Pages

Tuesday, June 28, 2011

ముళ్ళపూడి వారి జయంతి....


గత సంవత్సరము ఆయనకు జన్మదినమన్నాము..
ఏడాది తిరగకుండా జయంతి అంటున్నాము..
నేను ఆయన ఇంకా మనల్ని నవ్వించడానికి
ఆ చెన్నై నగరంలో ఉన్నట్టే అనుకుంటాను
అందుకే ఈ రోజు --------

శ్రీ ముళ్లపూడి వేంకటరమణ గారి జన్మదినం (హాస్యానికి పండుగ రోజు)


ఆ ఇంటి ముందర "ముత్యాల ముగ్గులు." ముందు గదిలో బాపుగారుతీర్చిదిద్దిన
"శ్రీరామ పట్టాభిషేకం" నిలువెత్తు చిత్రం.
"ఎందరో మహానుభావులు" అంటూ త్యాగరాజు కీర్తన బ్యాక్ గ్రౌండు మ్యూజిక్కుతో వినపడుతోంది. అతిథులంతా లోపలికి వస్తున్నారు. అప్పటికే యేదో "ఋణగుణ" ధ్వనితో, "కొత్త రూపాయిలా పెళపెళ లాడుతూ" "బాకీలవాళ్ళకి కోపిష్టివాడి జవాబులా పొట్టిగా,టూకీగా" వున్న ఓ శాల్తీ ఆ జనాల మధ్య కలయతిరుగుతూ, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొరబడినట్టు చొరబడి, ఒక్కొక్కళ్ళనే 'హలో' (రెండు రూపాయలు),
'హలో' 'హలో' (నాలుగు), 'హలో కులాసా' (ఆరు) - అంటూ పలకరించి పోతూ, జేబునిండా అప్పులతో
నింపేస్తోంది.
అటుచూడండి - బద్దీల లాగు - చింపిరిజుత్తుతో, బుడి బుడి నడకలతో, బుడుగులా వుంది వచ్చేస్తున్నాడు.
అతగాడి చెయ్యిపట్టుకుని, రెండు పిలక జెళ్ళతో సీగాన పెసూనాంబ - వెనకాలరెండు జెళ్ళ సీత, బాబాయి,
లావుపాటి పక్కింటి పిన్నిగారు, ఆవిడ కొంగట్టుకొని - ఆవిడ మొగుడుగారు యింకా యింకా బోల్డు
చాలా మంది వస్తున్నారు.
వీళ్ళని చూడగానే ముళ్ళపూడివారు గుర్తొచ్చారా - అదిగో చూడండి మరి ! తెల్లటి లుంగీ పంచె - తెల్ల చొక్కాతో వీళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. ముళ్ళపూడి వారి పుట్టినరోజు సంబరం - బాపుగారు డిజైన్ చేసి తీసుకువచ్చిన కేకు- దాని మీద జీవితంలో వెలుగులు నింపిన 79 జ్యోతులు వెలుగుతున్నాయి. మిణుకు మిణుకుమంటున్న
జ్యోతులు కష్టాలు గుర్తు చేస్తున్నా-- "కష్టపడ్డ ఆ కష్టాలు కూడా చాలా రుచిగా వుంటాయి.
మామూలుగా అనుభవించే సుఖాలకన్న అవే మధురంగా తీపి గుర్తులుగా ఉండిపోతాయి ." అన్న
ముళ్లపూడి మాటల్ని గుర్తుచేస్తున్నాయి.
"డామిట్ ! జనం అడ్డం తిరుగుతున్నారేమిటి, మైడియర్ వెంకటేశం...?" అంటూ "గురజాడ
నించి వచ్చిన విశిష్ట అతిథి గిరీశం ముందుకొచ్చి, వెంకటరమణ గారి ప్రక్కన నిలబడ్డాడు. అక్కడ
ఋణగ్రహణ చేసిన రుణదత్తుడు జ్యోతుల వెలుగులో నొల్లుకోవడానికి ముందుకు రాబోతే -
అప్పారావుని చూసిన సీగాన పెసూనాంబ 'కెవ్వు'మంది. - బుడుగు నేను రక్షిస్తాడు అని
ముందుకు వచ్చి అప్పారావుకి ప్రైవేటు చెప్పాడు. సీగాన పెసూనాంబ 'బలే' 'బలే' అని చంకలు కొట్టుకుంది.
"రమణ గారూ ! అందరూ వచ్చారు. ఇంక కేకు కోయండి" అన్నారు ఎవరో. రమణగార్కి బాపుగారు
వెండి చాకు అందిస్తే ఇద్దరూ కలిసి కేకు కోసాడు. వారు రెండు కాదు..ఒకటే..పుట్టింది రెండు జిల్లాలలో
తూగోజి-పగోజి అయినా "గోదావరి" ఒకటే అయినట్టు, హాస్యం- బొమ్మ రెండైనా "కార్టూన్"
ఒక్కటే అయినట్టు బాపు రమణలు వేరుగా కనిపిస్తున్నా వారు ప్రసరించే "వెలుగులు" ఒకటే.
ఇక స్పీచ్ లు ప్రారంభమయ్యాయి..
"సాహిత్యపరంగా చిన్న చిన్న పద్యాలు వ్రాసారు ముళ్లపూడి. మా ఇంట్లో నేను వేసిన పెసరట్టు తిని -
'కంద'(పద్య)ట్టు పెట్టారు" అన్నారు పన్నాల సుబ్రహ్మణ్య భట్టు.
"చీకటి- రాధ కంటి కాటుకలా, కృష్ణుడి వంటి నలుపులా, నందుడి ఇంటి చల్లలా చిక్కబడింది
అని రాసారు ఓ కథలో" అని ఉటంకించారు శ్రీ శ్రీరమణ.
తను మాట్లాడక పోతే బాగోదేమోనని బుడుగు గొంతు సవరించుకున్నాడు.
ఈలోగా "ఆయన మంచి కథలకుడు" అనేసింది సీగాన పెసూనాంబ.--బుడుగుకి మరి
కోపమొచ్చింది. "కథకుడు అనాలేమో" అన్నాడు పెసూనాంబతో.. "కథకాదు ఆయన
రాసింది కథలు కదా? అంచేత కథలకుడే రైట్" అన్నాడు బాబాయి - రెండు జెళ్ళసీత కేసి
చూస్తూ కాలరెగరేసి.
"మరే! మరే! మంచి విమర్శకులుడు కూడా" అన్నారు లావుపాటి ప్రక్కింటిగారి
మొగుడుగారు. వెంటనే లా.పి.గారు ఆయన కాలుతొక్కి "ఆయన వేదాంతి కూడా...
కావాలంటే కోతికొమ్మచ్చి ఆడండి." అన్నారు.
"ఎంత అందమైన సినీమాలు తీసాడు." అన్నాడు అందాలరాముడు. "నిజమే -
విదేశీయులు కూడా ముక్కు మీద వేలేసుకునేలా "సీతా కళ్యాణం"ఇంకా మరేమో
సంపూర్ణరామాయణంలాంటి సినీమాలు అందుకు "సాక్షి" అంది బంగారు పిచుక.
"మరి టి.వి.భాగవతం" అన్నాడు బాలరాజు అప్పుడే మహాబలిపురం నుంచి వచ్చి.
"భక్తకన్నప్ప" వచ్చి, "నా కన్ను పొడుచుకున్నానంటే నేను కిరాతకుణ్ణి - మరీ ఇంత కిరాతకమా ?"
అని వాపోయాడు...అతడి చేతిలో కో..కొ..ఉంది.
విషయం తెల్సిన గిరీశం "తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత దాఋణాలు కూడా ఉన్నాయా? బార్బేరియస్ !" అంటూ లెక్చర్ ఒకటి అందుకున్నాడు.
'స్వాతి' బలరామ్ గారు ముందుకొచ్చి...."కష్టాలు తాను పడ్డాడు-- సుఖాలు మనకి అందించాడు.
అపార్థసారథి బాపు, అప్పార్థసారధి రమణ--ఇద్దరూ ఎంతో క్షమాగుణమున్న దయామూర్తి--
లోతుగుండె ఉన్న వేదాంతి." అనగానే బాపురమణలు చొక్కాల బొత్తాము విప్పబోతే
"మా ఎదురుగుండా తప్పు" అంది Mr.పెళ్ళాం.
మంత్రిగారి వియ్యంకుడు ఖండువా సవరించుకుంటూ "ఇక భోజనాలకి లేవండి" అనగానే....
"సమూహ భోజనంబు - సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు - అహహ ఏమనందు"
అందరూ కోరస్ పాడుకుంటూ కదిలారు భోజనాలకి.
______________________________________________________________
నాలోని భావలాను అక్షరబద్ధంచేస్తే అది గత సంవత్సరం జూన్ 28న స్థానిక దినపత్రిక
"సమాచారమ్"లో వెలుగుచూసింది. ఆ కాపీ ఒకటి శ్రీ ముళ్లపూడి వార్కి పంపాను. వారు
స్పందించి వ్రాసిన ఉత్తరము కాపీ ఇది.నా పట్ల ఇంత ప్రేమ పంచిన ఆ హృదయ సంస్కారానికి
మవునంగా అంజలి ఘటిస్తున్నాను.
ఇది వారు నాకు వ్రాసిన ఆఖరు ఉత్తరం........
"ఔరా..మొత్తం ఎన్నివ్రాసారేమిటి" అనకండి...
ఇది నాకు వారు వ్రాసిన మొదటి ఉత్తరం కూడా ...
శ్రీరామ
శ్రీ దినవహి వేంకట హనుమంతరావు గార్కి
రమణ నమస్కరించి వ్రాసేది.
తేనెలూరే మాటలతో మీరు పంపిన సుధలేఖకు
నా సుధాకాంక్షలు. ధన్యవాదాలు తప్ప-"పొగడు పూల"
దండకు అన్యవాదాలుండవుగదా!
'గట్లు రెండయినా గోదారి ఒకటే
బొమ్మలు రెండయినా వాక్యం ఒకటే'
లాటి వాక్యాలు కావ్యాల్లా చవులూరిస్తున్నాయి
శుభాశీస్సులతో...
(సం) ముళ్లపూడి వెంకట రమణ
02-07-2010
--------------------------------------------------------------------------------------------------

