Pages

Friday, February 24, 2012

రాజమండ్రి గురించి... నాకు తెలిసినంతా కాదు; నేను చూసినంతా కాదు.. కూసింత

   
రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం... ఎందుకు ?
ఆదికవి నన్నయ్యకు ఇష్టం, మొదటి తెలుగునవల వ్రాసిన కందుకూరికిష్టం, కథాచక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికిష్టం, గయోపాఖ్యానం వ్రాసిన చిలకమర్తికి, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరివారికి, హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావుగార్కి, వారబ్బాయీ - మరో హాస్యరచయిత రాధాకృష్టగారికి, ఆంధ్రపురాణ గ్రంధ రచయిత, మరో నన్నయ్య అనదగ్గ మొన్నమొన్నటి మా మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారికి... ఇంకా... ఇంకా.... ఇంకా,,,,,,
ఎంతమందికండీ వీరందరికీ ఇష్టం కదా...అందుకనో ......... ఇక్కడివాడినే కనకనో--- నాకు మా రాజమహేంద్రవరం మీద మక్కువ... ఇక్కడివాళ్ళు కానివాళ్ళు కూడా ఇక్కడికొచ్చి .. నచ్చి.... ఇష్టపడి సెటిల్ అయిపోయినవాళ్ళున్నారు. ...వాళ్ళు కూడా ఇష్టపడ్తారు మా రాజమండ్రిని ..... మీకూ ఇష్టమే అయి ఉంటుంది...లేపోతే ఇంతదూరం వచ్చి ఇది చూస్తారా..?
ఆ నన్నయ్యగారి దగ్గరనుంచి... మా మధునాపంతులవారిదాకా ఈ నగరం అనేక మార్పులు చెందినా... ఆరుద్రగారు చెప్పినట్టు వేదంలా ఘోషించే గోదావరి శృతిపేయంగా ఇప్పటికీ తన వేదనాదంతో  విందు చేస్తోంది... అమరధామంలా శోభించే     రాజమహేంద్రి నయనానందకరంగా ఇప్పటికీ భాసిస్తోంది.ముందు నేను విన్నవి కొన్ని... ఇక్కడి మార్కండేయస్వామి వారి ఆలయం పురాణప్రసిద్ధి గల ఆలయం.. అక్కడి నుంచి చూస్తేగోదావరి     గట్టుకన్నా ఊరే ఎత్తుగా ఉండేదట.. ధాన్యం బస్తాలతో నిండిన ఎడ్లబండిమీద బస్తాల పైన కూర్చున్న చిన్నవాడికన్న ఎత్తట... నాకు తెలిసి     మార్కండేయుని గుడి ఎత్తుగానే     ఉండేది.. అప్పుడు ఎక్కి వెళ్ళేవాళ్ళం--ఇప్పుడు దిగి వెడ్తున్నాముకదా?
1 టౌన్ పోలీసు స్టేషన్ ఉన్న సెంటర్ అప్పట్లో అదే  నగరానికి వ్యాపార కేంద్రం.. కూరలగాయల మార్కెట్ కూడా అప్పట్లో ఇక్కడనే ఉండేది..         ఇప్పుడున్న ఊర్వశీ ధియేటర్ సెంటరులో చాలాకాలం గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది.. ఆ హాస్పిటల్ జైలున్నచోటకి మారాక   కూరలమార్కెట్ ఆ స్థలంలోకి మారింది.. ఆ పోలీస్ స్టేషన్ ప్రక్కనున్న పెద్దమసీదు ఉన్నచోట వేణుగోపాలుని ఆలయం ఉండేదట.
పెద్ద ఆనపకాయకు ఒక ఏగాని ఇస్తే తిరిగి ఆ కూరల ఆసామీ మనకు ఒకటో రెండో గవ్వలిచ్చేవాడట ..అంటే గవ్వకు కూడా అంత విలువ.. "గుడ్డి     గవ్వ విలువ చేయవనే" నానుడి తెలుసుకదా..  మూడు గవ్వలు ఒక ఏగాని లేదా పైస (ఇప్పటి నయా పైసలు కావు.) మూడు పైసలు ఒక     "కాని"/"డబ్బు". "డబ్బు" అంటే గుండ్రంగా ఉండే రాగి నాణెం.. "కానీ" అన్నదానికి చిల్లుకూడా ఉండేది.. ఆ చిల్లువల్ల రాగి ఆదా చేయాలనేమో.     దాన్నిబట్టే మినప్పిండి ఆదా చేయడానికి చిల్లుగారె సృష్టించారేమో.. ఏమో మరి...రెండు కానులు ..అర్థణా; రెండు అర్థణాలు ఒక అణా... పదహారు     అణాలు ఒక రూపాయి...
 గాంధీగారి చితాభస్మాన్ని రాజమండ్రి తీసుకువచ్చినప్పుడు, ఆ ఊరేగింపులో నాన్నగారు, చండ్రుపట్ల హనుమంతరావుగారు, మార్ని  నరసన్నగారు ఇంకా పెద్దలు చాలామంది ముందు వరసలో ఉన్నారు... ఐదేళ్ళున్న నేను మా సందు మొగదల నించుని చూడ్డం ఇంకా లీలగా గుర్తు.
 రాజమండ్రి అనగానే అప్పట్లో చాలామంది వరదరావు ఇడ్లీ అనేవారు..  - ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు కమలాకరరావు గారి తండ్రి..వరదరావుగారు. హోటల్ ఇండస్ట్రీ. మాడర్న్ హిందూ హోటల్ గా ప్రారంభించి... శాంతి నివాస్, శ్రీ నివాస్ హోటల్స్, కోర్టుల్లో కాంటీన్, రెండు రైల్వేస్టేషన్స్ లోనూ కాంటీనులు.... సుఖనివాస్ అని ఓ లాడ్జ్ వారి యాజమాన్యంలో అలా అలా వచ్చాయి.వారు వారి కుటుంబ సభ్యులు స్వయంగా పర్యవేక్షించేవారు.. వరదారావుగారి ప్రోత్సాహంతో కర్ణాటక దేశంలోని వారి బంధువులుకూడా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు.  దామోదరరావు హోటల్ అని కోటగుమ్మం సెంటర్ లో ఒక హోటల్ ఆ బంధువులదే.
రాజమండ్రిలో శ్రీ వరదరావుగారు ఒక ప్రముఖ వ్యక్తి.. వారి గురించి నే విన్న ఓ సంఘటన. ఒకసారి విద్యార్థులుగా కనపడ్తున్న ఇద్దరు చిన్నవయస్కులు వీరి హోటల్ కు వచ్చి భోంచేస్తున్నారుట. కౌంటర్ లో శ్రీ వరదరావుగారు ఉన్నారు.. అందులో ఒక కుర్రవాని భోజనమైంది కాని రెండవ కుర్రవాడు కావలసివన్నీ అడిగి వేయించుకుని చాలా సేపు తిన్నాడట..  తృప్తిగా భోంచేసాక వెళ్ళిపోతుంటే వరదరావుగారు పిలిచారు.
"ఎవరు బాబూ మీరు ?"
"వేదపాఠశాలలో చదువుకోడానికి వచ్చాము"
"ఎక్కడ ఉంటున్నారు..భోజనం సంగతేమిటి ?"
"మకాము స్థిరమైంది.. భోజనానికి #వారాలకి చెప్పుకోవాలి"
"అక్కరలేదు...మీరున్నన్నాళ్ళూ మా హోటల్ కి వచ్చి భోంచేయండి.. ఏమీ ఈయనక్కరలేదు." అని చెప్పి వరదరావుగారు నమ్మకమైన తన సర్వర్స్ లో ఒకర్ని పిలిచి
"వీరెప్పుడు వచ్చినా భోజనం నువ్వే వడ్డించి పెట్టు.. నలుగురిలోనూ పెట్టకు, లోపలి గదుల్లో పెట్టు.." అని చెప్పారట... అదీ రాజమండ్రిలో కనపడే అమ్మగుండె...
    (#అప్పటి రోజుల్లో వారానికి ఒక ఇంట్లో చొప్పున ప్రతిరోజు ఎవరో ఒకరు పేదవిద్యార్థులకు భోజనం పెట్టే సంస్కృతి ఉండేది.. మా ఇంటికి కూడా     రావడం నాకు గుర్తు.. ఇప్పుడు ఎక్కడా కనిపించటంలేదు...)
పుష్కరాలు వస్తే ప్రతి ఇంట్లోనూ వారి వారి స్తోమతలకు మించి కనీసం రోజుకి పదిమందికైనా ఆతిథ్యం ఈయడం రాజమండ్రిలో చూస్తాము..     డొక్కా సీతమ్మగారు...మా గోదావరి జిల్లా ఆడపడుచు ... ప్రాతః స్మరణీయురాలు  ఆవిడకు తెలిసినది ఒకటే... వచ్చినవాళ్ళకి నిత్యమూ     లేదనకుండా వండి తృప్తిగా భోజనం పెట్టడం.. అదీ ఇక్కడి సంస్కృతి...
   
