Pages

Monday, May 30, 2011

కుడి కాలు ముందు పెట్టకే ........


దసరాకు హైదరాబాదు వచ్చాడు....ప్రసాదరావు. పేరు పూర్తిగా చెప్పకపోతే ప్రసాదరావుకు చాలా కోపం వస్తుంది. ఎంచేతనంటే బామ్మ స్వయంగా రికమెండు చేసి ప్రసాదరావు వాళ్ల నాన్నచేత పేరు పెట్టించింది. పూర్తి పేరు ఏమిటంటే సత్య వేంకట సూర్య మల్లిఖార్జున వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాద రావు. ఇందులో బామ్మ దర్శించిన పుణ్యక్షేత్రాలలో వేంచేసివున్న ముక్కోటి దేవతల పేర్లూ..అన్నీ కాకపోయినా కొంతవఱకైనా వున్నాయి అంటే అలా పొందుపఱచిన ఘనత బామ్మకే దక్కుతుంది. అంతేకాదు..శ్రీ వెంకటప్పయ్యగారు కూడ కొంతవఱకు చోటు చేసుకున్నారు. శ్రీ వెంకటప్పయ్యగారంటే గం.భా..బామ్మగారి పెనిమిటి. శ్రీ వారు మనకిప్పుడు లేరు. ఆయన పూర్తిపేరు పెట్టలేదన్న విషయంలో మాత్రం బామ్మకు కొంచెం అసంతృప్తి వుంది.

బామ్మగారంటే ప్రసాదరావుకు బాగా గురి. ఎంచేతనంటే చిన్నప్పటి నుంచి ఆమె పెంపకంలోనే పెరిగాడు..అలా అని ఆవిడ ఏమీ తేడాగా పెంచలేదు. బి. వఱకు చదువుకున్నాడు. ఎటొచ్చీ శకునంచూస్తేకాని క్షవరం చేయించుకుందుకుకూడా ప్రసాదరావుని పంపేది కాదు బామ్మ. బామ్మకు రొంపపట్టినప్పుడు మాత్రం ప్రసాదరావుకు కాలేజీకి వెళ్లడం చాలా కష్టమయ్యేది. వాల్తేరునుంచి విజయవాడదాకా ఆగని కోరమాండల్ ఎక్స్ ప్రెస్సులాగా అడ్డూ ఆపూ లేకుండా అరగంటవఱకు తుమ్ముతూ ఉండడం బామ్మ స్పెషాలిటీ..బామ్మని కాదని వెళ్లినా ఫర్వాలేదుకాని ఆమె తుమ్మునీ, ప్రభావాన్ని కాదని వెళ్లడం ఇష్టంలేని పని ప్రసాదరావుకి. ప్రసాదరావు కాలేజీకివెళ్తున్నప్పుడుకాని, మాటకొస్తే మఱెప్పుడైనా సరే...ఎవరైనా "ఎక్కడికి ?" అని అడిగారంటే ఇంతే సంగతులు....ప్రసాదరావైతే మామూలుగానే ఆగిపోతాడు కాని అలా అడిగిన సదరు వ్యక్తి బామ్మగారి ధాటికి రెండుమూడు రోజులుదాకా నిద్రలో కూడా ఉలిక్కిపడి లేవాల్సిందే...

పరీక్షల్లో మాత్రం ప్రసాదరావు చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు.. ముందరి రోజునుంచి బామ్మను కాకా పట్టేవాడు..అందుబాటులో విక్స్ ఇన్హేలర్ ఒకటి బామ్మకోసంఉంచేవాడు, అత్యవసర పరిస్థితినుంచి కాపాడ్డానికి. బామ్మకూడా ముందఱిరోజే బిందె నిండా నీళ్లు పట్టి ఉంచేది. నీళ్లబిందె తీసుకుని కోడలు (అంటే ప్రసాదరావు వాళ్ల అమ్మ) ప్రసాదరావుకి ఎదురు వచ్చేది.. అప్పుడు ప్రసాదరావు, బామ్మ చెప్పినట్టు కుడికాలు ముందు పెట్టి, ఠీవీగా పరీక్షలకు వెళ్లేవాడు. మఱీ కాలేజీకి ఫస్టు అవీ వచ్చేయలేదుకాని మంచి మార్కులతోనే బి. పాసయ్యాడు...

