నవ్వడం ఒక భోగం, నవ్వకపోడం ఒక రోగం........ఈ వల్లరికి మరికొన్ని చిగుళ్ళు. నా లోకి నేను, నా తో నా సగం, నాడూ నేడూ రేపూ మీతో నేను.
Sunday, December 18, 2011
ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం.... యాత్ర
ప్రయాగ ,,, అయోధ్య ,,, నైమిశారణ్యం,,,, (ఈ మధ్య ఒక 25రోజులు చేసిన మా తీర్థ యాత్రలగురించి వ్రాసిన వ్యాసాలలో ఇది మూడవది, ఆఖరుది. మా ఆనందం అందరితోనూ పంచుకోవాలనే తపన...అందుకీ ప్రయత్నం......)
ఉదయం అయిదుగంటలు దాటాక మా పన్నెండుమంది బృందం కాశీనుంచి బయల్దేరింది.. మేమంతా పరస్పరం బంధువులమే బీరకాయ పీచు. బృందావనం, కాశీ ఐన తర్వాత ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం కలిసి ప్రయాణించామన్నమాట. ముందుగా మా మితృని ద్వారా కాశీనుంచి. ఒక "ట్రావెలర్" వేన్ కుదుర్చుకున్నాము.. అందులో పదముగ్గురు కూర్చోవచ్చు.. మీటర్ లెక్కన మాట్లాడాము..కారు 15వ తేదీ బయల్దేరే ముందు మా రథసారధి హిందీలో ఉవాచ.."స్పీడో మీటర్ చాలూ నహీఁ సాబ్, కరాబ్ హో గయా".. మేమూ కూసింతసేపు "అబ్ క్యా కరనా హైఁ" అని హిందీలో బాధపడినవారమై.. "చలో" అనక తప్పిందికాదు. దారిలో ఉన్న సైను బోర్డులు, మైలు రాళ్ళూ ఆధారంగా దూరాలు కొల్చుకుంటూ, రథచోదకుడు చెప్పినదాన్ని మా అంకెలతో సరిపెట్టుకుని, ..బేరాలాడి..,మొత్తానికి డబ్బులు సెటిల్ చేసి, వాణ్ణి అక్కడ హిందీలోనే వదిలేసి ఇబ్బందిలేకుండా మన తెలుగుబండి ఎక్కామనుకోండి..
సరే విషయానికొద్దాము.....
కాశీ నుంచి ప్రయాగ చేరేసరికి ఉదయం సుమారు పది అయింది.. డైరెక్ట్ గా త్రివేణి సంగమానికి వెళ్ళాము.. హరిజగన్నాధశాస్త్రిగారు ప్రయాగలో పేరున్న పురోహితులు.. తెలుగువారు. ప్రస్తుతం వయసురీత్యా పెద్దవారవడం వలన వారి కుమారులు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు... వారితో ముందుగానే ఫోనులో మాట్లాడాం కనుక వారు చెప్పిన ప్రకారము రేవులో వారిని కలిసాము. సంగమస్నానానికి చిన్న నావలో పంపించారు.
నది మధ్యలోకి వెళ్తుంటే తెల్లటి పక్షులు గుంపులు గుంపులుగా నదీజలాల అలలలో తేలియాడుతూ నయనానందకరంగా కనపడ్డాయి.. పడవల్లోకివచ్చి అమ్మిన కారప్పూస ప్యాకట్టులలోని కారప్పూస నీటిపైన జల్లి .. "దాఁ" "దాఁ" అని పిలిస్తే తెల్లటి నీటి అలలపై పాలనురుగుల్లాంటి రెక్కలు విప్పుకుని ఎగురుతూ వచ్చి ఆ కారప్పూస పలుకుల్ని నీటిలో మునగకుండానే కరుచుకు పోతాయి.