 రాజమండ్రిలో నాకుతెలిసిన రోజుల్లో అంటే 1955 నుంచి గుర్తుచేసుకుంటే చాలామందికి కూడా గుర్తొచ్చేవి ముచ్చటించుకుందాం...
   
 అప్పట్లో శెట్టి అని పేరుగల కానిస్టేబుల్. (పేరు అదే అని విన్నాను). కానిస్టేబుల్ కి కాకీ నిక్కరు, కాకి సగంచేతులచొక్కా నెత్తిమీద టోపీ   అవి  యూనిఫాం.. టోపీ అయితే రకరకాల షేపులు మారి ప్రస్తుతం ఉన్న దశకు చేరింది.. ఆ రంగు ఎరుపు.. ఇప్పటి రంగు ..వదిలేయండి. ఈ శెట్టి గారి కాకీ యూనిఫాం గంజిపెట్టించేవాడేమో స్టిఫ్ గా ఉండేది.. కాలికున్న బూట్స్ చక్కగా పాలిష్ చేయబడి నిగనిగలాడుతూ ఉండేవి..     ఆతడు టక టకానడుస్తుంటే పరిగెత్తినట్టే... విజిల్ నోటిలో సైడుగాపెట్టి తమాషాగా ఊదేవాడు.. ఆతడు డ్యూటీలో ఉంటే సందడే సందడి..  రిక్షాల  వాళ్ళు రూల్ కు వ్యతిరేకంగా తిప్పుతున్నారంటే ఒక్కటే పరుగు.. వెళ్ళి సీట్స్ తీసి పట్టుకుపోయేవాడు... మాటలాడ్డం లేదు... వెనకాల ఆ రిక్షా     డ్రైవరు     పరుగెత్తేవాడు..     వాడి తప్పు తీవ్రతను బట్టి కొంచెం దూరం పరుగెత్తించడమో... కాసేపు ఉంచడామో చేసి అప్పుడు ఇచ్చేవాడు.. కేసులు     సాధారణంగా వ్రాసేవాడు     కాదు.. శెట్టిగారి మాటలు తమాషాగా ఉండేవి.. మా కుర్రకారుకి అతను పట్టుకుంటే బాగుణ్ణు అనుకోవడం ఉండేది.. ఓ     సారి ఒక హైస్కూల్ విద్యార్థి రాంగ్ సైడులో సైకిలు త్రొక్కుతున్నాడని పట్టుకున్నాడు..
    "చదువుకుంటున్నవానిలా ఉన్నావు... రాంగ్ సైడులో వెళ్ళెదవేమి ?"
    "లేదండీ వెళ్ళలేదు..."
    "ఏమేమీ.. వెళ్ళలేదా... చూస్తే బ్రాహ్మణకుమారునిలా ఉన్నావు.. మీరే అబద్ధమాడితే లోకం తలక్రిందులైపోతుంది నాయనా!" అని తను ఉన్న     టాఫిక్ ఐలాండ్ చుట్టూ మూడుసార్లు పరుగెత్తి... అప్పుడు సైకిల్ తీసుకువెళ్ళమన్నాడు.. ఆ కుర్రాడు ఆనందంగా శిక్ష పూర్తిచేసి సైకిల్ పట్టుకు     వెళ్ళాడు..
 చీకటిపడ్డాక ఓ సారి మా ఫ్రండూ నేనూ చెరో సైకిల్ పై వస్తున్నాము... ఒక సైకిల్ కు లైటు ఉంది, ఒకదానికి లేదు. మమ్మల్ని ఆపాడు.  కాసేపు  ఎగాదిగా చూసి.." ఏమండీ.. రెండు సైకిళ్ళకు ఒక లైట్ చాలనుకున్నారా ?
అట్లు కుదరదే ?".  చేసినతప్పుకన్నా ఆతడు పట్టుకున్నాడనే     ఆనందం     మాకు ఎక్కువగా ఉంది.. నిజం.. ఓ వార్నింగ్ ఇచ్చి సైకిళ్ళు నడిపించుకు  పొమ్మన్నాడు.
    ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి కాని చీటికిమాటికీ శిక్షించడం సరికాదనే ఆ శెట్టిగారిలోని భావన అభినందనీయం.. కదా ?