మఱీ బామ్మ వెనకాల తిరిగే కూచి ప్రసాదరావు అనుకుంటున్నారా ? చాలా పొరపాటండి...బాల్ బ్యాట్ మెంట్ లో రైటుఫ్రంట్ బాగా ఆడ్తాడు... ఎటొచ్చీ బంతి కొట్టేటప్పుడు ముందర ఆంజనేయుణ్ణి తర్వాత
బామ్మను తలచుకున్నాకనే బంతికొడ్తాడు... బ్యాట్ మెంట్ కోర్టులోకి వెళ్లేటప్పుడు ముందు కుడి కాలు పెట్టడం తప్పనిసరి..అన్ని రకాల పుస్తకాలు చదువుతాడు...అందఱితోనూ చక్కగా మాట్లాడతాడు... ఎవరైనా తుమ్మితే మాత్రం అసంకల్ప ప్రతీకార చర్యలాగా కాసేపు ఆగిపోతాడు...తర్వాత మళ్లీ పుంజుకుంటాడు....

దసరాకు రైల్లో హైదరాబాదు వచ్చేటప్పుడు పరుగెడ్తున్న రైల్లోకూడా గుమ్మం దగ్గఱ కాసేపు నించున్నాడు ధైర్యంగా...ఇంకాసేపు నించునును కాని ఎవరో ముసలాయన "ఎందుకు బాబూ ? అక్కడ నుంచుంటావు..లోపలికి వచ్చేయమ్మా!" అన్నాడు..ఆయన ముఖంలో బామ్మో, వెంకటప్పయ్యగారో కనపడ్డారులా వుంది..వెంటనే వెనక్కి వచ్చేసాడు..

స్టేషనుకు మామయ్యగారబ్బాయి సారథి వచ్చాడు...ఇద్దరూ ఆటోలో మామయ్యగారింటికి వెళ్ళారు..మామయ్య "కొన్నాళ్ళుండరా..ఏదైనా ఉద్యోగం చూద్దాం " అన్నాడు.. సారథితో ఊరంతా చూడ్డం మొదలెట్టాడు ప్రసాదరావు...

బస్సులూ---ఆటోలు; రిక్షాలు---అమ్మాయిలూ అన్నీ కొంచెం వింతగా వున్నాయి ప్రసాదరావుకి. పరుగెత్తే బస్సు వెనకాల పరిగెత్తి బస్సెక్కడం, కదుల్తున్న బస్సుల్లోంచి స్టాపు కానిచోట కూడ దిగడం వింతల్లోకి వింతగా కనిపించింది ప్రసాదరావుకి.

"ప్రసాదూ! గమ్మున ఇక్కడ దిగరా, ఇక్కడనుంచి హాలు దగ్గర.." అని కదుల్తున్న బస్సులోంచి సారథి బస్సు దిగేస్తున్నాడు. వెనకాలే ముందు ఆంజనేయస్వామినీ, తర్వాత బామ్మనీ, తలచుకుని కుడికాలు ముందు పెట్టి, పరుగెత్తే హైదరాబాదు సిటీ బస్సులోంచి దిగేసాడు సత్య వేంకట సూర్య మల్లిఖార్జున వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాదరావు... కాలు చుక్కల అరటిపండు తొక్కమీద పడింది. అది వేరే విషయం.

తర్వాత ఆసుపత్రినుంచి నర్సుచేత బామ్మకి నీతి వాక్యం రాయించాడు ప్రసాదరావు....
"పరిగెత్తే హైదరాబాదు సిటీ బస్సులోంచి దిగేటప్పుడు కుడికాలు ముందు పెట్టకే బామ్మా!!!!"
*******

[ఆకాశవాణి, హైదరాబాదు'బి' నుండి...'యువభారతి' (జంటనగరాల సాహితీ సంస్థ) వారి సాహిత్యకార్యక్రమంలో 1981 అక్టోబర్, 7 స్వీయ రచన ప్రసారం చేయబడింది...నేనే చదివా... ]

8 comments:

సుభద్ర said...

chalaa baagundi.

