నవ్వడం ఒక భోగం, నవ్వకపోడం ఒక రోగం........ఈ వల్లరికి మరికొన్ని చిగుళ్ళు. నా లోకి నేను, నా తో నా సగం, నాడూ నేడూ రేపూ మీతో నేను.
Sunday, September 11, 2011
అసలు పాయింట్
కాలేజీలో చదువుతున్న రోజుల్లో...సైన్సు విద్యార్థులకు వాల్యుమెట్రిక్ అనాలిసిస్ అనేది ఒక ప్రయోగం. పైన బ్యూరెట్ లో పొటాషియమ్ పెర్మాంగనేట్ (రంగు ద్రవం)నింపి, క్రింద గాజుకుప్పెలో ఆక్సాలిక్ ఆసిడ్(తెలుపు రంగు) నింపి...చేసే ప్రయోగం... ఒక్కొక్క చుక్కా బ్యూరెట్ లోంచి గాజుకుప్పెలో పడుతుంటే క్రమంగా తెలుపు రంగులో మార్పు వచ్చి ఒక పాయింట్ దగ్గర పింక్ కలర్ వస్తుంది. ఇంక ఒక చుక్క వేసినా ఆక్సాలిక్ ఏసిడ్ ద్రవంయొక్క తెలుపు రంగు మొత్తం పొటాషియం పెర్మాంగనేట్ కలర్ లోకి మారిపోతుంది.. అప్పుడు ఇంక ఎక్స్ పెరిమెంట్ గోవిందా! గోవింద !! అదిగో సరిగ్గా ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర రీడింగు తీసుకుని ప్రయోగం పూర్తి చేస్తారు...
ప్రయోగం గురించి చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యంకాదు... ఆ టర్నింగ్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్ కోసం మనం పడే కష్టాలు.. పింక్ కలర్ వచ్చేసినట్టే ఉంటుంది.. నమ్మకం కలగదు ప్రక్క వాడిని అడుగుతాం... ఎండ్ పాయింట్ వచ్చిందా అని...వాడు ఆ గాజుకుప్పెను పైకెత్తి, ట్రైను/విమానం మిస్సవడంవల్ల నోబెల్ బహుమానం తనకు మిస్సయి పోయింది తప్ప మరో కారణం కాదు అన్నట్టుగా, ఆర్కిమెడిసో, ఆర్థర్ ఎడిసనో అన్నట్టుగా ఓ పోజు కొట్టి... కూసింత మౌనం పాటించి .. ఆ తర్వాత...... అప్పుడంటాడు..."రీడింగ్ నోట్ చేసుకుని ఓ డ్రాపు వేయండి" అని ఇప్పటిదాకా చాలాసేపట్నుంచి మనం చేసేదదే ! కాని శంఖువులో పోసే తాపత్రయం... ఎండ్ పాయింట్ కోసం.....
కట్ చేస్తే...."డాక్టర్ గారు ! ఎడమ భుజం లాగుతోందండి...చాలా బాధపెడ్తోంది". "ఎప్పట్నించి.." మొట్టమొదటగా డాక్టర్ ప్రశ్న..."అంటేనండీ.." ఈలోగా డాక్టరు గారు నొక్కి చూస్తారు. ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా..అంటూ...నొప్పి వచ్చిన క్షణం మనం చెప్పగలిగితే, ఏ పాయింట్ లోనొప్పిఉందో వివరించగలిగితే వైద్యానికి సహకారం... మందు కూడా పని చేస్తుంది...అదిగో ఆ పాయింట్ కావాలి.
ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తాము...అది కట్టెల వ్యాపారం కావచ్చు..పువ్వుల వ్యాపారం కావచ్చు. వేలల్లోనూ లక్షల్లోనూ కావచ్చు, కోట్లలో కావచ్చు...అది ప్రారంభించినప్పుడు అన్నీ ఖర్చులే ఉంటాయి. అది ఉత్పత్తి ప్రారంభించాలి ...జనానికందాలి.. అప్పుడు ప్రోడక్ట్ అమ్మకం పెరుగుతూ ఉంటే క్రమంగా నష్టాలు తగ్గి లాభాల వైపు సాగుతుంది వ్యాపారం. అదిగో ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలి...వ్యాపారం యొక్క ఆరోగ్యంకరమైన అభివృద్ధికోసం...ఆ బి.ఇ.పి ఇవతలే స్తిరపడిపోయామా ఇక వ్యాపారం దివాలా అని అర్థం. అంచేత వ్యాపారం యొక్క జాతకం ఆ పాయింట్ మీద ఆధారపడి ఉంది.
