Pages

Friday, February 24, 2012

రాజమండ్రి గురించి... నాకు తెలిసినంతా కాదు; నేను చూసినంతా కాదు.. కూసింత

   
రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం... ఎందుకు ?
ఆదికవి నన్నయ్యకు ఇష్టం, మొదటి తెలుగునవల వ్రాసిన కందుకూరికిష్టం, కథాచక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికిష్టం, గయోపాఖ్యానం వ్రాసిన చిలకమర్తికి, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరివారికి, హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావుగార్కి, వారబ్బాయీ - మరో హాస్యరచయిత రాధాకృష్టగారికి, ఆంధ్రపురాణ గ్రంధ రచయిత, మరో నన్నయ్య అనదగ్గ మొన్నమొన్నటి మా మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారికి... ఇంకా... ఇంకా.... ఇంకా,,,,,,
ఎంతమందికండీ వీరందరికీ ఇష్టం కదా...అందుకనో ......... ఇక్కడివాడినే కనకనో--- నాకు మా రాజమహేంద్రవరం మీద మక్కువ... ఇక్కడివాళ్ళు కానివాళ్ళు కూడా ఇక్కడికొచ్చి .. నచ్చి.... ఇష్టపడి సెటిల్ అయిపోయినవాళ్ళున్నారు. ...వాళ్ళు కూడా ఇష్టపడ్తారు మా రాజమండ్రిని ..... మీకూ ఇష్టమే అయి ఉంటుంది...లేపోతే ఇంతదూరం వచ్చి ఇది చూస్తారా..?
ఆ నన్నయ్యగారి దగ్గరనుంచి... మా మధునాపంతులవారిదాకా ఈ నగరం అనేక మార్పులు చెందినా... ఆరుద్రగారు చెప్పినట్టు వేదంలా ఘోషించే గోదావరి శృతిపేయంగా ఇప్పటికీ తన వేదనాదంతో  విందు చేస్తోంది... అమరధామంలా శోభించే     రాజమహేంద్రి నయనానందకరంగా ఇప్పటికీ భాసిస్తోంది.ముందు నేను విన్నవి కొన్ని... ఇక్కడి మార్కండేయస్వామి వారి ఆలయం పురాణప్రసిద్ధి గల ఆలయం.. అక్కడి నుంచి చూస్తేగోదావరి     గట్టుకన్నా ఊరే ఎత్తుగా ఉండేదట.. ధాన్యం బస్తాలతో నిండిన ఎడ్లబండిమీద బస్తాల పైన కూర్చున్న చిన్నవాడికన్న ఎత్తట... నాకు తెలిసి     మార్కండేయుని గుడి ఎత్తుగానే     ఉండేది.. అప్పుడు ఎక్కి వెళ్ళేవాళ్ళం--ఇప్పుడు దిగి వెడ్తున్నాముకదా?
1 టౌన్ పోలీసు స్టేషన్ ఉన్న సెంటర్ అప్పట్లో అదే  నగరానికి వ్యాపార కేంద్రం.. కూరలగాయల మార్కెట్ కూడా అప్పట్లో ఇక్కడనే ఉండేది..         ఇప్పుడున్న ఊర్వశీ ధియేటర్ సెంటరులో చాలాకాలం గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది.. ఆ హాస్పిటల్ జైలున్నచోటకి మారాక   కూరలమార్కెట్ ఆ స్థలంలోకి మారింది.. ఆ పోలీస్ స్టేషన్ ప్రక్కనున్న పెద్దమసీదు ఉన్నచోట వేణుగోపాలుని ఆలయం ఉండేదట.
పెద్ద ఆనపకాయకు ఒక ఏగాని ఇస్తే తిరిగి ఆ కూరల ఆసామీ మనకు ఒకటో రెండో గవ్వలిచ్చేవాడట ..అంటే గవ్వకు కూడా అంత విలువ.. "గుడ్డి     గవ్వ విలువ చేయవనే" నానుడి తెలుసుకదా..  మూడు గవ్వలు ఒక ఏగాని లేదా పైస (ఇప్పటి నయా పైసలు కావు.) మూడు పైసలు ఒక     "కాని"/"డబ్బు". "డబ్బు" అంటే గుండ్రంగా ఉండే రాగి నాణెం.. "కానీ" అన్నదానికి చిల్లుకూడా ఉండేది.. ఆ చిల్లువల్ల రాగి ఆదా చేయాలనేమో.     దాన్నిబట్టే మినప్పిండి ఆదా చేయడానికి చిల్లుగారె సృష్టించారేమో.. ఏమో మరి...రెండు కానులు ..అర్థణా; రెండు అర్థణాలు ఒక అణా... పదహారు     అణాలు ఒక రూపాయి...