    రాజమండ్రిలో గుర్తించదగ్గ మరో వ్యక్తి... కిళ్ళీ అమ్మే అతడు.. కోటగుమ్మందగ్గరనుండి బయలుదేరి ఆ చివరదాకా ఒక లుక్కేస్తే ఎక్కడో అక్కడ     ఇతడు తారసపడేవాడు. ముతక ఖద్దరు బట్టలు భుజాన ఒక ప్రక్క ఖండువా  ఇంకో భుజంపై గుడ్డ సంచి, దానిపై శివ పరివారం బొమ్మ..     ఎడమచేతిలో ఒక పెట్టె.. ...అదో చిన్నసైజు పాన్ షాపు.  అది కొంచెం ఎత్తుగానే ఉండేది.. దానికి పైభాగంలో     మూడు ప్రక్కల అద్దం.. క్రింద    భాగంలో ఒకటో రెండో సొరుగులు.. ఆ అద్దాల వెనుక ముందు సగంలో తమలపాకులు... వెనుక సగభాగం     కిళ్ళీలు తయారు చేయడానికి     కౌంటర్     అన్నమాట. క్రింద సొరుగులు స్టాక్ కోసం... గులాబులు చల్లేవాడు.. అగరొత్తులు వెలిగించేవాడు...  ఆ కౌంటర్ పై, నిలుచుని చక్కగా     తయారుచేసిన ఆ కిళ్ళీఇంచుమించు అన్ని షాపులవాళ్ళూ కొనేవారు.. ఆ కిళ్ళీ; అతడి మాటలు ఒకదానికన్నా ఒకటి రుచిగా ఉండేవి..
    "వాగ్భూషణం భూషణం అన్నారు పెద్దలు...మన మాట్లాడుతుంటే పరిమళాలు గుభాళించాలండి.. అంతేకాని దుర్గంధం రాకూడదండి.. అంచేత     మా కిళ్ళీతో నోరు పరిమళింప జేసుకోండి.. ఇది మామూలు కిళ్ళీ కాదండీ... ...(తన చంక సంచి అలవోకగా ముందుకు వచ్చేట్టుచేసి అంది     మీదున్న శివ పరివారపు బొమ్మను చూపి...యాక్షన్ అన్నమాట) సాక్షాత్తూ ఆ పరమశివుని ప్రసాదమండి..ఇలా నోటిలో వేసుకుంటే     అలా     కరిగిపోతుందండి... అందరూ     అర్థణాకిస్తుంటే నీ కిళ్ళీ     ఖరీదు ఎక్కువంటారండి చాలామంది.. మా కిళ్ళీలో వేసే సరుకులు చాలా     ఖరీదైనవండి.. తుని నుంచి వచ్చిన లేత     తమలపాకులండి ఇవన్నీ వాడడం వలన ఎక్కువఖరీదు .. అలా కొందరన్నా నేను     పట్టించుకోనండి..     ఎందుకంటే మీ వంటి విజ్ఞులు (ఎదురుగుండా నోరెళ్ళబెట్టి చూస్తున్న మనల్ని చూపేవాడు) అలాంటి మాటలు     పట్టించుకోరండి..     ఎందుకంటే ఇది కైలాసనాథుని ప్రసాదమండి...". ఇలా సాగేది అతని ప్రసంగం.. ఆ మాటలు యథాతథంగా వ్రాయలేను... కానిఅందర్నీ     ఆకర్షించేవాడు... అతని దగ్గర కిళ్ళీ కొనడమంటే అతని మాటల రుచి వలననే.

    మరో వ్యక్తి... గోసేవా పరాయణ రామేన ఆదినారాయణగారు... ఇతను చిన్నపిల్లలకు వచ్చే అనాస వ్యాధికి మందులు కూడా ఇచ్చేవారు...     గోదావరి స్టేషన్ సమీపంలో ఉన్న తెల్లటి శివుని విగ్రహం (అప్పట్లో లేదా విగ్రహం) దగ్గరనుంచి కళా నికేతన్ కు వెళ్ళే రోడ్ మొదట్లో..  రోజూ రిక్షా     మీద పచ్చగడ్డి మోపులు తెచ్చి.. అక్కడ నిలబడి ..."దాఁ...దాఁ..." అనిపిలిస్తే ఆవులు పరుగెత్తుకొచ్చేవి... వాటికి ఈ గడ్డి వేసేవాడాయన... అవి     ఆనందంగా గడ్డి తింటూ ఉంటే చూడ ముచ్చటగా ఉండేది... తర్వాత కుక్కలకు రొట్టెలు వేసేవాడు... బోల్డు కుక్కలు.. అక్కడున్న యాచకులకి     పైసలిచ్చి, తినడానికేమైనా ఇచ్చేవాడు... ఈ దృశ్యం నేను హైస్కూల్లో చదువుకునే రోజుల్లో తరచు చూసేవాడ్ని...