వాఘా సరిహద్దు అవతల తస్మదీయుడు, ఇవతల అస్మదీయుడు...ఆ సరిహద్దు ఇంపార్టెంట్.
వివాహముహూర్తం..నెత్తిమీద జీలకర్ర పెట్టాడా గృహస్తు, పెట్టకపోతే బ్రహ్మచారి. అప్పటిదాకా వధువు 'ఆడ' పిల్ల .. ముహుర్తం అయ్యాక 'ఈడ' గృహిణి.
ఇలా నిత్యజీవితంలో బాగుపడ్డానికైనా పాడవడానికయినా ఓ పాయింట్, ఓ క్షణం ఉంటుంది...అది చాలా విలువైనది. ఆ పాయింట్ చేరేదాకా నిరాశాజనకంగా సాగే జీవితం, ఆశావహం అయ్యేది ఆ పాయింట్ చేరాకనే...
ఆధ్యాత్మిక జీవనయానంలో కూడా చేసే సాధన సిద్ధి పొందాలంటే ఒక పాయింట్. ఆ పాయింట్ దగ్గరనే మన సాధన జరగాలి అంటారు విఙ్ఞులు.. రాత్రంతా అలసి నిద్రపోయిన మన బాహ్యేంద్రియాలు ఉదయ రాగాలతో నెమ్మదిగా జాగృతమయ్యే సమయం... తమస్సులోంచి వెలుగులోకి ప్రవేశించే సంధ్యా సమయం... ఆ ఉదయ సంధ్య చాలా విలువైనది.. ఆ సమయంలో మన మేధస్సు నిశితంగా ఉంటుంది... మనం చేసే పనికి సత్ఫలితాలను ఇస్తుంది... విద్యార్థిదశలో విద్యనభ్యసించేందుకు అనువైన సమయం బ్రాహ్మీముహుర్తమే...ఆధ్యాత్మిక జీవనంలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే ఉపాస్య దైవాన్ని ఉపాసించాలి...ఆ ప్రశాంత సమయంలో సాధన చేస్తే గొప్ప ఆనందం అనుభవమౌతుంది...అదే ప్రాతఃకాల సంధ్యావందనం. సవితృ మండల మధ్యస్థ అయిన గాయత్రీ ఉపాసన.
అలాగే బాహ్యజగత్తుతో సంబంధం ఏర్పరచుకొని లోకవ్యవహారంలో కొట్టు మిట్టాడుతున్న జీవుల భౌతిక దృష్టి తగ్గి అంతఃచ్ఛక్షువులు తెరచుకోడానికి - తొలి గడప -- సాయంసంధ్య... అది దాటితే నిర్మల నిశ్శబ్ద నిశాసమయంలోకి జారుకుంటాం. - అంతఃమధన ప్రారంభమౌతుంది...ఆ మథనం ఆధ్యాత్మిక విషయంగా అయితే ఆనందమే మరి.
యా నిశా సర్వ భూతానాం, తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని, స నిశా పశ్యతో మునేః
(భూత జాలములన్నింటికీ యేది రాత్రియో అది జితేంద్రియుడగు యోగికి పట్టపగలు,
సనస్త భూతములకు ఏది పగలో అది విఙ్ఞుడగు ద్రష్టకు రాత్రి....అని గీతా వాక్యం.)
అగ్ని సోమాత్మకమైన జగత్తులో సోముని చల్లదనం ఆస్వాదించగలిగే తరుణసమయం.... సాయంసంధ్య....ఆ సమయంలో ఉపాసన అవసరమంటున్నది శాస్త్రం. అలాగే మరో రెండు సంధ్యలు....ఉదయం నుంచి భాను ప్రతాపం పెరిగి పెరిగి ..ఒక దశనుంచి తగ్గడం ప్రారంభించే మధ్యాహ్న సంధ్య; అలాగే అర్థరాత్రి... ఇలా నాలుగు సంధ్యలు ఉపాసనా సమయాలు అని ఋషివాక్యం... ఒక దశనుంచి రెండవ దశకు మారే పాయింట్... ఏ దశాలేనిది ఆ మధ్యపాయింట్.....అదే ఇక్కడ పాయింట్.
పాపం...మన హిరణ్యకశిపులవారు.... నూరు దివ్యసంవత్సరాలు తపస్సుచేసి...ఈ పాయింట్ మరచిపోయి... బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఏమడిగారు ?
"గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం ........" అంటూ గాలిలోనూ, నేలలోనూ, అగ్నిలోనూ నీటిలోనూ, ఆకాశంలోను...రాత్రి పగలు, లోపల బయట అంటూ పెద్దలిష్టిచ్చి ఇందులో ప్రాణం ఉన్నవాటిచే
కాని, ప్రాణం లేని వాటిచేత కాని ... మరణం ఉండకూడదు అన్నారు...అదికాని ఇదికాని అంటూ ద్వంద్వాలే చెప్పాడు కాని...ద్వందాలమధ్యన ఉండే పాయింట్ గమనించలేదు పాపం. ...ఇక్కడా అక్కడా అంటావేమిటయ్యా వెర్రినాన్నా కాలస్వరూపుడైన ఆ పరమాత్మ "కలడంబోధి గలండు గాలి..." అంతటా ఉన్నాడు అని క్లారిఫై చేస్తూనేవున్నాడు తనయుడు- తలకెక్కలేదు, బ్రహ్మవరప్రసాద గర్వం తలకెక్కింది.. వరాలు పుచ్చుకున్న పెద్దరాక్షసుడు గమ్మునుండకుండా "... దిక్పాలుర పట్టణముల గొనియె నతడు బలమున నధిపా...". దాంతో... ఆ దైత్యుని శిక్షించడానికి, తన భక్తుని రక్షించడానికి అవతారమెత్తక తప్పలేదు ఆ శ్రీమన్నారాయణునికి... హిరణ్యకశిపుని కోరిక, బ్రహ్మ యిచ్చిన వరాలు దృష్టిలో ఉంచుకుని ఆ సర్వాంతర్యామి తన ఆహార్యాన్ని డిజైన్ చేసుకున్నాడు.
"శ్రీ నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబులనన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్."--- "ఇట్లు కేవలపురుష రూపంబును మృగరూపంబునుంగాని నరసింహరూపంబున, రేయునుం బవలునుంగాని సంధ్యా సమయంబున..." ఆ పాయింట్ లో పరతత్త్వం...
"ద్వంద్వాలు మరచిపో...ఆ పాయింట్ లో ఉన్న నన్ను పట్టుకో" ...అని హెచ్చరిస్తున్నది...అది
"....హరిమాయారచిత మగు యదార్థము సూడన్" అది నరసింహ తత్త్వం...అది సంధ్యోపాసన.
జరిగిపోయినకాలం ఇక రాదు... రాబోయేకాలం తెలియదు... నిరంతరంగా సాగిపోయే
అనుభవమయ్యేది ఒకే ఒక్క క్షణం....ఒక చిన్న బిందువు...పాయింట్ అదే...
బ్రహ్మ, విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్ప అనుకుంటుంటే మధ్యలో పొడసూపింది ఓ జ్యోతి స్వరూపం...
ఎక్కడో పాతాళంనుంచి అనంతాకాశంలోకి జాజ్వల్యమానంగా ఎదిగిపోతోంది...స్తంభాకారంగా ఉన్న ఆ అఖండజ్యోతి... ఆద్యంతాలు చూడాలనిపించింది ఈ గొప్పవాళ్ళకి... ఎంతవరకు ఎదుగుతోందో చూడాలని ఊహలరెక్కలతో
భవిష్యత్ లోకి పయనించాడు బ్రహ్మ-హంస రూపంలో ...
ఎక్కడనుంచి వచ్చింది అని చరిత్ర తవ్వడం మొదలెట్టాడు విష్ణువు - వరాహరూపంలో.
ఎరగని భవిష్యత్తులో కాదు...తిరిగి పొందలేని భూతకాలంలో కాదు ఎదురుగా వాస్తవంగా ఉన్న జ్యోతిని చూడగలగాలి ... ఉపాసించాలి.... అదీ...పాయింట్.
నిర్మల ఆకాశంలో ప్రాభాత సమయాన మారే వెలుగుల జిలుగులు... సాయంసంధ్యలో దర్శనమిచ్చే అరుణిమలు... ఆ సంజె వెలుగులలో దేశ కాల పరిస్థితుల కతీతంగా ఉండే ప్రత్యక్ష నారాయణుని.....విశ్వనట చక్రవర్తిని భావిద్దాము... ఆనందస్వరూపుని అనుభవంలోకి తెచ్చుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
అసలు పాయింటుకే వచ్చా ! చాలా బాగుంది. వాఘా సరిహద్దు అంటే జ్ఞాపకం వచ్చింది. చైనాకు మనకు యుద్ధ సమయంలో శ్రీ ముళ్లపూడి వారంటారు."సరిహద్దులో ఇటు సైనికులు, అటు చైనికులు !"
