Pages

Sunday, March 25, 2012

రాజమండ్రి-2


 

రాజమండ్రి... మొదటిది.
రాజమండ్రి గురించే.... మరికొంచెం
                                                    .... డి.వి.హనుమంతరావు
నా బ్లాగులో రాజమండ్రి అని కనపడగానే  చాలామంది నా బ్లాగు చూసారు.. అంతమంది చూడ్డం నా బ్లాగు జీవితకాలంలో ఓ రికార్డ్. చాలా ఆనందమైంది.. "ఇంకా వ్రాస్తే బాగుంటుంది కదా" అని అభిమానం చూపారు... అందుకనే ఈ ప్రయత్నం.. రాజమండ్రి గురించే మరి కొంచెం.....

గోస్టేషన్...వహొ...రాస్టేషన్...కరాఆ...పవీబ్ర...ధనకట్టా....
మీకు గుర్తొచ్చేఉంటుంది.. కాని దీని గురించి తరవాత మాట్లాడుకుందాం..


1950..51 ప్రాంతంలో నా హైస్కూల్ ప్రవేశం.. "ఫస్ట్ ఫారం" అంటే ఇప్పటి "ఆరవ క్లాసు".. అనుకోవచ్చుకాని.. చిన్న తేడా ఉంది. మాకు ఇంగ్లీషు ఆల్ఫబెట్ ఫస్ట్ ఫారంలో చెప్పేవారు. ఇలా అని  నేను ఇప్పుడు నిజం చెప్పినా మా మనుమడు నవ్వుతాడు.. కాని అది నిజం... సరే ఈ ఫస్ట్ ఫారంలో చేరాలంటే "ఇంటూ ఫస్ట్ ఫారం" అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ వ్రాయాలి.. అది నేను వ్రాసినప్పుడు, నా ప్రక్క మరో అబ్బాయి పరీక్ష వ్రాసాడు.. వాడికి నేనో, వాడు నాకో ఒక తెల్లకాగితం అప్పు ఇచ్చుకోవడమో - పుచ్చుకోవడమో జరిగింది..... ఆ ఋణానుబంధం - ఇప్పుడు నాకు వాడు వియ్యంకుడు.. ఇంక 'వాడు' అనకూడదు.. నేను ఆడపిల్లను ఇచ్చుకున్నవాడిని కదా... సరే ! స్ట్రెయిట్ లైనులోకి వద్దాం...
 పేపరుమిల్లు ఎదురుగా ఉన్న మా శ్రీరామనగర్ కు గోదావరి ఒడ్డున  పుష్కరఘాట్ దగ్గరగా ఉన్న ఆ మునిసిపల్ హైస్కూలు దగ్గర. అందుకని నన్ను అక్కడ చేర్పించారు..  ఆ స్కూలుకు ఎంత అందమైన ప్లేగ్రౌండో.. నిజానికి ఆ రోజుల్లో చాలా స్కూల్స్ కు చక్కని ప్లేగ్రౌండులు ఉండేవి. అక్కడక్కడ చెట్లు కూడా ఉండేవి.. మంచి మంచి మేష్టరులు.. రోజూ స్కూలుకి నడిచేవెళ్ళేవాళ్ళం. సుమారు అయిదారు కిలోమీటర్లుంటుందేమో... పుస్తకాలతో నిండిన సంచి ఒక చేతిలోనూ, రెండు గిన్నెల ఇత్తడి కారియర్ ఒకచేతిలో..మధ్యాహ్నం అన్నంతిన్నాక ఆ కారియర్లు కబుర్లు చెప్పుకుంటూ గోదావరికి తీసుకువెళ్ళి ఇసుక పెట్టి తోమి మరీ కడిగేవాళ్ళం.. ఇంటికొచ్చాక మళ్ళీ అమ్మ కడిగితేనే కాని ఆ ఎంగిలీ, మేము పట్టించిన ఇసుకమట్టి వదిలేవి కావనుకోండి ! వర్షాకాలమైతే చిన్నగొడుగు... అలా పొలో మంటూ పోవడమే. ఉదయం తొమ్మిదింటికి బయల్దేరి వెళ్తే సాయంత్రం పెత్తనాలు చేసుకుంటూ ఇంటికొచ్చేసరికి అయిదు అయ్యేది.. 
లాగుడు రిక్షాలుండేవి.. అప్పుడప్పుడు ఆ రిక్షా ఎక్కేవాడ్నండోయ్ !..మనల్ని కూచోపెట్టి డ్రైవరు రిక్షా ఎత్తితే ఆకాశం కనపడేది...  పొట్టప్పన్న ఉండేవాడు.. హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ రిక్షా లాగేవాడు. నలుగురం ఎక్కి నాలుగణాలు ఇస్తే చాలు... నోటితో కారు ధ్వని చేస్తూ...బ్ర్..బ్ర్...బ్ర్.. అంటూ పరుగెత్తేవాడు... ఎప్పుడయినా రిక్షా ఎక్కినా ఎక్కువగా నడిచే...స్కూలుకి వెళ్ళేటప్పుడు కాతేరు రోడ్డులో వచ్చి ఆర్యాపురం మధ్యవీధిలోకి తిరిగే వాడ్ని..ఆ వీధి చివర కొణితివాడ జమీందారు గారి ఇల్లు వుండేది.. ఆయన కొంచెం పొట్టిగా ఉండేవారు.. గులాబిపూవులా..ఎర్రగా ఉండేవారు... తెల్లది కాని, గులాబి రంగుదికాని, పంచె కట్టుకుని నవ్వుతూ ఉండేవారు. ఆయన్ని చూసి నమస్కారం పెట్టి స్కూలుకి వెళ్ళడం ఒక అలవాటు.. ఎందుకు పెట్టేవాడ్నో తెలియదు.. ఆ రోడ్ మీద వెళ్ళే స్కూలు పిల్లలందరూ ఆయనికి నమస్కారం పెట్టి మరీ వెళ్ళేవారు..  నవ్వుతూ లోపల్నించి వచ్చి ఆయన అందర్నీ పలకరించేవారు.. అప్పుడప్పుడు ఏ పండో ..చాకలెట్టో ఇచ్చేవారు. దానికోసమేమో తెలియదు.. స్కూలుకి ఆలస్యమవుతున్నా ఈయన్ని చూడ్డంమాత్రం మానేవాళ్ళం కాదు.. తరువాత ఫైర్ ఆఫీసుదగ్గర కిటికీలోనుంచి గోడ గడియారం చూడ్డం..అదో రొటీన్ లాగా...