సుభద్ర said...

chalaa baagundi.

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఇంతకీ మీరు ఎలా దిగుతారు బస్సు చెప్పనే లేదు.

ఎక్కడికి వెళుతున్నావు అంటే వెంటనే ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుగుకొని మంచి నీళ్ళు తాగి మళ్ళీ బయల్దేరే మిత్రుడు నాకూ ఉండేవాడు. ఏమిటో ఎవరి నమ్మకం వారిది.
మీరు బామ్మగారి పక్షమా లేక సిటీ బస్సు పక్షమా కుడి కాలుకి సంబందించి.:):)

Geetha said...

Chala bagundi pedanannagaru! Infact bamma gurthukurakapoyina, coincidentally that was my experience as well with train... school days lo running races lo participate chesinappudu, manchi pickup kosam kudi kalu petti start cheyyadam baga alavatu, so running train lonchikuda ala digithe grip baguntundanna self-confidence tho try chesa.... first di kinda padinadebba ayithe... supplementary gaa nannagaru vesina mottikaya redovadi... 1+1 offer :)

హనుమంత రావు said...

సుభద్ర గార్కి ...కృతఙ్ఞతలు...

సుబ్రహ్మణ్యంగారు..నేను మీ పక్షమే...బామ్మగార్కి చెప్పకండి..వీలైతే గీతగారి అనుభవం వ్యాఖ్యలలో చదవండి..
.
భాస్కర్..నీ అనుభవం బాగుంది...నేను వ్రాసినది
కథో, స్కెచ్చో తెలియదుకాని...హైదరాబాదులో నా
అబ్సర్వేషన్...మామిత్రులు యువభారతి
కార్యక్రమానికి ఏదో ఒకటి వ్రాయమంటే...వ్రాసా..ఇది
వెలుగుచూసిన నా తొలి రచన....చాలామంది మిత్రులు ఇదో జోక్ గా చెప్పుకుని ఆనందించేవారు.. .థాంక్స్ ఫర్ యువర్ కామెంట్...

మిస్సన్న said...

పాపం ప్రసాదరావు పెద్దవాడై పోయి ఉంటాడు. బామ్మ చాదస్తం పోయిందో లేదో. బామ్మ పోయే ఉంటుంది పాపం.

హనుమంత రావు said...

డియర్ మిస్సన్నగారూ.. మీ సందేహానికి బామ్మగారి పక్షాన కృతఙ్ఞతలు,
& బామ్మగారు ఉవాచ:: బ్రహ్మ మానస పుత్రులు.. సనకసనందాదులు. వారు నివృత్తి మార్గంలోవున్న ఙ్ఞాన సంపన్నులు..వారు ఙ్ఞానవృద్ధులయ్యూ ఎల్లప్పుడూ చిరుతప్రాయంలోనే వుంటారని మీలాంటి వారి వలన విన్నాను.. ఆ సనక సనందనాదులను అర్చించే వారు...వారి అనుగ్రహంవలన కాలానుగుణమైన మార్పులకతీతులు. అలాంటి వారు :: మునిమాణిక్యం వారి కాంతం, చిలకమర్తివారి గణపతి, పానుగంటివారి జంఘాలశాస్త్రి, గురజాడ వారి గిరీశం, ముళ్లపూడివారి బుడుగు మొదలైనవారు. నేను (అంటే బామ్మగారు) కాంతం,గణపతి, బుడుగులను సేవిస్తాను. వారి అనుగ్రహంవలన నాకూ(అంటే బామ్మగార్కి) చావు పుట్టకలు లేవు...మీ అందరికి నా ఈ అనుభవం నచ్చిందంటే, వీలువెంబడి మా ప్రసాదరావును తీసుకుని వస్తాను..ఇంతకీ నచ్చిందో లేదో చెప్పారుగారు....

మిస్సన్న said...

అయ్యా నా జ్ఞాన నేత్రాన్ని తెరిపించారు.
బామ్మా ప్రసాదయోః చిరాయురస్తు.
అద్భుతమైన పోస్ట్. ఏమీ సందేహం లేదు.