Pages

Friday, April 6, 2012

రాజమండ్రి...3 (డొచ్చేసింది)




రాజమండ్రి గురించి నే వరుసగా వ్రాసినవి చదివిన నా చిన్ననాటి మిత్రుడు "రాజమండ్రిలో మన స్కూలుగురించి వ్రాసావు మరి సోములు ఐస్ బండిగురించి వ్రాయలేదేరా " అని  అడిగాడు.. నా వ్రాత వాడికి పాత రుచులు గుర్తు చేసిందన్నమాట ... నాటి రుచులు గుబాళిస్తూ వెంటనే  నాకూ  మూడొచ్చేసింది.... అందుకే ఈ రాజమండ్రి మూడు..ఆస్వాదిస్తారు కదూ....

మేము హైస్కూల్లో చదువుకునేరోజుల్లో మా గేటుదగ్గర రెండు ఐస్ బళ్ళుండేవి. వడ్రంగులు చిత్రిక పట్టే పనిముట్టును తిరగేసి బండికి బిగించుకుని దానిమీద ఐస్ కోరి.. ఆ కోరు ఓ గ్లాసులో వేసి కలరు, సబ్జాలు, నీళ్ళు వేసి డ్రింకు చేసి ఇచ్చేవారు.. ఆ ఐస్ కోరు ఒక పుల్లకు తమాషాగా చుట్టి కలరు వేసి ఐస్ ఫ్రూట్ లా అమ్మేవారు...అక్కడ ఉన్న రెండు బళ్ళల్లోనూ ఒకటి సోములుది, రెండవది వెంకట్రావుది.. మాకు సోములు బండి దగ్గర అరువుండేది.. ఈతడి పలకరింపు బాగుండేది.. ఇంకో ఐస్ బండి వెంకట్రావుది .. అతడు కొంచెం సీరియస్.. మాట బాగుండేది కాదు.. సోములు సబ్జాలు, కలరు అడిగితే మరికొంచెం వేసేవాడు. వెంకట్రావా ? అస్సలు వేసేవాడు కాదు...ఇంకో తమాషా ఏమిటంటే నేను బ్యాంక్ లో ఫీల్డాఫీసరు అయ్యాక కంబాల చెరువు దగ్గర  నివాసముండే చాలా మంది ఐస్ బళ్ళవాళ్ళకి లోనులిచ్చాను. అదో థ్రిల్.. కాని పాపం  సోములు, వెంకట్రావు లేరు...మా స్కూలు ముందర ఓ మామ్మ చిన్న అద్దాలపెట్టెలో కొబ్బరినౌజుండలు, వేరుశనగపప్పుండలూ, రేగొడియాలు... అమ్మేది.. కొబ్బరినౌజు, వేరుశనగుండలు నాకు భలే ఇష్టం. ఇప్పటి వియ్యంకుడైన అప్పటి ఫ్రెండ్ నేనూ బాగా లాగించేవాళ్ళం.. ఆవిడ సీమ సింతకాయలు అమ్మకానికి పెట్టిందంటే  మార్నింగ్ స్కూల్స్ వచ్చాయన్నమాట... గోదావరొడ్డునే మా స్కూలు....గోదావరికి కొత్తనీరు వచ్చినప్పుడు పడమటి గాలి వచ్చేది..  క్రొత్త అకడమిక్ సంవత్సరం ప్రారంభానికి అది సూచన... ...ఇప్పటికీ ఆ గాలి మేనుకి తగలగానే ఆ రోజుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాను.. నిజం...క్రొత్త క్లాసులు... క్రొత్త పరిచయాలు అవన్నీ గుర్తొస్తాయి. అందులోనూ ఆ విశాలమైన స్కూలు ప్రాంగణంలో గోదావరి మీదనుంచి వచ్చే చల్లటిగాలి వంటికి తాకుతూంటే....చాలా ఆనందంగా క్రొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది.. అందమైన బాల్యం...