గోదావరికి జులైనుంచి సెప్టంబరు వరకూ వరద రోజులు.. ఇప్పుడు మూలపడిన రైలు బ్రిడ్జి మీద నీటిమట్టం తెలిపే స్కేలు ఉంది..ఏదో పని ఉన్నట్టు అక్కడికి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడు వెళ్ళి వరద మట్టం చూసే వాళ్ళం.  ఏమాత్రం గోదావరికి నీరు తగిలినా రోడ్డుమీదకి వచ్చేసేది. ఇంటికెళ్ళి ఆ న్యూస్ ఆనందంగా అమ్మకు చెప్పడం...మోకాళ్ళలోతు నీళ్ళలో స్కూలుకి పోయేవాళ్ళం. నిక్కర్లేకదా ...పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు .. సరదా కూడాను. 1953 ఆగష్ట్ 15, మామూలుగా మేం జండావందనానికి వెళ్ళాము. ఫంక్షన్ అయిపోయింది.. హెడ్ మాష్టారు (శ్రీ కొఠే నరసింహరావుగారు) అనౌన్స్ మెంట్ చేసారు.. "ఇక్కడ్నించి మీరంతా తిన్నగా ఇళ్ళకు పొండి.. దారిలో పెత్తనాలు చేసారా.. నేను వచ్చి చూస్తాను... తాట వలుస్తాను.. గోదావరి ప్రమాదం కరంగా ఉంది" అని చెప్పారు. స్కూలుకి తూర్పు గోడ అవతల పెద్ద ఆంజనేయస్వామి గుడి.. అప్పట్లో అక్కడ రోడ్ వెడల్పు తక్కువ.. అక్కడ గోడకి స్కూలువైపు, గుడివైపు రెండు బల్లలు వేసి పెద్ద క్లాసు కుర్రాళ్ళని పెట్టి మమ్మల్నందర్నీ బల్లలమీద ఎక్కించి గోడ దాటించారు.. మేమలా కోటగుమ్మంవైపు నుంచి ఇళ్ళకు జేరాము.. ఆ రాత్రి కర్రల అడితీ ఉన్నచోట పెద్ద గండి పడింది.. ఇటు సీతంపేట నుంచి అటు ఆర్యాపురం వరకూ ములిగిపోయింది. ఇళ్ళ కప్పుల పైన రెండు మూడు నిలువుల ఎత్తుగా నీరు ప్రవహించింది. గండి పడింది - కర్రల అడితీలో అని చెప్పాకదా.. అక్కడ పెద్దపెద్ద మోకులతో కట్టిన వెదురు కట్టలు, దుంగలు ఆ తాళ్ళు తెగిపోయి ప్రవాహవేగానికి ఊళ్ళోకి మరఫిరంగుల్లా వచ్చి ఇళ్ళను కొట్టుకోడం.. ఇళ్ళు నేలమట్టమయిపోవడం. ఆర్యాపురంలో గాంధిగారి బొమ్మ ఉండేది.. పెద్దగాంధిబొమ్మ సెంటరు అని దానికి పేరు అదికూడా పడిపోయింది.. ఇప్పుడు చిన్నగాంధీ బొమ్మ ఉందికాని.. ఈ చిన్నగాంధీగారికి అంత పేరురాలేదు...పాపం. పేపరుమిల్లు దగ్గర ఉన్న మాకు నగరానికి లింకు కట్... మా అన్నయ్య రామాటాకీసులో సినీమాకు సెకండుషోకి వెళ్ళాడు.. కుర్చీల క్రిందకు నీళ్ళు వచ్చేసాయి.. ఆ ప్రక్కనున్న ఎవరింట్లోనో తలదాచుకుని మర్నాడు ప్రొద్దెక్కాక వచ్చాడు. ఊళ్ళోకి వెళ్ళాలంటే వీవర్స్ కాలనీ వైపున ఉన్న కోరుకొండ రోడ్ మీద వెళ్ళాలి. అయితే అప్పటిదాకా ఆ రోడ్ కు జనసంచారం అంతంత మాత్రం. అదీ కాక మా శ్రీరామనగర్ లో కూడ ఇరవై లోఫునే ఇళ్ళు.. మిగతా భాగం అంతా చెట్లూ మొక్కలూనూ..