Friday, June 24, 2011

"చు క్కో ప ని ష త్"


ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ !
పొగచెట్టై జన్మించెను
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ !!

ఇది మన గిరీశంగారు శిష్యుడు వెంకటేశానికి చెప్పిన పద్యం.. బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో వుందని సదరు గిరీశంగారే ఉవాచ.."మీతో వుంటే నాకు పొగచుట్ట త్రాగడం తప్ప చదువేం రావటంలేదట" అని వెంకటేశం వాపోతే చుట్ట మాహాత్మ్యం పైవిధంగా చెప్తారు గురువుగారు.
ఇప్పుడు మనకు కావలసినది -- ఆ పద్యంలో పాయింటేమిటని? దున్నపోతు, పొగచుట్ట కాదండి-- 'చుక్క'. అది మనపాయింట్... భుగ భుగ పొంగుతోందట.. అమృతంపు చుక్క.. అమృతం ఖగపతి అంటే గరుత్మంతుడు తెచ్చాడు.. "నా దగ్గర దాస్యం చేస్తున్ననీ తల్లికి విముక్తికావాలంటే నాకు అమృతంకావాలి..అమరపురికి వెళ్ళి అమృతం తెచ్చి ఇయ్యి..." అని సవతితల్లి కండిషన్ పెట్టింది...వెంటనే వైనతేయుడు సురపురికి వెళ్ళి, దేవతా వీరులనోడించి.. అమృతభాండము గ్రహించి, చేతిలో ఉన్న అమృతాన్ని కనీసం వాసనకూడా చూడకుండా, సవతితల్లికి సమర్పించి, అక్కడున్న దర్భలపై వుంచాడు వినతాసూనుడు. అఫ్ కోర్స్ అలా పెట్టించడం దేవతల ప్లానే అనుకోండి తల్లికి దాస్యవిముక్తి అయిందని కద్రువ ఇలా డిక్లేర్ చేయగానే; రెడీగా ఉన్నదేవతలు అలా అమృతభాండాన్నికాస్తా తన్నుకు పోయారు... కద్రువ సంతానమైన నాగులు పాపం ఆ దర్భల్ని నాకాయట అమృతపు చుక్కలు ఏమైనా అక్కడ పడ్డాయేమోనని...'చుక్క' అమృతంకూడా పడలేదు సరికదా నాలుకలు నిలువుగా చీలాయి మాగాయి ముక్కల్లా ... పాములకు రెండు నాలుకలు అప్పట్నించీ....
అక్కడ పడని ఆ యొక్క అమృతపు చుక్క భూమి మీద పడి పొగచెట్టై కనపడింది గిరీశానికి. ఆ అమృతం భుగ భుగ పొంగుతోందట.. విషానికి తోబుట్టువుకదా.. అదీకాక పొంగితే కాఫీకూడా గొప్ప రుచిగా వుంటుంది... పొంగు రుచి మరి...