 గాంధీగారి చితాభస్మాన్ని రాజమండ్రి తీసుకువచ్చినప్పుడు, ఆ ఊరేగింపులో నాన్నగారు, చండ్రుపట్ల హనుమంతరావుగారు, మార్ని  నరసన్నగారు ఇంకా పెద్దలు చాలామంది ముందు వరసలో ఉన్నారు... ఐదేళ్ళున్న నేను మా సందు మొగదల నించుని చూడ్డం ఇంకా లీలగా గుర్తు.
 రాజమండ్రి అనగానే అప్పట్లో చాలామంది వరదరావు ఇడ్లీ అనేవారు..  - ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు కమలాకరరావు గారి తండ్రి..వరదరావుగారు. హోటల్ ఇండస్ట్రీ. మాడర్న్ హిందూ హోటల్ గా ప్రారంభించి... శాంతి నివాస్, శ్రీ నివాస్ హోటల్స్, కోర్టుల్లో కాంటీన్, రెండు రైల్వేస్టేషన్స్ లోనూ కాంటీనులు.... సుఖనివాస్ అని ఓ లాడ్జ్ వారి యాజమాన్యంలో అలా అలా వచ్చాయి.వారు వారి కుటుంబ సభ్యులు స్వయంగా పర్యవేక్షించేవారు.. వరదారావుగారి ప్రోత్సాహంతో కర్ణాటక దేశంలోని వారి బంధువులుకూడా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు.  దామోదరరావు హోటల్ అని కోటగుమ్మం సెంటర్ లో ఒక హోటల్ ఆ బంధువులదే.
రాజమండ్రిలో శ్రీ వరదరావుగారు ఒక ప్రముఖ వ్యక్తి.. వారి గురించి నే విన్న ఓ సంఘటన. ఒకసారి విద్యార్థులుగా కనపడ్తున్న ఇద్దరు చిన్నవయస్కులు వీరి హోటల్ కు వచ్చి భోంచేస్తున్నారుట. కౌంటర్ లో శ్రీ వరదరావుగారు ఉన్నారు.. అందులో ఒక కుర్రవాని భోజనమైంది కాని రెండవ కుర్రవాడు కావలసివన్నీ అడిగి వేయించుకుని చాలా సేపు తిన్నాడట..  తృప్తిగా భోంచేసాక వెళ్ళిపోతుంటే వరదరావుగారు పిలిచారు.
"ఎవరు బాబూ మీరు ?"
"వేదపాఠశాలలో చదువుకోడానికి వచ్చాము"
"ఎక్కడ ఉంటున్నారు..భోజనం సంగతేమిటి ?"
"మకాము స్థిరమైంది.. భోజనానికి #వారాలకి చెప్పుకోవాలి"
"అక్కరలేదు...మీరున్నన్నాళ్ళూ మా హోటల్ కి వచ్చి భోంచేయండి.. ఏమీ ఈయనక్కరలేదు." అని చెప్పి వరదరావుగారు నమ్మకమైన తన సర్వర్స్ లో ఒకర్ని పిలిచి
"వీరెప్పుడు వచ్చినా భోజనం నువ్వే వడ్డించి పెట్టు.. నలుగురిలోనూ పెట్టకు, లోపలి గదుల్లో పెట్టు.." అని చెప్పారట... అదీ రాజమండ్రిలో కనపడే అమ్మగుండె...
    (#అప్పటి రోజుల్లో వారానికి ఒక ఇంట్లో చొప్పున ప్రతిరోజు ఎవరో ఒకరు పేదవిద్యార్థులకు భోజనం పెట్టే సంస్కృతి ఉండేది.. మా ఇంటికి కూడా     రావడం నాకు గుర్తు.. ఇప్పుడు ఎక్కడా కనిపించటంలేదు...)
పుష్కరాలు వస్తే ప్రతి ఇంట్లోనూ వారి వారి స్తోమతలకు మించి కనీసం రోజుకి పదిమందికైనా ఆతిథ్యం ఈయడం రాజమండ్రిలో చూస్తాము..     డొక్కా సీతమ్మగారు...మా గోదావరి జిల్లా ఆడపడుచు ... ప్రాతః స్మరణీయురాలు  ఆవిడకు తెలిసినది ఒకటే... వచ్చినవాళ్ళకి నిత్యమూ     లేదనకుండా వండి తృప్తిగా భోజనం పెట్టడం.. అదీ ఇక్కడి సంస్కృతి...
   
