Pages

Saturday, October 9, 2010

దసరా కదండీ

శరదృతువు. ప్రకృతిలో ఓ పులకరింత. వసంతంలో పల్లవించిన జగత్తు, గ్రీష్మంలో తపించి, వర్షర్తువు ప్రభావంతో జలదరించి, శరత్తులో పులకరిస్తుంది. నిన్నటిదాకా వరదల బురదతో నిండిన జలాశయములలోని నీరు విరిగి, తేటపడి, స్వచ్ఛమై, స్వాదు జలాలతో ఆహ్లాదం కలిగించే ఋతువీ శరదృతువు. అంతా నిర్మలమే. నిర్మలమైన నీలి ఆకాశం. పిండి ఆరబోసినట్లు తెల్లని శరత్కాలపు సిరి వెన్నెల. వికసించిన పూల సౌరభాలు. ఏదో తెలియని ఆనందంతో పులకరించిపోయే నిండు మనస్సుతో శరదృతువుకు స్వాగతమందాము.
నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్వని. అది పూర్ణిమతో కూడిన మాసం ఆశ్వీయుజం. ఆ కారణంచేత ఈ పాడ్యమితోనే సంవత్సరారంభమనే ఆచారముంది. మాసాలలో మొదటిది చైత్రము కనుక చై.శు.పాడ్యమి సంవత్సరాది అనడం కూడా మనకు తెలుసు. అప్పుడు వసంత నవరాత్రులు, యిప్పుడు శరన్నవరాత్రులు జరపడం సాంప్రదాయంగా వస్తున్నది. పంచభూతాత్మికమైన ప్రకృతితో - పంచభూత తత్త్వాలతో కూడిన మన ఈ శరీరాన్ని సరిపోల్చుకుంటూ - ప్రకృతినే పరమాత్మగా ఆరాధించడం మన హైందవ సాంప్రదాయం. అవే యీ నవరాత్రి సంబరాలు. ఆశ్వీయుజం, కార్తీకం - ఈ రెండూ మనకు పవిత్రమైనవే.

దసరాలో అమ్మను పూజిస్తాము. దసరా అనడంలోనే ఒక సరదా. పట్టు పరికిణీలతో, విరిసిన పూలతో చక్కగా సింగారించిన వాలుజడలతో ఘల్లు ఘల్లుమంటూ మువ్వల సవ్వడితో తిరిగే బాలా స్వరూపిణిగా.... పసుపుపారాణితో, రంగురంగుల గాజులతో శోభించే కోమల హస్తాలతో, చంద్రుని బోలు నిండు మోము పై యెర్రని కుంకుమ బొట్టుతో, కురుల విరులు అలంకరించి మందగమనంతో నిండుముత్తైదువగా శోభించే సువాసినీ రూపంగా ..... మంజీరధ్వనులు వేదధ్వనులు తలపిస్తుండగా భవునితో కూడి ఆనందంగా నడయాడే భవాని......అంతటా దర్శనమిస్తుంది.

మునుపటి రోజులలో .. దసరా అంటే పిల్లలకి గొప్ప సరదా. వేడినీళ్ళ పొయ్యిలు,,,, వాటి చుట్టూచేరి వేడి నీళ్ళకోసం అక్క చెల్లెళ్ళతో అన్నదమ్ములతో పోటీపడుతూ చేసే తలంటుస్నానాలు,పండుగనాటికి నాన్న కొన్న క్రొత్తబట్టలు, అమ్మచేతి కమ్మటి భోజనాలు,.....ఇవి యిప్పుడులేవా అంటే వున్నాయి... గీజరు నొక్కితే వేడి నీళ్ళు, బాత్రూములలో షాంపూలతో మూగ స్నానాలు. క్రొత్త బట్టలు యిప్పుడు నిత్యం. అంచేత ఆ ఆనందం క్షణికమే....బర్గర్లూ,పిజ్జాల కమ్మతనంఅలవాటుపడ్డాక అమ్మతనం యెంతమందికి కావాలి? ఇప్పటివారు యిదిఆనందదాయకమే అనవచ్చు.....కాని పండుగ ప్రత్యేకత లేదేమో అని మా భావన....అయ్యో! మన అభిమాన హీరో హీరోయిన్లు బుల్లితెర పై చెప్తారుగా పండగల గురించి ముద్దు ముద్దు మాటలతో...వారి మాటాలే మనకి విఙ్ఞాన సర్వస్వం....కదా?

అప్పట్లో రేడియోలో ...'శారద రాత్రులు వచ్చాయి-పండు వెన్నెలలు తెచ్చాయి' అంటూ ఓ పాట వచ్చేది.(నాకు పాట సరిగా గుర్తు లేదు). అందులోనే 'అట్లతద్దోయ్...ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్...పిల్లల్లారా,జెల్లల్లారా! లేచిరండోయ్ !'....అట్లతద్ది అనగానే మా బాబాయి గారి పిల్లలూ, మేమూ, పేటలో పిల్లలూ అంతా తెల్లారగట్టే లేవడం... మా పిన్ని గోంగూర పచ్చడి+పేరిననెయ్యి, నూపొడి, వుల్లిపాయ పులుసు, గడ్డపెరుగు వేసి చద్దన్నాలు పెడ్తే లాగించేసి.....పుచ్చపూవులాంటి వెన్నెలలో తెల్లారేదాకా ఆటలే. కొంచెం వయస్సువచ్చిన మగ పిల్లలు చిలిపి అల్లర్లు చేసేవారు. సెలూన్ బోర్డు లాయరు గారింటికి...డాక్టర్ గారి బోర్డ్ లాండ్రీ షాపుకీ ,,, అలా. ఆ వెన్నెలలో ఆ ప్రకృతి మాత ఒడిలో ఆ ఆనందానుభవం ప్చ్! అమ్మఒడి ఒక రక్షణ...ఓ భద్రత....ఈ కాంక్రీట్ జంగిల్లో ఆకాసమే కనుమరుగై పోయింది. చూడాలంటే ప్లానిటోరియంకు వెళ్ళాలి. తారలతో నిండిన ఆకాశం చెప్పేపాఠాలు...పండువెన్నెలలు పలికించే కవితావేశాలు...మనసును రసప్లావితం చేసే పిల్లతెమ్మెరలు...యే కోనసీమల్లోనో....యేకొబ్బరిఆకుల చాటునో...యే పంటకాలువల నీటి తరగల్లోనో....యింకా వున్నయేమో...ప్రగతిగా భావించే నాగరికతల ప్రభావం ఆ పల్లెలలోపడనంతకాలం రసహృదయాలు స్పందిస్తూనేవుంటాయి.