అటు తొర్రేడు, కాతేరు గ్రామాలు... ఇన్నీస్ పేట అన్నీ జలమయం అని చెప్పారు... మరి రెండు మూడు చోట్ల గండి పడిందని చెప్పారు..అసలు నాకు గండి అంటే తెలియదు.. పదేళ్ళకుర్రాడిని.అప్పుడంతా అమ్మచాటే కదా..... 16వ తారీఖు ఉదయం నాన్నగారితో కలసి సీతంపేట వెళ్ళి ఆ నీరంతా  చూసాము.. వీధుల్లో లాంచీలు, పడవలూ తిరిగాయి...మునిగిపోయిన ఇళ్ళల్లో మా భావి వియ్యంకుని ఇల్లు కూడా ఉంది.. వాళ్ళారాత్రి అక్కడే ఉన్న కృష్ణనగర్ కొండమీద (చిన్న గుట్ట) ఉన్నారుట. వాళ్ళని పడవల్లో మా ఇంటికి తీసుకువచ్చాము.. వాళ్ళేకాకుండా మా ఇంట్లో .. చాలా కుటుంబాలవారు తలదాచుకున్నారు.. మా పేటలో ఉన్నవారందరూ చాలామందికి ఆశ్రయాలు  కలిపించారు... అదో విచిత్రానుభూతి. డా.ఎ.బి.నాగేశ్వరరావుగారు అప్పుడు మునిసిపల్ చైర్మన్.. ఆయన తన ఇల్లు ములిగిపోతున్నా పట్టించుకోకుండా అందర్నీ ముందర్నించీ హెచ్చరిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో చాలా సేవ చేసారు.. ఆ సేవ మరవలేనిదని ఇప్పటికీ చెప్పుకుంటారు.. ఈయన ఆంధ్రరాష్ట్రప్రభుత్వంలో టంగుటూరివారి నేతృత్వంలో స్వపరిపాలనశాఖామాత్యులుగా బాధ్యతలు నిర్వహించారు.. మంత్రిగా ఉన్నప్పుడుకూడా రాజధాని కర్నూల్ చుట్టుపట్ల గ్రామాల్లో స్వంతఖర్చులమీద వైద్య సేవలందించిన మహావ్యక్తి.. నిరాడంబరుడు.. ప్రాతః స్మరణీయుడు.
ఇప్పుడు గట్లు పటిష్టం చేసారు. పెద్ద ప్రమాదాలు తగ్గాయి.. ఇప్పటికీ వరదరోజుల్లో గోదావరి అందమే అందం.  మహరాష్ట్రలో వర్షాలు బాగా పడితే మా గోదావరికి వరదొస్తుంది.. దండకారణ్యంలోనుండి ప్రవహించుకుంటూ తనతోపాటు బోల్డు చెట్లను, విలువైన దుంగలనూ  తీసుకువస్తుంది. అవి పట్టుకోవడానికి ఈతగాళ్ళు ప్రవాహంలో ఈదుకుంటూ వెళ్తారు.. పనికొచ్చే దుంగలు కనుగొనడంలోనూ, ఎంతదూరంలో దాన్ని పట్టుకోగలరో, ఇవన్నీ అంచనా వేసి రేకు దొన్నెలమీద (వాటిని గుర్రాలంటారు) వాలుగా వెళ్ళి.. దుంగ పట్టుకుని ఎదురీదుతూ ఒడ్డుకు వస్తారు..తమాషాగా ఉంటుంది.. పాములు అవీ ఆ దుంగలమీద ఉండొచ్చు.. చాలా రిస్క్ తీసుకుంటారు. మరీ పెద్దవాళ్ళూ, ఆడవారు, పిల్లలు గట్టుప్రక్కన నిలబడి పెద్ద వెదురుకర్రతో చిన్నసైజు కంపల్నీ పొయ్యిలోకని సేకరిస్తారు... ఇదంతా తీరంవెంట కాపురాలుండే కొన్ని కులాలకు చెందినవారు చాకచక్యంగా చేస్తారు. గోదావరి  శాంతంగా ఉంటే పెరుగుతుందని.. గలగల పారుతూ ఉంటే తగ్గుతుందని .. అలాగ్గానే నిన్న ఎక్కడదాకా ఉంది.. ఈ రోజు ఎలా ఉంది.. ఇలా గట్టుమీదున్న నా లాంటివాళ్ళు అంచనాలు వేస్తూ ఉంటారు.. అదో తమాషా..... 