    అప్పుడూ ఇప్పుడూ కూడా రాజమండ్రిలో ఆధ్యాత్మిక భావన వెల్లివిరుస్తూ ఉండడం కనిపిస్తుంది... గిన్నెలకు మాటులు వేసే అతను వచ్చేవాడు..     అతనిపేరు రామదాసు... "మాట్లోయ్"   అని రెండుసార్లు అరచి నాలుగుసార్లు "హరేరామ హరే కృష్ణ" అని గట్టిగా అరచేవాడు... "మధుకరం"     అని రాత్రిళ్ళు వచ్చే యాచకులు,  తెల్లగా తోమిన ఇత్తడి పాత్రలకు విబూతి, కుంకుమ అలది యాచనకువచ్చే  కాశీ కావడివాళ్ళు హరిలో రంగ     హరి అని వచ్చే హరిదాసులు.. అందరూ భగవన్నామ స్మరణే...
    మాదిరెడ్డి నరసింహారావు & సన్స్ అని ఫర్నిచర్ షాపు.. వీరు అప్పట్లో ఆంధ్రా యూనివర్సిటీ పరిథిలోని కాలేజీలకు, అలాగే స్కూల్స్ కు     ఫర్నిచర్ సప్లై చేసేవారు.. ఆ ప్ర్రొప్రయిటర్ పెద్దాయన.. కుమారులు షాపు చూసుకుంటుంటే ఆయన ఓ పడక్కుర్చీలో కూర్చుని ... తన దగ్గరకు     వచ్చిన చిన్నపిల్లలచేత రామనామం చెప్పించి... ఏ శనగపప్పో, చాకలెట్టో     ఇచ్చేవారు.
    శివరాత్రికి, కార్తీక మాసం, గ్రహణ సమయాలలోను.. గోదావరి ఘాటులదగ్గర సందడే సందడి... ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసంకాని, ఒక సంగీత     కచేరిగాని, ఒక సాహిత్య సభకాని... రాజమండ్రిలో చాలా అద్బుతంగా జరుగుతాయి...
    ఆధ్యాత్మిక భావాలతో, సాహిత్య సంగీత హృదయాలతో భాసించే రాజమండ్రి... అందరికీ ఆమోదకరమైన వాణిజ్యవ్యాపారలతో విలసిల్లే రాజమండ్రి     అంటే నాకు చాలా ఇష్టం...
    నేను చెప్పగలిగినవి కొన్ని వ్రాసాను... గోదావరి అంత విశాలంగానూ, పొడవుగానూ, లోతుగానూ, గంభీరంగానూ, గలగలమంటూ సందడిగానూ     ఉన్న రాజమండ్రి చరిత్ర... ఎంత వ్రాసినా తక్కువే..."జననీ జన్మభూమిశ్చ .... ఏదో అభిమానం... నా రాజమండ్రి     గురించి నాదనుకున్న బ్లాగులో     నాకోసం వ్రాసుకుంటున్నాను... మన రాజమండ్రి గురించి అనుకునేవాళ్ళకు నచ్చినా చాలు... ధన్యుణ్ణి....

Friday, January 20, 2012


ప  డి  తే      ప  డ్డా  ను     కా  ని......

మార్నింగ్ వాక్ కు వెళ్ళా... ఎర్లీ అవర్స్ లో...  ఇంకా వెలుతురు రాలేదు. చేతిలో టార్చ్ వేద్దామనుకునే లోగా స్పీడ్ బ్ర్రేకర్ కాలికి తగిలింది. ముందుకు తూలా..బోర్లా పడ్డా.. ముక్కు చితికింది...లేవడానికి ముందు కొంచెం కష్టపడ్డా...మొత్తానికి లేచా..క్రింద చూస్తే ఇంత బ్లడ్..చేత్తో ముక్కట్టుకుంటే ముక్కులోంచి చుక్కలుగా పడుతోంది బ్లడ్..తెలుస్తోంది.... ముక్కుకి అండ్ నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకుని వెనక్కితిరిగి సుమారు రెండు మీటర్లు నడుచుకుంటూ ఇంటికి తిరిగివచ్చేసి కాలింగ్ బెల్ కొట్టా...