ఇంకా ముందుకుపోయాక సంగమము.. శివుని జటాజూటం నుంచి..వెలువడ్డ గంగమ్మ ఓ ప్రక్క స్వచ్ఛంగా .. తెల్లగా ... చలాకీగా సాగుతూ ఉంటుంది ... కిష్టయ్యను సేవించడం వలన నల్లబడ్డదా అన్నట్టు నల్లని యమున గంగను జేర సంకోచంగా వస్తున్నట్టు రెండవ ప్రక్కనుంచి మెలమెల్లగా వస్తుంది. తెల్లటి శివయ్యా.. నల్లటి కిష్టయ్య.. తెల్లటి గంగమ్మ .. నల్లటి యమునమ్మ.. ఆ దృశ్యం నయన మనోహరము.. అంతర్వాహిని సరస్వతి కాళ్ళకు చల్లగా తగులుతుంది ...ఆ త్రివేణి సంగమం భరతభూమికి క్షేత్రమాహత్మ్యము కల్పిస్తున్నది.. కనపడే రెండునదులు --కనపడనిది ఒకటి... ఆ నదుల త్రివేణీ సంగమంలో .. దానికి ప్రతీకగా....కనపడని ఒక పాయ కనపడే రెండు పాయలతో అల్లబడిన నల్లని వేణిని దానం చేస్తారు.. ఆ కురులు సంగమంలో వదిలితే నీటిపై తేలకుండా క్రిందకు పోవడం అక్కడ విశేషం...
వేణీ దానానికి ముందు దంపతులు చేసే పూజ తంతు భలే బావుంటుంది... అది వయసులో ఉన్నవాళ్ళు చేస్తే ఫరవాలేదు.. వయసు పెరిగిన వాళ్ళు చేస్తే..చూడముచ్చట. వయసురీత్యా రకరకాల ఆకారాలు... రకరకాల కేశ సంపదలు...దృష్టి మాంద్యాలు.. భార్యా భర్తలు కాళ్ళకు పారాణి పరస్పరం దిద్దాలన్నా, ఒళ్ళో భార్యని కూర్చోబెట్టుకుని ఆమెకు జడ వేయాలన్నా--అసలు వళ్ళో భార్యామణిని కూర్చోబెట్టుకోవలన్నా వయస్సు భారం, సహకరించని అవయవాలు .. ఏదో చేయాలన్న ఆరాటం .. సరిగా చేయలేకపోతున్నామనే అసంతృప్తి. రక రకాల జంటలను ఏక తాటిపై నడిపించే ప్రయత్నంలో బ్రహ్మగారు.. చోద్యం చిత్రీకరించే కేమెరాలు, హేండీకామ్ లు పట్టుకుని కూడా వచ్చిన బందుగుల కోలాహలం..... సందడిగా రేవుదగ్గర కార్యక్రమాలు ముగించుకుని.. భోజనాదులు పూర్తి చేసుకుని...
శంకరమఠం.. తర్వాత లలితాదేవి ఆలయం చూసాము. ఇది శక్తిపీఠం.. చెయ్యిపడిన ప్రదేశం.. ఒక నూతిలో పడినదట.. గర్భగుడిలో నూయి..దానికి పూజాదికములు... తర్వాత బడే హనుమాన్.. పెద్ద విగ్రహం. మహిరావణుని చంఫి రామలక్ష్మణుల తన భుజాలపై తెచ్చిన హనుమ సుందర రూపం.. పడుకున్న భంగిమలో ఉంటుంది.. పూలమాలలతో నిండి మోము మాత్రం చూపే స్వామి మరునాటి ఉదయం పూర్తిగా దర్శనమిచ్చాడు... ఆనందభవన్ (నెహ్రూగారి జన్మస్థలి) బయటినుంచే చూసాము.