 రాజమండ్రిలో నాకుతెలిసిన రోజుల్లో అంటే 1955 నుంచి గుర్తుచేసుకుంటే చాలామందికి కూడా గుర్తొచ్చేవి ముచ్చటించుకుందాం...
   
 అప్పట్లో శెట్టి అని పేరుగల కానిస్టేబుల్. (పేరు అదే అని విన్నాను). కానిస్టేబుల్ కి కాకీ నిక్కరు, కాకి సగంచేతులచొక్కా నెత్తిమీద టోపీ   అవి  యూనిఫాం.. టోపీ అయితే రకరకాల షేపులు మారి ప్రస్తుతం ఉన్న దశకు చేరింది.. ఆ రంగు ఎరుపు.. ఇప్పటి రంగు ..వదిలేయండి. ఈ శెట్టి గారి కాకీ యూనిఫాం గంజిపెట్టించేవాడేమో స్టిఫ్ గా ఉండేది.. కాలికున్న బూట్స్ చక్కగా పాలిష్ చేయబడి నిగనిగలాడుతూ ఉండేవి..     ఆతడు టక టకానడుస్తుంటే పరిగెత్తినట్టే... విజిల్ నోటిలో సైడుగాపెట్టి తమాషాగా ఊదేవాడు.. ఆతడు డ్యూటీలో ఉంటే సందడే సందడి..  రిక్షాల  వాళ్ళు రూల్ కు వ్యతిరేకంగా తిప్పుతున్నారంటే ఒక్కటే పరుగు.. వెళ్ళి సీట్స్ తీసి పట్టుకుపోయేవాడు... మాటలాడ్డం లేదు... వెనకాల ఆ రిక్షా     డ్రైవరు     పరుగెత్తేవాడు..     వాడి తప్పు తీవ్రతను బట్టి కొంచెం దూరం పరుగెత్తించడమో... కాసేపు ఉంచడామో చేసి అప్పుడు ఇచ్చేవాడు.. కేసులు     సాధారణంగా వ్రాసేవాడు     కాదు.. శెట్టిగారి మాటలు తమాషాగా ఉండేవి.. మా కుర్రకారుకి అతను పట్టుకుంటే బాగుణ్ణు అనుకోవడం ఉండేది.. ఓ     సారి ఒక హైస్కూల్ విద్యార్థి రాంగ్ సైడులో సైకిలు త్రొక్కుతున్నాడని పట్టుకున్నాడు..
    "చదువుకుంటున్నవానిలా ఉన్నావు... రాంగ్ సైడులో వెళ్ళెదవేమి ?"
    "లేదండీ వెళ్ళలేదు..."
    "ఏమేమీ.. వెళ్ళలేదా... చూస్తే బ్రాహ్మణకుమారునిలా ఉన్నావు.. మీరే అబద్ధమాడితే లోకం తలక్రిందులైపోతుంది నాయనా!" అని తను ఉన్న     టాఫిక్ ఐలాండ్ చుట్టూ మూడుసార్లు పరుగెత్తి... అప్పుడు సైకిల్ తీసుకువెళ్ళమన్నాడు.. ఆ కుర్రాడు ఆనందంగా శిక్ష పూర్తిచేసి సైకిల్ పట్టుకు     వెళ్ళాడు..
 చీకటిపడ్డాక ఓ సారి మా ఫ్రండూ నేనూ చెరో సైకిల్ పై వస్తున్నాము... ఒక సైకిల్ కు లైటు ఉంది, ఒకదానికి లేదు. మమ్మల్ని ఆపాడు.  కాసేపు  ఎగాదిగా చూసి.." ఏమండీ.. రెండు సైకిళ్ళకు ఒక లైట్ చాలనుకున్నారా ?
అట్లు కుదరదే ?".  చేసినతప్పుకన్నా ఆతడు పట్టుకున్నాడనే     ఆనందం     మాకు ఎక్కువగా ఉంది.. నిజం.. ఓ వార్నింగ్ ఇచ్చి సైకిళ్ళు నడిపించుకు  పొమ్మన్నాడు.
    ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి కాని చీటికిమాటికీ శిక్షించడం సరికాదనే ఆ శెట్టిగారిలోని భావన అభినందనీయం.. కదా ?

