Pages

Tuesday, June 28, 2011

ముళ్ళపూడి వారి జయంతి....


గత సంవత్సరము ఆయనకు జన్మదినమన్నాము..
ఏడాది తిరగకుండా జయంతి అంటున్నాము..
నేను ఆయన ఇంకా మనల్ని నవ్వించడానికి
ఆ చెన్నై నగరంలో ఉన్నట్టే అనుకుంటాను
అందుకే ఈ రోజు --------

శ్రీ ముళ్లపూడి వేంకటరమణ గారి జన్మదినం (హాస్యానికి పండుగ రోజు)


ఆ ఇంటి ముందర "ముత్యాల ముగ్గులు." ముందు గదిలో బాపుగారుతీర్చిదిద్దిన
"శ్రీరామ పట్టాభిషేకం" నిలువెత్తు చిత్రం.
"ఎందరో మహానుభావులు" అంటూ త్యాగరాజు కీర్తన బ్యాక్ గ్రౌండు మ్యూజిక్కుతో వినపడుతోంది. అతిథులంతా లోపలికి వస్తున్నారు. అప్పటికే యేదో "ఋణగుణ" ధ్వనితో, "కొత్త రూపాయిలా పెళపెళ లాడుతూ" "బాకీలవాళ్ళకి కోపిష్టివాడి జవాబులా పొట్టిగా,టూకీగా" వున్న ఓ శాల్తీ ఆ జనాల మధ్య కలయతిరుగుతూ, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొరబడినట్టు చొరబడి, ఒక్కొక్కళ్ళనే 'హలో' (రెండు రూపాయలు),
'హలో' 'హలో' (నాలుగు), 'హలో కులాసా' (ఆరు) - అంటూ పలకరించి పోతూ, జేబునిండా అప్పులతో
నింపేస్తోంది.
అటుచూడండి - బద్దీల లాగు - చింపిరిజుత్తుతో, బుడి బుడి నడకలతో, బుడుగులా వుంది వచ్చేస్తున్నాడు.
అతగాడి చెయ్యిపట్టుకుని, రెండు పిలక జెళ్ళతో సీగాన పెసూనాంబ - వెనకాలరెండు జెళ్ళ సీత, బాబాయి,
లావుపాటి పక్కింటి పిన్నిగారు, ఆవిడ కొంగట్టుకొని - ఆవిడ మొగుడుగారు యింకా యింకా బోల్డు
చాలా మంది వస్తున్నారు.
వీళ్ళని చూడగానే ముళ్ళపూడివారు గుర్తొచ్చారా - అదిగో చూడండి మరి ! తెల్లటి లుంగీ పంచె - తెల్ల చొక్కాతో వీళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. ముళ్ళపూడి వారి పుట్టినరోజు సంబరం - బాపుగారు డిజైన్ చేసి తీసుకువచ్చిన కేకు- దాని మీద జీవితంలో వెలుగులు నింపిన 79 జ్యోతులు వెలుగుతున్నాయి. మిణుకు మిణుకుమంటున్న
జ్యోతులు కష్టాలు గుర్తు చేస్తున్నా-- "కష్టపడ్డ ఆ కష్టాలు కూడా చాలా రుచిగా వుంటాయి.
మామూలుగా అనుభవించే సుఖాలకన్న అవే మధురంగా తీపి గుర్తులుగా ఉండిపోతాయి ." అన్న
ముళ్లపూడి మాటల్ని గుర్తుచేస్తున్నాయి.
"డామిట్ ! జనం అడ్డం తిరుగుతున్నారేమిటి, మైడియర్ వెంకటేశం...?" అంటూ "గురజాడ
నించి వచ్చిన విశిష్ట అతిథి గిరీశం ముందుకొచ్చి, వెంకటరమణ గారి ప్రక్కన నిలబడ్డాడు. అక్కడ
ఋణగ్రహణ చేసిన రుణదత్తుడు జ్యోతుల వెలుగులో నొల్లుకోవడానికి ముందుకు రాబోతే -
అప్పారావుని చూసిన సీగాన పెసూనాంబ 'కెవ్వు'మంది. - బుడుగు నేను రక్షిస్తాడు అని
ముందుకు వచ్చి అప్పారావుకి ప్రైవేటు చెప్పాడు. సీగాన పెసూనాంబ 'బలే' 'బలే' అని చంకలు కొట్టుకుంది.
"రమణ గారూ ! అందరూ వచ్చారు. ఇంక కేకు కోయండి" అన్నారు ఎవరో. రమణగార్కి బాపుగారు
వెండి చాకు అందిస్తే ఇద్దరూ కలిసి కేకు కోసాడు. వారు రెండు కాదు..ఒకటే..పుట్టింది రెండు జిల్లాలలో
తూగోజి-పగోజి అయినా "గోదావరి" ఒకటే అయినట్టు, హాస్యం- బొమ్మ రెండైనా "కార్టూన్"
ఒక్కటే అయినట్టు బాపు రమణలు వేరుగా కనిపిస్తున్నా వారు ప్రసరించే "వెలుగులు" ఒకటే.
ఇక స్పీచ్ లు ప్రారంభమయ్యాయి..
"సాహిత్యపరంగా చిన్న చిన్న పద్యాలు వ్రాసారు ముళ్లపూడి. మా ఇంట్లో నేను వేసిన పెసరట్టు తిని -
