Pages

Saturday, March 30, 2013

POPULAR SINGER AND ACTOR JITH

(శ్రీపాద జిత్ మోహన్ మిత్రకు ఈ రోజు డెభై ఒకటవ జన్మదినం .. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు (30-3-2013) ఆనంద్ రిజెన్సీ (పందిరి ఆడిటోరియమ్) రాజమండ్రిలో    సంగీత విభావరి కార్యక్రమము జరుగనుంది.. జిత్ గా చాలామందికి సుపరిచితుడయిన మా మిత్రుడు మంచి గాయకుడు, మంచి నటుడు, సహృదయుడు.. ఈ రోజు స్థానిక దినపత్రిక "సమాచారమ్" లో నా వ్యాసం ఇక్కడ ఇస్తునాను.. మీ అందరికీ ఆమోద యోగ్యము, ఆనంద కారణము అవుతుందని భావిస్తూ.........   




                           జిత్ డెబ్భై ఒకటవ జన్మదినోత్సవము
                                                                                                రచన:డి.వి.హనుమంతరావు.

ఎనర్జీ తగ్గలేదు. ఏడుపదులు నిండాయంటే నమ్ముతారా ?
పది ఏడులు నిండినా పదేళ్ల పసి హృదయము. కాదంటారా ?

డెబ్భై ఒకటవ జన్మదినోత్సవము జరుపుకుంటున్న జిత్తూ నేనూ గోదావరి తీరంలో అప్పట్లో ఉండే పురపాలకసంఘోన్నత పాఠశాలలో చదువుకున్నాము. అందుకని కొంత చనువు. ఆ చనువు జిత్తుకి నాతోనే ఏమిటి అందరితోనూ.....ఒక్క మాటలో చెప్పాలంటే మా జిత్ ను ఎందరో కావాలనుకుంటారు.. కాని తమాషా అందర్నీ కావాలనుకుంటాడు జిత్. సందడికి మారుపేరు జిత్.. 
శ్రీపాద వారింట 30-3-1943న ఈ సందడి కన్నుతెరిచింది.... ఒక కథా చక్రవర్తి, ఒక ఆస్థానకవి, ఒక సంగీతపాణి వీరందరి ఇంటిపేరు "శ్రీపాద"వారే.. వీరందరూ మన అఖండ గౌతమి అమృత జలాలను పానం చేసినవారే..మన ఊరికి గర్వకారణమైన జిత్ కూడా ఆ వంశనామంవాడే ...జిత్ పుట్టినింట అందరూ కళాకారులే.. అందరూ వారి వారి రంగాలలో సుప్రసిద్ధులే..తండ్రిగారు శ్రీపాద కృష్ణమూర్తిగారు.. గంభీరమైన కంఠంతో అద్భుతంగా రంగస్థలముపై పద్యాలు చదివేవారట. కృష్ణమూర్తిగారి పెద్దబ్బాయ్ పట్టాభి. మధురమైన గాత్రముకల శ్రీ పట్టాభి రంగస్థలనటులే కాకుండా డా.గరికిపాటి రాజారావుగారితో నాటకాలు వేసారు.. చలనచిత్రాలలో కూడా నటించారు..రెండవవాడు కుమారశర్మమంచి నటులు. ఎన్నో నాటకపరిషత్తులకు వారి ఆహ్వానం మేరకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఉంటారు..మంచి గాయకులు కూడా. ప్రతి ఏటా శ్రీపాద నాటక కళాపరిషత్ పతాకముపై నిజమాబాద్ లో నాటకపోటీలు  నిర్వహిస్తూ ఉంటారు. నాల్గవ అబ్బాయి  శ్రీ ఆంజనేయమిత్ర కూడా మంచి నటులు.. కృష్ణమూర్తిగారమ్మాయి యజ్ఞప్రభ మంచి గాయని....ఇక తర్వాతి తరానికి వస్తే పట్టాభి కుమారులు మణి, మంచి గాయకుడు, జిత్ ఆర్కెష్ట్రాలో డ్రమ్స్ ప్లేయర్. కుమార శర్మగారి అమ్మాయి శ్రీమతి యామిని ..యస్.పిగారి పాడుతా తీయగా కార్యక్రమములో మొదటి రోజుల్లోనే ప్రథమ బహుమతి కైవసం చేసుకున్న అద్భుత గాయని. జిత్ కుమార్తె చి.సౌ.వంశీ బాలనటిగా చేసినవి ఇరవై చిత్రాలైతే అందులో పద్దెనిమిది చిత్రాలకు నంది బహుమతులు గెలుచుకుంది. ఇంతటి కళాత్మక నేపధ్యంనుంచి  కృష్ణమూర్తి, సుబ్బలక్ష్మి దంపతుల మూడవ కుమారుడుగా వచ్చినవాడు మన కథానాయకుడు శ్రీపాద జిత్ మోహనమిత్ర... అందుకే ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ చెప్పినట్లు.. బాలీవుడ్ ప్రపంచంలో పృధ్వీరాజ్ కపూర్ కుటుంబాన్ని పోలింది మన జిత్ కుటుంబ నేపథ్యం...జిత్తుకు సంగీతం చెప్పినవారెవ్వరూ లేరు .. వారి కుటుంబాన్ని అనుగ్రహించిన కళాసరస్వతే గురువు..