    రాజమండ్రిలో గుర్తించదగ్గ మరో వ్యక్తి... కిళ్ళీ అమ్మే అతడు.. కోటగుమ్మందగ్గరనుండి బయలుదేరి ఆ చివరదాకా ఒక లుక్కేస్తే ఎక్కడో అక్కడ     ఇతడు తారసపడేవాడు. ముతక ఖద్దరు బట్టలు భుజాన ఒక ప్రక్క ఖండువా  ఇంకో భుజంపై గుడ్డ సంచి, దానిపై శివ పరివారం బొమ్మ..     ఎడమచేతిలో ఒక పెట్టె.. ...అదో చిన్నసైజు పాన్ షాపు.  అది కొంచెం ఎత్తుగానే ఉండేది.. దానికి పైభాగంలో     మూడు ప్రక్కల అద్దం.. క్రింద    భాగంలో ఒకటో రెండో సొరుగులు.. ఆ అద్దాల వెనుక ముందు సగంలో తమలపాకులు... వెనుక సగభాగం     కిళ్ళీలు తయారు చేయడానికి     కౌంటర్     అన్నమాట. క్రింద సొరుగులు స్టాక్ కోసం... గులాబులు చల్లేవాడు.. అగరొత్తులు వెలిగించేవాడు...  ఆ కౌంటర్ పై, నిలుచుని చక్కగా     తయారుచేసిన ఆ కిళ్ళీఇంచుమించు అన్ని షాపులవాళ్ళూ కొనేవారు.. ఆ కిళ్ళీ; అతడి మాటలు ఒకదానికన్నా ఒకటి రుచిగా ఉండేవి..
    "వాగ్భూషణం భూషణం అన్నారు పెద్దలు...మన మాట్లాడుతుంటే పరిమళాలు గుభాళించాలండి.. అంతేకాని దుర్గంధం రాకూడదండి.. అంచేత     మా కిళ్ళీతో నోరు పరిమళింప జేసుకోండి.. ఇది మామూలు కిళ్ళీ కాదండీ... ...(తన చంక సంచి అలవోకగా ముందుకు వచ్చేట్టుచేసి అంది     మీదున్న శివ పరివారపు బొమ్మను చూపి...యాక్షన్ అన్నమాట) సాక్షాత్తూ ఆ పరమశివుని ప్రసాదమండి..ఇలా నోటిలో వేసుకుంటే     అలా     కరిగిపోతుందండి... అందరూ     అర్థణాకిస్తుంటే నీ కిళ్ళీ     ఖరీదు ఎక్కువంటారండి చాలామంది.. మా కిళ్ళీలో వేసే సరుకులు చాలా     ఖరీదైనవండి.. తుని నుంచి వచ్చిన లేత     తమలపాకులండి ఇవన్నీ వాడడం వలన ఎక్కువఖరీదు .. అలా కొందరన్నా నేను     పట్టించుకోనండి..     ఎందుకంటే మీ వంటి విజ్ఞులు (ఎదురుగుండా నోరెళ్ళబెట్టి చూస్తున్న మనల్ని చూపేవాడు) అలాంటి మాటలు     పట్టించుకోరండి..     ఎందుకంటే ఇది కైలాసనాథుని ప్రసాదమండి...". ఇలా సాగేది అతని ప్రసంగం.. ఆ మాటలు యథాతథంగా వ్రాయలేను... కానిఅందర్నీ     ఆకర్షించేవాడు... అతని దగ్గర కిళ్ళీ కొనడమంటే అతని మాటల రుచి వలననే.

