Pages

Thursday, January 9, 2014

హరాజీకాలు - 2 - పంచి ఉండీ… ఊడీ




హరాజీకా - 1 (బాల వాక్కు) .. చదివి చాలామందే స్పందించారు. మీ స్పందన  అక్షరబద్ధం చేసి బ్లాగులోనే పోస్ట్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఇక ఇది  రెండోది. 2004లో హాసం క్లబ్ రాజమండ్రిలో ప్రారంభించి దిగ్విజయంగా చాలాకాలం నడిపాము. ఇప్పటికీ, “మరల హాసం క్లబ్ ఎప్పుడుంటుంది” అని అడుగుతూనే ఉన్నారు. ఇవ్వాళ కూడా ఎవరో ఆడిగారు.. ..ప్చ్..
అలా హాసం క్లబ్ సమావేశాలలో పుట్టినదీ జోకు..


హరాజీకా  .. 2
పంచి ఉండీ… ఊడీ


హాస్యం అనగానే ముళ్లపూడి వారి పేరు మనకు స్ఫురణకొస్తుంది. ఆయన ఒక చోట చెప్పారు. నాక్కాదండీ..  ఒక రచనలో చెప్పారు అని అర్థం. ఒరిజినల్ గా జోకులు కొద్దిగానే ఉన్నాయట. మనకు వినపడే జోకులన్నీ వాటికి  పొడిగింపులట.. దానికి ఉదాహరణగా :


రాము అలా వెళ్తుంటే సోము ఆడిగాడట..
“రామూ, రామూ! నువ్వు పరగడపున ఎన్ని ఇడ్లీలు తింటావురా” అని
“మూడు తింటానురా” అన్నాడుట రాము
“మొదట ఇడ్లీ కొరగ్గానే పరగడుపు పోతుంది. ఇక మూడు ఎలా తింటావురా” అని కిసుక్కున నవ్వేడట సోము.. .. నాలిక్కరచుకున్నాడు రాము.. నాలుక తెగిందా, రక్తం వచ్చిందా లేదా అదికాదు ప్రశ్న .. ఇక్కడికి జోకు నిజానికి అయిపోయిందికదా.. కాని కాదంటారు ముళ్లపూడి..  

దానికి కొనసా...........గింపు..

పై ఎపిసోడ్ లో ఉన్న జోకు బాధితుడు.. అంటే రాము, భీము దగ్గరకి వెళ్లి
“భీమూ, భీమూ.. నువ్వు పరగడపున ఎన్ని ఇడ్లీలు తింటావురా” అని అడిగాడు.
“అయిదు తింటానురా” అన్నాడు భీము.. గతుక్కుమన్నాడు రాము…
...క్కుమన్న రాము  “చంపావురా భీము.. నువ్వు మూడు అని ఉంటే భలే జోకు చెప్పేవాణ్ణిరా”అని చక్కాపోలేక ..   వెళ్ల లేక వెళ్లాడు..
రాము లాంటి వాడు ఇడ్లీ బదులు, పూరియో, చపాతియో చెప్పినా సోము చెప్పిన జోకు చెప్పలేకపోయేవాడు.. అది ప్రస్తుతం.. అప్రస్తుతం.  


ముళ్లపూడి వారి జోకు మీరు కాపోతే మరొకరు చెప్తారు.. దానికి ఇంత బిల్డప్ ఏంటి అనకండి.. ఇది కేవలం నేపథ్యం…
అప్పట్లో హాసం క్లబ్ జరిగేరోజుల్లో విషయం  ఇది.. మన వాళ్లు అంటే మీరేనండి, మీలాంటి హాస్యప్రియులు, హాసం క్లబ్ వేదిక మీదకు వచ్చి మంచి మంచి జోకులు చెప్పేవారు. వారిని వేదికమీదకు నేను పిలిచేవాడిని. అలా పిలిచేటప్పుడు
“మీకు తారసపడ్డ జోకు, మీరు వ్రాసిన జోకు ఏదైనా వచ్చి చెప్పవచ్చు” అనేవాణ్ణి..
“మాకు తెలిసిన జోకు చెప్పొచ్చా”
“చెప్పొచ్చు”
“పాతదైనా చెప్పొచ్చా?”
“పాతదైనా చెప్పొచ్చు”
“బాగా పాతదైనా చెప్పొచ్చా?”
“చెప్పొచ్చండీ బాబూ,, ఎలాంటి జోకైనా చెప్పొచ్చు. సభా మర్యాదకు భంగంకలుగకుండా, నవ్వు పుట్టించేది ఏదైనా చెప్పొచ్చు.. ఎటొచ్చీ పంచ్ ఉండాలి. పాతదైనా, కొత్తదైనా సరే చక్కని పంచ్ ఉండాలి.. చెప్పేటప్పుడు ఆ పంచ్ కనుక ఉంటే జోకు బాగా పేలుతుంది. అంచేత మంచి జోకులు పంచ్ తో చెప్పండి…” అని చెప్పడం కద్దు.
నా అభ్యర్ధనమేరకు మిత్రులు వచ్చి జోకులు చెప్పి వెళ్తూండేవారు.. నవ్వులు పండేవి.. ఒకసారి  ఒక కార్యక్రమం అయ్యాక, ఒకాయన వచ్చి
“నేను జోకు చెప్దామనుకున్నానండీ”అన్నాడు.
“అయ్యో చెప్పలేకపోయారా?”
“మీరు పంచి, పంచి అంటున్నారు.. నాది పాంటు మరి” అన్నాడు .. అది వేదిక జోకు కాకపోయినా.. వేడి జోకు కనుక  నవ్వులు పూయించింది..
హాసం క్లబ్ లో పురుడుపోసుకున్న ఆ జోకును మా అప్పారావుగారు (సురేఖ) తన "సురేఖార్టూన్స్" పుస్తకం అట్టమీద గీసారు కూడాను...


ముళ్లపూడి వారి ఫార్ములా ప్రకారం దీని కొనసాగింపు. మరొకసారి మా కార్యక్రమం జరుగుతోంది. ఓ పెద్దాయన
“నేనూ ఓ జోక్ చెప్తా”నన్నారు. సరే అన్నాం.

“ఇక్కడ జోక్ చెప్పే అధికారం నాకొక్కడికే ఉంది. ఎందుకంటే నాకొక్కడికే పంచుంది.  మిగతావన్నీ పాంటులే” అనగానే నవ్వులు విరబూసాయి..


     <<<<<<<<<<>>>>>>>>>>      


మళ్లీ హారాజీకా -3 లో కలుద్దాము.. హరాజీకా అంటే చెప్తానన్నాను కదూ.. తప్పక చెప్తానండీ..తర్వాత దాంట్లో..  

2 comments:

Anonymous said...

రాసింది తక్కువ అయినా ఎక్కువగానే. పంచుంది

TVS SASTRY said...

బాగుంది హనుమంతరావు గారూ!మీ హాస్యవల్లరిని కొనసాగించండి !!