స్వాగతం...క్రొత్త సంవత్సరానికి స్వాగతం
2011వ సంవత్సరం కాలంలో కలిసిపోతోంది.. కాలచక్రపరిభ్రమణంలో మరో ఆకు...2012. స్వాగతిద్దాం..
వర్షాకాలంలో కొండల్లోంచి, కోనల్లోంచి ప్రవహించే నదిలో ఎన్నో దుంగలు కొట్టుకొస్తూ ఉంటాయి.. సముద్రం వైపుసాగే ఆ నది ప్రయాణంలో... ఆ ప్రవాహంలో ఈ దుంగలు ఒకదానికొకటి చెలిమిచేస్తూ ఉంటాయి.. విడిపోతూ ఉంటాయి.. మళ్ళీ కలుస్తూ ఉంటాయి... మన జీవనయానం కూడా అంతే...
నిరంతరంగా సాగే ఈ కాలప్రవాహంలో ఎన్నో పరిచయాలు.,,ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు... ఎన్నో వైషమ్యాలు,, ఎన్నో అనుబంధాలు.
ఎప్పటెప్పటి మిత్రులో కలుస్తారు.. ఎప్పటినుంచో కూడాఉన్న ఆత్మీయం సడన్ గా తెరమరుగౌతుంది... ఏమిటీ సంయోగాలు, ఏమిటీ వియోగాలు అని ఆలోచిస్తే అది మన ఆలోచనకంతుపట్టని వింత.. ఈ వింతచేసేవాడిని భగవంతుడని అంజలి ఘటిస్తాడు..ఆస్తికుడు... ఇది సైన్స్ థియరీ, దానికి హేట్సాఫ్ అంటాడు మరొకడు.. ఎవరేమన్నా కాలచక్రం ఆగదు. ఆ వాదనలు వింటూ కూర్చోదు...
తెలుగు ఉగాదికి స్పష్టమైన మార్పును ప్రకృతిలో చూస్తాం... మోడులైన చెట్లు చిగురుస్తాయి... కోయిలల కుహుకుహూరావాలు వినిపిస్తాయి..
అప్పటిదాకాఉన్న శీతలంనుంచి మారి వెచ్చదనం సంతరించుకుంటుంది వాతావరణం...మల్లెలు మొల్లలు విరుస్తాయి.. విరితావులకు మనస్సు పరవశిస్తూ ఆహ్లాదంగా ఉంటుంది.. అదో అనుభూతి...
శీతాకాలంలో ....వళ్ళంతా చల్లటిగాలులు తాకుతూ ఉంటే...మనసూ మాటా చలికి వణుకుతుంటే.. సంవత్సరాది శుభాకాంక్షలు పంచుకోవడం ఆంగ్లసంవత్సరాదికి వింత అనుభవం.. రాత్రి పన్నెండుగంటలసమయంలో క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం ఈ పండుగ ప్రత్యేకత...తెలుగు వత్సరాదికి ఇంటికొచ్చిన బంధుమిత్రులతో పండుగజేసుకుంటే., జనవరి ఒకటి నాడు.. మిత్రులనూ, అధికారులనూ, శ్రేయోభిలాషులనూ వారి తావులకు వెళ్ళి, కలసి పుష్పగుచ్ఛాలతోను, పళ్ళబుట్టలతోనూ.. శుభాకాంక్షలు చెప్పడం ఆంగ్లసంవత్సరాది వేడుక...
ఆపిల్, కమలా మొదలైన పళ్ళతోనూ, బుకేలు, దండలూ, పువ్వులతోనూ..క్రొత్త సంవత్సరపు గ్రీటింగ్ కార్డ్స్ తోనూ, హేపీ న్యూ ఇయర్ వ్రాయడానికి రంగురంగుల ముగ్గుల రంగుల అమ్మకాలతోనూ.. గలగలలాడుతూ కొనడానికి వెళ్ళే కళ కళలతోనూ... వీధులూ, అంగళ్ళూ సందడి సందడిగా కోలాహలంగా కనపడ్తాయి. క్రొత్తసంవత్సరమని ఆ సమయంలో ఆలయాలకు వెళ్ళి క్రొత్తసంవత్సరమంతా శుభంకరంగా ఉండేటట్టు ఆశీర్వదించమని పరమాత్మను కోరుకుంటారు. తిరుమలలాంటి దివ్యక్షేత్రాధీశుని దర్శించేవారూ ఉంటారు.
నాణానికి రెండవవైపు... చల్లటి వాతావరణానికి వెచ్చటిద్రవం నింపుకుని, లైట్లార్పి..పన్నెండవగానే ఒక్కసారి వెలిగించి...చేతులు కలుపుకొనే సంస్కృతీ కనపడ్తుంది...విచ్చలవిడిగా వీధుల్లోజేరి..గమ్మత్తైన మత్తులో అందరికీ చోద్యం కలిగించే మిత్రులు కూడా సందడిస్తారు... అదైనా ఇదైనా ...ఏదైనా క్రొత్తసంవత్సరానికి స్వాగతోత్సవ సందడే... అతిలేనిది ఆహ్వానించవలసినదే...
