులనుంచీ మునిసిపాలిటీ వారు ‘చెత్త’ పట్టు కెళ్ళటం లేదుటండి, అందుకని ఎవరూ క్రిందకి ‘చెత్త’ తేవద్దూ, కలక్టింగ్ బిన్నుల దగ్గరకూడా పెట్టొద్దూ” అని, “వాచ్ మన్ చెప్పా”డంటూ - ‘మన పనిమనిషి చెప్పిందండి” అని మా శ్రీమతి వివరించి చెప్పింది.
సరే సాయంత్రం మీటింగ్ —-
“ప్రతినెలా ఈయవలసిన ‘చెత్త ఫీస్’ ఈయటం లేదుకనుక, ఆ ‘చెత్త’ రుసుము ఇచ్చేదాకా, దానితో పాటు పాత ‘చెత్త’ బాకీలు కూడా ఇచ్చేదాకా - మీ ‘చెత్త’ మాకక్కరలేదు, ఆ ‘చెత్త’ మేం తీసుకెళ్ళము. మీ ‘చెత్తేదో’ మీ దగ్గరే ఉంచుకోండి” అని అన్నారు చెత్త వారు - కనుక ఇప్పుడు ఏమి చేయాలో ఆ ‘చెత్త’ గురించి గౌరవనీయ సభ్యులు ఆలోచించవలసిన” దని ప్రెసిడెంట్ గారు తన సహజ హాస్య ధోరణిలో చెప్పారు. ఇదేదో ‘చెత్తలో’ మీటింగ్ కాదు, సీరియస్సే అని అర్థమైంది. ‘చెత్త’ అని దేనినీ తీసిపారేయలేము కదండి. దేని విలువ దానిదే.. కదా! అలా అని ‘చెత్త’ను పెట్టిలో పెట్టి దాచుకోనూ లేము - నిజమే కదండీ మరి.
చిన్నతనాలలో -, బావి దగ్గర రెండు చేదల నీళ్ళు తోడుకుని నెత్తిమీద గుమ్మరించుకుని, హాయిగా స్నానం చేసి, హడావుడిగా ఒక అగరొత్తు త్రిప్పి దేవునికో నమస్కారము భక్తిగా సమర్పించుకొని - రొటీన్ కు పరుగెత్తే వాళ్ళం. సాయంత్రమయ్యేసరికి ఆరుబయట మంచాలు వేసుకుని హాయిగా స్వచ్చమైన గాలి పీలుస్తూ, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ - అమ్మ కలిపిపెట్టే గోరు ముద్దలు తిని పెరిగాము. ఉద్యోగాలు, జీవితంలో మంచి చెడ్డలు అనుభవించి - రిటైరయ్యాము. ఓ అపార్ట్మెంట్ కొనుక్కొని, ‘రామా’ ‘కృష్ణా' అంటూ కాలక్షేపం చేస్తున్నాము. రెక్కలొచ్చిన పిల్లలు ఉన్న ఊరు ఒదిలి – ఎక్కడో అక్కడ వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇద్దరమే ఉన్నాం కనుక ఇండివిడ్యువల్ హౌసెస్ లో సెక్యూరిటీ తక్కువ కనుక, అక్కడ ఒకరికొకరు దూరం దూరంగా ఉంటారు కనుక - బాగా ఆలోచించి - ఇక్కడైతే ఒకళ్ళకొకళ్ళు సాయంగా ఉంటారని అపార్ట్మెంట్ వాసాన్ని ఎంచుకున్నాము. బాగానే జరుగుతోంది.
ఇపుడు ఇంటింటా, వీధి వీధీ ‘చెత్త’ ‘చెత్త’ అంటూ చెత్త సవ్వడే ప్రతిధ్వనిస్తున్నది. ఏ పెళ్లి కెళ్ళినా పేరంటానికి వెళ్ళినా ‘చెత్త’ కబుర్లే. మంచి కెళ్ళినా చెడు కెళ్ళినా ‘చెత్త’ ఊసులే!
చిత్త శుద్ధి కొరకు ఉదయమే స్నానమయ్యాక కొద్ది సేపైనా జపమో, మంత్రమో, పూజో, పునస్కారమో ఒక అలవాటుందనుకోండి, ఇపుడు మన పూజా ఫలంగా చెవులకు వినపడేవి ,
అప్సరసల అందెల రవళులు కాదు - ఒకప్పుడు ప్రిస్టీజీ కుక్కర్ విజిల్స్ వినపడేవి. లెక్కెట్టి శ్రీమతికి చెప్పే బాధ్యత, అవసరాన్ని బట్టి స్టవ్ కట్టాల్సిన బాధ్యతా – పురుష పుంగవులదే కదా మరి. ఇపుడు వాటిని మించి చెత్త లారీల హారన్ మ్రోతలు, ‘చెత్త, చెత్తండీ’ అంటూ చెత్తకోసం కేకలూ.
ముక్కుకు సోకేవి నందన వనంలోని కల్పవృక్ష కుసుమాల పరిమళాలు కాదు -
మరుగుతున్న సాంబార్ వాసనలు, కమ్మటి తాళింపు ఘుమ ఘుమలూ ఒకప్పుడు, - ఇపుడు ఫ్యాక్టరీలనుంచి వచ్చే కెమికల్ వాసనలు.. కుకర్ టైముకి కట్టని పు.పుంల తప్పిదానికి, మాడిన పప్పు వాసనలూ …
గంధర్వ గానాలు పోయె - ‘పాలూ’ అంటూ పాలబ్బాయి, ‘పేపర్’ కేకలు సోకాయి … తోపాటు - తడి చెత్తా, పొడి చెత్తా అంటూ వారి విజ్ఞప్తులు.
