విరోధాభాసము.....ఒక అలంకారము. (రచన:దినవహి వేంకట హనుమంత రావు.
విరోధముగా నున్నట్లుగాన్పించి విరోధము లేకుండుట "విరోధాభాసము" అని నిఘంటువు
ఉదాహరణ: మిత్ర తేజోహారి యయ్యు నా రాజమిత్ర తేజో హారి యయ్యె.
మిత్ర తేజోహారి===సూర్యునివంటి తేజస్సుచే మనస్సు హరించువాడు.
అమిత్రతేజోహారి===శత్రువులతేజస్సునుహరించువాడు.
__________________________________________________________________________________________
భార్యా............భర్త.
ఆవిడకి కాల్గేట్ ఫ్రష్ ఆయనకి బినాకా కూల్.
ఆవిడకి యే కాలమైనా చన్నీటి స్నానం యిష్టం
ఆయనకి యెండాకాలమైనా వేణ్ణీళ్ళే కావాలి.
ఈవిడకి వయస్సు పెంచని సంతూర్ సబ్బు
ఎక్కడ ఆరోగ్యం వుందో అక్కడ ఈయన.
పాండ్స్ మేజిక్ ఆవిడకైతే కూటికురా ఈయనకిష్టం.
ఆవిడకి బ్రేక్ ఫాస్ట్ అక్కర లేదు
కాని చెయ్యడం పాపం తప్పదు
ఎందుకంటే ఈయనికి కావాలి కనుక.
న్యూస్ పేపరు ఈయనకి నల్లమందు
ఆ టైముకి లోకాభిరామాయణం
ఆయనతో ముచ్చటించటం ఆవిడకి ముద్దు.
వేసవి కాలంలోనైనా ఫ్రిజ్ లో నీళ్ళు పెట్టవోయ్ అంటాడాయన
ఏ కాలమైనా క్రొత్త కుండ నీళ్ళు మంచిదంటుందావిడ.
ఆవిడకి స్వీటిష్టం.......ఆయనికి మిర్చి బజ్జీ ప్రాణం.
భోజనంలో కూర కంపల్సరీ ఆవిడకి
పచ్చడి లేకపోతే ముద్ద దిగదీయనికి.
చిరుపులుపు మజ్జిగ యిష్టం ఆయనికి
పులుపంటే గిట్టదావిడకి.
మధ్యాహ్నం ఓ చిన్న కునుకు...లేచాక ఓ స్ట్రాంగు టీ
ఆ రిటైర్డ్ ప్రాణి కావాలంటాడు పాపం
ఎంత టైరయినా ఆవిడకి కునుకూ అక్కర్లేదు .... టీ కూడా అక్కర్లేదు.
ఖర్చులు హమేషా లెక్కలు పెట్తూ వుంటాడీయన
నెల ఫించను...నెల బజెట్ కు సరిపెట్టాలి కనుక
అస్తమానూ లెక్కలంటారేమిటి...కక్కుర్తి బుద్ధి అంటుందావిడ.
బెడ్ రూమ్ లైటు వద్దంటుందావిడ నిద్ర పోయేటప్పుడు
అమ్మో అది లేకపోతే పీడకలలంటాడీయన.
సౌండ్ స్లీప్....నిశ్శబ్దంగా పడుకోవాలంటుందావిడ
సౌండ్ లేకుండా స్లీపెలాగం టాడీయన.
అటుదిటూ యిటుదటూ అయినా
యింటింటా యిది నిత్యమూ...సత్యమూ...
తెలుగు గ్రామరుకే కాదు...సంసారంలో గ్లామరుకి కూడా ..
విరోధాభాసం ఒక అలంకారము.....కాదంటారా???