తలుపుతీసిన మా ఆవిడ ముందు నన్ను చూడలేదు.. తర్వాత లైట్ వేసి చూసి...
"అయ్యో..అయ్యో..ఏమైందండీ ?"
"పడ్డానోయ్ ."
"అలా ఎలా పడ్డారండీ ?"
పడి చూపెట్టబోయా...కాని వళ్ళు స్వాధీనంకావటంలేదు.
సర్లే ఎందుకులే కంగారు (పెట్టడమని) పడడమని  విషయం వివరించా..
"ఎవర్నైనా పిలవకపోయారా ?" అంది శ్రీమతి..
"పిలిచా... పలకలేదు"
"పిలిచినా పలకని ఆ త్రాష్టుడెవరండీ ?"
"...అయ్యో..త్రాష్టుడు కాదోయ్.. రాముడు... మా రాముడ్ని పిలిచా ..పలకలేదు" లెంపలు వాయించుకుందామని
చేత్తో లెంపమీద వాయిస్తే లెంప ఎదురొచ్చింది...
"అబ్బా.." అన్నా... "ఏమైందండీ..." అందిమా ఆవిడ. "లెంప వాచిపోయి ముందుకి ప్రొజెక్టై  చేతికి దగ్గరగా వచ్చింది..
దొరికింది కదా అని వాయించా... వచ్చినందుక్కాదు, రాముణ్ణి తిట్టించినందుకు...నొప్పెట్టింది."
"సర్లెండి..లంఖణాల్లో మనుగుడుపుల్లాగా..జోకులొకటి" అని క్రింద ఫ్లోర్ లో ఉన్న రాజబాబుని పిలిచింది.
"అయినా రాముణ్ణి పిలిస్తే పలుకుతాడా.. మనుష్యుల్ని పిలవాలి.." అని ముక్తాయించింది...  ఒక్కోప్పుడు మా ఆవిడ నాకు అర్థంకాదు...
సరే రాజుబాబు వచ్చాడు...చూసి
"ఏమైందంకుల్ ?" రీప్లే..పెట్టా...
"బట్టలేసుకువస్తా అంకుల్... హాస్పటల్ కు తీసుకెళ్తా..." అని వెళ్ళాడు.. బట్టలున్నాయి కదా అని నా సందేహం...మా ఆవిణ్ణడిగా...
"మీరు పేషంట్.. కుళ్ళు జోకులెయ్యకండి.. సెప్టిక్ అవుతుంది..." అంది మా ఆవిడ..
"ఈవిడ జోకు వద్దంటూ..జోకేసిందా.. ...కేస్తూ...వద్దందా...ఏమో అర్థం కాలా...
రాజుబాబు బట్టలేసుకుని వచ్చాడు.. కూడా మూర్తిగారొచ్చారు..
"ఏంటీ.. పడ్డారుట ?" అంటూ..
"అవునండీ.వాకింగ్ కు వెళ్ళి..."
"వాకింగా... వెడతారేమిటి.. అలవాటా ?" అడిగారు...
"భలేవారే.. అలవాటు లేకపోడమేంటండి.. నా చిన్నప్పుడు ఏడాదెళ్ళకుండానే అడుగులేసేసానట.. మా అమ్మమ్మ ..తన మనవడు (అంటే నేనన్నమాట) అడుగులేస్తున్నాడని  ఊళ్ళోవాళ్ళకి అరిసెలు పంచిపెట్టిందట.. మా అమ్మ చెప్పేది.. అదిగో అప్పట్నించి .. ఇప్పటిదాకా ..అంటే ఇప్పుడు నాకు 69 సంవత్సరాలు. ఇప్పటిదాకా నడుస్తూనే వున్నాను కదండీ... బాగా అలవాటు...." అని చెప్తూ మురిసిపోయా...
రాజుబాబు వచ్చాడు...
"రాజుబాబు బట్టలేసుకున్నాడే" అరవబోయా...చురుక్కుమంది నోరు...
"రండి అంకుల్" అని లిఫ్ట్ దగ్గరకివేళ్ళేటప్పటికి చలం కనపడ్డాడు...
"ఏంటిరా బాబూ ఇది."..
"ఇది సర్వనామం" అనబోయి "పడ్డానయ్యా" అన్నా...
"అలా ఎలా పడ్డావు.." అందరూ అదే ప్రశ్న...మళ్ళీ రీ>>ప్లే.
"నేను  పడ్డప్పుడు.. చాలా బాధపడ్డారా..పగవాడికి కూడా వద్దు ఆ నరకము"
"నువ్వు పడ్డావా .. ఎప్పుడు?"
"మరి పడ్డాను కదా..ఆఫీసు నుంచి వస్తుంటే రాంగ్ సైడులో సైకిల్ నడిపించుకుంటూ..వచ్చి గుద్దేసాడు>"
"నువ్వు స్కూటర్ మీదున్నావా..."
"అప్పటికింకా స్కూటర్ కొనలేదు.. నడిచే వెళ్తున్నాను.."
"చెప్పావు కాదు.. ఎన్నాళ్ళైంది.."
"జస్ట్..నాలుగేళ్ళయింది.. ఇప్పుడు బెటర్ అనుకో"
దెబ్బకి నా దెబ్బకిక్ తగ్గిపోయింది...
సరే డాక్టర్ దగ్గరకి చేరాము మొత్తానికి.. డాక్టర్ దగ్గర నే చెప్పబోయా...ఆయన చూస్తున్నాగా మళ్ళీ వినడం ఎందుకనుకున్నాడో ఏమో చెవుల్లో సెత్ స్కోప్ పెట్టుకుని ... "సిస్టర్.. క్లీన్ చేసి పిలు ..వస్తాను." అన్నాడు..
నిర్దాక్షిణ్యంగా ముక్కునీ మూతినీ కర్ర చిత్రిక పట్టినట్టు తుడిచింది ఆ సోదరి. క్యార్,,,క్యార్ మన్నాను.. డాక్టర్ గారు వచ్చారు ..
"యూ ఆర్ లక్కీ. ఆఁ....నో కుట్స్ ఆఁ....తగ్గిపోతుంది. ఆఁ. నో ప్రాబ్లమ్ ఆఁ"
కూడా వచ్చిన మా ఆవిడ అడిగింది..
"డాక్టర్ గారూ అన్నీ తినొచ్చాండీ.."
"నువ్వు తినడానేకేమమ్మాఆఁ...శుభ్రంగా తిను ఆఁ..." అని నవ్వి
"ఆంటీ బైటెక్స్ ఇచ్చాగా ఆఁ ... పాపం! ఆయనక్కూడా పెట్టండి ఫర్వాలేదు ఆఁ..." అని
"రోజూ వచ్చి డ్రెస్సింగ్ చేయించుకోండి ఆఁ.." అని చెప్పి వెళ్ళారు
ఆసుపత్రిలోనుంచి బయటికి వస్తుంటే  బాబాయి వచ్చాడు...
"ఏంటిరా పడ్డావుట ?",,,
"నీకెవరు చెప్పారు ?" అన్నా...
"శని.." అన్నాడు బాబాయి..
" ? " ఎక్స్ ప్రెషన్ మాత్రం బ్యాండేజీ చాటునుంచి..
"ఏల్నాటి శని! దాని ప్రభావం.. నీది కన్యా రాశి కదా...ఓ ఊపు ఊపితేకాని ...."
"అయితే శని ముక్కట్టుకుని ఊపాడన్నమాట. అవునా బాబాయి?" బ్యాండేజ్ వేసారని గుర్తొచ్చి మాటలు స్పష్టంగా రావడంలేదు...
"ఇది శనిగాడి పనికాదన్నయ్యా... అదే అయితే వీడికి పళ్ళు రాలాలి. ఎముకలు విరగాలి... '...ల'లేదు, '...రగ' లేదు" అన్నాడు మా ఇంకో బాబాయి.
"ఎలా విరుగుతాయి.. వీళ్ళావిడ రెండో ఇంటిలోంచి బుధుడు  చూస్తున్నాడు వాడు శనికి మిత్ర గ్రహం.అంచేత శబ్బరి ఉండదు" అన్నాడు మొదటి బాబాయి..
"మా ఆవిడ ఇంకో ఇంట్లో లేదు. మాది ఒకే రూఫ్ కింద సహజీవనం మొర్రో." అన్నా....ఈలోగా మా ఆవిడ ఆటో పిలిచి..
"మాటలాపి ఎక్కండి" అంది. ఇలాంటి సత్వర నిర్ణయాలు ఆపత్కాలంలో తీసుకోవడంలో ఆవిడ బెస్ట్. ఇంటికొచ్చేసరికి తల భారంగా ఉండి
చాలా అన్ ఈజీగాఉంది.
గుమ్మంలో ఉండగాని క్రింద ఫ్లోర్ పార్థుగారు,, కనకయ్యగారు వచ్చారు..పరామర్శకు.. తాళంతీసి లోపలికి ఆహ్వానించాము..
"అయినా మీరంత దూరాలు వెళ్ళడమేమిటండీ.. మన అపార్ట్ మెంట్ చుట్టూ తిరగచ్చుకదా.."అన్నారు పార్థుగారు.
"అలా ఎలా కుదుర్తుందండి..చిన్న ఆవరణ.. ఒక రౌండ్ కి రెండు నిముషాలు కూడా పట్టదు .  ఎన్ని రౌండులని తిరుగుతాడు" అన్నారు కనకయ్యగారు.
వీళ్ళిద్దరికీ పడదు... అపార్ట్ మెంట్ సమావేశాల్లోకూడా ఎడ్డెమంటే తెడ్డం అన్నట్టే ఉంటుంది.
"నేను చక్కగా తిరుగుతున్నా కదా ?" అన్నారు పార్థు
"మీరు తిరిగితే? మీరో పెద్ద స్టాండర్డా "" అన్నారు కనకయ్య...
"లేఫోతే మీరా స్టాండర్డ్" మాట పెరుగుతోంది...
నేను మాట్లాడాలంటే నాకు వాగ్బంధనం.. బ్యాండేజి వేసారు కదా ? అప్పటికీ మధ్యాహ్నవార్తలు చదివినట్టుగా సంజ్ఞలు చేసాను.
"లేకపోతే ఏమిటండీ.. చక్కగా గాలి పీల్చుకుంటూ.. అలా బయట తిరిగినదానికీ.. మనపైపుగొట్టాల్లోంచి వచ్చే కుళ్ళుకంపు పీలుస్తూ టీకప్పులో తిరిగినట్టు తిరగడమూ ఒకటేనా..." అన్నారు కనకయ్య..
"అవును.. ఎందుక్కొట్టవు కంపు? .. సె క్క్ర ట్ట రీ గా....రు...అస్సలు క్లీనింగ్ చేయిస్తేకదా.."అన్నారు పార్థు. "సెక్రటరీ" అన్నపదం వత్తి పలుకుతూ...
కనకయ్యగారికి వళ్ళు మండింది.. డదా మరి.. ఆయనే సెక్రటరీ కదా...
"మెయింటనెన్స్ టైమ్ కి ఇచ్చేడిస్తే సెక్రటరీ ఏమన్నాచేస్తాడు.. ఎప్పుడైనా ఇచ్చి ఏడిస్తే మాట్లాడాలి..."చురక వేసారు కనకయ్య.
"కాఫీ తీసుకోండన్నాయ్యగారూ.." అంటూ మా ఆవిడ మళ్ళీ తాజా నిర్ణయం తీసుకుంది.
చోద్యం చూస్తున్నరాజు తీసుకొచ్చాడులాఉంది పద్మనాభంగారు లోపలికొచ్చారు... వీళ్ళిద్దరూ ఒకళ్ళవెనకాల ఒకళ్ళు బయటికి దారితీసారు...ఆ ఇద్దరికీ ఈయనంటే పడదు. ఆయనికి  కూడా కాఫీ ఇచ్చింది మా శ్రీమతి..
"సుగర్ ఉందా?" పద్మనాభంగారు విచారణ ప్రారంభించారు...
"అయ్యో ఉందండీ>>తక్కువయిందా..తెస్తానుండండి అన్నయ్యగారు!" అంది లోపల్నించి మా స్త్రీమూర్తి...
"నా ఉద్దేశ్యము నా సుగర్ నా కాఫీ కాదు.  మీకు చక్కెరవ్యాధిఉన్నదా అని నా ప్రశ్న" అని విపులీకరించారు పద్మనాభంగారు.
లేదు అందామంటే మాట రాదు.. బుర్ర అటూ ఇటూ త్రిప్పాకనుక అర్థంచేసుకున్నాడా పెద్దమనిషి..
"అయితే ఫర్వాలేదు.. త్వరగా తగ్గిపోతుంది..
అయినా శీతాకాలం ...కొంచెం టైము పట్టొచ్చు..;
మనడాక్టర్ గారిదగ్గరకే గా వెళ్త? ఆయన హస్తవాసి మంచిది. తగ్గిపోతుంది...
పెద్దవయస్సుకదా..పడితే కొంచెం టైమ్ పడ్తుంది..
ఫర్వాలేదులెండి మీరు జాగ్రత్తగానే ఉంటారు..అయినా మందులు అన్నీ మందులేసి తయారు చేస్తున్నారండీ ...ఓ పట్టాన పని చేయవు.." .తగ్గుతుంది ...తగ్గదు రెండూ చెప్పాడు పెద్దమనిషి .
"అన్నయ్యగారూ... ఆయన్ని బాగా రెస్ట్ తీసుకోమన్నారు...మీరు మాట్లాడుతూ ఉండండి... ఆయన కాసేపు పడుకుంటారు..." సత్వరనిర్ణయం తీసుకొంది మా బెటర్ హాఫ్... "వస్తానమ్మా" నిష్క్రమించారు ఆయన ....సంస్కారి కదా....
"మందులు వేసి మందులు చేయడమేమిటి... పంటలకి కదా మందులు.. " నోరు తెరవబోయా...
"మూసుకు పడుకోండి..." అని బెడ్రూమ్ తలుపు మూసి.. ఆవిడ తన వంటింటి సామ్రాజ్యానికి తరలింది...ఇంటి మహారాజ్ఞి కదా....

