పెసరట్టు పై కందట్టు
పన్నాల భట్టుగారూ
ఎన్నాళ్ళకు పెట్టినారు ఈ మీ స్పెషరట్
తిన్నట్టి ముళ్ళపూడి-క
తిన్న-ట్టును మరచిపోడు ఎన్నేళ్ళయినా.
ఇందులో పన్నాల భట్టుగారెవరు?
శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, నేనూ కళాశాల చదువులనుంచి స్నేహితులము.
శ్రీ భట్టు--ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో వుద్యోగించి...ప్రస్తుతము
విశ్రాంతజీవనం... కనకదుర్గమ్మ క్షేత్రంలో గడుపుతున్నారు. ఎప్పుడూ
నవ్వుతూ మాట్లాడే ఆయన సంభాషణలలో హాస్యం తొణికిసలాడుతూ
వుంటుంది. అందుకే భట్టు అంటే నా కిష్టం. 1974 ప్రాంతంలో ఆకాశవాణి
విజయవాడ కేంద్రంనుండి రేడియో కార్ట్యూన్స్...చెళుకులు అని ఓ కార్యక్రమం
వచ్చేది. హాస్యం, వ్యంగ్యం జోడించి వచ్చే ఈ చిట్టి చిట్టి శ్రవ్య రూపకాలు
శ్రోతజనరంజకంగావుండేవి. ఆ శ్రవ్యరూపక రచయితలలో శ్రీ భట్టు ఒకరు.
వీరి ఆ రచనలను కొన్నింటిని ఏప్రిల్, 1975లో నవోదయ పబ్లిషర్స్,
విజయవాడ వారు పుస్తకరూపంలో తీసుకువచ్చారు. 'భలే చౌక టోకు
బేరము' అంటూ మంచి ముఖచిత్రం....బాపూ గారి గీత. అదిగో ఆ పుస్తకము
లోనిదే ఈ క్రింద కనపడే 'చౌకరాజ్యం'....ఇది వ్రాసింది భట్టు...వుంటుంది విట్టు...
నిజం ఒట్టు.
సరే పై పజ్జెం యేమిటట స్పెషరట్టూ కందట్టూ అంటూ?
ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చి మీరు ఆడే వుంటారు......అదేనండీ..
చదివే వుంటారు....అందులో తరచు కనపడిన భట్టుగారునున్నూ...
నేను ఇప్పటిదాకా మీ దివ్యచిత్తమునకు నివేదించుకున్న
భట్టుగారునున్నూ ఒకటే. ఆ సదరు శ్రీభట్టుగారు శ్రీముళ్ళపూడివారికి -
శ్రీ పెసరట్టును స్వయంగా, యే మాయింటివంట
కార్యక్రమములు చూడకుండా చేసి, వేసి, పెట్టి ఆనందింపజేసారు. తిన్న
రమణగార్కి ... చిన్న 'కంద'ట్టు తన్నుకొచ్చింది. అదే బ్లాగు మొదట
గ్లామరుగా పెట్టినది....భట్టుగారి అట్టు తిని (శ్రీ రమణ)పలికిన మరో ఆటవెలది:::
పొట్టు పప్పు రుబ్బి మిర్చి గిర్చీ చేర్చి
భక్తి శ్రద్ధ కలిపి పోయునట్టి
భట్టుగారి అట్టు బహుగొప్ప హిట్టురా
విశ్వదాభిరామ వినుమ రమణ
శ్రీ రమణ వ్రాసిన ఆ కందట్టుకి బాపూగారు బొమ్మగీసారు
ఆ బాపుగారి అందం మీద రమణగారి కందం..లామినేషన్
చేయబడిన చందం...భట్టుగారింట అలంకరింపబడింది.
ఇక చౌకరాజ్యం...కానీ
మళ్ళీ కానీ అర్థణా అంటూ ఆ నసుగుడేమిటండీ?