'కంద'(పద్య)ట్టు పెట్టారు" అన్నారు పన్నాల సుబ్రహ్మణ్య భట్టు.
"చీకటి- రాధ కంటి కాటుకలా, కృష్ణుడి వంటి నలుపులా, నందుడి ఇంటి చల్లలా చిక్కబడింది
అని రాసారు ఓ కథలో" అని ఉటంకించారు శ్రీ శ్రీరమణ.
తను మాట్లాడక పోతే బాగోదేమోనని బుడుగు గొంతు సవరించుకున్నాడు.
ఈలోగా "ఆయన మంచి కథలకుడు" అనేసింది సీగాన పెసూనాంబ.--బుడుగుకి మరి
కోపమొచ్చింది. "కథకుడు అనాలేమో" అన్నాడు పెసూనాంబతో.. "కథకాదు ఆయన
రాసింది కథలు కదా? అంచేత కథలకుడే రైట్" అన్నాడు బాబాయి - రెండు జెళ్ళసీత కేసి
చూస్తూ కాలరెగరేసి.
"మరే! మరే! మంచి విమర్శకులుడు కూడా" అన్నారు లావుపాటి ప్రక్కింటిగారి
మొగుడుగారు. వెంటనే లా.పి.గారు ఆయన కాలుతొక్కి "ఆయన వేదాంతి కూడా...
కావాలంటే కోతికొమ్మచ్చి ఆడండి." అన్నారు.
"ఎంత అందమైన సినీమాలు తీసాడు." అన్నాడు అందాలరాముడు. "నిజమే -
విదేశీయులు కూడా ముక్కు మీద వేలేసుకునేలా "సీతా కళ్యాణం"ఇంకా మరేమో
సంపూర్ణరామాయణంలాంటి సినీమాలు అందుకు "సాక్షి" అంది బంగారు పిచుక.
"మరి టి.వి.భాగవతం" అన్నాడు బాలరాజు అప్పుడే మహాబలిపురం నుంచి వచ్చి.
"భక్తకన్నప్ప" వచ్చి, "నా కన్ను పొడుచుకున్నానంటే నేను కిరాతకుణ్ణి - మరీ ఇంత కిరాతకమా ?"
అని వాపోయాడు...అతడి చేతిలో కో..కొ..ఉంది.
విషయం తెల్సిన గిరీశం "తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత దాఋణాలు కూడా ఉన్నాయా? బార్బేరియస్ !" అంటూ లెక్చర్ ఒకటి అందుకున్నాడు.
'స్వాతి' బలరామ్ గారు ముందుకొచ్చి...."కష్టాలు తాను పడ్డాడు-- సుఖాలు మనకి అందించాడు.
అపార్థసారథి బాపు, అప్పార్థసారధి రమణ--ఇద్దరూ ఎంతో క్షమాగుణమున్న దయామూర్తి--
లోతుగుండె ఉన్న వేదాంతి." అనగానే బాపురమణలు చొక్కాల బొత్తాము విప్పబోతే
"మా ఎదురుగుండా తప్పు" అంది Mr.పెళ్ళాం.
మంత్రిగారి వియ్యంకుడు ఖండువా సవరించుకుంటూ "ఇక భోజనాలకి లేవండి" అనగానే....
"సమూహ భోజనంబు - సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు - అహహ ఏమనందు"
అందరూ కోరస్ పాడుకుంటూ కదిలారు భోజనాలకి.
______________________________________________________________
నాలోని భావలాను అక్షరబద్ధంచేస్తే అది గత సంవత్సరం జూన్ 28న స్థానిక దినపత్రిక
"సమాచారమ్"లో వెలుగుచూసింది. ఆ కాపీ ఒకటి శ్రీ ముళ్లపూడి వార్కి పంపాను. వారు
స్పందించి వ్రాసిన ఉత్తరము కాపీ ఇది.నా పట్ల ఇంత ప్రేమ పంచిన ఆ హృదయ సంస్కారానికి
మవునంగా అంజలి ఘటిస్తున్నాను.
ఇది వారు నాకు వ్రాసిన ఆఖరు ఉత్తరం........
"ఔరా..మొత్తం ఎన్నివ్రాసారేమిటి" అనకండి...
ఇది నాకు వారు వ్రాసిన మొదటి ఉత్తరం కూడా ...
శ్రీరామ
శ్రీ దినవహి వేంకట హనుమంతరావు గార్కి
రమణ నమస్కరించి వ్రాసేది.
తేనెలూరే మాటలతో మీరు పంపిన సుధలేఖకు
నా సుధాకాంక్షలు. ధన్యవాదాలు తప్ప-"పొగడు పూల"
దండకు అన్యవాదాలుండవుగదా!
'గట్లు రెండయినా గోదారి ఒకటే
బొమ్మలు రెండయినా వాక్యం ఒకటే'
లాటి వాక్యాలు కావ్యాల్లా చవులూరిస్తున్నాయి
శుభాశీస్సులతో...
(సం) ముళ్లపూడి వెంకట రమణ
02-07-2010
--------------------------------------------------------------------------------------------------

