గోధూళీ ధూసరిత కోమల గోపవేషం, గోపాల బాలక శతై రనుగమ్య మానమ్
సాయన్తనే ప్రత్రిగృశమ్ పశుబంధనార్థం, గచ్ఛంత మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం.
(కడుపునిండా మేత మేసిన గోవులను తోలుకొని, వాటిని వాటి వాటి స్థానాల్లో కట్టడానికి గోపాల బాలురతో కలసి... గోధూళి నిండిన దేహంతో వస్తున్న అచ్యుతునికి నమస్కరిద్దాము....)
వేదాంత వీధుల్లో తిరిగే వేదవేద్యుడు.. గోవిందుడై ... బృందావనంలో గోప బాలురతో గోవుల కాసుకుంటూ తిరుగుతున్నాడంటే ఏమాశ్చర్యం ?
"ఒక పులినతల మండప మధ్యమున మహేశ్వర ధ్యానము చేసుకుంటున్న సమయంలో" పోతనగారికి
తన ముందు ఆజానుబాహుడైన రాజకుమారుడు సాక్షాత్కరించాడట... ఘనమేఘముతో ఉన్న మెఱపుతీవలా ఒక స్త్రీమూర్తి ఆతడి ప్రక్కన శోభిస్తున్నదట .. చంద్రునిలాగా అమృతమయమైన చల్లని చిరునవ్వు ఆతడి మోమున వెలుగుతోందిట..... మూపున విల్లంబులు, అరవిందములబోలు విశాలనేత్రములు, నీలాకాశములో మెరిసే భానునిభంగి ఘన కిరీటముదాల్చిన ఆ అందగాడు తనని శ్రీరామభద్రునిగా పరిచయంచేసుకుని (తెలుగువారి భాగ్యమా అన) భాగవతము తెలుగులో వ్రాయమని పోతనగారిని ఆదేశించినాడట... ...
భాగవతమంటేనే శ్రీ కృష్ణుడు..
భగవంతుని కథ భాగవతము::భాగవతుల కథ భాగవతము::భాగవతము అనే పదే పదే అన్నా బాగౌతాము...
భా.. భక్తి; గ ...జ్ఞానం; వ ... వైరాగ్యము... భక్తి జ్ఞాన వైరాగ్య తాత్పర్యమే భాగవతమని ఒక నిర్వచనం చెప్పారు.
వ్యాసకృత భాగవతాన్ని మందార మకరంద మాధుర్యంలో ముంచి అందించారు పోతనగారు........
భీష్ముని పైకి కుప్పించి లంఘించు గోపాల కృష్ణుని కుండలాల కాంతి
కరిరాజు మొఱపెట్ట పఱువెత్తు కఱివేల్పు ముడివీడి మూపుపై బడిన జుట్టు
సమరమ్ము గావించు సత్య కన్నులనుండి వెడలు ప్రేమక్రోధ వీక్షణములు
కొసరి చల్దులు మెక్కుగొల్ల పిల్లల వ్రేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు
ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి
రయ్య ! ఏ రాత్రి కలగంటివయ్య ! రంగు
కుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు !
సహజ పాండితి కిది నిదర్శనమటయ్య !
(ఆయుధం ముట్టనని చెప్పాడు అర్జునునికి... కాని తన అనన్య భక్తుని రక్షించడానికి తన ప్రతిన కూడ మరచి రథాంగపాణియై భీష్మునిపైకి లంఘించాడు..
భార్యామణితో సరససల్లాపములలో తేలియాడుతున్న గజేంద్రుని ఆర్తనాదము వినగానే ఉన్నపళంగా పరుగెత్తాడు.. సంగటికాళ్లకు చల్దులు మాగాయ పచ్చళ్లతో నంజి మరీ నోటికందించిన అమ్మ కారుణ్యము కృష్ణుడు...... తన కవితామృతంతో భక్తుల హృదయాలను తడిపేసాడు తెలుగుకవి.....(జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి అందమైన భావన ఈ పద్యం)
అద్వైత సిద్ధిపొందిన కారణ జన్ముడు పోతన...
కనుకనే గోధూళితో ప్రకాశించే బాల కృష్ణుడు.. బూతి పూసుకున్న బాల శివునిలా దర్శనమిచ్చాడు పోతనగారికి....
తనువున నంటిన ధరణి పరాగంబు, పూసిన నెఱిభూతి పూతగాగ
ముందఱవెలుగొందు ముక్తాలలామంబు తొగలసంగడికాని తునకగాగ
ఫాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్ను గాగ
గంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయ మగు మెడ కప్పుగాగ
హారవల్లు లురగహారవల్లులు గాగ బాల లీల బ్రౌఢ బాలకుండు
శివుని పగిది నొప్పె శివునికి దనకును వేఱులేమి దెల్ప వెలయునట్లు....
.....................................శివాయ విష్ణురూపాయ... శివ రూపాయ విష్ణవే
విప్రా గావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశ్శమః
శ్రద్ధా దయా తితిక్షా చక్రతవశ్చ హరేస్తనుః
బ్రాహ్మణులు, గోవులు, వేదాలు, తపస్సు, సత్యం, దమం, శమం, శ్రద్ధ, దయ, సహనం, యజ్ఞం ఇవన్నీ విష్ణువు శరీరాలు...అని శాస్త్ర వచనం..
నీ నామము భవహరణము
నీ నామము సర్వ సౌఖ్య నివహకరంబు
నీనామమమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా...
కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయచ
నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః
చూపులకు చిన్ని వటువు... పలకరిస్తే పరమాత్మ..
బలి చక్రవర్తి ప్రశ్నలు వేసాడు.......
"వడుగా...ఎవ్వరి వాడ వెవ్వడవు, సంవాస స్థలంబెయ్యది..".
"ఇది నాకు నెలవని.. (నా చోటు అని) యే రీతి బలుకుదు.. నొకచోటనక నిండియునేర్తు" (అంతాటా నిండిన విష్ణువుకదా మరి)
"ఎవ్వరి వాడనని ఏంచెప్తాను నా యంతవాడనై నేనై తిరుగుతూ ఉంటాను"
"నీ నడిచేదెక్కడ అంటే ముల్లోకాలములలోను తిరిగే నేను ఫలాన చోట తిరుగుతానని చెప్పలేను"
తను ఎక్కడ ఉంటాడో చెప్పాడు... చేతనైతే పట్టుకో మంటున్నాడు...
ఎవరి వాడవంటే... అందరూ నాకు ఆత్మీయులే... అంటాడు..
తొలి సిరి గలదుట.. పాపం వటువుగా ఉన్నప్పుడు ఆవిడ లేదుకదా మరి..
ఆఖరిగా.. "సుజనులయందు దఱచు చొచ్చియుందు.."
నేను సజ్జనుల మధ్య ఉంటానని .. చెప్పాడు...
పట్టుకోవాలంటే సజ్జన సాంగత్యమొక దారి... ఒ క్క టే దారి.
4 comments:
ఆనందం పరమానందం, బాల కృష్ణుని లీల చూడగ భక్తకోటికి బ్రహ్మానందం.కృష్ణాష్టమి శుభకామనలు.
ఆనందం పరమానందం, బాల కృష్ణుని లీల చూడగ భక్తకోటికి బ్రహ్మానందం.కృష్ణాష్టమి శుభకామనలు.
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...
ఆ కృష్ణయ్య కృప సదా మీపై కురవాలని కోరుకుంటూ...
Post a Comment