ఇంత రచనకు కారకుడిగా, ఈ బ్లాగు
ఓనరుగా, నా కోటాలో ఓ చిన్న.......చెప్పను....చూడండి.
పెనం మీద 'పెసరట్టు'
రమణ 'పూరి'oచిన కందట్టు
వేసిన బొమ్మ బాపూ'గారి'కేతట్టు
ఇదంతా ఎక్కడ.... భట్టుగారి వీట్టు
ఏ'దోస'రదాకి నే పట్టిన ఓ పట్టు
వీట్టు అంటే ఇల్లు....అరవం...తెలుసుకదా
అరవం.....అంటే...భాష...మళ్ళీ తెలుసుకదా.
టట్టటాం.....చౌక రాజ్యం....భట్టు స్కిట్టు.
(దేశకాలపరిస్థితులను దృష్టిలో వుంచుకొని విజ్యులైజ్ చేయండి.)
వెంకట్రావు :: అబ్బాయ్! అన్ని రాజ్యాలు చిన్న..పెద్ద ఏకమవుతే
కాని మన దరిద్రం తీరదురా..
శంకరం:: రోడ్డుమీద ఎందుకు బాబూ! ఈ కబుర్లు ? పాతిక
సంవత్సరాలు ఐక్యరాజ్యసమితిలో పనిచేసావు.
ధరల నిలకడ సంఘం నిపుణిగా వున్నవు. ఒక్క
పని చేయగలిగావా? చౌకరాజ్యం తేవడమే
ధ్యేయమన్నావు కుదిరిందా?
వెంక:: ప్రచ్ఛన్నయుద్ధంవచ్చి మా పథకాలని పాడు చేసిందిరా శంకరం...
అయినా వుప్పు ధరని అదుపులో పెట్టింది
మేము. గాలిని అమ్మే ప్రయత్నాలను వమ్ము చేసింది
మేము.
శంక:: ఊఁ..ప్రస్తుతం ధరలని అరికట్టలేం...ఎందుకు వచ్చిందిలే
బాబూ...ఇదంతానూ?
వెంక:: ఆఁ అలా అనకు శంకరం! పెద్దా చిన్నా దేశాలు కలిస్తే
ధరలు పడిపోతాయి. కట్ట చుట్టలు పైసా...వంద పెసరట్లు
రెండు పైసలు. నా కళ్ళలో చూడు నువ్వు..
శంక:: విదేశీ సుందరులు కనపడతాయా...వెంకట్రావుబావా?
వెం:: మహా సంక్షేమరాజ్యం కనబడుతుంది. కారు చౌకరాజ్యం
కనబడుతుంది. నేను కలలుకన్న రాజ్యం. అతిచౌకరాజ్యం
కనబడుతుంది చూడు. చూడు నా కళ్ళతో చూడు.
(చూస్తున్నట్లు దృశ్యం.)
దండోరా::: రండిసార్ రండి కొనండి. మంచి దుస్తులు సార్ !
మంచి మంచి వస్త్రాలు సార్ ! మీటరు క్లాతు రెండు పైసలు.
ఓన్లీ టు పైసే. ఫారిన్ నైలక్స్ చీర అర్థరూపాయి. పిల్లల
డ్రాయర్లు వంద మూడు పైసలు. పది జేబురుమాళ్ళూ ఒక్క
పావలా సార్ ! ట్వినుఫూల్సు వెడ్డింగు సూటింగ్ మీటరు
పదిపైసలు సార్ ! ఓన్లీ పదిపైసలు సార్ ! బెనారస్ పట్టుచీర
ఒకేఒక్క రూపాయి.....ఇంకా ఆరణి పావలా...ధర్మవరమ్ దస్
పైసా......అమ్మా ! రండి ... అయ్యా ! రండి. కారు చౌక ... కారు
చౌక........
(కారు స్పీడు తగ్గి ఆగుతుంది)
శంకరం: ఒరేయ్ అచ్యుతం..ఆరు రూపాయలు తగలేసి ఈ పెయ్యమూతి
చిన్నకారు కొనేకంటే పదిరూపాయలు తగలేసి పందిమూతి
కారు కొంటే బాగుంటుందికదరా.?