రాజమండ్రి pkp గురించి చెప్పాలండి.. మీరు  ఎప్పుడైనా తిన్నారా... మేం సరే మీరు తిన్నారా ? అని. ఏం రుచండీ అది.. ఒక పుష్ కార్టు. దానిపైన ఎడమవైపుగా అటుకుల రాశి.. మామూలు ప్రెస్ అటుకులైతే నిమ్మ రసం తడికి మెత్తబడతాయి. కాని ఇవి మిక్చరు అటుకులు.. కర కర లాడతాయి.. ఆ అటుకుల రాశిని అందంగా నలు చదరంగా చేసి దాని మధ్యగా ఓ చిన్న సైజు చిల్లుల కుండ - అందులో నిప్పులువేసి పెడ్తారు.. అడపా తడపా ఆ అటుకులు రాశిని అడుక్కీ పైకీ కదుపుతాడు., అటుకులు వేడిగా తాజాగా ఉండడానికి... కొంచెం అటుకులు ఓ గిన్నెలోకి తీసుకుని, పచ్చి ఉల్లి ముక్కలు, వేయించిన వేరుశనగ గుళ్ళు, పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు, కారం ఇంకా ఏవో వేసి నిమ్మరసం పిండి బాగా చేత్తో...చేత్తోనే, చమ్చాలతో కాదు, కలిపి చిన్న కాగితం పొట్లాంలో కట్టిస్తాడు.. వేడి వేడిగా ...కారం కారంగా... పుల్లపుల్లగా ఉన్న కర కరలాడే ఆ మిక్చరు తింటే ఉంటుందండీ మజా... ఓహ్... ఆ రుచే వేరు. ఇందులో మిర్చితోకాని,అరటికాయ,టమోటాతో కాని చేసిన బజ్జీ ముక్కలు  వేసికూడా చేస్తున్నారిప్పుడు ..  పి.కె.పి.... అంటే పిడత క్రింద పప్పు... సాయంత్రం గోదావరి గట్టుమీద చల్లగాలిలో  స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ అలా తింటే... అడక్కండి మరి.. అలా మళ్ళి మళ్ళీ చేయించుకుని తినాలనే ఉంటుంది...
ఓ సారి మద్రాసు వెళ్ళా....ప్చ్ ఎంత అందమైన బీచ్ అయితే మాత్రం పి.కె.పి లేదు కదా అని బాధేసింది... వైజాగ్ బీచ్ ఎంత బాగుంటే మాత్రం..పికెపి ఉందా ? ఇంకెందుకండీ ఆ బీచ్///...... మరమరలతో కూడా చేస్తారు కాని ప్చ్..బాగోదండీ... ఇలాంటి పి.కె.పి గోదావరి జిల్లాల్లోనూ ముఖ్యంగా ఇక్కడా, కాకినాడల్లోనే చూసా... మరెక్కడైనా మీరు చూసారేమో నాకు తెలియదనుకోండి.. 
ఈ పికెపి కొందరైతే చాలా బాగా చేస్తారు.. వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళం..మా ఊళ్ళో ఈ మిక్చరు బళ్ళవాళ్ళకి అసోసియేషన్ కూడా ఉండేదండి. వాళ్ళు దేశరక్షణ నిధికి  విరాళాలు కూడా ఇచ్చారు...
మా ఇంటిదగ్గరనుంచి సాయంత్రం అయ్యేసరికి సీతంపేట రామమందిరం దగ్గర చేరి ఈ బండికోసం వెయిటింగ్... కనుచీకటి పడుతుంటే వచ్చేవాడు.. బండికి ముందు చిన్న ఇలాయి బుడ్డి తగిలించేవాడు.. ఆ బుడ్డిలో కిరసనాయిల్ పోసి లావుగా వున్న వత్తి వేసి వెలిగిస్తే చిమ్నీ లేకపోయినా చిన్న చిన్న గాలి తాకిడికి ఆరేదికాదు..ఎత్తుగా ఉన్న సీతమ్మ చెరువుగట్టుమీంచి సీతంపేటలోకి తిరిగేవాడు...(ఆ ఎత్తుగా ఉండే గట్టు ఇప్పుడు లెవెలయిపోయింది)... దేదీప్యమానంగా వెలిగే ఆ ఇలాయి బుడ్డి దీపం మాపాలిట ఆశాజ్యోతి. అది వస్తోంది అనగానే...మనసు ఉరకలు వేసేది...ఊహల్లోని నిమ్మరసం నాలుకమీద అల్లరి చేసేది.... మా వైపు వస్తున్న ఆ ఆశా జ్యోతిని .. దారిలో ఎవ్వరైనా ఆపితే.. వాళ్ళు  కొనుక్కుంటూంటే మాకు టెన్షన్... మా దగ్గరకి వచ్చేటప్పటికి ఐపోతుందేమో అని....ఆ బండి ఓనరు పేరు కళ్యాణి... నేను ఇందాక చెప్పిన అసోసియేషన్ లో ఆఫీస్ బేరర్... మిర్చి బజ్జీ (సైజులో చిన్నవి) పొట్ట నిలువుగా చీరి ఉల్లిముక్కలు మొదలైనవి వేసి నిమ్మరసం పిండి ఇస్తే, అవి తింటుంటే డబ్బులుండాలి కాని బాగానే లాగించేసే వాళ్ళం. అది అయ్యాక మిక్చరు... ఇంట్లోని పెద్దవారు చూస్తే చిరుతిళ్ళతో ఆరోగ్యంపాడవుతుందనే చేసే హెచ్చరికలు వినాల్సి వస్తుందేమోననే ఎరుగున్నవారు చూడకుండా జాగ్రత్తపడుతూ భయం భయంగా తినేవాణ్ణి.. నాన్నగారూ అమ్మా ఏమీ అనేవారు కాదు.. కాని ఏదో భయం...ఆ కాలం పిల్లలం కదా....