9 comments:

మిస్సన్న said...

మంచి ఆర్ద్రత నిండిన టపా.
అయ్యా మీరు ధన్యులు.

కొత్త పాళీ said...

విరుపులు చాలా బావున్నై.

బులుసు సుబ్రహ్మణ్యం said...

చాలా చాలా బాగుంది ఈ మీ టపా.

'గట్లు రెండయినా గోదారి ఒకటే
బొమ్మలు రెండయినా వాక్యం ఒకటే'
లాటి వాక్యాలు కావ్యాల్లా చవులూరిస్తున్నాయి
శుభాశీస్సులతో...
(సం) ముళ్లపూడి వెంకట రమణ

మిస్సన్న గారన్నట్టు మీరు ధన్యులు.
ఈ టపా చదివి ముళ్ళపూడి వారి కధలన్నీ మరోమారు గుర్తుకు తెచ్చుకున్నాము.

రాధేశ్యామ్ రుద్రావఝల said...

దినవహి గారూ,
మీ టపా చాలా బాగుంది. మీ( మీరూ, అప్పారావుగారూ కూడా) లాంటి అభిమాన అభిమానుల జ్ఞాపకాల అలల్లో, వారి పుస్తకాలు తప్ప వ్యక్తిగత పరిచయం లేని మాలాటి వారికి, ముళ్ళపూడి వారు మేరుసమానుడిగా కనిపిస్తున్నారు. ప్రత్యేకించి వారికి మీ పట్ల గల వాత్సల్యం..మిస్సన్నగారు చెప్పినట్లు చాలా ఆర్ద్రంగా ఉంది. వారి జయంతి మీ బ్లాగుల రూపకం గా 'ముళ్ళపూడి జ్ఞాపకాలతో' బహ బాగా జరుపుకున్నాం. ధన్యవాదాలు.
-రాధేశ్యాం.

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

పక్కపక్కనే మనమున్నా అదేంటో మీ బ్లాగుమ్మంలోకి అడుగు పెట్టటానికి బద్ధకం.ఈరోజు నా బ్లాగులోకి మీరు అడుగెట్టి ఓ ప్రకటన లాంటిది
ఉచితంగా వేసేసరికి బద్ధకం విదిలించుకొని ఇలా బయలుదేరి వచ్చేశా ! మన ముళ్ళపూడివారికి మీరు (వే)వ్రాసిన మల్లెపూల
మాల ఇంతకు ముందు నాకు చూపించలేదు కాబట్టి ఇప్పుడు చదివితే చాలా పరిమళాలు యదపై వెదజల్లింది. ఏమిటో ఆయన తలపుకు
వచ్చినప్పుడల్లా ఆయన ఎదురుగా కూర్చొని కమ్మని కబుర్లు చెబుతున్నట్లే వుంటుంది. ఇంతకు ముందు అమ్మాయి మాధురి దగ్గర
కన్న వంకతో మద్రాసు ఆయన కోసమే పరిగెట్టేవాడిని. ఆయన్ని, బాపుగారిని ఎలా ఐనా మన హాసం క్లబ్ కి తీసుకురావాలనీ వుండేది.
అందుకే ఆ దేముడంటే నాకు అప్పుడప్పుడు మా చెడ్డకోపం వస్తుంటుంది. కానీ దేముడికీ ముళ్ళపూడితో మా(ఆ)టలాడుకోవాలిపించిందేమో!
రమణగారి గురించి కలకలాం నిలిచిపోయేలా బ్లాగించిన మీ రచన బహు బ్లాగు బ్లాగు!.