ఆ స్కూలులో నేను యస్.యస్.యల్.సీ దాకా చదివాను.. ఈ క్లాసు ఇప్పుడు ఇంటర్ లో కలిసిపోయింది.. స్కూలునించి వస్తూ నెమ్మదిగా,, వచ్చేవాళ్ళం. ఇప్పుడు అండర్ గ్రౌండ్.. అంటే రైలు ట్రాక్ అడుగున నడుస్తున్న మార్కెట్ స్థానంలో రైలు గేట్ ఉండేది.. ఆ గేటు దాటి మున్సిపల్ ఆఫీసు ముందరినుంచి వెడ్తూ ఉంటే గొప్ప సందడి.. రైలు గేటు దాటాక పెద్ద పోస్టాఫీసు వుండేది.. నిజంగా అది పెద్ద పోస్టాఫీసే .. పెద్ద బిల్డింగ్. బ్రిటిష్ వాళ్ళ టైములో దనుకుంటాను.. మోళీ సాయిబులు, చిలకప్రశ్నవాళ్ళు, జ్యోతిష్కులు, మూడుముక్కలాట్లవాళ్ళు.. అంతా కాలక్షేపమే.. మూడుముక్కలాళ్ళు మమ్మల్ని దగ్గరకి రానీయకుండానే పొమ్మనేవారు.. ఒక చోట మోళీ సాయిబు మోళీ చేసేవాడు.. చుట్టూ జనం... జనంకోసం మద్దెలవాయిస్తూ హడావుడి చేస్తూ ఉంటాడు..అందులో దూరేవాళ్ళం.. డప్పుకొడుతూ కొడుతూ...ఏవేవో మాట్లాడేవాడు...కూర్చుని ఉన్నవార్ని చేతులు కట్టుకోవద్దనేవాడు.. మధ్యలో వెళ్ళకూడదనేవాడు.. వాడి మాట వినని వాళ్ళు నెత్తురు కక్కుకొని చస్తారనేవాడు.. అంటూ చెప్పు తీసి నేలమీద గట్టిగా అరుస్తూ కొట్టేవాడు.. మా ప్రక్కనున్నవాడు దఢేలు మని మధ్యలో పడిపోయేవాడు.. నోట్లోంచి రక్తం.. మాకు భయం.. వెళ్ళలేము. ఉండలేము.. ఏదేదో చేసేవాడు.. కొంచెం పెద్దయ్యేదాకా వాడు వాళ్ళ మనిషే అని, ఇదంతా గొప్పనాటకమని మాకు తెలిసేది కాదు...ఇంకో చోట వెయింగ్ మెషీన్.. అర్థణాకు బరువుచూసుకుంటే ఓ గిప్ట్ ప్యాకు ఇచ్చేవాడు.. దానికి చాలా న్యూస్ పేపర్లు చుట్టేవాడు.. దానిలో చాలా గొప్ప బహుమతి ఉందనేవాడు... విప్పగా, విప్పగా,విప్పగా... ఓ పిన్నీసో, చంపపిన్నో ఉండేది.. పెన్సిల్ ఉంటే గొప్ప ప్రైజు అన్నమాట.. మరో చోట సైకిలు స్టాండు వేయకుండా సైకిలుకి తమాషాగా జేర్లబడి, ఓ ఈవినింగ్ క్యాపు, చేతిలో ఓ పెన్సిలు హస్తసాముద్రికమనేవాడు. ఇంగ్లీషు,తెలుగు కదంబం మాట్లాడేవాడు.. మేం కాలేజీలోకి వచ్చాకకూడా ఇతగాడ్ని చూసేవాళ్ళం.. రాజమండ్రి చుట్టుపట్ల ఊళ్ళకు కూడా వెళ్ళేవాడట...ఇంకో ప్రక్క చిలకప్రశ్నలవాళ్ళు.. ఓ గొడుగు, రెండొమూడో చిలకలున్న ఒక పంజరం, ముందు కార్డులు, భూతద్దం... పెట్టుకుని వచ్చేపోయేవాళ్ళకి జాతకాలు చెప్పేవాడు.. ఎంతోమందికి జాతకంచెప్పినా అతని జాతకం మారలేదు.. చాల కాలం కనపడేవాడు.. ఇవన్నీ చూసుకుంటూ.. గోకవరం బస్టాండు డౌనులో ఉన్న పంజాబీ మిఠాయికొట్టులో ఓ అర్థణాకి వేయించిన శనగపప్పు కొనుక్కొని ఒక్కో బద్దే తింటూ ఇంటికి చేరేవారం.