గుండువారి వీధిలో సింగు బండి.. మడి షావుకారు అని  నేనూ మా మిత్రుడూ అనుకునేవాళ్ళం.. ఎందుకంటే సాధారణంగా ఈ బళ్ళవాళ్ళు బండికి ముందుభాగంలో అటుకులతో పాటు అందులో వేయవలసిన వేరుశనగగుళ్ళు,శనగపప్పు ఇలాంటివి పళ్ళాలతో వేరు వేరుగా పెట్టుకుంటారు.. వాటిల్లో చేతులెట్టి  అడపా తడపా తినడం కొందరికి సరదా. ఆ అవాంఛనీయ సంస్కారం ఇప్పుడూ ఉంది.. అలాంటివారిని ఈ షావుకారు అసలు ఎలోవ్ చేసేవాడుకాదు.. చూసాడో పెద్దగొడవ చేసేసేవాడు...తరచు పొడిగుడ్డతో ఆ మిక్చర్ కలిపేచోట తుడిచి నీట్ గా ఉంచేవాడు.. పెద్దపంచె కట్టి, లాల్చీ వేసుకుని బుజాన ఓ ఎర్రటి కండువాతో చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉండేవాడు... అందుకని మ డి షా వు కా రు అని పేరు మేం పెట్టుకున్నాము... మిక్ఛరు చాలా రుచిగా చేసేవాడు.. రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు.. ఇప్పుడు గోకవరం బస్టాండులో ఉన్న ఠాకూర్ స్వీట్స్ అతడి కొడుకో/మనుమడో  నడుపుతున్నాడు. అతడుకూడా నీట్ నెస్ పాటిస్తాడు... నేను ఓ సారి అక్కడికి వెళ్ళినప్పుడు అతడు చెప్తూ అప్పట్లా కంట్రోల్ చేయడం ఇప్పుడు కష్టమవుతోందని వాపోయాడు.. వీరభద్రా టాకీసు (ఇప్పుడు దాని పేరు శివజ్యోతి) దగ్గరకూడా మిక్చరు బాగా చేసేవారు.. ఇప్పటికీ మునిసిపల్ ఆఫీసు గోడదగ్గర, మార్కండేయస్వామి ఆలయందగ్గర.. ఇంకా కొన్నిచోట్ల బాగా చేసేవారున్నారు.. అఫ్ కోర్స్ -- ఎవరో చెప్పినట్టు తిందామనుకున్న వయసులో తలిదండ్రుల చాటు పిల్లలకు చేతిలో డబ్బులు ఆడేవి కావు.. ఇప్పుడు తిందామన్నా... ప్చ్... వదిలేయండి.