క్రొత్త సంవత్సరంలో మొదటి అడుగు వేసే ముహూర్తంలో ఒక్కసారి వెనక్కి చూస్తే.... ఇప్పటిదాకా ఏంచేసాము?.. చేసింది ఎవరికైన ఉపయోగకరంగా ఉందా ? కనీసం నాకైనా శ్రేయస్సునిస్తుందా? అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం.. ఒక్కసారి ఆలోచిద్దాం... ఎందుకంటే.....
"కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర, ఒంటినిండా దుస్తులు, ఇంటినిండా పిల్లలు, కళకళలాడే కళత్రం, తళ తళలాడే వస్తువాహనాలు...ఇంతకు మించి పరమార్థంలేదని చాలా మంది భావిస్తారు. కొంతవరకు అది నిజమే. అదికూడా జీవిత దర్శనమే. కాని అంతటితో జీవితం సార్థకంకాదనే విషయం జీవిత పరమార్థాన్ని అర్థంచేసుకోవాలని ఆరాటపడే ఆలోచనాపరులకు బోధపడుతుంది. ఆలోచన మానవలక్షణం..ఏది ఎలా కనిపిస్తే దాన్ని అలాగే భావించి, ఏది మంచిదనిపిస్తే దాన్ని స్వేచ్ఛగా సేవించటం సామాన్యజీవి స్వభావం. కాని కంటికి కనిపించేది, చెవికి వినిపించేది, మనస్సుకు అనిపించేది ఆ రూపంలో అలా ఎందుకు ఉంది, ఎలా ఉంది, ఎంతకాలం ఉంటుంది, అ తర్వాత అది మరో రూపంలో ఉంటుందా, అసలు రూపమే మాసిపోఇ మాయమయి ఫోతుందా, కలకాలం నిలిచేది, నిలబెట్టేది ఈ ప్రపంచంలో ఏమయినా ఉన్నదా, ఉంటే అది మనకు కనిపిస్తుందా, కనీసం మనకు బోధపడుతుండా అన్న ప్రశ్నలు ఒకదానివెంట ఒకటి ఆలోచించగల మన్స్సులో ఉదయిస్తాయి.." (స్వర్గీయ ఇలపావులూరి పాండురంగారావుగారి "ఉపనిషత్సుధ"నుంచి) ..క్రొత్త సంవత్సర శుభసమయాన ఈ వేదాంతమేమిటనుకుంటారేమో...
మనగురించి ఆలోచించండి అని చెప్పడం.. ఆ దృష్టితో భావి కార్యక్రమాలు సంకల్పించండి అని కోరడం... సంకల్పించిన కార్యక్రమం యొక్క ఆచరణకు త్రికరణ శుద్ధిగా (మనో, వాక్, కాయ కర్మలద్వారా) ప్రయత్నించండి అని సూచించడం.. క్రొత్త సంవత్సరం వస్తుంది... పాతబడిపోతుంది.. మళ్ళీ క్రొత్త సంవత్సరం... ఇది కాలచక్రం.. మనం మనంగా ఉండగలిగే సత్కర్మలకు శుభసంకల్పం చేయండి... అదే నూతన సంవత్సరానికి శుభ స్వాగతం... మీకూ మీ ఆలోచనలకూ సకల శుభాలు కలగాలని,, రాబోయే సంవత్సరం మీకు సకల శుభాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... శుభం భూయాత్.....
-----------------------------H A P P Y N E W Y E A R------------------------------------------
6 comments:
కొత్త సంవత్సరానికి మీ ఆహ్వానంలో చాలా విషయాలు చెప్పారు. జనవరి ఒకటిన మీరన్నట్టు మత్తుగా వుండటం వాళ్ళకో గమ్మత్తు. ఒకాయన అన్నాడూ
"మీరు ఉగాదినాడు చేదు పచ్చడి తినడంలే. అలానే మేం తీసుకొనే మత్తు రుచీ చేదే అన్నాడు ! " ఆ చేదులోని గ"మత్తే"మిటో ? మీకు మనందరికీ ఈ ఏడాది బహు బ్లాగు బ్లాగుగావుండాలని ఒకరికొకరు అందరి బ్లాగోగులు చూసుకోవాలని ఆశిద్దాం !!
కాలం మారలేదు. మనుషుల బుద్ధులు మారిపోతున్నాయ్!.వెచ్చటి ద్రవం గొంతుకలో పోసుకోవడం నూతన సంవత్సరానికి స్వాగతం అనుకునే వారికి చెప్పలేం. వారికో నమస్కారం, ఇంతకుమించి చెయ్యగలదిలేదు కనక.
కాలం మారలేదు. మనుషుల బుద్ధులు మారిపోతున్నాయ్!.వెచ్చటి ద్రవం గొంతుకలో పోసుకోవడం నూతన సంవత్సరానికి స్వాగతం అనుకునే వారికి చెప్పలేం. వారికో నమస్కారం, ఇంతకుమించి చెయ్యగలదిలేదు కనక.
కొత్తసంవత్సరానికి మీరు ఆహ్వానం బాగానే చెప్పారు.
కొత్త సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులందరికి సకల శుభాలు, సుఖ సంతోషాలు తీసుకు రావాలని కోరుకుంటున్నాను.
మీకూ మా శుభాకాంక్షలు.
mirku kuda happy new year andi.. miru annatlu ati kanidi eppudu ahvaninchadaginade..
Post a Comment