జయీ భవ! దిగ్విజయీ భవ...అంటూ...విల్లంబులు ధరించి.... ఆ బాణాలలో పూవులు పెట్టి...యింటింటికీ మేష్టరుగారి సారధ్యంలో వెళ్ళి దసరా పద్యాలు పాడి అక్కడ తలిదండ్రుల మీద పూలు జల్లి బహుమానాలు తెచ్చుకొనే సరదాలు చరిత్రలో కలసిపోయాయి...."దసరాకు వస్తిమని రుసరుసలు పడక..బహుమానముల నిచ్చి పంపండి వేగా..." అని "యేదయా మీ దయా మా మీద లేదూ...పావలా యిస్తే పట్టేది లేదు, అర్థరూపాయి అయితేను అంటేది లేదు" అని కండిషను పెట్టి "అయ్యవారలకు చాలు అయిదు వరహాలు..పిల్లవారికి చాలు పప్పుబెల్లాలు." అంటూ గురువుగారి పట్లగల భక్తి ప్రపత్తులనీ, తమ నిర్మలప్రేమనూ వ్యక్త పరుస్తారు. అలాంటి దసరా పద్యాలు యిప్పుడు కనుమరుగై పోయాయి.కార్పరేట్ స్కూల్స్....ఎ.సి.బస్సులు....ఎ.సి.క్లాసులు....అంతా క్లాస్....
గతం కొద్దో గొప్పో చూసాము కనుక మారే కాలంలో వున్నాము కనుక ఏదో వ్రాయడం....మార్పు అనివార్యం. ఏదీ తప్పుకాదు. యాంత్రికజీవనంలో మమతానురాగాలు దూరమై పోతున్నాయేమో అని ఆవేదన. అయితే ఆలోచించేవాళ్ళను కోరేది ఒకటే మనదైన సంస్కృతిని రాబోవుతరాలకు అందీయవలసిన పవిత్రబాధ్యతను మరచిపోకండి. మనవంతు కృషి మనం చేద్దాం.
దసరా పండుగ శుభాకాంక్షలు ....
మీకూ మీ కుటుంబములోని వారికీ.
............ది న వ హి

2 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

మహాశయా బహుకాల దర్శనం. ఎక్కడికి వెళ్ళారు.
చాలా బాగా చెప్పారు. పాతకాలపు మధుర స్మృతులు. అట్లతద్ది, ఉండ్రాళ్ళతద్ది మేంచేసిన అల్లరి అన్నీ గుర్తుకు వచ్చాయి.మాఊరి తోటలో ఆడ పిల్లలు ఆటలాడుకుంటూంటే, మాలాంటి అల్లరి పిల్లలు అడ్డురాకుండా పెద్దవాళ్ళు కాపలా కాసేవారు. అయినా వాళ్ళ కళ్ళు కప్పి మధ్యలో దూరి అల్లరి చేసి తిట్లు తినేవారం.వాహ్ మళ్ళీ తిరిగి రావు. థాంక్స్ ఫర్ ఎ నైస్ పోస్ట్.

హనుమంత రావు said...

ప్రియమైన మిత్రులు శ్రీ సుబ్రహ్మణ్యం గారికి,
ప్రణామములు. నా క్రొత్త పోస్ట్ కి మీ స్పందన. "మహాశయా బహుకాల దర్శనం" అనిచదవగానే ఏదో ఆత్మీయత ఎక్కడో స్పృశించింది.నిజమే! ఈ మధ్య ఓ నెలరోజులు.....అలా అలా భాగ్యనగరమూ అక్కడనుంచి కాశీనగరమూ చూసి పూరీ జగన్నాధుడిని చూసి క్రితం నెల చివరిలో స్వగృహప్రవేశం చేసా...అందులో విశేషం లేదు కాని వచ్చాక జ్వర పడ్డా...దాని పర్యవసానంగా శరీరంలో పంచదార పంట సూచనలు గోచరమయ్యాయి..నీరసమధికమయి ఔషధసేవనంతో కొంచం తెప్పరిలి మరల మీబోంట్లతో యిదిగో యిలాగ పలకరింపులు...ఎక్కువ వ్రాసానేమో...కారణం మీ మనసు పలకరింపే..."దసరాకదండీ" మీ సరదాలరోజులు గుర్తు చేసిందంటే చాలా ఆనందమయింది.....త్వరలో మరల కలుస్తా...ఈ లోగా మీ బ్లాగులోకి వెళ్తా...శలవు...................దినవహి