మా స్కూల్ దగ్గర పుష్కరాల రేవులో ఓ కాకా హోటల్ ఉండేది.. అక్కడ ఇడ్లీ విత్ మిర్చి చట్నీ చాలా రుచిగా ఉండేది...
ఫోర్ట్ గేట్ దగ్గర ఇప్పుడు లక్ష్మీ ఎజన్సీస్  ఉన్నచోట రాజేశ్వరీ కాఫీ విలాస్ అని ఉండేది. ఆ ప్రాంతంలో అదొక్కటే కాఫీ హోటల్ .అక్కడకి వెళ్ళి ఓ కప్పు కాఫీ అంటే అణాన్నరకు పెద్ద స్టీల్ గ్లాసునిండా కాఫీ ఇచ్చేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఐనా సరే... నోటిలోకి పొరపాటున జారిపోతుందేమో అన్నంత.పట్టుకుకూడా ఇమడని. బుల్లి బుల్లి ప్లాస్టిక్ కప్పులతో ఇచ్చే ఈ నాటి కాఫీతో పోల్చగలామా ? చెప్పండి. ఇన్నమూరి చెంచయ్య హోటల్ ఇడ్లీ సాంబారుకి ప్రత్యేకం.. దానికి రెండు గుమ్మాలుండేవి. ఓ గుమ్మందగ్గర ప్రొప్రయిటర్ చెంచయ్యగారుండేవారు.. తిన్నవాళ్ళు కొందరు  రెండొ గుమ్మంలోంచి డబ్బులివ్వకుండా పోయేవారని అనేవారు.. అంతకన్నా నాకు తెలియదు... 
నేను యస్ యస్ యల్ సి చదువుతున్నప్పుడనుకుంటా లక్ష్మీ కేఫ్ తెరిచారు.. అక్కడ ఇప్పుడు తుమ్మిడి రామకుమార్ గారి వస్త్రాలయం ఉంది.. కేఫ్ అంటే అప్పుడర్థం కాఫీహోటల్ అని... ఇప్పుడు కేఫ్ అంటే అర్థం వేరు.. సప్పోజు ఇప్పుడు  సైబర్ కేఫ్ కు వెళ్ళామనుకోండి.. కాఫీ దొరకదు కదా మరి ? అదన్నమాట....ఆ లక్ష్మీకేఫ్ పేరు పెద్ద అక్షరాలతో వ్రాసి దానిక్రింద Tag  ఏమిటో తెలుసా సార్ ? -- "ఈ హోటల్ లో తినుబండారాలు వెన్నకాచిన నేతితో చేసినవి  కా వ ని  ఋజువు చేస్తే నూటపదారు రూపాయలు బహుమతి" అని వ్రాసి ఉండేది.. వాటిలో రుచి కూడా అంత్ద ఛాలెంజింగ్ గానూ ఉండేది.. మేము కాలేజీలో ఉండగా అయితే సాయంత్రాలు తరచూ వెళ్ళేవాళ్ళం. దోసె.. అంటే మినపట్టు గొప్పగా చేసేవాడు.. సాయంత్రం ఆ దోసె కోసం చాలామంది వచ్చేవాళ్ళు. అందులో చట్నీ & సాంబారు గొప్ప టేస్ట్.. మాకు ఒక దోసె రెండు ప్లేట్స్ చట్నీ అడక్కుండానే ఇచ్చేవాళ్ళు సర్వర్స్. అంత రెగ్యులర్ మరి.. అప్పుడప్పుడు టిప్స్ ఇచ్చేవాళ్ళంలెండి.. చపాతీ కుర్మా అక్కడ మరో స్పెషల్.. ఆ కుర్మా తలచుకుంటే ఇప్పటికి ఆ రుచి గుర్తొస్తుంది.. ఇడ్లీ విత్ కారప్పొడి...అండ్ వెన్నకాచిన నెయ్యి..  పోసేసేవాడండి బాబూ... ఇడ్లీ కూడా మామూలు తడివస్త్రాల్లో ఇడ్లీ పాత్రల్లో వేసి ఆవిరిమీద వండి.. వేడి వేడిగా ప్లేటులో అరటాకువేసి ఇస్తే..  నేతితో కారప్పొడి నంచుకు తింటే... ఆ టేస్ట్ ఈ మిషన్ ఇడ్లీలకి వస్తుందా... ఇప్పటివాళ్ళకి ఆ రుచులు తెలియవు పాపం అనిపిస్తుంది... అలా అంటే బర్గర్లు పిజ్జాలు అంగీకరించవు. కాఫీ కూడా చాలా బాగుండేది.. కాఫీ లేకుండా టిఫిన్ ఒక్కటీ అంటే నాకు ఏదో వెలితిగా ఉండేది. అందరం చందాలు వేసుకుని మరీహోటల్ కు వెళ్ళేవాళ్ళం...టిఫిన్ అనే వాళ్ళుమిత్రులు కాదు.. కాఫీ హోటల్ ఇది, కాఫీ త్రాగకపోతే టైటిల్ జస్టిఫై అవదు అనేవాణ్ణి నేను.. వాళ్ళు తిట్టుకుంటూ నా మాటను పాపం...గౌరవించేవాళ్ళు.
తర్వాత ఈ లక్ష్మీ కేఫ్ వారు పంచవటి అని దానిదగ్గరనే ఓపెన్ చేసారు.. అదికొంచెం దీనికన్నా ఖరీదెక్కువ. దానిలో ఎ.సి.రూమ్ కూడా ఉండేది.. మా ఊళ్ళో ఎ.సి.రూమ్ ఉన్న హోటల్ దానితోనే ప్రారంభమేమో... ఆ పంచవటి హోటల్ రాకమునుపు అక్కడ ఓ పఠాన్ నిర్వహణలో ఏదో షాపు ఉండేది. అక్కడ వాళ్ళవాళ్ళు పఠాన్ లు వచ్చి కూర్చుంటూ ఉండేవారు. పఠాన్ లనే కాబూలీవాలా లనికూడా అంటారనుకుంటా.. వాళ్ళు తమబాకీలు వసూలు చేసుకోవడంలో ఘటికులని చెప్పేవారు.. మంచు దేహసౌష్ట్యంకలిగి, చేతిలో ఓ చిన్నలాఠీతో, నెత్తిమీద టర్బన్, లూజ్ కుర్తా పైజమా వేసుకుని భలే ఉండేవారు. ఇప్పుడు రాజమండ్రిలో వాళ్ళు కనిపించటంలేదు. ఇక వరదరావు ఇడ్లీ మా ప్రక్క ఊళ్ళల్లో కూడా ఫేమస్. ఆ హోటల్లో ఉప్మా అడిగితే ఓ గరిటె ఉప్మాకు ఓ గరిటె కూర,,, ఓఁ కడుపునిండిపోయేది...
వీరిదే శాంతినివాస్ కూడా.. మంచినీళ్ళు ఒగేల్ గ్లాసులో ఇచ్చేవారు.. అలా చూసినా చాలు.. దాహం తీరిపోయేది... నేను బ్యాంకులో చేరకముందు... ఫారెస్ట్ డిపార్ట్ మెంటులోపనిచేసేవాణ్ణి.. దారిలో ఆల్కట్ గార్డెన్స్ లో లక్ష్మీ కేఫ్ అని చిన్నిహోటల్ ఉండేది. అక్కడ సింగిల్ కాఫీ ఇచ్చేవారు.. సగం కాఫీ అన్నమాట.. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ టిఫిన్ తిని సైకిలెక్కితే సుమారు ఐదు మైళ్ళు శ్రీరామనగర్ చేరేటప్పటికి.. మామూలుగా ఆకలేసేసేది. బుధవారం సాయంత్రమయితే మాత్రం బోండా సాంబారుకోసం శాంతినివాస్ కి వచ్చేవాళ్ళం.. చాలా బాగుండేది.

