నవ్వడం ఒక భోగం, నవ్వకపోడం ఒక రోగం........ఈ వల్లరికి మరికొన్ని చిగుళ్ళు. నా లోకి నేను, నా తో నా సగం, నాడూ నేడూ రేపూ మీతో నేను.
Tuesday, December 6, 2011
కాశీ ప్రయాణం...కాశీలో ... 1
శ్రీ సామవేదం వారికి కాశీ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరమూ కాశీ వచ్చి ప్రవచనాలు చేస్తూ ఉంటారు..
సాధారణంగా ఈ కార్యక్రమాలు హైదరాబాదులోని మిత్ర బృందం నిర్వహణలో జరుగుతూ ఉంటాయి. .
ముందు ఏర్పాటు ప్రకారము మేము కూడా బృందావనంనుండి కాశీ నవంబర్ అయిదవతేదీకి చేరాము.
కేదరఘాట్ లో ఉన్న కుమార స్వామి మఠంలో మా బస. ఆరవ తేదినుంచి ప్రవచనాలు అక్కడనే. ఈసారి
"సూత సంహిత" విషయం.. కాశీ రావడం మా దంపతులకు ఇది మూడవ సారి. మూడుసార్లూ
శ్రీ షణ్ముఖశర్మగారి ప్రవచనాలు వినడానికే వచ్చాము. మొదటిసారి శ్రీ శర్మగారితో కలసి ప్రయాణము చేసాం ...
అదో అదృష్టం... మా ప్రమేయం లేకుండా కాశీ క్షేత్రంతో మాకు అనుబంధం ఏర్పడుతోంది...
కేదార్ ఘాట్ లో గంగా స్నానం ఉన్నన్నాళ్ళూ (మధ్యలో ఆరోగ్యరీత్యా నేను కొన్ని మిస్సయ్యాను) చేసాము.
కేదార్ నాథుని దర్శించాము. వెళ్ళగానే కాలభైరవుణ్ణి దర్శనం చేసుకుని "వచ్చా"మని చెప్పుకున్నాము..
అక్కడనే దండపాణి ఆలయం ఉంది.. ఐతే విశ్వనాథుని ఆలయానికి వెళ్తుంటే డుంఠి గణపతికి దగ్గరలో
ఉన్న దండపాణి్ ప్రాచీనమైనదట.. తర్వాత ఆస్వామిని దర్శనం చేసుకున్నాము కాలభైరవుని
దగ్గరలో కృత్తివాసేశ్వరుని, మహామృత్యుంజయుని చూసాము.
మహామృత్యుంజయుని ఆలయంలో వెనుక భాగాన ధన్వంతరీ కూపం. కలియుగం ప్రవేశించే
సమయంలో తనదగ్గరనున్న మూలికాసంపత్తిని ఆ కూపంలో వేసి ధన్వంతరి అవతారం
చాలించేడని పురాణ కథనం.. ఆ నూతిలోని జలం ఔషధ విశేషాలుగలదని తీర్థసేవనం చేస్తారు.. చేసాము.
వారాహీ దేవతను దర్శించాము.. ఆమె కాశీకి రక్షణ శక్తి. ఆమెను నేరుగా చూడకూడదు.. చూడలేము..
పైన ఏర్పాటు చేసిన కిటికీల్లోనుండి చూస్తే అమ్మ పాదాలు దర్శనమౌతాయి.
ఓంకారేశ్వరుని చూసాము.. 'అ'కారేశ్వరుడు(బ్రహ్మ); 'ఉ'కారేశ్వరుడు (విష్ణు); 'మ'కారేశ్వరుడు (రుద్ర)
మూడు శివాలయాలు ఓంకారేశ్వరునిగా పురాణకాలంనుంచి ప్రసిద్ధి.. కాశీ మూడు ఖండాలుగా చెప్పబడుతున్నది.
ఓంకార ఖండము, కేదార ఖండము, కాశీ ఖండము. ఓంకార ఖండములోగల ఈ ప్రాచీన శివాలయాలు ప్రస్తుతము
ముస్లిముల నివసించే ప్రాంతంలో ఉన్నాయి. ఒక ఆలయం ఐతే ముస్లిముల గోరీల మధ్యలో గుట్టమీద ఉంది..