*********                                 ***********                                    ***********                                                        

(ప్రఖ్యాత దర్శకుడు వి.శాంతారామ్ గార్కి కంటికి ఆపరేషన్ అయి రెండు కళ్ళూ మూసి బ్యాండేజ్ వేసారుట.. కళ్ళు మూసుకొని మనసు తెరిచినప్పుడు వచ్చిన భావ స్వప్నం... "నవరంగ్". ఒక అద్భుత దృశ్యకావ్యం. నాకు కన్ను మూస్తే నిద్రొస్తుంది కాని అలాంటి ఆలోచనలు ..ప్చ్....
అయితే డిశంబర్ లో వాకింగ్ కు వెళ్తూ పడ్డా. అప్పుడు నోరు మూయకతప్పిందికాదు... ఎంతో మంది అభిమానంగా వచ్చి చూసి తమ ఆందోళన వ్యక్తపరిచారు ...వారి ప్రేమకు వినయాంజలులు...కొన్ని ఎక్కువ ఊహిస్తే  వచ్చిన ఆలోచన ఇది...నిజం మాత్రంకాదు.. ఎవర్నీ నొప్పించడం ఉద్దేశ్యమూ కాదు...బాధలో ఆనందం వెతుక్కోవడం మాత్రమే...అర్థంచేసుకోగలరు...)
----oooo-----

Friday, December 30, 2011




స్వాగతం...క్రొత్త సంవత్సరానికి స్వాగతం

Sunday, December 18, 2011

ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం.... యాత్ర













ప్రయాగ ,,, అయోధ్య ,,, నైమిశారణ్యం,,,, (ఈ మధ్య ఒక 25రోజులు చేసిన మా తీర్థ యాత్రలగురించి వ్రాసిన వ్యాసాలలో ఇది మూడవది, ఆఖరుది. మా ఆనందం అందరితోనూ పంచుకోవాలనే తపన...అందుకీ ప్రయత్నం......)