బాపు రమణలకు "సాక్షి" లో కనపడింది అదే....హీరోయిన్ 'చుక్క' కొబ్బరి పీచు కొట్తూ వుంటుంది.. ఆ శ్రమకు వంటినంటిన వలువల అస్తవ్యస్తమైన పరిస్థితి.. అది చూసిన మునిసిబు "చుక్క వళ్ళు దాచుకోకుండా పనిచేస్తుందయ్యా" అని ప్రక్కనే ఉన్న కరణంతో అంటాడు, "మరే! మరే!" దాగీ దాగని వళ్ళుచూసి పరవశుడై పళ్ళికిలిస్తాడు కరణం. 'చుక్క' విలువకు "సాక్షి" ఆ సినీమా. అందుకే ఆ కారెక్టరుకి బాపు,రమణలు పెట్టిన పేరు "చుక్క"

ఋషులకాలంలో ఆకాశంవైపు అలా చూసి, చుక్కని బట్టి టైము చూసేవారు...వేగుచుక్క పొడిస్తే తెలవారే టైము...తూర్పువెళ్ళేరైలు సినీమాలో అనుకుంటా 'వేగుచుక్క పొడిచింది' అంటూ పాటకూడా ఉందండోయ్...అదీ బాపుగారిదే...కోడికూతతో కూడా టైము చూసేవారనుకోండి...అది అంత స్టాండర్డు కాదేమో...ఎందుకంటే గౌతమ మహర్షి దెబ్బతిన్నాడుకదా... అయినా పరాయి వాళ్ళ ఫామిలీ గొడవలు మనకెందుకులెండి...?

మనజీవితాలు చుక్కలోంచే పుట్టాయి. "అణురో రణూయాన్..." అణువు అంటే చుక్క..
అది అలా ఉంచితే అసలు సృష్టిక్రమం చూడండి... పైనుంచి ఓ నీటి చుక్క పడుతుంది....తన చిరునామా తెలియని ఆ చుక్క-- చిన్న చెలమవుతుంది.. అందులో ఓ పసితనం... తర్వాత గలగలపారే ఏరవుతుంది...అది గంతులేసే బాల్యం... గట్టులనొరిసిపారే చెరువవుతుంది నిండు యవ్వనంతో....స్వాదుజలాల్ని అందించే తల్లి గోదావరిగా మారుతుంది... ఆ తర్వాత నిండుగంభీర సాగరాన్ని చేరుతుంది... ఆ రత్నగర్భకు ప్రారంభం ఆ యొక్క నీటిచుక్కే కదా..

చిన్నప్పుడు స్కూల్ రోజుల్లో అనేవారు... శ్రీ----చుక్క-----బొల్లిమేక అని. టైముకన్నా ముందు స్కూలుకెళ్తే...చేతిలో 'శ్రీ' వ్రాసేవారట...అదిగొప్ప; టైముకెళ్తే 'చుక్క' పెట్టేవారట... మరీ ఆలస్యంగా వెళ్తే వాడు 'బొల్లిమేక'గా పరిగణింపబడేవాడు. ఇది వినడమేకాని నాకు అంతకన్నా తెలియదు.
అంచేత స్కూల్ రోజులు 'చుక్క'తోనే ప్రారంభం.. చుక్కలాట ఆడేవాళ్ళం వెనకాల బెంచీల్లోకూర్చుని... కాగితం మీద వరుసగా చుక్కలు పెట్టి, ప్రక్క చుక్కలు, తడవకు ఒకరు చొప్పున, కలుపుతూ... నాలుగు చుక్కలు కలిసి స్క్వేర్ అవగానే మనకొక పాయింట్... మధ్యలో మేట్టారు చూస్తే "మేట్టారండీ..మేట్టారండీ..కొట్టకండి మేట్టారండీ".
పద్యానికి చుక్క మార్కు ఉంటే అవి కంఠతా పట్టాలి....తప్పదు. ఎందుకంటే అవి పరీక్షల్లో అడుగుతారు మరి.

ధనుస్సంక్రమణం ప్రారంభమవగానే ముగ్గులు ప్రారంభం...నెలపట్టు అనేవారు...వేకువనే చక్కని చుక్కలు ఇంటిముందు కళ్ళాపు చల్లి, జారిపోతున్న పమిట (ఒకప్పటి డ్రస్సులెండి) సర్దుకుంటూ చుక్కలు పెట్టి...(ముగ్గు డిజైన్ ని బట్టి చుక్కల లెక్క ఉంటుంది).. ఆ చుక్కలు కలుపుతూ రక రకాల ముగ్గులు పెట్టే చక్కని చుక్కలు మనకి తెలుసు...వారి ఓరచూపులు కేచ్ చేస్తూ చుక్కల్లో చంద్రుడిలా కొంటె కుర్రాళ్ళు.

వయసువచ్చిన నవవధువులు బుగ్గమీద చుక్క పెట్టుకుని "బుగ్గమీద పెళ్ళి బొట్టు ముద్దులాడ" సిగ్గులమొగ్గలై పెళ్ళిమంటపంలో కూర్చుంటే ఆ చుక్క ఠీవి వరుని బుగ్గపై ప్రతిఫలించడం చూస్తూనేవున్నాంగా...