ఆ రాత్రికక్కడ ఆగి మరునాటి ఉదయమే అయోధ్యకు బయల్దేరాము. అయోధ్యలో సరయూనదీ జలాలు కేవలం మార్జనమే చేసుకున్నాము.. విపరీతమైన రక్షణ వలయంలో ఉన్న బాలరాముణ్ణి చూసాము.. మనదేవుణ్ణి మనం చూడడానికి విపరీతమైన ఆంక్షలు.. బాల్ పెన్, జేబు దువ్వెన తో సహా అక్కడ అనుమతించరు.. రామదర్శనమంటే అంత కష్టమా... అంత సులభంగా దొరుకుతాడా శ్రీరాముడు. క్రొత్త దేవాలయానికి పాలరాతి కట్టడములు తయారవుతున్నాయి.. ఎన్నో దేశాలభక్తులు తమ సంసిద్ధతకు ప్రతీకగా ఇటుకలు సమర్పించారు.. కోర్టు అనుమతి దొరకగానే 24 గంటల వ్యవధిలో శ్రీరాముని దివ్యధామం సిద్ధమౌతుందట.. దానికి సిమ్మెంట్, కాంక్రీటు అక్కరలేని అధునాతన పద్ధతిలో నిలబెట్తారట.. రామాలయ నిర్మాణ పూర్తయ్యేవరకు భోజనం చేయనని సరయూనదీ జలాలతో సంకల్పించి.. పదహారు సంవత్సరాలనుండి కేవలం పాలు పళ్ళ తీసుకుంటూ దీక్షలో ఉన్న ఒక స్వామీజీని చూసాము. అయోధ్య యాత్ర ముగించుకుని నైమిశారణ్యం బయల్దేరాం.
లక్నోకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో నైమిశారణ్యం. అక్కడ వనమే భగవత్స్వరూపం.. అన్ని పురాణాలలోను నైమిశారణ్య ప్రస్తావన ఉంటుంది.. సుదర్శనం యొక్క నేమి (అంచు) వలన ఏర్పడ్డ తటాకం చక్రతీర్థం ఉంది.. దాని చుట్టూ ఉన్న అరణ్యం నైమిశారణ్యం అని ఒక కథ.. అక్కడ గోమతి నది.. మేం నైమిశారణ్యం చేరే సమయానికి చీకటి పడింది.. బాలాజీమందిర్ లో ఉన్న మాతాజీ మాకు ఆశ్రయమిచ్చారు.. మా బృందానికి నాలుగు విశాలమైన గదులు ఏర్పాటు చేసారు.. రాత్రికి మాకు భోజనం ఏర్పాటు చేసారు.. ఆప్యాయంగా పలకరించారు.. మరునాటి ఉదయం గోమతిలో స్నానం చేసి... వ్యాసగద్దె, సూతగద్దె,దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం,సేతుబంధరామేశ్వరం, మొదలైనవి చూసాము.. మాతాజీ ఆధ్వర్యవంలో సత్యనారాయణ వ్రతం చాలా చక్కగా తృప్తిగా చేసుకున్నాము.. రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది. .. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే అ ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయట.. ఆ అడుగున శివమూర్తి ఉన్నదట...చూడలేకపోయాము. ఆ రాత్రికి కూడా ఉన్నాము.. మరునాడు... ఉదయకాంతులలో ,, మంచుకురుస్తుండగా వనశొభ మనస్సుకు ఏదో తెలియని ఆనందాన్నిచ్చింది..
మాతాజీ దగ్గర శలవు తీసుకుని బృందావనమాదిగా నైమిశారణ్యం వరకు అనుభవమైన మధురానుభూతుల మనస్సులో భద్రపరచుకుని లక్నో సాయంత్రానికి చేరాము.. అక్కడనుండి లక్నో టు యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ లో స్వస్థల ప్రస్థానం...
మన ఇంటిలో లాగున ఎక్కడా ఉండదు.. ఇబ్బందులు ఉంటాయి.. నచ్చని భోజనాలు తప్పవు.. మెచ్చని బసలో కాపురాలు తప్పవు..బలహీనతను ఆసరాగా తీసుకుని ఆటో రిక్షా మొదలుకుని దైవసాన్నిధ్యం వరకు తటస్థపడుతూ దోచే దొంగలుంటారు.. ఇచ్చినడబ్బులకి చేయవలసిన సేవలందించని దొర (దొంగ) ప్రభుత్వాల వైఫల్యాలు ప్రతిచోటా కనపడుతూనే ఉంటాయి. రైలు పెట్టెలలో కనీస శుభ్రత పాటించని మనలాంటి ప్రయాణీకులు... టిక్కట్..రిజర్వేషన్ లేకుండా దర్జాగా ప్రయాణించే ప్రభృతులు.. వారిని ఏమీ అనని రైల్వే అధికారులు...