కిరసనాయిల్ వడలగురించి కూడా చెప్పాలని ఉంది.. గౌతమీ లైబ్రరీ డౌనులో (ఇప్పటి నాగదేవి టాకీసు ఎదురు సందులో) సాయంత్రమయ్యేసరికి ఓ చిన్నసైజు స్టాలు వెలిసేది. అది ఏరోజుకారోజే టెంపరరీ అరాంజ్ మెంట్. ఆ ఓనరు సి.టి.ఆర్.ఐ లో టెంపరరీగా పని చేసేవాడట. సాయంత్రమయ్యేసరికి తన సైకిలుకి వెనకాల కట్టెపుల్లలు, ముందరి హేండిల్ బార్ కి కావలసిన సామానులు అన్నీ వేసుకుని వచ్చేవాడు.. రోడ్ ప్రక్క ... క్రింద పొయ్యివెలిగించి, మూకుడుపెట్టి నూనె కాచి వడలు వేసేవాడు.. అబ్బో చాలా రుచిగా ఉండేవి.. బోల్డు డిమాండు.. నాలుగు వడలడిగితే మూడు వడలు మాత్రమే ఇచ్చేవాడు, మిగతా డబ్బులకి ఓ మిరపకాయ బజ్జీ అలా కోటా సిస్టమ్.. దానికంత రుచేమిటంటే నా వెర్షన్... మూకుడులో సలసల నూనె కాగుతుంటే వడలు వేసి వేపు సరిపోయిందా లేదా అని చూసుకుంటూ.. ఫైనల్ స్టేజిలో హరికేన్ లాంతరు పైకెత్తి ఆ లైటువెలుగులో చూసాక బయటికి తీసేవాడు.. అలా ఆలాంతరు ఎత్తినప్పుడే ఓ చుక్క కిరసనాయిల్ వేస్తాడు.. అందువల్లే ఆ రుచి.. అనేవాణ్ణి..... వాటికి అందుకనే నే పెట్టిన పేరు కిరసనాయిల్ వడలు.