ఎన్నికలొస్తే చుక్కతో ప్రారంభమై..చుక్కతో ముగుస్తుంది ఎలక్షన్... ముందు చుక్క పోస్తేనే బూతు చేరతాడు విలువైన ఓటరు, చేతిపై చుక్కపెట్టింఛుకున్నాకనే చుక్క మత్తులో ఓటు వేస్తాడు.. అప్పుడు ఎలక్షన్ పూర్తయినట్టు... ఎన్నికైన ప్రభుత్వం గద్దెనెక్కాక...కుళాయిల్లో నీటిచుక్కలు లేక కన్నీటిచుక్కలతో గొంతు తడుపుకొంటే వాళ్ళకేం పట్టింది... కన్నీరు అలా చుక్కలుగా ఉండక ప్రవాహంగా మారితే ఆ కన్నీళ్ళు కూడా జాతీయంచేసీయగలదు ప్రభుత్వము. అప్పోజిషన్ వాళ్ళు రంగు జెండాలు పాతినా పాతీయొచ్చు. తస్మాత్..జాగరత!...

మన భాగ్యనగరంలో చుక్కల అరటి పళ్ళు ..అబ్బా ఏం రుచండి... చుక్కంటే అంతేమరి..
మనం నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయని గగ్గోలుచేస్తాం...ఆ బాధ పోగొట్టడానికి ముందుచూపుతో వాడ వాడలా చుక్కల దుకాణాలు తెరచారు దయగల ప్రభుత్వంవారు. పవిత్రమైన ఓటువేసే వాడిపై
(చుక్కవేసుకుని మరీఓటు వేసేవాడిపై) అంతప్రేమ.

అసలీ చుక్కగొడవ నీకెందుకయ్యా అని మీరనొచ్చు. చుక్కమీది మక్కువ ఎందుకంటే మేమున్నది..చుక్క అప్పల స్వామి రెడ్డి గారి మేడ ప్రక్క వీధిలో...
మీరుమాత్రం తక్కువ తిన్నారూ..? ఏం చేసానంటారా... అంతర్జాలంతో ఆడుకుంటున్నారా? అదంతా మరి చుక్కలే కదండీ... సో అండ్ సో చుక్క బ్లాగ్ స్పాట్(అదీ చుక్కే) తర్వాత చుక్క ఆ తర్వాత కామ్..
సో అండ్ సో జిమెయిల్ చుక్క కామూ.,
చుక్క కో;
చుక్క ఇన్నూ.
ఈ జగమంతా చుక్కల మయమూ...
ఇతి . . . .చుక్కోపనిషత్ సర్వం సంపూర్ణం... ఏతత్ ఫలం మీకే సమర్పయామి.
____________________________________________________________________________________________________________________________________________________________________
{మిత్రులు శ్రీ కె.వి.శాస్త్రిగారు వైజాగ్ నుంచి మాట్టాడుతూ..."శ్రీ రమణ ఏదో మేగజైనులో చుక్కమీద వ్రాసారండి బాగుంది..చూసారా" అని అడిగారు. అది నేను చూడలేదు..కాని నా కొచ్చిన ఆ చుక్క ఆలోచన పైవిధంగా రూపొందింది... సారూప్యాలుండవచ్చు, నిజాలు కదా.
చిన్నమనవి.. చుక్క ఆలోచనంటే అపార్థం చేసుకోకండి ప్లీజ్.....}
--- ---- ----- ------- ------ ------ ------- ------- - ------- ---

Wednesday, June 22, 2011

మా నాన్న గారి జయంతి ఈ రోజు

మధ్యలో నాన్నగారు దారా వేషం లో...ఆయనప్రక్కన జహానారా గా ఒక జడ్జీ గారు ఆడ వేషం వేసారు.

(కూర్చున్న వారిలో ఎడమ చివర నాన్నగారు..పాత ఫోటో అర్థం చేసుకోండి.)




గాయత్రీ మంత్ర దీక్ష ప్రేమనొసంగినట్టి
గురు నుత్తమజనకు
సత్యనారాయణాఖ్యు
తలతు గురుండని ఎల్లవేళలన్