ఉదయం అయిదుగంటలు దాటాక మా పన్నెండుమంది బృందం కాశీనుంచి బయల్దేరింది.. మేమంతా పరస్పరం బంధువులమే బీరకాయ పీచు. బృందావనం, కాశీ ఐన తర్వాత ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం కలిసి ప్రయాణించామన్నమాట. ముందుగా మా మితృని ద్వారా కాశీనుంచి. ఒక "ట్రావెలర్" వేన్ కుదుర్చుకున్నాము.. అందులో పదముగ్గురు కూర్చోవచ్చు.. మీటర్ లెక్కన మాట్లాడాము..కారు 15వ తేదీ బయల్దేరే ముందు మా రథసారధి హిందీలో ఉవాచ.."స్పీడో మీటర్ చాలూ నహీఁ సాబ్, కరాబ్ హో గయా".. మేమూ కూసింతసేపు "అబ్ క్యా కరనా హైఁ" అని హిందీలో బాధపడినవారమై.. "చలో" అనక తప్పిందికాదు. దారిలో ఉన్న సైను బోర్డులు, మైలు రాళ్ళూ ఆధారంగా దూరాలు కొల్చుకుంటూ, రథచోదకుడు చెప్పినదాన్ని మా అంకెలతో సరిపెట్టుకుని, ..బేరాలాడి..,మొత్తానికి డబ్బులు సెటిల్ చేసి, వాణ్ణి అక్కడ హిందీలోనే వదిలేసి ఇబ్బందిలేకుండా మన తెలుగుబండి ఎక్కామనుకోండి..
సరే
విషయానికొద్దాము.....

కాశీ
నుంచి ప్రయాగ చేరేసరికి ఉదయం సుమారు పది అయింది.. డైరెక్ట్ గా త్రివేణి సంగమానికి వెళ్ళాము.. హరిజగన్నాధశాస్త్రిగారు ప్రయాగలో పేరున్న పురోహితులు.. తెలుగువారు. ప్రస్తుతం వయసురీత్యా పెద్దవారవడం వలన వారి కుమారులు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు... వారితో ముందుగానే ఫోనులో మాట్లాడాం కనుక వారు చెప్పిన ప్రకారము రేవులో వారిని కలిసాము. సంగమస్నానానికి చిన్న నావలో పంపించారు.
నది
మధ్యలోకి వెళ్తుంటే తెల్లటి పక్షులు గుంపులు గుంపులుగా నదీజలాల అలలలో తేలియాడుతూ నయనానందకరంగా కనపడ్డాయి.. పడవల్లోకివచ్చి అమ్మిన కారప్పూస ప్యాకట్టులలోని కారప్పూస నీటిపైన జల్లి .. "దాఁ" "దాఁ" అని పిలిస్తే తెల్లటి నీటి అలలపై పాలనురుగుల్లాంటి రెక్కలు విప్పుకుని ఎగురుతూ వచ్చి ఆ కారప్పూస పలుకుల్ని నీటిలో మునగకుండానే కరుచుకు పోతాయి.
ఇంకా
ముందుకుపోయాక సంగమము.. శివుని జటాజూటం నుంచి..వెలువడ్డ గంగమ్మ ఓ ప్రక్క స్వచ్ఛంగా .. తెల్లగా ... చలాకీగా సాగుతూ ఉంటుంది ... కిష్టయ్యను సేవించడం వలన నల్లబడ్డదా అన్నట్టు నల్లని యమున గంగను జేర సంకోచంగా వస్తున్నట్టు రెండవ ప్రక్కనుంచి మెలమెల్లగా వస్తుంది. తెల్లటి శివయ్యా.. నల్లటి కిష్టయ్య.. తెల్లటి గంగమ్మ .. నల్లటి యమునమ్మ.. ఆ దృశ్యం నయన మనోహరము.. అంతర్వాహిని సరస్వతి కాళ్ళకు చల్లగా తగులుతుంది ...ఆ త్రివేణి సంగమం భరతభూమికి క్షేత్రమాహత్మ్యము కల్పిస్తున్నది.. కనపడే రెండునదులు --కనపడనిది ఒకటి... ఆ నదుల త్రివేణీ సంగమంలో .. దానికి ప్రతీకగా....కనపడని ఒక పాయ కనపడే రెండు పాయలతో అల్లబడిన నల్లని వేణిని దానం చేస్తారు.. ఆ కురులు సంగమంలో వదిలితే నీటిపై తేలకుండా క్రిందకు పోవడం అక్కడ విశేషం...
వేణీ
దానానికి ముందు దంపతులు చేసే పూజ తంతు భలే బావుంటుంది... అది వయసులో ఉన్నవాళ్ళు చేస్తే ఫరవాలేదు.. వయసు పెరిగిన వాళ్ళు చేస్తే..చూడముచ్చట. వయసురీత్యా రకరకాల ఆకారాలు... రకరకాల కేశ సంపదలు...దృష్టి మాంద్యాలు.. భార్యా భర్తలు కాళ్ళకు పారాణి పరస్పరం దిద్దాలన్నా, ఒళ్ళో భార్యని కూర్చోబెట్టుకుని ఆమెకు జడ వేయాలన్నా--అసలు వళ్ళో భార్యామణిని కూర్చోబెట్టుకోవలన్నా వయస్సు భారం, సహకరించని అవయవాలు .. ఏదో చేయాలన్న ఆరాటం .. సరిగా చేయలేకపోతున్నామనే అసంతృప్తి. రక రకాల జంటలను ఏక తాటిపై నడిపించే ప్రయత్నంలో బ్రహ్మగారు.. చోద్యం చిత్రీకరించే కేమెరాలు, హేండీకామ్ లు పట్టుకుని కూడా వచ్చిన బందుగుల కోలాహలం..... సందడిగా రేవుదగ్గర కార్యక్రమాలు ముగించుకుని.. భోజనాదులు పూర్తి చేసుకుని...
శంకరమఠం
.. తర్వాత లలితాదేవి ఆలయం చూసాము. ఇది శక్తిపీఠం.. చెయ్యిపడిన ప్రదేశం.. ఒక నూతిలో పడినదట.. గర్భగుడిలో నూయి..దానికి పూజాదికములు... తర్వాత బడే హనుమాన్.. పెద్ద విగ్రహం. మహిరావణుని చంఫి రామలక్ష్మణుల తన భుజాలపై తెచ్చిన హనుమ సుందర రూపం.. పడుకున్న భంగిమలో ఉంటుంది.. పూలమాలలతో నిండి మోము మాత్రం చూపే స్వామి మరునాటి ఉదయం పూర్తిగా దర్శనమిచ్చాడు... ఆనందభవన్ (నెహ్రూగారి జన్మస్థలి) బయటినుంచే చూసాము.
ఆ
రాత్రికక్కడ ఆగి మరునాటి ఉదయమే అయోధ్యకు బయల్దేరాము. అయోధ్యలో సరయూనదీ జలాలు కేవలం మార్జనమే చేసుకున్నాము.. విపరీతమైన రక్షణ వలయంలో ఉన్న బాలరాముణ్ణి చూసాము.. మనదేవుణ్ణి మనం చూడడానికి విపరీతమైన ఆంక్షలు.. బాల్ పెన్, జేబు దువ్వెన తో సహా అక్కడ అనుమతించరు.. రామదర్శనమంటే అంత కష్టమా... అంత సులభంగా దొరుకుతాడా శ్రీరాముడు. క్రొత్త దేవాలయానికి పాలరాతి కట్టడములు తయారవుతున్నాయి.. ఎన్నో దేశాలభక్తులు తమ సంసిద్ధతకు ప్రతీకగా ఇటుకలు సమర్పించారు.. కోర్టు అనుమతి దొరకగానే 24 గంటల వ్యవధిలో శ్రీరాముని దివ్యధామం సిద్ధమౌతుందట.. దానికి సిమ్మెంట్, కాంక్రీటు అక్కరలేని అధునాతన పద్ధతిలో నిలబెట్తారట.. రామాలయ నిర్మాణ పూర్తయ్యేవరకు భోజనం చేయనని సరయూనదీ జలాలతో సంకల్పించి.. పదహారు సంవత్సరాలనుండి కేవలం పాలు పళ్ళ తీసుకుంటూ దీక్షలో ఉన్న ఒక స్వామీజీని చూసాము. అయోధ్య యాత్ర ముగించుకుని నైమిశారణ్యం బయల్దేరాం.
లక్నోకు
సుమారు వంద కిలోమీటర్ల దూరంలో నైమిశారణ్యం. అక్కడ వనమే భగవత్స్వరూపం.. అన్ని పురాణాలలోను నైమిశారణ్య ప్రస్తావన ఉంటుంది.. సుదర్శనం యొక్క నేమి (అంచు) వలన ఏర్పడ్డ తటాకం చక్రతీర్థం ఉంది.. దాని చుట్టూ ఉన్న అరణ్యం నైమిశారణ్యం అని ఒక కథ.. అక్కడ గోమతి నది.. మేం నైమిశారణ్యం చేరే సమయానికి చీకటి పడింది.. బాలాజీమందిర్ లో ఉన్న మాతాజీ మాకు ఆశ్రయమిచ్చారు.. మా బృందానికి నాలుగు విశాలమైన గదులు ఏర్పాటు చేసారు.. రాత్రికి మాకు భోజనం ఏర్పాటు చేసారు.. ఆప్యాయంగా పలకరించారు.. మరునాటి ఉదయం గోమతిలో స్నానం చేసి... వ్యాసగద్దె, సూతగద్దె,దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం,సేతుబంధరామేశ్వరం, మొదలైనవి చూసాము.. మాతాజీ ఆధ్వర్యవంలో సత్యనారాయణ వ్రతం చాలా చక్కగా తృప్తిగా చేసుకున్నాము.. రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది. .. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే అ ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయట.. ఆ అడుగున శివమూర్తి ఉన్నదట...చూడలేకపోయాము. ఆ రాత్రికి కూడా ఉన్నాము.. మరునాడు... ఉదయకాంతులలో ,, మంచుకురుస్తుండగా వనశొభ మనస్సుకు ఏదో తెలియని ఆనందాన్నిచ్చింది..
మాతాజీ
దగ్గర శలవు తీసుకుని బృందావనమాదిగా నైమిశారణ్యం వరకు అనుభవమైన మధురానుభూతుల మనస్సులో భద్రపరచుకుని లక్నో సాయంత్రానికి చేరాము.. అక్కడనుండి లక్నో టు యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ లో స్వస్థల ప్రస్థానం...