పాచిపోయిన అన్నం, మిగిలిపోయిన కూరలు, పాన్ పరాగ్ పేకెట్లు, గుట్కా కవర్లు,గాజు పెంకులు… ఇలా చెత్తా చెదారమంటూ చెవిలో మైకు పెట్టి, అపార్ట్మెంట్ దగ్గరే మకాం పెట్టి మరీ చెప్తుంటే – దేవునికి, తెలిసి చేసే పూజతో పాటు, తెలియకుండా ఈ ‘చెత్త’ విధానం కూడా పూజతో కలిపి చెప్పేప్రమాదం ఉంటుంది. కుళ్ళిన కూరగాయలు, కోడిగుడ్డు పై పెంకులు, మరోటి మరోటి వినపడితే - దైవధ్యానానికి కూర్చున్న ఆ పు.పుం ప్రాణాయామం చేయకుండానే ముక్కు మూసేస్తాడు - అధికార కరుణా కటాక్ష సిద్ద్యర్థం, తడి చెత్తా పొడి చెత్తా వేరు చేయవయ్యా స్వామీ అని భగవంతుణ్ణే అడిగేస్తాడు …. క్షమస్త్వత్త్వం భగవాన్ !
రోజులు మారాయి, వనరులు పెంచుకోడానికి ‘చెత్త’ ఆలోచన వచ్చింది మేధావులకి.. ఉన్నవారికీ, లేనివారికీ కుటుంబాలలో వద్దన్నా పెరిగేది ‘చెత్త’ అని ఆ ‘చెత్త’కు కూడా విలువ ఉంటుందని , ఆ విలువ తెలిసినవారై ‘చెత్త’మీద దృష్టి పెట్టారు చెత్తాధికారులు. ‘చెత్త’లోంచి విద్యుచ్చక్తి – దానితో వెలిగే పొయ్యిలు, వీధి దీపాలు…ఇలా ఎన్నెన్నో వెలుగు చూసాయి. .. అంతెందుకండీ - విదేశాలలో చూడండి, ఉదయాన్నే పుర్ర చేయి వాటం వాడైనా, కుడి చేతి వాటం వాడైనా సరే, ఎడం చేత్తో బ్రీఫ్ కేసో, లాప్ టాపోపట్టుకుని — ఆఫీస్ టైము అయిపోతున్నాసరే - యార్డ్ అంతా నడచి, పెద్ద చెత్త డబ్బాలో తను పవిత్రంగా కుడిచేత్తో మడిగా పట్టుకొచ్చిన చెత్త మూటను వేసి, అప్పుడు తన కారు దగ్గరకి పోయి డోరు తీసి, దేవుని ఫోటోలో మెరిసిపోతున్న దేవుని కాళ్ళు కుడిచేత్తో ముట్టుకుని కారు స్టార్ట్ చేస్తాడు. అంతేకాదు, రోడ్ మీద ‘చెత్త’ మరీ ఎక్కువైతే, అది ఎత్తడానికి, ఉన్నతోద్యోగులు కూడా ముందుకొచ్చి సాయపడతారు. మన ఎన్ ఆర్ ఐ లైనా సాయ పడాల్సిందే .. తప్పదు మరి. అది అంతే. ఇంతకీ నే చెప్పొచ్చే దేమంటే, దేశవిదేశాల తెలివైన వారే, అక్కడున్న మనవారితో సహా ‘చెత్త’ను గుర్తించారు స్మీ అని చెప్పడమే.
అప్పట్లో పన్నులు కడ్తే చాలు అందులో ఈ ‘చెత్తలూ గిత్తలూ’ [ప్రాస కోసం వాడబడింది కోపగించుకోవద్దని గిత్తలకు విజ్ఞప్తి] కొట్టుకుపోయేవి. చూస్తే మనకు పన్నులు అంతగా వెనుకటి తారీఖుతో పెంచినా - అవి ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నాయట పాపం. అలాంటపుడు మరి వారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. మనది ప్రజాప్రభుత్వము కనుక మనప్రజలే ప్రభుత్వానికి సహకరించాలి. మన డబ్బులతో అయినా సౌకర్యములు కల్పిస్తున్న యాజమాన్యమునకు ఈ చెత్త పన్నులు + సంబంధిత ఇతర సుంకములూ వెంటనే చెల్లించాలి కదండీ మరి.. మనం ఇచ్చే పన్నులతో పాపం వాళ్ళు బ్రతుకుతూ, ఉద్యోగస్తులను బ్రతికిస్తూ మనకొరకు మనుగడ సాగిస్తున్నారు పాపం.. ఉద్యోగులంటే మన ప్రజలే కదండీ. ఆ మాటకొస్తే ప్రభుత్వమంటేమాత్రం - ప్రజలే కదుటండీ! ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పటుచేసుకున్నదే కదా !!!
అంచేత తెలియ జేయునదేమనగా ‘చెత్త’ ఆలోచనలు మాని ‘చెత్త’ గురించి ఆలోచించండి.
No comments:
Post a Comment