    మరో వ్యక్తి... గోసేవా పరాయణ రామేన ఆదినారాయణగారు... ఇతను చిన్నపిల్లలకు వచ్చే అనాస వ్యాధికి మందులు కూడా ఇచ్చేవారు...     గోదావరి స్టేషన్ సమీపంలో ఉన్న తెల్లటి శివుని విగ్రహం (అప్పట్లో లేదా విగ్రహం) దగ్గరనుంచి కళా నికేతన్ కు వెళ్ళే రోడ్ మొదట్లో..  రోజూ రిక్షా     మీద పచ్చగడ్డి మోపులు తెచ్చి.. అక్కడ నిలబడి ..."దాఁ...దాఁ..." అనిపిలిస్తే ఆవులు పరుగెత్తుకొచ్చేవి... వాటికి ఈ గడ్డి వేసేవాడాయన... అవి     ఆనందంగా గడ్డి తింటూ ఉంటే చూడ ముచ్చటగా ఉండేది... తర్వాత కుక్కలకు రొట్టెలు వేసేవాడు... బోల్డు కుక్కలు.. అక్కడున్న యాచకులకి     పైసలిచ్చి, తినడానికేమైనా ఇచ్చేవాడు... ఈ దృశ్యం నేను హైస్కూల్లో చదువుకునే రోజుల్లో తరచు చూసేవాడ్ని...

    అప్పుడూ ఇప్పుడూ కూడా రాజమండ్రిలో ఆధ్యాత్మిక భావన వెల్లివిరుస్తూ ఉండడం కనిపిస్తుంది... గిన్నెలకు మాటులు వేసే అతను వచ్చేవాడు..     అతనిపేరు రామదాసు... "మాట్లోయ్"   అని రెండుసార్లు అరచి నాలుగుసార్లు "హరేరామ హరే కృష్ణ" అని గట్టిగా అరచేవాడు... "మధుకరం"     అని రాత్రిళ్ళు వచ్చే యాచకులు,  తెల్లగా తోమిన ఇత్తడి పాత్రలకు విబూతి, కుంకుమ అలది యాచనకువచ్చే  కాశీ కావడివాళ్ళు హరిలో రంగ     హరి అని వచ్చే హరిదాసులు.. అందరూ భగవన్నామ స్మరణే...
    మాదిరెడ్డి నరసింహారావు & సన్స్ అని ఫర్నిచర్ షాపు.. వీరు అప్పట్లో ఆంధ్రా యూనివర్సిటీ పరిథిలోని కాలేజీలకు, అలాగే స్కూల్స్ కు     ఫర్నిచర్ సప్లై చేసేవారు.. ఆ ప్ర్రొప్రయిటర్ పెద్దాయన.. కుమారులు షాపు చూసుకుంటుంటే ఆయన ఓ పడక్కుర్చీలో కూర్చుని ... తన దగ్గరకు     వచ్చిన చిన్నపిల్లలచేత రామనామం చెప్పించి... ఏ శనగపప్పో, చాకలెట్టో     ఇచ్చేవారు.
    శివరాత్రికి, కార్తీక మాసం, గ్రహణ సమయాలలోను.. గోదావరి ఘాటులదగ్గర సందడే సందడి... ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసంకాని, ఒక సంగీత     కచేరిగాని, ఒక సాహిత్య సభకాని... రాజమండ్రిలో చాలా అద్బుతంగా జరుగుతాయి...
    ఆధ్యాత్మిక భావాలతో, సాహిత్య సంగీత హృదయాలతో భాసించే రాజమండ్రి... అందరికీ ఆమోదకరమైన వాణిజ్యవ్యాపారలతో విలసిల్లే రాజమండ్రి     అంటే నాకు చాలా ఇష్టం...
    నేను చెప్పగలిగినవి కొన్ని వ్రాసాను... గోదావరి అంత విశాలంగానూ, పొడవుగానూ, లోతుగానూ, గంభీరంగానూ, గలగలమంటూ సందడిగానూ     ఉన్న రాజమండ్రి చరిత్ర... ఎంత వ్రాసినా తక్కువే..."జననీ జన్మభూమిశ్చ .... ఏదో అభిమానం... నా రాజమండ్రి     గురించి నాదనుకున్న బ్లాగులో     నాకోసం వ్రాసుకుంటున్నాను... మన రాజమండ్రి గురించి అనుకునేవాళ్ళకు నచ్చినా చాలు... ధన్యుణ్ణి....

12 comments:

Anonymous said...