గాయత్రీ మంత్రోపదేశము చేసిన గురువు... ఒక చిరునామా ఇచ్చినన్ను లోకానికి పరిచయం చేసిన మహావ్యక్తి, ...ఇంకెవరు మా నాన్నగారు...
సాధారణంగా ప్రతి వ్యక్తికి కూడా తమ తలిదండ్రులు గొప్పవారే..
తలిదండ్రుల ప్రత్యేకతలు ఆయా తలిదండ్రులవే..
మా తండ్రిగారు శ్రీదినవహి సత్యనారాయణగారు. వారి పుట్టినరోజు రోజు (ఇంగ్లీషు కాలండర్ ప్రకారము..22-6-1894).
జీవితంలోని కష్టసుఖాలను భగవత్ప్రసాదంగా స్వీకరించి ఆనందంగా జీవనయానంచేసిన మా నాన్నగారు
నాకు ఆదర్శమూర్తి...
ఆయన దేశభక్తులు, తెలుగు,హిందీ,వంగ భాషలలో పాండిత్యం కలవారు. అభినయదక్షులు.,సహృదయులు.
1921లో గాంధీమహాత్ముని పిలుపుమేరకు చదువుతున్న బి. క్లాసులను వదలి జాతీయోద్యమంలో చేరిన మా నాన్నగారు కాకినాడలో స్థాపింపబడిన జాతీయ పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసారు. చుట్టుప్రక్కల ఉన్న పల్లెలలో ఒకచేత్తో హరికేన్ లాంతరు పట్టుకుని ఇంటింటికీ వెళ్ళి జనాల్ని ప్రోత్సహించి హిందీ భాష నేర్పెడివారట. నిర్వాహకులైన నాయకులు జైలుపాలవుతుంటే పాఠశాల నిర్వహణ కష్టదశలో ఉన్నప్పుడు విద్యార్థులనుత్సాహ పరుస్తూ వారితో కలసి నాటకాలు ప్రదర్శించి నిధులు సేకరించెడివారు....జాతీయపాఠశాలలో విద్యార్థినిగా దుర్గాబాయ్ (దేశముఖ్) నాన్నగారిదగ్గర హిందీ నేర్చుకున్నారు.. అది తన జీవితచరిత్రలో ఆమె ప్రస్తావించారు కూడా..చురుకుగా ఉండే దుర్గాబాయ్ విద్యార్థినిగా ఉన్నప్పుడే నాన్నగారి ప్రోత్సాహంతో జాతీయ పాఠశాలకు ప్రిన్సిపల్ గా పరిచయంచేయబడ్డారు
స్వాతంత్ర సముపార్జన తర్వాత వీరు గుజరాత్ విద్యాపీఠ్ వారి బి. పూర్తిచేసారు కాని డిగ్రీ మన ప్రభుత్వము గుర్తించని కారణంగా సరియైన ఉద్యోగం లేదు.. ఏలూరులో ఉండగా అక్కడ ఉన్నవిద్యాధికులతో కలసి హిందీలో వీరు నటించిన షాజహాన్ నాటకం మద్రాసులో పురస్కారములందుకుంది. పై ఫోటోలో దారా వేషంలో ఉన్నది నాన్నగారు. మొదటి ఫోటోలో వేషాలు వేసినవారే క్రింద ఫోటోలో వున్నవారు. lచంద్రగుప్త నాటకంలో చాణక్యుడిగా వీరి పాత్రధారణ బహుథా ప్రశంసింప బడింది.. తణుకు టౌన్ హాల్ లో వీరికి సన్మానం జరిగిందని వారి పంచాయతీ సావనీర్ లో వుంది. బెంగాలీ భాషలో ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన "షాజహాన్" నాటకాన్ని తెలుగులోకి అనువదించి, ముద్రింపించారు.. అది బహుళ ప్రజాదరణ పొందింది. కలకత్తాలో ఉండగా విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో పాలీ భాషకు గ్రామరు వ్రాసారు. ప్రేమచంద్ కథలు, మేవార్ రాజ్యపతనం వీరు తెలుగు అనువాదాలు... వీరికి బాగా పేరు తెచ్చినది... తులసీదాస కృత శ్రీరామ చరితమానస్ గ్రంధానికి వీరి తెలుగు వచనానువాదం.. 1962లో వీరు ముద్రించిన గ్రంధానికి మొత్తం మూడుముద్రణలు జరిగాయి.
అయితే వీరికి బెంగాలి,పాలీ,హిందీ,తెలుగు భాషలలో విధమైన డిగ్రీలూ లేకపోవడం
ఆశ్చర్యకరం.
స్వాతంత్రోద్యమంలో నిర్మాణాత్మక కార్యక్రమాలలోనే ఉండమన్న నాయకుల ఆదేశాలు కారణంగా వీరు జైలుకి వెళ్ళే సందర్భం రాలేదు.. ఫలితంగా వీరు స్వాతంత్ర సమరయోధులుగా గుర్తింప బడలేదు. విధమైన ప్రభుత్వ సాయమూ అందలేదు. అదీ భగవంతుని ప్రసాదమనే భావించారు... అప్పటి రెవెన్యూశాఖామాత్యులు శ్రీ కళా వెంకటరావుతో వీరికి సాన్నిహిత్యముంది. సాయంచేయమని అర్థించడం చేతకాని విద్య నాన్నగారికి...
శ్రీరాముని హృదయంలో ప్రతిష్టించుకుని శ్రీరాముని బిగ్గరగా స్మరిస్తూ తన 88 ఏట సునాయస మరణాన్ని పొందిన
మా నాన్నగారు ధన్యజీవి అని నే నెప్పుడూ భావిస్తాను. జన్మదినం సందర్భంగా వారికి వినయాంజలులు....

(నాన్నగారు పై పద్యం రోజూ చదివేవారు...కాని వేంకట్రామాఖ్యు అని తాతగారి పేరు అనేవారు.. గణ యతి దోషాలు ఉంటే అవి నావి ..విన్నది గుర్తు చేసుకోవడం..)

Tuesday, June 14, 2011

డా|| రావ్ (టి వి స్పెషలిస్ట్ )




( రచన నా స్వంతం)

పాత్రలు: డాక్టర్, పేషంట్(స్త్రీ)
........................................