ఇప్పుడాలోచిస్తే... ఈ రోజు ఇడ్లీ జత పదిహేను రూపాయలు .. అప్పుడు రెండణాలు.. పావలా పెడితే అప్పుడు  రెండు ఐటమ్స్.. 1990 దాకా కూడా ఒక రూపాయికి రెండు ఐటమ్స్ వచ్చేవి.. ఎంత స్పీడుగా ఎదిగిపోతున్నామో కదా... రాబళ్ళు పెరగటంలేదా అంటారేమో... కొన్ని వర్గాలలో పెరుగుతున్నాయేమో కాని్ అందరికీ కాదు.  కాని ఆ సరుకు నాణ్యత... ఆ రుచీ మాత్రం ఇప్పుడు లేవు అని నిస్సందేహంగా చెప్పవచ్చు...?

12 comments:

అక్షర మోహనం said...

పాత జ్ఞాపకాలని చెదరకుండా, చెరగకుండా ,ఎంతబాగా రాశారు..

Subramanya Shastry said...

బాబోయ్ ఇదేమి టపా? సగం చదివేసరికే ఇలాంటివే నా జీవితంలోని ఙ్ఞాపకాలు గుర్తుకొచ్చి, నోరూరింది. మరీ ఇంత విడమరిచి ఊరిస్తూ రాస్తే - చదివేవారికి కష్టమండీ!!!

హనుమంత రావు said...

అక్షరమోహన గారికి... స్పందనకు కృతజ్ఞతలు.
తెలుగుభావాల భావుకులకు... అయ్యా తిట్టినట్టా...పొగిడినట్టా... గిడినట్టే భావిస్తూ కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను.