1951 కి అటూ ఇటూగా రాజమండ్రిలో సైకిలు రిక్షాలు ప్రవేశించాయి.. అప్పటిదాకా లాగుడు రిక్షాలే.. మరీ మొదట్లో నే ఎక్కలేదుకాని నెమ్మదినెమ్మదిగా అలవాటుపడ్డాం.. అప్పుడు సైకిలురిక్షా డ్రైవరుకి లైసెన్స్ వుండేది.. ఆ లైసెన్స్ పెద్ద ఇత్తడి బిళ్ళపై ఇచ్చేవారు,..అది చేతికి కట్టేవాడు. పాత సినీమాల్లోఈ లైసెన్స్ ఉన్న రిక్షావాళ్ళను చూడొచ్చు...ఓ సారి మేం స్కూలునించి వస్తుంటే ఓ రిక్షా వేగంగా వచ్చి రోడ్డుమీదున్న ఓ లావుపాటాయన్ని గుద్దింది. ఆయనకేమీ అవలేదు కాని రిక్షా ముందుచక్రం వంకర్లు పోయింది.. ఆయన రిక్షావాలా చెయ్యి పట్టుకుని, లైసెన్స్ లాక్కుని ఆ ఇత్తడి బిళ్ళను గట్టిగా నొక్కాడు.. అది అప్పడంలా అయిపోయింది.. ఆయన ఆ రిక్షా అతన్ని గట్టిగా చివాట్లు పెట్టాడు..పిల్లలు స్కూళ్ళనుంచి వచ్చేటైములో ఆ స్పీడేమిటని. ఆ తమాషా మేం చాలా ఆసక్తిగా చూసాము... అమ్మకి వర్ణిస్తూ చెప్పాము.

