నవ్వడం ఒక భోగం, నవ్వకపోడం ఒక రోగం........ఈ వల్లరికి మరికొన్ని చిగుళ్ళు. నా లోకి నేను, నా తో నా సగం, నాడూ నేడూ రేపూ మీతో నేను.
Tuesday, June 14, 2011
డా|| రావ్ (టి వి స్పెషలిస్ట్ )
(ఈ రచన నా స్వంతం)
పాత్రలు: డాక్టర్, పేషంట్(స్త్రీ)
........................................
డా: నెక్స్ట్?
ఆమె: (వస్తుంది) నమస్కారం డాక్టరుగారూ!
డా: నమస్కారం...ఏమైందీ ?
ఆమె: నాక్కాదండీ, మా మనవడికి..
డా: ఏడీ వాడూ ?
ఆమె: తీసుకురాలేదండి..విషయం చెప్తానండి..కొంచెం మీరు మందిస్తే పట్టుకెళ్తానండి.
డా: పేషంటును తీసుకురాకుండా మందంటే ఎలాగ ? సర్లే! మందిస్తాను. పట్టుకెళ్ళడం కాదు, పట్టుకెళ్ళీ వాడికి వెయ్యి...నువ్వేసుకునేవు...!
ఆమె: అయ్ బాబోయ్...భలేటోరండీ...
డా: ఇంతకీ ఏమిటి ప్రోబ్లెమ్ ?
ఆమె: అన్నం తింటంలేదండి.
డా: అన్నం తింటం లేదా ? ఎప్పట్నించీ ?
ఆమె: నిన్న రాత్రి నుంచండి
డా: ఎందుకని ?
ఆమె: అది తెలియకనే కదండీ. మీ దగ్గరకొచ్చింది
డా: ఆ ప్రశ్న మీక్కాదు..నాకు నేనే వేసుకున్నాను.
ఆమె:చిత్తం:
డా: కడుపులో నొప్పికాని వుందా?
ఆమె: (మాట్టాడదు)
డా: ఆ ప్రశ్న నీకే..మాట్టాడొచ్చు..
ఆమె: చిన్నపిల్లాడని చెప్పానుకదండీ..మాట్టాడ్డం రాదు. ఉన్నట్టుండి గుక్కపట్టి ఏడుస్తున్నాడండి.
డా: ఇంకా ?
ఆమె: టి.వి.కేసి చూపించి ఏడుస్తున్నాడండి.
డా: ఇంకేం ? మరి టి.వి.పెట్టలేకపోయారా ?
ఆమె: అది పెడ్తే-కాసేపు చూసినట్టే చూసి, ఉలిక్కిపడి ఏడుస్తున్నాడండి..
డా: అలాగా? ఇది వరకు ఎప్పుడైనా ఇలా అయిందా?
ఆమె: లేదండి.నిన్న టి.వి.చూసినప్పట్నించే ఇలా అయిపోయాడు.
డా: నిన్న టి.వి.లో ఏ ప్రోగ్రాం చూసాడు?
ఆమె: మామూలుగా టి.వి.లో వార్తలు పెట్టి అది చూస్తుంటే అన్నం పెడ్తామండీ. వార్తలు చూస్తూ చక్కగా అన్నం తింటాడండి.
డా: మరి నిన్న చూడలేదా ?
ఆమె: నిన్న వార్తలముందర ఏవో ప్రకటనలొస్తున్నాయని..అది మార్చి "సంస్కార్" చానల్ పెట్టామండి..అందులో కృష్ణుడి పాటలు వస్తుంటాయి కదండీ? అందుకు అది చూస్తూ నేను చానల్ మార్చడం మర్చిపోయానండి.
డా: అదీ విషయం..నాకర్థమై పోయింది కేసు
ఆమె: ఏంటి డాక్టరుగారూ...ఏమయినా ప్రమాదమా?
