Pages

Saturday, September 21, 2013

హింది-తెలుగు హాస్య యుగళ,,,



రాజమండ్రిలో హింది-తెలుగు హాస్య యుగళ కవితా సమ్మేళనం.


నిన్న అంటే 20-9-2013 న రాజమండ్రీలో హిందీ,తెలుగు యుగళ హాస్య కవితా సమ్మేళనం జరిగింది.. చాలా బాగా జరిగింది. అక్కడ చాలా హాస్యం పండింది. హైదరాబాదు వాసులకు సుపరిచితులైన… నరేంద్రరాయ్ (చిత్రకారులు కూడా), వేణుగోపాల్ భట్టర్ , పండిట్ రామకృష్ణపాండే, వహీద్ పాషా ఖాద్రీ పాల్గొన్నారు.  ఇందులో భట్టార్ గార్కి
ఫేస్ బుక్ ఉందట.  అందులో వారు జోకులు పెడ్తూ ఉంటారట. స్థానికులైన కొందరు తెలుగు కవులు వారితో కలసి, హిందీ తెలుగు యుగళ హాస్య కవి సమ్మేళనం  జరిపారు. విని కొన్ని పాయింట్స్ లా వ్రాసుకుని కూర్చుకున్నా..వారి భావాన్ని, వారి భాషాసౌందర్యాన్ని పట్టుకునేటంత భాష నాకు రాదు. నాకొచ్చిన కొద్దిపాటి హిందీ పరిచయంతో అర్థంచేసుకునే ప్రయత్నం చేసా.. పట్టుకోగలిగిన పంచ్ కి రూపకల్పన చేసి హాస్యం ఆవిష్కరించబోయా.. ఇందులో  అంటె నేనందించే ప్రయత్నంలో చేసిన తప్పులు నావి .. హాస్యం వారు పండించిన తీరు అభినందనీయం.. ఆ జోకులు మీతో పంచుకోవాలని..

ఒక పిల్లికి ఎలుకల మంద ఒకటి కనపడింది. పిల్లికి అమితానందం అయిపోయింది. ఒక్కదాన్నైనా పట్టి విందు చేసుకోవాలని వాటి వెంట పడింది.పిల్లీ, అండ్ ఎలుకలు - టామ్ అండ్ జర్రీల్లా - పరుగెత్తాయి. అందులో వయోభారంతో ఒక ఎలుక వెనుకబడింది.. ప్రాణభయం ఎక్కువయింది. తెగించింది. వెనక్కి తిరిగి పిల్లిని చూసి కుక్కలా భౌ భౌ అని మొరిగింది.  నోటిదాకా వచ్చేసిన కూడు పట్టుకోబోతున్న పిల్లి ఖంగు తింది.. ఆగింది .. తటపటాయించింది.. వెనక్కి తిరిగి పరుగో పరుగు.. ఊహించని ఈ పరిణామానికి వృద్ధ మూషికానికి మతి పోయింది. పారిపోయిన మిగతా మూషికాలు వెనక్కి వచ్చి ఈ ముసలి ఎలుకను అభినందించాయి.. అప్పుడు ఆ వృద్ధ మూషికం …”ఇతర భాషలు నేర్చుకోవడం వలన ఆపదలనుండి గట్టెక్కొచ్చు.. తెలుసా”... అని పెద్ద కన్నంలోంచి కలుగులోకి పోయింది.

మారిపోతున్నాయి ఫేషన్లు. ఒక ఆధునిక యువతి జేబురుమాలు అంత సైజు చక్కని గుడ్డ తెచ్చి దర్జీకి ఇచ్చి జాకెట్ కుట్టమంది. ఆ దర్జీ అడిగాడు “అమ్మా మిగిలిని ముక్క ఏం చేయమంటారు “ అని…

నెమలి కన్ను నెత్తికెక్కినా శ్రీ కృష్ణుడు అందగాడే…

ఇదివరలో గడియారాలు లేవు.. అయినా మంచి పనులు చేయడానికి సమయముండేది..
ఇప్పుడు అందరికీ గడియారాలున్నాయి.. సమయం మాత్రం లేదు..

హాస్య కవులు ఒక పిచ్చాసుపత్రిలో కార్యక్రమం చేస్తున్నారు. కవి తన కవితలు  వినిపిస్తున్నాడు. వేదికమీదనున్న మరియొక కవి దగ్గరకొచ్చి ఒక పిచ్చాడు చెవి కొరికేస్తున్నాడు. ఏదో చెప్పేస్తున్నాడు. ఏమిటంటే.. “నేనూ చెప్పగలను.. కాని నన్నిక్కడ బంధించి లోపల పెట్టారు. వీణ్ణిలా బయటొదిలేసారు.”