ఇవన్నీ మరచిపోవాలి.. కేవలం భగవంతుణ్ణే భావించాలి.. ఆయననే ధ్యానించాలి... ఆయననే సేవించాలి.. అప్పుడే ఈ కష్టాలు మనసుకి పట్టని స్థితి వస్తుంది .. ఆ స్థితిలో మనసులో కొలువైఉన్న భగవంతుని అనుభవం తథ్యం... మనం నమ్మి "ఏమిటయ్యా ఇది స్వామీ" అనకుండానే ఆయన సాయం ఏదో రూపంలో మనకి అందుతుంది.. పొందిన ఆ అనుభవం మన గొప్ప అనుకోకుండా ఆయన దయ అని తెలుసుకోగలిగితే అదే భగవత్సాక్షాత్కారం....
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
బాగుందండి.యాత్ర చేయాలనుకొనేవారికి ఈ టపా ద్వారా కొంత అవగాహన కలుగుతుంది
నా పోస్ట్ కు మీ ఆత్మీయ అభినందనలకు కృతఙ్ఞతలు..
మీ యాత్ర అంతా కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఇన్ని రోజులూ మీ ఉత్తరాలకి దూరమైపోయామని ఏదో మూల చాలా బాధగా ఉంటోంది. మీ బ్లాగ్ ఇవాళ నిజంగా ఆ కొరత తీర్చింది daddy....thx a lot for sharing....through out the article i had a feeling that i am visiting all the shrines myself....really great
హనుమంతరావు గారూ..!!
నమస్కారం. మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మా కాశీయాత్ర నాటి జ్ఞాపకాలు గుర్తుకి తెచ్చారు. త్రివేణీ సంగమంలో స్నానాలూ, వేణీదానం, ఆ చిన్న పడవలలో వెళ్ళడం, ఆ పక్షులు, అన్నీ మళ్ళీ కళ్ళకు కట్టాయి. గురువు గారితో పాటు యాత్ర చేసి వారి ప్రవచనాలు వింటూ ఆ ఆద్యాత్మికతలో ఓలలాడిన మీ బృందానికి మనఃపూర్వక అభినందనలు.
రాధేశాం, ధన్యవాదాలు.. నా రచన మీ జ్ఞాపకాల్ని కదిలించింది. ధన్యుణ్ణి.. రాధేశాం గురించి నవంబర్ పోస్ట్ చూసి ఉంటారనుకుంటా..చూడకపోతే చూడమనవచ్చా...?
శాంతి, చాలా సంతోషమైంది నీ మెయిల్ చూసి. మీ ప్రోత్సాహం మళ్ళీ రాయాలనిపిస్తుంది.. నవంబర్ లో "కాశీ ప్రయాణం...ముందు బృందావనం"అని హెడ్డింగ్ పెట్టి బృందవనం గురించి వ్రాసా.. అది కూడా చదువు... ఎలావుందో వ్రాయి...ఉండనా మరి?
రాధేశాం, ధన్యవాదాలు.. నా రచన మీ జ్ఞాపకాల్ని కదిలించింది. ధన్యుణ్ణి.. రాధేశాం గురించి నవంబర్ పోస్ట్ చూసి ఉంటారనుకుంటా..చూడకపోతే చూడమనవచ్చా...?
శాంతి, చాలా సంతోషమైంది నీ మెయిల్ చూసి. మీ ప్రోత్సాహం మళ్ళీ రాయాలనిపిస్తుంది.. నవంబర్ లో "కాశీ ప్రయాణం...ముందు బృందావనం"అని హెడ్డింగ్ పెట్టి బృందవనం గురించి వ్రాసా.. అది కూడా చదువు... ఎలావుందో వ్రాయి...ఉండనా మరి?
sir
namaskaram andi, meru mi yatrani baga vivarincharu andi. sir nenu kuda ee madya MAHABALIPURAM & RAMESWARAM vellanu andi, vatini kuda mi stayilo kakapoyina edo natoliprayantnamga rasanu.. mi lanti peddalu oksari chusi cheppagalaru..
http://rajachandraphotos.blogspot.com
baagundi mee yaatra...memu annee missing
Respected sir.. We too had the Kasi trip in the same year... That was the first time we went.. I am recollecting what ever you have said in Triveni adbutam.. we too undergone... Thank you so much for posting.
Post a Comment