డా: అవునమ్మా! చిన్నపిల్లాడికి దేముడి ఛానల్సా చూపించేది.? అవి చూస్తే మాలాంటివాళ్ళకే అన్నం సాయించదు. అలాంటిది ఆ పసిగుడ్డు తట్టుకోవద్దూ...ఏముంటాయ్ అందులో...ఓ రైలు ప్రమాదమా, ఓ ఆత్మహత్యా, అసెంబ్లీ ఫైటింగ్సా, బంద్ లా అల్లర్లా...? ఏముంటాయ్ ? ఆ ఛానల్స్ మార్చేయ్..ఇవన్నీ చూపించే ఛానల్స్ మనకి బోలెడున్నాయి. అవి చూపించండమ్మా!
ఆమె: మరి టి.వి.అంటేనే భయపడ్తున్నాడు కదండీ ?
డా: అదే బాగా క్రానిక్ అయిపోయాడు..మనకు ఎన్నో తెలుగు పేపర్లున్నాయి.. వాటిలో క్రైమ్ కాలమ్, క్రైమ్ పేజీ లాంటివి తీసి బాబుదగ్గర చదివి వినిపించండి.. వీలైతే మీరెవ్వరైనా యాక్షన్ చేసి చూపెడ్తూ చదవండి..దాంతోపాటు మాత్రలిస్తాను వేయండి..అలాంటి కథలు చెప్పండమ్మా;;;ఆ పేపర్లలో చక్కటి వార్తలు వుంటాయ్. రాజకీయంగా ఎదగాలంటే చక్కటి మాటలు..."చెరిగేస్తాను, నరికేస్తాను..."లాంటివి యెన్నో వంటపడ్తాయి...ధర్మపథంలాంటివి వద్దమ్మా....భావితరాన్ని పాడుచెయ్యకండమ్మా.....
ఆమె: థాంక్సండీ డాక్టరుగారూ...శలవు...
డా: పిల్లల్ని పెంచడం నేర్చుకోండమ్మా.....
నెక్స్ట్....?
౦౦౦౦౦౦౦)))))((((((౦౦౦౦౦౦౦
{రాజమండ్రి హాసం క్లబ్ లో ప్రదర్శింపబడింది...మన్ననలు పొందింది)
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
ఆకలేస్తే అన్నం పెట్టాలా ? టీవీ పెట్టాలా ? ఆ రోజు మన హాసం క్లబ్ లో ఈ స్కిట్ ను భలేగా ఎంజాయ్ చేశారు. మరోసారి గుర్తు చేసినందుకు
చక్కగా వ్రాసినందుకు మీలోని హాస్యరచయితకు అభినందనల మందారాల మాల అందిస్తున్నా, ఆయన మెడలో ( అదే నండి మీలోని హాస్య
రచయిత మెళ్ళో) వేయండి.
పిల్లల్ని పెంచడం ఎలా లో కొత్త అధ్యాయం మొదలు పెట్టారన్నమాట డాక్టరు గారు. శుభం. రెండు దొమ్మీలు, మూడు ఉపన్యాసాలు, ఒక హత్య అని డోసు లు కూడా చెప్పండి మరి.:))
సురేఖగారు, మీ కామెంట్ చూసి మీరు చెప్పిన ప్రకారము మందారమాలకోసం మెడ వంచా... మళ్ళీ ఎత్తడం లేటయింది.. అందుకని కొంచెం లేటు... ఆకలేస్తే అన్నం పెట్టాలా, టివీ పెట్టాలా... బాగా అడిగారు.. అది అంత అర్రీ బుర్రీగా తేలే యిసయం కాదు. రేటు లిశ్టు సూడాల....
బులుసువారూ... మీ ప్రిస్క్రిప్షన్ బాందండోయ్... ప్రాక్టీస్ పెరిగాక వాడుకుంటా! అవునూ
మీరింక స్పందనలుండవన్నారని గుర్తు... మరీ....? అయినా అభిమానాలూరుకుంటాయా?
చాలా చాలా థాంక్స్.
Post a Comment