Subramanya Shastry said...

కటువుగా తోస్తే క్షమించాలి. మీరు రాసిన వైనం - కంప్యూటర్ ముందు నోరూరిస్తే, ఏమి చెయ్యాలో అర్థంకాక అలా రాశాను. అద్భుతంగా రాశారు.

హనుమంత రావు said...

తెలుగుభావాలు...అయ్యా...మీ మనస్సు నేను నొప్పించాను. మన్నించాలి. మీ ముందరివ్యాఖ్యలోని అభినందన గ్రహించాను. జవాబుగా ఏదో వ్రాయబోయి సరిగా వ్రాయలేక ఏదో వ్రాసి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మన్నించమని కోరుతున్నాను. మీ ప్రోత్సాహం సదా కాంక్షిస్తూ.... హన్మంతరావు.

Ranga said...

At the outset for responding in english as i do not have facility to type in telugu in my system at present....however to retain the flavour and to add humour..let me try telugu in english script...mee mitrudiki bommalu veyadam vacchi mee rachanalaki rekahakrutini kooda yichi unte bapu-ramana la dwayam malli modalayyinda annattuga undedi...mee rachana chadivaka, naadi rajahmundry kaakapoyinaa (akkikedo eluru ni ammese adhikaram naakunnatlu) nenu kuda rajahmundry vadinenemo anipinchintaga rajahmundry parichayam ayyipoyindi....ayina mana...kshaminchali...naa pichigaani, mee rachanalo..rajahmundry andarini tana valle anukuntundani chappakane chapparu...marinka ee mee, maa.. golendukulendi...DESAMANTE MATTI KAADOYI anna mataki nidarsananga meeru rajahmundrylo pradesalakante prajalane yekkuva parichayam chesi raktikattincharu...mee rachana aa RAACHANAGARIKI oka (su)varnanabhushana..dhanyosmi..mee tadupari rachanakai naakunna rendu kallani 500 retlu penchi yedurchustu...selav.

హనుమంత రావు said...

శ్రీ రంగా గారూ, నమస్తే... మీరు ఇంగ్లీషించిన తెలుగు ఉత్తరం చాలా ఆనందం కలిగించింది.. లిగించదా మరీ.. ఏదేదో వ్రాసారు.. ఆ మహానుభావుని రచనలంటే అభిమానమున్న అభిమానుల యొక్క ప్రభావం నా మీద ఉందేమోకాని... ఆయన రచనలతో ఏ స్థాయిలోనూ... అబ్బే వద్దండి... ఇక మా మిత్రునితో డ్రాయింగ్స్ ప్రయత్నిద్దాం .. మీ మాటెందుకు కాదనాలి. మీ స్పందనకు చాలా చాలా కృతజ్ఞతలు.. వేలకన్నులెందుకు..త్వరలోనే మళ్ళీ చెయ్యిచేసుకుంటాను..

Ranga said...

Ayyaa....tappaka cheyyi chesukondi...memeppudu a tiyyani vaatalaki...i mean...vraatalaki siddhame

Telugu inti ammayi said...

ఇవన్నీ నేను కూడా రుచి చూశాను అనుభవించా కూడా .....! Thank u మరొక్కసారి నన్ను బాల్యం లోకి తీసుకువెళ్లి నందుకు........!

హనుమంత రావు said...

రంగా గారూ, నమస్తే... మీ స్పందన చూసాకా మీకో మెఇల్ పెట్టా... చూడగోర్తున్నాను..

తెలుగింటి అమ్మాయి... చక్కని పేరు పెట్టుకున్నారు మీ బ్లాగుకి... బాగుంది... మీ స్పందనకు కృతజ్ఞతలు.

Andhraman said...

What about Varada Rao Hotel near the banks of Godavari river? They used to make the best Rava Dosa.

హనుమంత రావు said...

dear andhra mana, probably it is Srinivas hotel one of Varadaraogroup of hotels..It is near Godavari Stn. All those hotels are not there now. yesterday's glamour.