అని !
నలుగురైదుగురు సంధ్యలు తెలిసినా, వందనార్హులు ఎవరూ లేకపోవడంతో శ్రీలక్ష్మి అష్టోత్రమ్ పఠించడం మొదలు పెట్టాను. 41 ఏళ్ళు గడిచిపోయినా అసలు పాయింట్ ఇంకా దొరకలేదు.
టైటర్ పాయింట్ దాటిపోయినా, బాక్ టైట్రేషన్ చేసేవాళ్లం అసలు ఎండ్ పాయింట్ పట్టుకోవడానికి. ఇక్కడ ఎన్ని కొత్త టెక్నిక్ లు ఉపయోగించినా, అబ్బే ఏ పాయింట్ అంతు చిక్కడం లేదు.
చాలా బాగా విశ్లేషించి చెప్పారండి. ఆ బ్యూరెట్ ప్రయోగం గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
ఏంటొ..ఎప్పుడు చూసినా సగం సగం తిథులొస్తున్నాయి..పూర్తిగా చతుర్దశి కాదు..పూర్తిగా పౌర్ణమి కాదు...అలాంటి ఎండ్ పాయింట్ దొరుకుతుందేమోనని 'ఎన్నెల'కూడా వెయిటింగు....
మట్టెకుంట వెంకట రమణగారు ! మీరు మరచిపోని రమణగార్ని గుర్తుచేసింది నా పాయింట్ అంటే... నా కృషి ఉండవలసిన పాఇంట్ దగ్గరే ఉందన్నమాట.... కృతఙ్ఞతలు.
సుబ్రహ్మణ్యంగారు... సంధ్యా వందనం అంటే... సంధ్య ఎక్కడ, వందన ఎవరు ? అంటే ఎలాగండీ ?
నా పాయింట్ అది కాదే ? సర్లెండి మీ మాటెందుక్కాదనాలి... మీ స్పందనకు చాలా చాలా థాంక్స్.
జె.బి.గారు చాలా సంతోషమండి...నా బ్లాగులో పోస్ట్ చూసి అభినందించినందుకు...
ఎన్నెలొచ్చింది నా బ్లాగుకి...హాయి హాయి... తిథులు తిథులే.. ఇంగ్లీషు కాలెండర్ ఇంగ్లీష్ కాలెండరే
కన్ ఫ్యూజన్ లేదు... ఇది మీకు తెలియదనికాదు చెప్పడం... ఇదే నాకు తెలుసునని చెప్పే కంగారు.
ఎన్నెల వెలుగుకి కృతఙ్ఞతలు.
Nijam daddy...if we can get hold of that tiny point...that's it kada. Chaala baaga raasaru....
సాధకులకు సాధ్యవస్తువు కోసం చేసే సాధనలో.... పొందవలసినది పొందేదాకా తపన...తపన.....
అదే చెప్పబోయా....నీకు నచ్చినదంటే... దొరకవలసిన పోయింట్ గురించి సరైన పాయింట్స్ రాయగలిగా ననిపిస్తున్నది .... కృతఙ్ఞతలు.
హనుమంతరావుగారు, మీ పాయింట్ కు నా మరో జాయింట్ తగిలిస్తున్నా! నా ఇంటి పేరు మట్టికుంట కాదండి ! "మట్టెగుంట" ! ఈ పేరుతో గుంటూరు జిల్లాలో ఓ ఊరుందట ! మట్టిలోనే కదా గుంట ( శ్రీకాకోళం గుంట కాదండి) వుండేదని చాలామంది మట్టిగుంట అని వ్రాస్తుంటారు ! అదన్నమాట
నా పాయింట్ ! మంచి హాస్యవ్యాసం అందించింనదుకు మరో సారి అభినందనలు!
మట్టిని అంటే నేలను కుంటల్లెక్కల్లో కొలవడం ఒక పద్ధతి విన్నాను.. ఆ దృష్టిలో అలా వచ్చేసిందేమో.
పొరబాటుకు క్షంతవ్యుడను... అదీకాక ఏ పేరుతో పిలిచినా ఆత్మీయం చిలకరించే సహృదయత మీది...
అద్భుతమైన తాత్త్వికతను అలా అలా సునాయాసంగా చిరుదరహాసం చిందిస్తూ ఆవిష్కరించారు. అమోఘం.
Post a Comment