డా: నెక్స్ట్?
ఆమె: (వస్తుంది) నమస్కారం డాక్టరుగారూ!
డా: నమస్కారం...ఏమైందీ ?
ఆమె: నాక్కాదండీ, మా మనవడికి..
డా: ఏడీ వాడూ ?
ఆమె: తీసుకురాలేదండి..విషయం చెప్తానండి..కొంచెం మీరు మందిస్తే పట్టుకెళ్తానండి.
డా: పేషంటును తీసుకురాకుండా మందంటే ఎలాగ ? సర్లే! మందిస్తాను. పట్టుకెళ్ళడం కాదు, పట్టుకెళ్ళీ వాడికి వెయ్యి...నువ్వేసుకునేవు...!
ఆమె: అయ్ బాబోయ్...భలేటోరండీ...
డా: ఇంతకీ ఏమిటి ప్రోబ్లెమ్ ?
ఆమె: అన్నం తింటంలేదండి.
డా: అన్నం తింటం లేదా ? ఎప్పట్నించీ ?
ఆమె: నిన్న రాత్రి నుంచండి
డా: ఎందుకని ?
ఆమె: అది తెలియకనే కదండీ. మీ దగ్గరకొచ్చింది
డా: ప్రశ్న మీక్కాదు..నాకు నేనే వేసుకున్నాను.
ఆమె:చిత్తం:
డా: కడుపులో నొప్పికాని వుందా?
ఆమె: (మాట్టాడదు)
డా: ప్రశ్న నీకే..మాట్టాడొచ్చు..
ఆమె: చిన్నపిల్లాడని చెప్పానుకదండీ..మాట్టాడ్డం రాదు. ఉన్నట్టుండి గుక్కపట్టి ఏడుస్తున్నాడండి.
డా: ఇంకా ?
ఆమె: టి.వి.కేసి చూపించి ఏడుస్తున్నాడండి.
డా: ఇంకేం ? మరి టి.వి.పెట్టలేకపోయారా ?
ఆమె: అది పెడ్తే-కాసేపు చూసినట్టే చూసి, ఉలిక్కిపడి ఏడుస్తున్నాడండి..
డా: అలాగా? ఇది వరకు ఎప్పుడైనా ఇలా అయిందా?
ఆమె: లేదండి.నిన్న టి.వి.చూసినప్పట్నించే ఇలా అయిపోయాడు.
డా: నిన్న టి.వి.లో ప్రోగ్రాం చూసాడు?
ఆమె: మామూలుగా టి.వి.లో వార్తలు పెట్టి అది చూస్తుంటే అన్నం పెడ్తామండీ. వార్తలు చూస్తూ చక్కగా అన్నం తింటాడండి.
డా: మరి నిన్న చూడలేదా ?
ఆమె: నిన్న వార్తలముందర ఏవో ప్రకటనలొస్తున్నాయని..అది మార్చి "సంస్కార్" చానల్ పెట్టామండి..అందులో కృష్ణుడి పాటలు వస్తుంటాయి కదండీ? అందుకు అది చూస్తూ నేను చానల్ మార్చడం మర్చిపోయానండి.
డా: అదీ విషయం..నాకర్థమై పోయింది కేసు
ఆమె: ఏంటి డాక్టరుగారూ...ఏమయినా ప్రమాదమా?
డా: అవునమ్మా! చిన్నపిల్లాడికి దేముడి ఛానల్సా చూపించేది.? అవి చూస్తే మాలాంటివాళ్ళకే అన్నం సాయించదు. అలాంటిది పసిగుడ్డు తట్టుకోవద్దూ...ఏముంటాయ్ అందులో... రైలు ప్రమాదమా, ఆత్మహత్యా, అసెంబ్లీ ఫైటింగ్సా, బంద్ లా అల్లర్లా...? ఏముంటాయ్ ? ఛానల్స్ మార్చేయ్..ఇవన్నీ చూపించే ఛానల్స్ మనకి బోలెడున్నాయి. అవి చూపించండమ్మా!
ఆమె: మరి టి.వి.అంటేనే భయపడ్తున్నాడు కదండీ ?
డా: అదే బాగా క్రానిక్ అయిపోయాడు..మనకు ఎన్నో తెలుగు పేపర్లున్నాయి.. వాటిలో క్రైమ్ కాలమ్, క్రైమ్ పేజీ లాంటివి తీసి బాబుదగ్గర చదివి వినిపించండి.. వీలైతే మీరెవ్వరైనా యాక్షన్ చేసి చూపెడ్తూ చదవండి..దాంతోపాటు మాత్రలిస్తాను వేయండి..అలాంటి కథలు చెప్పండమ్మా;;; పేపర్లలో చక్కటి వార్తలు వుంటాయ్. రాజకీయంగా ఎదగాలంటే చక్కటి మాటలు..."చెరిగేస్తాను, నరికేస్తాను..."లాంటివి యెన్నో వంటపడ్తాయి...ధర్మపథంలాంటివి వద్దమ్మా....భావితరాన్ని పాడుచెయ్యకండమ్మా.....
ఆమె: థాంక్సండీ డాక్టరుగారూ...శలవు...
డా: పిల్లల్ని పెంచడం నేర్చుకోండమ్మా.....
నెక్స్ట్....?

౦౦౦౦౦౦౦)))))((((((౦౦౦౦౦౦౦

{రాజమండ్రి హాసం క్లబ్ లో ప్రదర్శింపబడింది...మన్ననలు పొందింది)

