ఈ సీరీస్ లో ఇది మూడవ కథ..
మళ్లీ మొదలెట్టావా అనకండి..అవి రెండూ బాగున్నాయన్నారు,
మరి అందుకని ‘మళ్లీ’.. మీరనలేదంటారా…
మీరనరాలేదేమో కాని….
ఏవండీ! మీరన్నారు కదా.. మరి చెప్పండాయనికి ..
సరే మన హజీకాలోకి వచ్చేద్దాం…
హరాజీకాలు -3
పేరులో ‘నేము’ న్నది
గోస్వామి తులసీదాస్ హిందిలో ‘శ్రీరామచరిత మానస్’ అనేపేరుపెట్టి రామచరిత్ర వ్రాసారు.. హిందీలో ఉన్న ఆ గ్రంధాన్ని నాన్నగారు తెలుగు వచనంలో వ్రాసారు. నాన్నగారు వ్రాసిన తెలుగు తులసీ రామాయణం వచనంలో ఇంచుమించు మొదటిది. అప్పటికి ముంగర శంకర రాజుగారు ఆంధ్రపత్రికలో అనుకుంటా సీరియల్ గా వ్రాస్తున్నారు. పద్య రూపంగా కొన్ని వచ్చాయనుకుంటా.. నాన్నగారు వ్రాసిన రామాయణాన్ని ప్రజలు బాగా ఆదరించారు. ఇప్పటికి మూడు ముద్రణలు పొందిన ఈ గ్రంథాన్ని 1962లో నాన్నగారు మొదటిసారి ముద్రింపించారు.
అప్పటికి నేను డిగ్రీ చదువుతున్నాను. ప్రెస్సు పనుల్లో ఎక్కువగా తిరిగే వాణ్ణి. అప్పట్లో ప్రింటింగ్ అంటే ఇంత తేలికకాదు. ప్రతి అక్షరం పేర్చుకోవాలి, ప్రూఫ్ లు తెచ్చుకోవాలి, నాన్నగారితో కలిసి దిద్దుకోడం .. దిద్దినవి ఇచ్చి కరెక్ట్ చేసాక మళ్లీ ప్రూఫ్, మళ్లీ మళ్లీ దిద్దడం , కరెక్ట్ చేయించడం. ఇలా ఒక ప్రూఫ్ కాదు.. వచ్చిన తప్పు మళ్లి రాకుండా మరో తప్పు మరో తప్పు అలా వస్తూనే ఉండేవి. అది కాక బొమ్మలేయాలంటే బ్లాకులు తయారు చేయించుకోవాలి. కర్ర చెక్కమీద, సీసం కరిగించి పోసి బ్లాకులు తయారు చేసేవారు. అవి తెచ్చి ఆర్ట్ పేపరు మీద ప్రింట్ చెయ్యాలి.. కలర్ బొమ్మ మేం మద్రాసులో చేయించాము.. ఆ సదుపాయం అప్పట్లో ఇక్కడ లేదనుకుంటా.. కలర్ బ్లాక్ అయితే ఒక బొమ్మకు రెండు, మూడు బ్లాకులుండేవి. అవి పెట్టి ఒక కలరుకోసారి అన్ని కాపీలు ప్రింట్ చేసి, రెండో కలర్ కు ఈ ప్రింట్ చేసిన పేపర్లమీద అలైన్ మెంట్ పోకుండా మళ్లీ ప్రింట్ చెయ్యాలి.. అప్పుడు పూర్తయ్యేది.
రాజమండ్రిలో లైన్ బ్లాకులు చేయడానికి కోటగుమ్మందగ్గర ‘గౌతమీ బ్లాక్ మేకింగ్ వర్క్స్’ చాలా ఫేమస్. వేంకటేశ్వరరావు గారు దాని ప్రొప్రైటర్ .. అక్కడ పనులు చేయడానికి ఒక పెద్దాయన గుమాస్తా ఉండేవారు. మా బ్లాకులు అక్కడే చేయించేవాళ్లం.. సకాలంలో బ్లాకులు రాలేదా .. మా పనైపోతుంది … అంటే మా పని ఆగిపోతుంది. ఒక ప్రక్క ప్రింటింగ్ అవుతుంటే ఈ బ్లాకులకోసం పురమాయించడం .. వాళ్ల వెంటబడ్డం, ఒక పట్టాన తయారయ్యేవి కావు. ‘రేపు రా’ - ‘మాపు రా’ అంటూనే ఉండేవారు. వెంటపడి పడి, లేచి…ఇలా వెళ్తున్న ప్రహసనంలో .. చాలా వాయిదాల ఎపిసోడ్ లు అయ్యాక .. ఓ ప్రైమ్ టైమ్ ఎపిసోడ్ లో…సాయంత్రవేళ.. బ్లాక్ మేకింగ్ వర్క్స్ కు వెళ్లి .. గుమాస్తాగారినడిగా..