హారం లో అడుగు పెట్టగానే' రాజమండ్రి ' అని అందంగా కనిపించిన అక్షరాలు నా కళ్ళకు గాలంవేసి ఇటు లాక్కొచ్చి పడేసాయండి
మీ మాటల్లో రాజమండ్రి ని చూస్తుంటే శ్రీపాద వారి కథలు అలా అలా గుర్తొచ్చేసాయండి . అయ్యో అప్పుడే అయిపోయాయా అనిపించిందండి . ఇంకా గోదావరి గట్టు, ఆర్ట్స్ కాలేజీ, సెంట్రల్ జైలు, కంబాల చెరువు, ఉన్నాయికదండీ . అవన్నీకూడా ఒకసారి తిప్పి చూపించెయ్యలేకపోయారా . మీకు చెప్పలేదు కదూ రాజమండ్రి మాదికూడా నండి

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

మన రాజమండ్రి కధ బాగా చెప్పారు. నేను నిన్నే అనుకున్నా మన ఊరు కబుర్లు వ్రాయాలని. మీరే అన్నీ చెప్పేసారు. నాకు మూడేళ్ళ
వయసులో మా నాన్నగారు ఇక్కడి బ్యాంకుకు ట్రాన్స్పర్ ఐనప్పుడు వచ్చాం. కాలేజీ వరకు ఇక్కడే చదువుసంధ్యలు.మళ్ళీ బ్యాంకు ఉద్యోగ
రిత్యా ఊర్లు తిరుగుతూ 1972లో మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అప్పటినుంచే మనం స్నేహితులమయ్యాము. అదీ కత!

శ్రీలలిత said...

మాదీ రాజమండ్రీయేనండీ..
అసలు ఆ ఊరు, ఆ గోదావరిపైన తేలి వచ్చే గాలులు తలచుకుంటేనే సంతోషం పొంగివచ్చేస్తుంది.
మా ఊరు గురించి బాగా చెప్పేరు.

రసజ్ఞ said...

రాజమండ్రీ అని చూడగానే ముందు ఇదే తెరచి మొత్తం చదివేశా మా (మన) రాజమండ్రీని తరచి తరచి చూసినట్టుంది అంత చక్కగా వివరించారు. సిరి సిరిమువ్వ శివాలయం, సారంగధర మెట్ట మరిచారు అవి కూడా చూపించేయకపోయరా?

Anonymous said...

రాజమంద్రి మెయిన్ రోడ్లో కిళ్ళీలమ్మే అతను చాలా విలక్షణంగా కనపడి కబుర్లు చెప్పేవాడు. నాకు బాగా గుర్తు. ఎప్పటి జ్ఞాపకాలు మళ్ళీ చాలా అందంగా చెప్పేరు. రెండు నెలల కితం రాజమంద్రి వచ్చినపుడు మెయిన్ రోడ్ అంతా కాలి నడకన ఒక సారి తిరిగితేకాని తృప్తి తీరలేదు.

Anonymous said...

EXCELLANT.i am feeling I am unfortunate I am forced to leave Rajahmundry.Many Many happy memories many many friends like you keep me active today.Please add some more happy memories I too will recollect and communicate to you.

Regards and best wishes

kvshastri

హనుమంత రావు said...

లలిత గారు, మీరు మనసారా అభినందించారు.. చాలామంది చదివి అభినందిస్తున్నారు.. చాలా ఆనందంగా ఉంది...మీరు చెప్పినట్టు వ్రాయడానికి ప్రయత్నిస్తా..మీ స్పందనకు కృతజ్ఞతలు..

అప్పారావుగారు, నేనంతా ఎక్కడ వ్రాసానండి.. మీలాంటివారైతే ఇంకా.. నాకన్నా బ్లాగా... సచిత్రంగా, సకార్టూనులుగా వ్రాయగలరు.. వ్రాయమని నా హంబుల్ రెక్వెస్ట్..