మూడు ఆలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి. వీటి ప్రాశస్త్యము తెలిసిన శ్రీ షణ్ముఖ శర్మగారు ఆ పరిస్థితికి
చాలా ఆవేదన చెందారు. "ఒక ఆలయం నూతనంగా కట్టి విగ్రహ ప్రతిష్ట చేయడంకన్నా ఒక జీర్ణాలయ పునరుద్ధరణ
విశేష ఫలితాన్నిస్తుం"దని చెప్తూ గతంలో కాశీ వచ్చినప్పుడు ఉపన్యాసములలో ఈ ఆలయాలు పునరిద్ధరించాల్సిన
ఆవశ్యకతను ప్రస్తావించారు.. వారివంతుగా అధికమొత్తంలో సాయమందించారు. అప్పుడు స్పందించి ఎంతో మంది
తమ వంతు సాయాన్ని అందించారు.. ఆ స్పూర్తితో అప్పేశ్వరశాస్త్రిగారనే కాశీవాసి నడుంకట్టారు. అధికార అనధికార
ప్రభృతులను కలిసి అనుమతులు మంజూరుచేయించుకున్నారు,, స్థానికులను ఒప్పించారు. శారీరిక
మానసిక శ్రమ పడ్డారు..కాని ఆనందంగా భరించారు... ఈ మూడింటిలోనూ ఇప్పుడు "మ" కారేశ్వరుని ఆలయాన్ని
నవ్యాంగ సుందరంగా చేసి నవంబరు 5వతేదీ శ్రీ శర్మగారి చేతులమీదుగా కుంభాభిషేకం జరగటానికి కారకులయ్యారు.
మత్సోదరీ పార్క్ వద్దగల ఈ ఓంకార క్షేత్రం కాశీ యాత్రికులకు అవస్యం దర్శనీయం...
విశ్వనాథుని మందిరమునకు గేట్ నెం.1లోంచి వెళ్తే దారిలో సాక్షిగణపతి ఉంటాడు... చుట్టూ షాపులు పెట్టేసారు...
జాగ్రత్తగా చూస్తే కాని దర్శనమీయడు...అక్కడనుండి ముందుకెళ్తే డుంఠి గణపతి దర్శనమౌతుంది..
కాని పోలీసు వారు అక్కడ మనల్ని ఆపాదమస్తకము తడిమికాని పంపించారు.. వారి అభిమానం
భరించమంటున్నది చట్టం. ఐతే హడావుడిలో డుంఠి గణపతిని చూడకుండా వెళ్ళే ప్రమాదముంది...
డుంఠి గణపతికి మ్రొక్కి.. లోపలకు వెళ్తే అన్నపూర్ణమ్మ.. కాశీలో తిండికి లోటులేకుండా కాచే చల్లని తల్లి.
అమ్మను చూసి కొంచెం ముందుకు వెళ్తే విశ్వనాథుని దర్శనం...
జ్యోతిర్లింగము... తురుష్కులు దండయాత్రకు వస్తున్నారని విని విశ్వనాథుని సేవించుకుంటున్న
అర్చకులు, ఋషులూ అక్కడ విగ్రహానికి హాని కలుగకూడదని, ఇంకోచోట భద్రపరచే ఉద్దేశ్యముతో పెకలించబోయారు.
కాని విశ్వనాథుడు కదలలేదు.. ఏంచేయాలో తెలియని భక్తులు "మా ప్రాణాలు తీసికాని స్వామిని
ముట్టనివ్వ" మని ఆస్వామిని కౌగలించుకుని ఉండిపోతే.. అప్పుడు విగ్రహములో కదలిక వచ్చింది.. వెంటనే
విగ్రాహాన్ని పెకలించి ప్రక్కనున్న నూతిలో దాచారు... తురుష్కులు వచ్చి ముట్టడించారు. చేయదలచిన
విధ్వంసం చేసి నిష్క్రమించారు.. ఆ తర్వాత పునః ప్రతిష్ట చేద్దామంటే స్వామి నూతిలో కనపడలేదు.
రాణీ అహల్యాబాయికి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి తాను ఆ కూపంలో ( అదే ఙ్ఞానవాపిగా చెప్పబడుతున్నది)
లుప్తమయ్యానని, గుడి కట్టించి ఇంకో లింగాన్ని ప్రతిష్ట చేయమని ఆదేశించాడట... ఆ ప్రకారం అన్నీ ఏర్పాటులు చేసి
లింగాన్ని తెచ్చి ఓ ప్రక్కగా పెట్టి గర్భగుడి మధ్యభాగంలో ప్రతిష్ట చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారుట. అంతా అయ్యాక
లింగప్రతిష్ట చేద్దామంటే ముందు పెట్టిన స్థలంలోంచి ఆ స్వామి కదలలేదట.. ఆ స్థలమే తనకి ఇష్టమైనదని
అక్కడే అలాగే దాన్ని ఉంచి అర్చించమని స్వప్నంలో అహల్యాబాయికి చెప్పాడట స్వామి. ఆ కారణంగా గర్భగుడిలో
ఓ ప్రక్కకు ఉంటాడు విశ్వనాథుడు.. ముందుగా ప్రతిష్టింపబడిన నందీశ్వరుడు మామూలుగా ఎదురుగానే ఉంటాడు.