ఒక బిజీ రోడ్. ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఆగమని రెడ్ సిగ్నల్ పడింది. ఒక యాచకుడు కారుదగ్గరికి వచ్చాడు. ముష్టి కోసమా కాదండీ బాబూ…  “ఒన్ డే మాచ్ స్కోర్ ఎంత” తెలుసుకోడానికి .. అది క్రికెట్ ఫీవర్.

ఎప్పుడూ టి.వి.కి అతుక్కుపోతున్న గృహిణి తో విసిగెత్తి భర్త టి.వి. అమ్మేస్తానన్నాడుట. అయితే నిన్నొదిలేస్తున్నానందావిడ.

కవి సమ్మేళనానికి బయల్దేరుతున్న ప్రేక్షకునికి ఒక సాధువు దర్శనమిచ్చాడు. ‘“అక్కడ చక్కగా తప్పట్లు కొట్టు.. అలా కొట్టలేకపోతే వచ్చే జన్మలో ప్రతి ఇంటిముందునుంచుని తప్పట్లు చరుస్తూ అడుక్కునే జన్మఎత్తాల్సి వస్తుంది.. చూసుకో” అని హెచ్చరించాడు. ఇక కొట్టక చస్తారా..

ఒక తెలుగు కవి చెప్పింది.. “హిందీవాళ్లకు ముందు చూపెక్కువ.. హిందిలో చదువుకు “శిక్ష” అంటారు. తరగతికి “కక్ష” అంటారు. ఇప్పుడు నిజంగా అదే జరుగుతోంది.”

“ఆ దరిద్రపు సీరియల్.. ఆ అమ్మాయికి కడుపొచ్చింది అని సంవత్సరమయింది చెప్పి. ఇప్పాటి దాకా పురుడు రాలేదు.. వింతకదా “ఒక బుల్లితెర ప్రేక్షకుని ఆవేదన.

“राज नीति तॊड्ती.. साहित्य जॊड्ती” … అంటే రాజకీయం తెంపుతుంది, సాహిత్యం కలుపుతుంది.

ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది. అందులో ఒక చిత్రకారుని చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ఆ చిత్రకారుని మిత్రుని చూడబోయాడు. కొన్ని చిత్రాలు అర్థంకావటంలేదు. అది మాడర్న్ఆర్ట్  అన్నాడు మిత్రుడు. ఒక చిత్రం చూపించి ఇదేమిటి. అని అడిగాడు ఈ అజ్ఞాని.
అది “సీతాపహరణం”.
ఇక్కడేమీ కనపడటం లేదు.. రాముడేడి ?”
“మాయ లేడిగా వచ్చిన మారీచుని వెనక వెళ్లాడు”
“లక్ష్మణుడేమయ్యాడు “
“అన్నగారి ఆర్తనాదం వినపడి వెతుక్కుంటూ పోయాడు.”
“మరి సీత”
“రావణాసురుడు ఎత్తుకుపోయాడు”
“రావణుడు కూడా కనపట్టంలేదు”
“”లంకకు పోయాడు”
“అయితే నువ్వు గీసిన చిత్రమేంటి. ఒక గీత గీసి రామాయణం అంతా అంటున్నావు.”
“ఆ గీత లక్ష్మణరేఖ అర్థం చేసుకో.. అదే మాడర్న్ఆర్ట్. “
ఆ ఆర్టిస్ట్ అంతర్జాతీయ ఖ్యాతి వహించిన చిత్రకారుడట.  

తమాషా ఏమిటంటే పాండే, భట్టర్ ఒకరినొకరు దెప్పిపొడుచుకున్నట్టు జోకులు పండించారు. చాలా బాగుంది.

ఒక విమాన ప్రయాణంలో భారతీయుని ప్రక్కన చైనా వాసి. దోమ చైనా వానిని కుట్టబోయింది. ఒక దెబ్బ కొట్టి చచ్చిన దోమని నోట్లో వేసుకున్నాడు. ఆ తర్వాత భారతీయుని పై వాలింది. అతన్ని కుట్టగానే…

ఇలా భట్టర్ చెప్పగానే పాండే “ఈయన మార్వాడీ అండి. అందుకని ఆ దోమను చంపి .. ఆ చైనా వానికి అమ్మేశాడు” అని కొస మెరుపు ఇచ్చాడు.