ఆ తర్వాత సంవత్సరమనుకుంటాను.. రాజమండ్రిలో సిటీ బస్ చూసాను.. నెం.1 తర్వాత నెం.2 వచ్చాయి.. ముందు ట్రైల్ నెం.1 పేపరుమిల్లుదగ్గరనుండి గోదావరీ స్టేషన్ దాకా వేసారు..  తర్వాత అది సాగి ధవళేశ్వరం ఆనకట్ట దాకా పొడిగింపబడింది.. పేపరుమిల్లు దగ్గరనుండి గోదావరీ స్టేషనుకు అణాన్నర పుచ్చుకునేవారు.. సీతంపేట అంటే మాతర్వాత ఉన్న పేటనుంచయితే అణా మాత్రమే.. 
ఆ సిటీ బస్సుమీద మొదట్లో నేను చెప్పిన "గో.స్టేషన్ వహో రా.స్టేషన్ కరాఆ పవీబ్ర ధనకట్టా అని రాసిఉండేది.. అంటే  హాల్ట్స్ అన్నమాట. గోదావరి స్టేషన్, వరదరావు హోటల్, రాజమండ్రి స్టేషన్, కర్నల్ రాజుగారి ఆసుపత్రి, పప్పువీరన్న బ్రదర్స్, ధవళేశ్వరం ఆనకట్ట.." వీటికి అది క్లుప్తీకరణ టికట్టు పైన కూడా అలాగే ఉండేది. అలా చదవడం ఓ సరదా... మన సోషల్ రికార్డులో వర్షపాతం నెలవారి నమోదు ఎక్సర్ సైజులో "జఫిమా ఏమే జూజులై ఆసె అనడి"..అన్నట్టు.. (జనవరినుంచి నెలలు సరిపెట్టుకోండి..). 
రాజమండ్రిగురించి ఇంకా చెప్పాలని వుంది.. ఇది బోర్ కొట్టలేదని మీరంటే మరో సారి.. ఈసారికి శలవు.