అచ్యుతం:: ఇంకా ధరలు తగ్గుతాయిరా....ఆ పెద్దకారు మూడురూపాయలకే
వస్తుందట. అదిసరేకాని ముందు ఈ రెండుపైసలు పెట్టి రెండు
బాల్కనీ టిక్కట్లు కొను.
ప్యూన్:: సార్! బియ్యం నాలుగు బస్తాలు ఇంటిదగ్గర వేయించాను సార్!
నాలుగు రూపాయలు అయింది. అర్థరూపాయి పెట్టి బస్తా పంచదార
కొన్నానండి. అయిదు పైసలు పెట్టి ఇరవై కేజీల కాఫీగుండ
కొన్నానండి. పదిపైసలు పెట్టి వెయ్యి బత్తాయిలు కొన్నాను సార్!
అచ్యుతం:: మిగిలిన ఇరవై పైసలు బ్యాంకులో వెయ్యి. నువ్వు పో....
ఆనందం:: హల్లో అచ్యుతం..ఇల్లు కొన్నావటగా? ఎంతయింది.
అచ్యుతం:: అవును ఆనందం...గవర్నర్ పేటలో ఒక మేడ కొన్నాను. వంద
రూపాయలు. రెండువేల గజాల స్థలం. మేము వుండగా రెండు
రూపాయలు వస్తుందనుకో.
ఆనందం:: అబ్బా..అంత పెద్దదా?
అచ్యుతం:: ఆఁ సరేకాని మీ అమ్మాయి పెళ్ళి
కుదిరిందటగా. ఎంత కట్నం?
ఆనందం:: అవును బ్రదర్..కుర్రాడు డాక్టరు.పది రూపాయలు కట్నం.
ఆఁ కొంచెం యెక్కువే అనుకో. పై ఖర్చులు మరో అయిదు
రూపాయలు వేసుకొంటే నీ ధర్మమా అని గట్టెక్కి పోతము.
అచ్యుతం:: మంచివాడవే..ఆఁ అవునుకానీ...ఈ బొమ్మ యెలా వుందంటావు.
ఆనందం:: పిక్చర్ కలర్ లో తీసారు. అంతా కలిపి రెండు వేలయిందట.
బంపర్ కలక్షన్. రోజుకి పద్దెనిమిది రూపాయలు. హౌస్ ఫుల్.ఆఁ..
(కల అయిపోయిన ధ్వనులు)
వెంక:: నాలోకం అంత కారు చౌకగా వుంటుంది. ఆఁ ఎండ ఎక్కువగా
వుంది గొంతు తడారిపోయింది. కాస్త బత్తాయి రసం త్రాగుదాం.
ఆ కొట్టుకు పద...
శంక:: పదమరి....
వెంక:: రెండుగ్లాసులు బత్తాయి రసం ఇయ్యి నాయనా!
కొట్టువాడు: మూడురూపాయలు సార్ !
శం:: అదేమిటయ్యా?
కొ.వా:: బత్తాయిలు దొరకటంలేదండీ
వెంక:: అయితే రెండు కూల్ డ్రింకులీయి పోనీ..
కొ.వా:: అయిదు రూపాయలు సార్
శం:: ఏమిటయ్యా
వెంక:: పోనీ గ్లాసెడు మంచినీళ్ళియ్యి.
కొ.వా. దొరకవండి...పొరుగువారికి ఎగుమతి చేయాలని
వాడకం ఆపేసారండి.
-----ooooOOOoooo-----
నీతి: {నాకు తోచినది:} నిన్న అయినా, నేడయినా, రేపు అయినా;
అక్కడయినా, ఇక్కడయినా, మరెక్కడయినా
అప్పుడయినా, ఇప్పుడయినా, మరెప్పుడయినా
మనందరికీ ధరలు ప్రి య ము.
------