అనగానే భట్టర్ “ఒకసారి మిత్రుడు పాండే ముఖం మీద వాలిందండి ఒక దోమ. అది చూసి అతని భార్య లాగి లెంపకాయ కొట్టింది. ఉలిక్కి పడి ..
” ఎందుక్కొట్టావు” అన్నాడు..
“దోమ” అంది భార్య ..
” అయినా అంత గట్టిగా కొట్టవెందుకు “అన్నాడు పాండే..
“నే త్రాగావలసిన నెత్తురు మరొకరు త్రాగితే ఊరుకుంటానా మరి ?” అది ముక్తాయింపు.

దంపతులకు ఫస్ట్ నైట్.. అమ్మాయి తెల్ల చీర కట్టుకుని, తలనిండా పూలు తురుముకుని, వచ్చి కూర్చుంది,మల్లెలపరుపుపైన.. పెళ్లికొడుగ్గారు.. గ్లాక్సో పంచె కట్టుకుని విలాసంగా లోపలికి వచ్చాడు. తలుపు గడియ పెట్టాడు. మధుర క్షణాలకు తెరలేస్తోంది.. ఉత్కంఠ అమ్మాయి మదిలో.. సడన్ గా ఇద్దరు పిల్లగాళ్ళు మంచక్రిందనుంచి వచ్చారు. “కళ్యణరామ్ శోభనం .. కెమెరామాన్ రాంబాబుతో నారాయన్.. తమాషా టి.వి. అంటూ వస్తే టి.వి. ఉద్యోగి అయిన పెళ్లికొడుకు ఖంగు తిని.. వాళ్లను తరిమి కొట్టాడు.

హింది భాషా పదాలకు, డు, ము, ఉ లు జేరితే తెలుగైపోతుంది.. మేము మీ భాషకు అంత దగ్గర.”  అదీ హింది కవుల హృదయ వైశాల్యం.
మధ్యప్రదేశాది రాష్ట్రాలలో తెలుగు సెకండ్ లాంగ్వేజిగా ఉందని హిందీ కవులు చెప్పారు.

సాయంత్రం ఏడుగంటలకు ప్రారంభమైన కార్యక్రమం పదిన్నరవరకు నవ్వుల కోలాహలంగా సాగింది..



6 comments:

Anonymous said...

సాహిత్యం కలుపుతుంది. ... ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకుంటా మన రాష్ట్రంలో...! విరిచి విడగొట్టేదే సాహిత్యంగా చెలామణి అవుతోంది కదా. ఇది జోక్ కాదు.. ఆవేదన.

దేశంలో హిందీ తర్వాత రెండో పెద్ద భాష తెలుగు కాబట్టి హిందీ రాష్ట్రాల్లో తెలుగు రెండో భాషగా తెలుగే నేర్పించాలి. అంతే తప్ప దానిలో హిందీ భాషీయుల ఉదారత ఏమీ లేదని నా అనుమానం.

మీ మిత్రులు కేవలం హాస్యానికే అని ఉండవచ్చు... కానీ చాలా మంది ఔత్తరాహులకు తెలుగంటే చిన్నచూపే. హాస్యం పేరిట వ్యంగ్య అపహాస్యం చేసే వారే ఎక్కువమంది. అది ఇప్పటికీ బయటపడుతూనే ఉంటుంది.

వాళ్ళ తప్పు లేదు లెండి. మన భాష అంటే మనకే చిన్న చూపు, మనలో మనం కొట్టుకు చస్తూంటాం నా యాసని నువ్వు తిట్టావు, నీ యాసని నేను తిడతానూ అనుకుంటూ.

క్షమించండి... హాస్య వల్లరిలో కోపతాపాలు చూపినందుకు.

Vinjamuri Venkata Apparao said...

చాల చక్కని హశ్యం......

Vinjamuri Venkata Apparao said...

చాల చక్కని హశ్యం......

చందు తులసి said...

ఫణి సార్.....
కలుపుకుపోయే సాహిత్యమేదీ ఇప్పుడు రావడం లేదు కదా...అందుకే విడదీసే సాహిత్యం వస్తోంది.
రావు గారు. అద్భుతమైన జోక్ లు అందించారు. చాలా సంతోషమండి.

TVS SASTRY said...

Good humour.Keep it up!

హనుమంత రావు said...

ఫణిగారు, కోప తాపాలు కూడా అవసరమే.. అయినా మీ ఆవేదన అర్థం అయింది. చందుతులసిగారికి, వింజమూరివారికి, శాస్త్రిగారికి నా పోస్ట్ బాగుందని అభినందించినందుకు కృతజ్ఞతలు. సమాధానం ఈయటంలో జరిగిన జాప్యానికి మన్నించగోర్తాను.