మన
ఇంటిలో లాగున ఎక్కడా ఉండదు.. ఇబ్బందులు ఉంటాయి.. నచ్చని భోజనాలు తప్పవు.. మెచ్చని బసలో కాపురాలు తప్పవు..బలహీనతను ఆసరాగా తీసుకుని ఆటో రిక్షా మొదలుకుని దైవసాన్నిధ్యం వరకు తటస్థపడుతూ దోచే దొంగలుంటారు.. ఇచ్చినడబ్బులకి చేయవలసిన సేవలందించని దొర (దొంగ) ప్రభుత్వాల వైఫల్యాలు ప్రతిచోటా కనపడుతూనే ఉంటాయి. రైలు పెట్టెలలో కనీస శుభ్రత పాటించని మనలాంటి ప్రయాణీకులు... టిక్కట్..రిజర్వేషన్ లేకుండా దర్జాగా ప్రయాణించే ప్రభృతులు.. వారిని ఏమీ అనని రైల్వే అధికారులు...

ఇవన్నీ
మరచిపోవాలి.. కేవలం భగవంతుణ్ణే భావించాలి.. ఆయననే ధ్యానించాలి... ఆయననే సేవించాలి.. అప్పుడే ఈ కష్టాలు మనసుకి పట్టని స్థితి వస్తుంది .. ఆ స్థితిలో మనసులో కొలువైఉన్న భగవంతుని అనుభవం తథ్యం... మనం నమ్మి "ఏమిటయ్యా ఇది స్వామీ" అనకుండానే ఆయన సాయం ఏదో రూపంలో మనకి అందుతుంది.. పొందిన ఆ అనుభవం మన గొప్ప అనుకోకుండా ఆయన దయ అని తెలుసుకోగలిగితే అదే భగవత్సాక్షాత్కారం....

Sunday, December 11, 2011

తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు


తెలుగు బ్లాగు స్వంతదారుగా (dvhrao.blogspot.com) తెలుగు బ్లాగుల దినోత్సవ శుభసమయాన తెలుగు బ్లాగులు నిర్వహిస్తున్న సహబ్లాగర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాను.....