శ్రీ లలితగారు, ధన్యవాదాలు... నేను వ్రాసినది ఎలా ఉంది అని కాదు కాని మన రాజమండ్రి వాళ్ళు దగ్గరవుతున్నారు... ధన్యుణ్ణి

రసజ్ఞ గారు, ధన్యవాదాలు.. మీ సూచనమేరకు ప్రయత్నిస్తా... మీ బ్లాగు చూసా. రసజ్ఞ అనే పేరులాగానే నవరసభరితంగా ఉంది.. నారసింహుణ్ణీ చాలా బాగా వ్రాసారు.. నరసింహ తత్త్వం నా "అసలు పాయింట్" పోస్టు లో చెప్పే ప్రయత్నం చేసా... ద్వంద్వాతీతమైనది నరసింహ తత్త్వం... మీ కవితలు చాలా బాగున్నాయి... కంగ్రాట్స్..

కష్టేఫలే... నమస్కారం... రాజమండ్రి వచ్చినప్పుడు మాకు తెలియజేయండి.. కలుసుకొని రాజమండ్రి జ్ఞాపకాలు చెప్పుకోవచ్చు... మన రాజమండ్రి విషయాలు మీకు మరల గుర్తు చేయగలిగినందులకు ధన్యుణ్ణి.

శాస్త్రీ జీ,, మీ ఆనందం ఇక్కడ కనపడింది.. ఇందాకా ఫోన్ లో వినబడింది... రాజమండ్రివాసులెక్కడ ఉన్నా ఆ మధురానుభూతుల ఆనందాశ్రువులు ఈ జీవనదికి మరింత చైతన్యాన్ని కలిగిస్తున్నాయి.. మాతృభూమి హృదయాన్ని కరిగిస్తున్నాయి. ధన్యోస్మి....

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

నమస్కారం హనుమంతరావు గారు,!!మేము కూడా రాజమండ్రి వాళ్ళమే,వీరభద్రపురం

ఓల్డ్ పోస్ట్ ఆఫీసు వీధిలో కొంతకాలం తరువాత చాలాకాలం దానవాయిపేట చిన్న
ఆంజనేయస్వామి గుడి
వీధి లో
వున్నాము. మేము కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజీ చదువుకున్నాము. తరువాత జీవనక్రమం లో
వివాహం పుట్టిల్లు వదలడం జరిగియి.తీరిక గ పాత
రోజులు తలుచుకోవడం కోసం క్రిందటివారం రాజమండ్రి నేను మావారు వెళ్ళాం,చాల
అబివృద్ధి జర్గింది కాని హోటల్ అప్సర(చాల మంచి కాఫీ దొరికేది,సినిమా వాళ్ళు ఎక్కువ గ దిగేవారు ఒక్క
మాటలో చెప్పాలంటే అప్పటి స్టార్ హోటల్ అది "గ్రౌండ్ జీరో " అయింది. అది ఒక బాధాకరం అనిపించింది.ఇంకా
మా కాలేజీ వేల వేల పోతోంది.కర్పోరాటే కాలేజీల ఒరవాడి లో దీనీ గురుంచిపట్టించికొనే తీరికలేదు.
దానవయపేట్,ప్రకాష్ నగర్ లోని ఇల్లు అన్ని మల్టీస్టోరి భవనాలుగా రూపాంతరంచెందాయి.

సరే మన గోదావరి ఆ తల్లిస్పర్స లేకుండా రాలేము కదా అని పుష్కర రేవుకి వెళ్ళాము. అక్కడ ఆ తల్లిని చాల అపరిశుభ్రం గ ఉంచారు. చాలభాద వేసింది. తల్లి మీద తినిపారేసిన ప్లాస్టిక్సీసాలు,డబ్బాలు,చెత్తచెదారం, అక్కడ కొంచెమునగరపెద్దలు అందరు కలిసి శ్రద్ధ వహిస్తే మన రాజమండ్రి ,సంస్కృతి, ని కాపాడని వారు అవుతారు.


ఇంకా దామెర్ల వారి ఆర్ట్ గాలరి,గౌతమి లైబ్రరీ వున్నాయి. ఇంకా
సగమే చూసాము మళ్లివెళ్ళాలి. కొన్ని
జ్ఞాపకలు మాత్రమే మిగిలాయి.
చాల సంతోషము రావు గారు మీ బ్లాగ్
ద్వార మరో సారి గుర్తు చేసున్నాము మన
రాజమహేద్రవరం గురుంచి

మిస్సన్న said...

అయ్యా మన రాజమండ్రి గురించిన మీ జ్ఞాపకాలకు ఒళ్ళు పులకించింది.

హనుమంత రావు said...