7 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

అది నేను సైకిల్ కొనుక్కున్న కొత్త ! 22" సైకిల్! గోదావరి స్టేషన్నుంచి రాజమండ్రి స్టేషనుకు సైకిల్ మీద వెళ్ళి, అక్కడ నాకు తెలిసిన్ మెడికల్ షాపు దగ్గర సైకిల్ పెట్టి స్తేషన్లోకి చందమామ కోసం హిగ్గిన్బాదమ్స్ స్టాల్ కి వెళ్ళి మళ్ళీ యాదాలాపంగా టిక్కెట్టు కొనుక్కొని మరో రైల్లో గోదావరి స్టేషన్కు
వచ్చేశా ! రైలు దిగాక అప్పుడు గుర్తువచ్చింది నేనూ రాజమండ్రి స్టేషన్లో సైకిల్ వదిలొచ్చానని !ఈ సారి ఊసురోమని రిక్షా ఎక్కి రాజమండ్రి స్టేషన్ దగ్గరకు
వెళ్ళి నా తెలుగుదేశం తెచ్చుకున్నాను.

హనుమంత రావు said...

నా బ్లాగులోకి వచ్చి చూసారనుకుంటున్నాను. కాని పోస్ట్ మీకు రుచించలేదనుకుంటా... చందమామ, తెలుగుదేశం అన్నారు. bad luck, మీ అభిప్రాయానికి నోచుకోలేదు.

Krishna said...

రాజమండ్రి గురించి ఏం రాసినా అందంగానే ఉంటుంది. అందులోను నలుపు తెలుపు కాలపు ఙ్ఞ్యాపకాలు మరీ మరీ ఊరిస్తాయి. నేను యువకుడినే అయినా మీ కాలంలో ని సరదాలు విశేషాలు చుడనందుకు ఒకింత బాధ, ఆ సందడి సరదాలన్ని రుచి చూసినందుకు కొంచెం అసూయ కూడా ఉంది. ఏం చెయ్యమంటారు రాజమండ్రి అంటే నాకు మరీ మరీ ఇస్టం మరి.

రసజ్ఞ said...

బాగున్నాయి మన ఊరి ఊసులు! ఆర్యాపురం ఎప్పుడూ మునిగిపోవటం, జనాలు ఒక చోటునుండీ మరొక చోటుకి వెళ్ళడానికి ఇప్పటికీ తెప్పలు, పడవలు వాడటం భలే వింతగా అనిపిస్తుంది నాకు! ఎన్ని చెప్పినా చదవడానికి సిద్ధమే!

హనుమంత రావు said...

krsnaగారూ, మీ స్పందనకు కృతజ్ఞతలు. రాజమండ్రి అంటే మనకు ఇష్టమని నా జీవిత కాలంలో రాజమండ్రిని గురించి వ్రాయగలుగుతున్నాను, మీవంటివారు ప్రోత్సహిస్తున్నారు.. అసూయ వద్దండి. ఎందుకంటే అనుభవాలు, జ్ఞాపకాలు ప్రతి వారికి ఉంటాయి.నావి వ్రాసాను.. మీవి మీరు కూడా వ్రాయండి. ఆ వయస్సులోంచి మీ వయస్సువారిని చూసి ఆనందిస్తాము. సరేనా...
రసజ్ఞ గారూ మీ సంసిద్ధత నాకు చాలా ఉత్సాహాన్నిస్తున్నది.. ఇంకా వ్రాయలనే ఉంది.. త్వరలో మళ్ళా వ్రాస్తాను.. ఆర్యాపురం తుమ్మలావ ఇప్పుడు చాలా బెటర్.. ఇదివరకైతే ఊరి లోపల వర్షం.. బయటకి నీరు వెళ్ళాలంటే గోదావరిలో ఎక్కువనీరుంటే తలుపులు మూసుకుపోయి నీరు వెళ్ళేది కాదు.. ఇక
చూడండీ .. అప్పుడు పడిన బాధ ఇప్పుడు తలచుకుంటే భలేగుంటుంది.. బ్లాగోపయోగమవుతున్నది కదా.. మీ స్పందనకు కృతజ్ఞతలు...

Subramanya Shastry said...

నాది రాజమండ్రి కాదు; మీ జనరేషను అసలే కాదు. కానీ మీ టపా ఏ మాత్రం బోర్ కొట్టించలేదు. ఇట్టే చదివేశా! చాలా బాగుందండి...

Krishna said...

రాజమండ్రి మీద ఇష్టం కొద్ది కొంత కాలం క్రితం వచ్చి ఈ ఊరులో స్థిరపడ్డాం. నిజం చెప్పాలంటే ఊరు మొత్తం పెద్దగా తెలీదు. కాని తిరిగిన ప్రతీసారి ప్రతీది క్రొత్తగా భలేగా అనిపిస్తూ ఉంటుంది. నాకు వదిలి వెళ్ళాలనే ఉండదు కాని యే సెలవులకో వచ్చి వెళ్ళడం తప్ప. ఇప్పటికీ ఊరు సాంతం చూడనే లేదు. మా తల్లిదండ్రులు ఇప్పుడు రాజమండ్రిలోనే ఉంటున్నారు.