హనుమంత రావు said...

మిస్సన్నగారి హృదయం ఆర్ద్రమైందంటే నా భావ ప్రకటనలో నేను కృతకృత్యుడనయినట్టే... దీనిముందు పోస్ట్ లో నాన్నగారి గురించి వ్రాసా..స్పందించవా ప్లీజ్ నీ పద్యం హృద్యం ఈ మధ్య చూడలేకపోయా. కారణాలు అడక్కు...ఎక్కువ తీరుబడేమో తెలియదు. చూసి మళ్ళీవ్రాస్తా...

క్రొత్త పాళీ ..మీ వ్యాఖ్యకు కృతఙ్ఞతలు.. మీ బ్లాగు చూసా.. ఫోటోలు చాలా బాగున్నాయి..
చాలాకాలక్రితం పెట్టారేమో కాని నేను ఈ రోజే చూసా... మిగతావి చూసి నా అభినందనలు తెలియజేస్తా...

బులుసువారికి నమస్కారములు, నా ఈ టపాకి తీర్థం హోదా ఇచ్చారు.నిజమండి మరి శంఖువు.... అన్నమాట.

రాధేశ్యాం.. నిజానికి అసలు నాకు ముళ్లపూడివారితో పరిచయం లేదు..నా ఒకే ఒక ఉత్తరానికి అది వారి జవాబు...వారి సంస్కారమంతే..అదే వ్రాసా..
అదివారు నాకు వ్రాసిన చివరి ఉత్తరం, మొదటి ఉత్తరమూ కూడా అంటే ఒకే ఒక్క ఉత్తరము అని నా భావం...మీ అందరిలాగే హాస్యాభిమానిగా వారి అభిమానిని మాత్రమే. మీ స్పందనకు కృతఙ్ఞతలు.. మీ బ్లాగ్ చూడక మీకు బాకీ పడ్డా...త్వరలో ఋణవిముక్తుడనౌతా...

Sudha Rani Pantula said...

ముళ్ళపూడిబాపురమణగారి పుట్టినరోజు వేడుకలు చాలా ఆర్భాటంగా చేసారు..చాలా సంతోషం.
వారు రెండు కాదు..ఒకటే..పుట్టింది రెండు జిల్లాలలో
తూగోజి-పగోజి అయినా "గోదావరి" ఒకటే అయినట్టు, హాస్యం- బొమ్మ రెండైనా "కార్టూన్"
ఒక్కటే అయినట్టు బాపు రమణలు వేరుగా కనిపిస్తున్నా వారు ప్రసరించే "వెలుగులు" ఒకటే. మూడులోకాల మూడుకాలాలపాటు నిత్యమై వెలిగే సత్యం ఏదేనా ఉంటే ఇదే...

హనుమంత రావు said...

సురేఖగారు, మీ స్పందనకు నా కృతఙ్ఞతలు
సుధా ..చాలా సంతోషమమ్మా.. మీరు అందులోని స్వారస్యాన్ని చక్కగా గ్రహించారు ...ముళ్లపూడి వారు కూడా ఆ వాక్యానికి స్పందించారు.. ఆ పదం అక్కడ కూర్చబడడం ఆ తల్లి కరుణ.. మీకు నా కృతఙ్ఞతాభినందనలు.

మిస్సన్న said...

అయ్యా మీ వ్యాఖ్య (నా వ్యాఖ్యకు ప్రతిగా) ఇప్పుడే చూడడం జరిగింది. నాన్న గారి మీద వ్రాసిన టపా చూశాను. ఆలస్యంగా స్పందించాను. మీరు కూడా చీసే ఉంటారు.
ధన్యావాదాలు.