పలుకులతల్లి గారాబు బిడ్డడు పులకరించి పలక రించారంటే ఈ నా రెండు పలుకులు ధన్యత చెందాయి అభినందనలు శ్రీ మిస్సన్నగారు.

పూర్వఫల్గుణి గార్కి. నమస్కారము. సుదీర్ఘమైన మీ లేఖ చూసాను.వీరభద్రాపురం అంటే మాకు చాలా దగ్గర. మాది శ్రీరామనగర్. మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అన్నారు.నేను యస్.బి.ఐ వాణ్ణి.ఆవిధంగానూ మనం బ్యాంకింగ్ పీచే నన్నమాట.చాలా విషయాలు వ్రాసారు. కృతజ్ఞతలు...గోదావరి నది కాలుష్యం గురింఛి... ఎవరిననాలి ? శ్రద్ధలేని పాలకులనా, బాధ్యతలేని మనవారినా... గోదావరివంటి పవిత్రనది ఉంది కనుక రాజమండ్రి ఒక క్షేత్రమైంది... ఆ క్షేత్రాన్ని బట్టి ఇంతటి నగర వ్యవస్థ... ఒకదానికొకటిగా వర్తక వాణిజ్యాలు.. కాని, అన్నింటికి మూలమైన గోదావరిని మరచిపోతున్నారు.. అది చాలా బాధాకరం... దానికి ఎవరినో బాధ్యులను చేయడం కాదు, మన బాధ్యతే ఇది అని ..భారత్ వికాస్ పరిషత్ (వివేకానందశాఖ) ఒక ప్రయత్నం ప్రారంభించింది... అందులో నేనూ ఒక సభ్యుణ్ణి... పున్నమి నాడు గోదావరికీ హారతి అని ఒక కార్యక్రమం నాలుగేళ్ళక్రితం ప్రారంభించాము...కేవలం ఆధ్యాత్మికతయే కాకుండా... ఆ సందర్భంలో కాలుష్యనివారణ ఆవశ్యకతను జనాలకు గుర్తు చేస్తూ ప్రముఖ వ్యక్తులచేత కొద్దిసేపు మాట్లాడించడం... అక్కడ ఉన్నవారికి చేస్తున్నతప్పును చూపి, సరిదిద్దుకోమనడం, ఈ విషయాన్ని విశదీకరిస్తూ కరపత్రాలు పంచడం... ఇలాంటివి మా హారతి కార్యక్రమంలో భాగాలు.. దీనివల్ల కొంతైనా అవగాహన కల్గుతున్నదని మా అభిప్రాయం. పుష్కరఘాట్ లో మేం ప్రారంభించాము..ఆ స్పూర్తియేమో తెలియదు మరొక డబ్బున్న సంస్థవారు భారీగా ఆ రేవులోనే పున్నమి హారతి ప్రారంభించి ఏడాదికాలంగా నిర్వహిస్తున్నారు.. వారితో పోటీ పడలేమని మేము గౌతమ్ ఘాట్ కు వెళ్ళి అక్కడ మా పున్నమి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము... ఇది ఇలా వుండగా ప్రతి మూడవ ఆదివారం ఉదయం పుష్కర రేవులో పారిశుధ్యకార్యక్రమం చేసాము కొన్నాళ్ళు. ప్రత్యేకమైన టి-షర్టులు ధరించి చీపుళ్ళు గంపలు పట్టుకుని ... ఓ గంటసేపు రేవును శుభ్రపరచడం, కరపత్రాలు పంచిపెట్టడం, మైకుల్లో చెప్పడం చేసాము... అన్ని కార్యక్రమాలకు వచ్చే ఆటంకాలలాగానే అంత ఉదయం అంటే మిత్రులు రావడానికి కష్టపడుతున్నారు... ఇష్టపడటంలేదు... అది కొంచెం ఆగింది.. కొనసాగించాలని మనస్సుల్లో ఉంది... చూడాలి...మా వంతు కృషి ఇది... మీరూ చేయి కలపండి అని కోరడానికే ఈ సోత్కర్ష.... అధికప్రసంగం అనిపిస్తే మన్నించండి..

ajay said...

రాజమండ్రి గూర్చి ఇంత అందంగా వర్ణించడం చాలా బాగుంది

హనుమంత రావు said...

Sri Ajay.. thank you for your affection..