Saturday, June 4, 2011

భాగ్యనగరాన బామ్మ గారు


ప్రసాదరావు మీకు తెలుసుకదా? అదే మన బామ్మగారి మనుమడండీ! అంటే సత్య సూర్య వేంకట మల్లిఖార్జున వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాదరావు. మొన్న దసరాకు హైదరాబాదు వచ్చి పరుగెత్తే సిటీ బస్సులోంచి దిగేటప్పుడు కుడికాలు ముందు పెట్టకూడదన్న నీతి నేర్చుకుని వాళ్ళ ఊరువెళ్ళాడు..అప్పుడు ప్రసాదరావు కాలుకి పాపం దెబ్బ తగిలిందని బామ్మగారు చాలా యిదయ్యరు. బస్సులవాళ్ళనీ అందులో ఎక్కేవాళ్ళనీ, అందులోంచి దిగేవాళ్ళనీ అందర్నీ దుయ్యబట్తూ లెక్చరు ఇచ్చారు. ప్రమాద స్థలానికి స్వయంగా వెళ్ళి పరిస్థితి తెలుసుకోవాలని చాలా వుబలాట పడ్డారు. రెండు మూడుసార్లు ప్రసాదరావుని బామ్మగారు "ఒరేయ్ అబ్బీ ! సారి హైదరాబాదు తీసుకువెళ్ళరా.. చూడాలనివుంది." అని అడిగారు.. "మీ తాతగారు బాగున్నప్పుడు రోజూ--"అమ్మీ ! హైదరాబాదు రావోయ్ ! తీసుకువెళ్తా అనేవార్రా." అని బాధపడ్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ-- "ఆమహారాజు కోరిక ఆయన బ్రదికుండగ తీర్చలేకపోయాను" అని బామ్మగారు ముక్కు చీదుకున్నారు. బామ్మగారికళ్ళల్లో నీరుకారితే ప్రసాదరావు నీరుకారిపోతాడు...తన కాలుకేసి చూసినప్పుడల్లా హైదరాబాదు గుర్తొస్తుంది ప్రసాదరావుకి..కాని బామ్మగారి మీద ఉన్న ప్రేమ అనండి, తెలియని తాతగారి మీద వున్న గౌరవమనండి.. మొత్తానికి ప్రసాదరావు మళ్ళీ హైదరాబాదు ప్రయాణమయ్యాడు..... రోజు ఉదయమే గోదావరీ ఎక్స్ ప్రెస్సులో భాగ్యనగరాన దిగారు బామ్మగారు తన మనుమడితో సహా... "ఏరా ? మీ మామయ్యగాడు స్టేషనుకు రాలేదేం..వెధవ్వేషం వీడూను ?" ఝమాయించి మరీ అడిగారు.. "ఏమోనే బామ్మా! ఉత్తరం కూడా రాసాను మరి."అన్నాడు ప్రసాదరావు.. రాస్తే చాలదు పోస్టు చెయ్యాలన్న సంగతి బామ్మగార్కి తెలియదో, తెలిసే అడగలేదో ..ప్రసాదరావు మాత్రం చెప్పలేదు. అసలు విషయమేమిటంటే స్టేషనుకు రమ్మని మామయ్యకు రాస్తే తాను చులకనై పోతానేమోనని, మరదలు
సరోజ తన్ని ఆట పట్టిస్తుందని....... బామ్మగారు చెప్పినట్టు ఉత్తరం రాసినా ప్రసాదరావు పోస్టు చెయ్యలేదు. సరే...స్టేషనివతలికి వచ్చి రిక్షా అడిగాడు ప్రసాదరావు...
"కితనే సవారి ?" అడిగాడు రిక్షావాలా
"దో" ఆమాత్రం చెప్పగలిగాడంటే క్రితంసారి వచ్చినప్పుడు మామయ్యగారబ్బాయి సారథి ఇచ్చిన
ట్రైనింగు.. "నీ అమాయకత్వం కూలా..నువ్వు చెప్తావేం..ఒక్కరూపాయి
కన్నా యెక్కువ ఇవ్వక్కర్లా.. రెండంటావేమిటి.."అంటోంది బామ్మ తనకొచ్చిన హిందీ అంకెల్ని గుర్తు చేసుకుని... అది విననట్టుగా "డేఢ్" అన్నాడు రిక్షావాలా... అదిగో ! అక్కడే కన్ ఫ్యూజ్ అయిపోతాడు ప్రసాదరావు... "డేఢ్" అంటే రూపాయిన్నరా "ఢాయీ"అంటే రూపాయిన్నరా అని. ఈలోగా "ఒరేయ్ అబ్బాయి! రూపాయిన్నరకన్న యెక్కువపెట్టకురోయ్.. అంతకన్న దూరంలేదు. ఇక్కడకి దగ్గరే సత్తిపండు ఇల్లు.." అంటూ బామ్మ గొడవ. సత్తిబాబంటే ప్రసాదరావు మేనమామ... "అబ్బా..నువ్వుండవే బామ్మా..నన్ను కన్ ఫ్యూజ్ చేయకు" అంటూ రిక్షావాలాకేసి తిరిగి.. "ఢాయీ" "ఢాయీ" అని రెండుసార్లన్నాడు ప్రసాదరావు..రిక్షావాలా ఒకే ఒక్క నిమిషం వీళ్ళకేసి ఎగాదిగా చూసాడు...తర్వాత "బైఠో!" అన్నాడు "బైఠియే" అనలేదేమా అని కొంచెం బాధపడ్డాడు ప్రసాదరావు. మామయ్యగారింటికి తేలిగ్గానే చేరుకున్నారు బామ్మగారూ, ప్రసాదరావు. కాని డబ్బులిచ్చేటప్పుడు మాత్రం..."నాకు రావల్సింది..రెండున్నర" అంటాడు రిక్షావాలా... "నే బేరమాడింది రూపాయిన్నరకు" అంటాడు ప్రసాదరావు... అప్పటికీ స్టేజీలో కొంచెం మెత్తబడ్డాడు ప్రసాదరావు..కాని బామ్మగారు రంగప్రవేశం చేసి మళ్ళీ కథ మొదటికి తెచ్చారు.. కాని హైదరాబాదు రిక్షావాలా ఒప్పుకోలేదు..ఈలోగా మామయ్యవాళ్ళూ బయటికివచ్చి పరిస్థితిని చక్కబరచి లోపలికి తీసుకువెళ్ళారు మనవాళ్ళని.. ఎవరూ చూడకుండా ప్రసాదరావు తన చిన్ని నోట్ బుక్కులో రాసుకున్నాడు... "ఢాయీ అంటే రెండున్నర, డేఢ్ అంటే రూపాయిన్నర"అని ముందు జాగ్రత్తకోసం జేబులో పెట్టుకుంటూ... ************ మర్నాటినుంచి బామ్మగారిని తీసుకుని ప్రసాదరావు జంటనగరాలు చూడ్డం మొదలెట్టాడు..టాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చూసారు.. ఈమధ్యనే దీనికి వినాయకసాగర్ అని పేరెట్టారని సారధి చెప్పగానే వచ్చే శివరాత్రికి అందులో స్నానం చెయ్యొచ్చని రోజే తీర్మానించుకున్నారు బామ్మాగారు. ప్రక్కనే బిర్లామందిర్, పబ్లిక్ గార్డెన్సు చూసారు..