‘అయ్యాయా..’
‘ఇంకా కాలేదండి’ గుమస్తాగారి జవాబు
‘ఏంటండీ.. సుబ్బారావుగారూ.. ఎప్పుడిస్తానన్నారు? అప్పుడే నెలదాటి పోయింది. మా పనులన్నీ దీనిమూలంగా ఆగిపోయాయి.’
‘ఏంచేయమంటారు.. వర్కర్సు రావటంలేదు’
‘సుబ్బారావుగారూ.. అలా అంటే నేన్నమ్మను.. నెల్లాళ్లనుంచీ అదే సమాధానంచెప్తున్నారు మీరు ’
‘నమ్మకపోతే మానేయండి.. మేం యేం చేస్తాం ?’ కొంచెం కోపంగా అన్నారా గుమాస్తాగారు..
‘అదేంటండీ అలా మాట్లాడుతారు… ‘
‘ఎలా మాట్టాడనండీ.. ఎలా మాట్టాడాను’ ఆవేశం ఎక్కువవుతోంది..
‘సుబ్బారావుగారు ! ఎందుకంత ఆవేశం.. పైగా తప్పు మీ దగ్గరెట్టుకుని.. నా మీద ఎగురుతారేమిటి?’
‘తప్పేంటండీ.. ఏంటి తప్పు’ కూర్చున్నానాయన కదిలిపోతున్నాడు.. కూర్చునే ..
‘సుబ్బారావుగారూ .. మీరు పెద్దవారు.. అంత ఆవేశం పనికిరాదు.. ‘
‘ఏంటి మాట్టాడుతున్నారు మీరు.. అసలు మీరు మాట్లాడేదేంటి..’ అదే టెంపో
అన్నీ విని ఇప్పుడిలా అంటాడేంటీయన అని
‘మా బ్లాకులు అయ్యాయా అని అడిగాను..దానికే మీరు ఎందుకంత ఆవేశ పడతారు సుబ్బారావుగారు అన్నా అంతేకదా? మీకు ఆవేశం మంచిది కాదు అన్నాను .. అంతేకదా సుబ్బారావుగారు ?’
‘అదే మరి.. అదే నేననేది.. మీరు మాదగ్గరికి వచ్చినప్పటినుంచీ చూస్తున్నాను.. ఎప్పుడూ అదే మాట..
అస్తమానూ నన్ను… నన్ను సుబ్బారావు, సుబ్బారావు అంటారేంటి.. .. నా పేరు సత్యనారాయణ అయితేనూ ‘…
బ్లాకులకు వెళ్లిన నా మైండ్ ఒక్కసారి బ్లాక్ అయిపోయింది.. నా ఆవేశం దిగిపోయింది..
ఓ వెల్గి నవ్వు ముఖం మీద వెర్రింది.. సారీ
ఓ వెర్రి నవ్వు ముఖం మీద వెల్గింది మసక వెలుగుతో....
------------------------------------------------------------------------------------------------------------------------
[ హరాజీకా అంటే ఏంటి ? మళ్లీ సారి తప్పక చెప్తాను..! ! !
నాలుగో హరాజీకా త్వరలో విడుదల...........]
4 comments:
మీ "హరాజీకా" చాలా బాగుందండి .మరీ సస్పెన్స్ లో వుంచకుండా త్వరగా హరాజికా అంటే మీ భావాన్ని చెప్పేయండి
mee haasya chathuratha ku naa hridayapoorvaka abhi nandanalu.please continue ur series.---dr divakar.
thank u Sastry jee,, i will certainly tell u what HARAJEEKAA means..u continue reading my series...and give ur valuable comments..
dear divakar gaaru, thank u for your compliments.. i will certainly write with encouragement of people like u.
పంచ్ కుళ్ళబొడిచేసింది!
Post a Comment