కాశీ విశ్వనాథుణ్ణి ఇక్కడ ఎవరైనా స్వయంగా అభిషేకించుకోవచ్చు.. భక్తుల అభిషేకజలాలతో తనిసిన అభిషేక ప్రియుడు
తన శిరో భాగాన్ని మాత్రమే చూపుతూ ఉంటాడు.. అంతే ఆ విగ్రహమనుకున్నాను.. కాని ఓ సారి ఆ నీరు అర్చకులు
తీసేసినప్పుడు - ఓహ్!! పూర్తి స్వామి కన్నులపండువగా దర్శనమిచ్చాడు... సుమారు 3అడుగుల సుందరమూర్తి....
కొంచెం దూరంగా అమ్మ విశాలాక్షి శోభాయమానంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. తల్లిని చూసాము... శక్తిపీఠం.
శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే చోట ఉండడం విశేషం.
క్షేత్రపాలకుడు బిందుమాధవుని దర్శనమైంది.. ఆ ఆలయానికి దగ్గరలో త్రైలింగస్వామి సమాధి.. త్రైలింగ స్వామి
తెలుగువాడు. 286 సంవత్సరాలు జీవించి కాశీ క్షేత్రంలో కదలాడిన మహానుభావుడు.. యోగానంద,
రామకృష్ణ పరమహంసలాంటి మహనీయులకు స్పూర్తిప్రదాత.. కాశీలో కదలని శివుడు విశ్వనాథుడైతే
కదిలే శివుడీతడని పరమహంస అనేవారట. దిగంబరంగా కాశీ వీధులలో తిరిగెడి వారట.
నాటి పాలకులు పరాయిదొరలు. ఇతనిపై కేసు పెట్టి శిక్షించబోతే త్రైలింగస్వామి తన మహిమ వారికి ఎరుకపరచాడు.
దానితో ఆయన జోలికి వెళ్ళడానికి భయపడేవారట.
(ఇంకా ఉంది మరి,,,,,,,)
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
Kaashi kallaku kattinattu chupisthunnaaru. Dhanyavaadaalu. Taruvaayi bhaagam kosam eduru chusthunnaamu.
శ్రీదేవి గారూ,, నేను వ్రాసినది చదివి అభిప్రాయం వ్రాసినందుకు చాలా సంతోషం.. ఎవరికైనా నచ్చుతుందో లేదో అనుకున్నా..
మీ వ్యాఖ్యతో ధైర్యం వచ్చింది.. తరవాయి భాగం రెండురోజుల్లో పోస్ట్ చేస్తా.... బృందావనం యాత్ర వ్రాసా. చదివే ఉంటారనుకుంటా...
Rendo bhagam kuda ippude chadivanandi. Chala bavundi. Kashee nijanga chala goppa pradesham. Eppatikaina chudaali. Vyakya lekapothe evaru chadavaledanukovaddemonandi. Nenu kaakunda inka kuda chadive untaaru. Inthati adhbhuthamanina post ku marokkasari dhanyavaadaalu
sir.. kaashiki first time vellaboye malanti vallaki mi rasina post chala baga use avutundi . thank you andi.
late ga chadivutunna chustunnanta madhuranubhuti pondutunnam. Dhanyavadalu
JANARDHAN
late ga chadivutunna chustunnanta madhuranubhuti pondutunnam. Dhanyavadalu
JANARDHAN
శ్రీ దేవిగారికి, రాజా గారికి, జానా గారికి,, ఇంతవరకు మీ వ్యాఖ్యలు చూడని నా అశ్రద్ధకు మన్నించండి.. నా రచనలకు మీరు చక్కటి స్పందన తెలిపారు.. చాలా సంతోషం... మీకు నచ్చే మంచి రచనలు నేను వ్రాయగలిగే శక్తిని అందజేయండి.. ధన్యవాదాలు...
Post a Comment