ఆకాశవాణి, అసెంబ్లీ హాలు బయట్నించే .."అవిగో" అని చూపించాడు సారథి... సుల్తాను బజారులో భూచరంలా కదులుతున్నతడిని చూసి కొంచెం కంగారు పడ్డారు బామ్మగారు..బిచ్చగాడైతే మాత్రం వాడిలో విష్ణ్వాంశ కనపడింది..అంతమంది జనం అటూ యిటూ తిరుగుతున్నా.. తోపుడుబళ్ళు తోసుకుంటూ అమ్మేవాళ్ళు కేకలువేస్తూ హోరెత్తిస్తున్నా, చిరునవ్వు చెదరకుండా చేయి తలక్రింద పెట్టుకుని ఓచేత్తో బిచ్చమెత్తుకుంటున్న అతగాడిని చూస్తూవుంటే... క్షీరసాగర మధ్యస్తుడై వేయితలలతోనూ ఆదిశేషుడు బుసలు కొడ్తూ హోరెత్తిస్తున్నా, చెరగని చిరునవ్వుతో చేయి తలక్రిందపెట్టుకుని... చేత్తో అభయహస్తం అందిస్తున్న శ్రీ మన్నారాయణమూర్తి గుర్తొచ్చాడు బామ్మగారికి.. అవును మరి ! వామనావతారంలో బిచ్చమెత్తింది శ్రీ మహావిష్ణువేకదా!" అనుకుని బామ్మగారు మనస్సులోనే అంజలి ఘటించారు నారాయణ స్వరూపానికి. ప్రక్కనే వున్నకూరల అంగళ్ళు చూసేటప్పటికి బామ్మగార్కి కడుపునిండిపోయింది. ధరవరలు తెలుసుకుని అవన్నీ కిలో రేట్లనుకుని చవకనుకున్నారు కాని తర్వాత తెలిసింది అవన్నీ పావుకిలో రేట్లని.. *********** మర్నాడు వీళ్ళతో ఊరు చూడ్డానికి సారథి రాలేక పోయాడు.. బామ్మగార్కి వేలో రెండువేళ్ళో విడిచిన మేనత్త కొడుకున్నాడంటే అడ్రస్ నీ, బామ్మగార్నితీసుకుని బయల్దేరాడు ప్రసాదరావు. బస్సులు ఎక్కాలో, ఎక్కడ దిగాలో అన్నీ వివరంగా ముందే తెలుసు కున్నాడు ప్రసాదరావు. బస్సు వీళ్ళు యెక్కవలసింది వచ్చి ఆగింది.."బామ్మా! అట్నించి నువ్వెక్కవే " అంటూనే వెనకాల గుమ్మందగ్గరకి పరుగెత్తాడు ప్రసాదరావు. బస్సెక్కేద్దామనుకుంటున్నాడు--ఈలోగా "ఒరేయ్ అబ్బీ! అంత రష్ లోకి యెక్కకురా..మళ్ళీ ఇదివరకులాగ పడిపోతావు." అంటూ చెయ్యి పట్టుకుని లాగేసారు బామ్మగారు. "అదేమిటే బామ్మా? నిన్ను అటెక్కమంటే ఇటొచ్చావు..ఆడవాళ్ళ గుమ్మం అదీ" అన్నాడు ప్రసాదరావు. "అదేంటిరా? నువ్విక్కడవుంటే నేను అక్కడెలా యెక్కుతాను " అని బామ్మగారు యిబ్బందిపడ్డారు.. అతి కష్టంమీద ఆవిడకి నచ్చచెప్పి మళ్ళీ వచ్చిన బస్సులో ఆవిడ ముందరనుంచి ఎక్కిన తర్వాత లోపలికి జొరబడ్డాడు ప్రసాదరావు..."అందర్ జావ్..అందర్ జావ్" అంటూ గుమ్మందగ్గిర కేకలతో కొంచెం లోపలికి గెంటబడ్డాడు ప్రసాదరావు... ఈలోగా కండక్టర్ చిటిక లేసుకుంటూ వచ్చి బామ్మగారి మొహం మీద చిటిక వేసాడు..."టికెట్" అంటూ.. "ఏమిటబ్బాయ్ ..ఏదో కుక్కను పిలిచినట్టు ఏమిటా చిటికలేయడం?" అని గదమాయించారు బామ్మగారు. "టికెట్" అన్నాడు కండక్టర్ అదేమీ వినిపింఛుకోకుండా.. "మా ప్రసాదరావు నడుగు" అంటూ లోపలికి చూపించారు బామ్మగారు. చిటికలేసుకుంటూ కండక్టర్ ముందుకు సాగాడు.... "ఏమిటి గట్ట చూస్తవ్...జరా జరగరాదె..."అంటూ ప్రసాదరావుని వెనకాలతను గెంటాడు...మళ్ళీ ప్రసాదరావు ముందరకి జరిగాడు.. కండక్టర్ ప్రసాదరావు ముఖం మీద చిటిక వేసి "టిక్కట్" అన్నాడు. రెండు టిక్కట్లు తీసుకున్నాడు ప్రసాదరావు. చిల్లరలో పది పైసలు తక్కువైందని అనుమాన పడ్తుంటే..."ముందరకి జర్గయ్యా" అంటూ మళ్ళీ తోసాడు కండక్టర్...ఆడవాళ్ళ సీట్లు దాటి ముందరకి జరిగాడు ప్రసాదరావు. "ఆయనే పాస్ ఖడా క్యా..దిమాగ్ ఖరాబుందా...చల్ చల్ "అన్నాడు డ్రైవర్ టర్నింగ్ తీసుకుంటూ.."ఉతర్నేకా...క్యా దేఖ్ తా...దిగ్గు..." అంటూ లోపల్నించి తోసారు ప్రసాదరావును... ప్రసాదరావు దిగడం...స్పీడందుకుని బస్సు బామ్మతో సహా ముందుకి సాగడం ఒకేసారి జరిగింది.... "అయ్యో!!! బామ్మా.." తనకి ఊరు క్రొత్త..బామ్మకి ఇంకా క్రొత్త..ఎక్కడని వెతకడం ఏం చెయ్యడం.. లోగా బామ్మ ఎక్కడైనా దిగేస్తుందేమో..తప్పిపోయిన బామ్మని వెదకడంకోసం మామయ్య సహాయంకోసం ఇంటికి మళ్ళాడు ప్రసాదరావు.. తప్పిపోయిన బామ్మా వెంకటప్పయ్యగారి ఆచూకీ తెలిస్తే మన సత్య సూర్య వెంకట మల్లిఖార్జున వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాదరావుకి తెలియజేయండి....ప్లీజ్......

**********


[
ముప్ఫై సంవత్సరాలక్రితం నేను చూసిన హైదరాబాదు...కొంచెం గమనించండి....]
[
జంటనగరాల సాహితీ సంస్థ "యువభారతి" వారి సాహిత్యలహరి కార్యక్రమంలో నా స్వీయరచన చదువగా ఆకాశవాణి, హైదరాబాదు'బి' కేంద్రంనుండి 3--2--1982 ప్రసారం చేయబడింది..]