హైస్కూలు రోజుల్లో పాడిన మొదటి పాటనుంచి.. ఇప్పటిదాకా ఒకే దమ్ముతో పాడుతున్నవాడు మన జిత్..ఇప్పటికీ స్టేజ్ మీద గంతులేస్తూ పాడుతున్న జిత్ ను చూస్తే డెబ్భై ఏళ్లంటే.. అబ్బే .. నమ్మలేం.
అది నిజం. ఇంత దమ్ముతో పాడడం ఇతనికే సాధ్యం.. పాడడంలోనే కాదు ఇతనిలో దమ్ము ఇతనితో ఎదిగింది. ఎదుగుతోంది. చదువుకొనే రోజుల్లో  ఏ గొడవ జరిగినా ముందు వీడినే పిలిచేవారు.. తప్పు వీడిదైతే దెబ్బలు తినేవాడు.. కాకపోతే మేష్టార్ని కూడా నిలదీసేవాడు. జిత్ ఆర్కెష్ట్రా 25ఏళ్ల రజతోత్సవాలు కాని, అపూర్వంగా సాగిన చలన చిత్ర సంగీత సప్తాహంకాని, ఆరుగురు అమరగాయకులకు పాటల నివాళికాని,  నవాంబరాలు, డిశంబరాలు, కనకాంబరాలు అంటూ చేసిన మూడురోజుల 50వ వార్షికోత్సవ  సంబరాలుకాని... అందరూ మెచ్చుకునే విధంగా దేనికదే అపూర్వరీతిలో నిర్వహించాడంటే అదీ అతడి దమ్ము. 1972లో కాకినాడ ఇంజనీరింగ్ కళాశాలలో కచ్చేరీ.. అల్లరి పిల్లలు.. స్టేజి ఎక్కినవాళ్ళందర్నీ అల్లరి పెట్టేస్తున్నారు..ఆ అల్లరిలోంచి జిత్ గొంతు ఖంగుమంది..మైకు పుచ్చుకుని జిత్ అందుకున్నాడు..."గునిజనో భక్త జనో" కిషోర్ పాట... తర్వాత సాగిన అద్భుత కార్యక్రమానికి ఆ అల్లరి మనస్ఫూర్తిగా సహకరించింది. అదీ జిత్ దమ్ము....చెన్నై సుప్రీమ్ ఆర్కెస్ట్రా వారు1982లో  రాజమండ్రిలో ఒక ప్రోగ్రామ్ చేసారు.. వారు ఒక పాట అద్భుతంగా పాడామని అనుకుని అలాగా రాజమండ్రిలో ఎవరైనా పాడగలరా అని సభాముఖంగా ఛాలెంజ్ చేసారు.. మనవాడు సభలో ఉన్నాడు.. ఊరుకుంటాడా.. గొంతెత్తి "మెహబూబా"...ఆర్.డి.బర్మన్ స్థాయిలో పాడితే తలవంచాడు సుప్రీమ్ ఆర్కెస్ట్రా కళాకారుడు.. అదీ జిత్ దమ్ము. హైదరాబాదులో ఉద్యోగంచేస్తూ, నైట్ కాలేజీలో లా చదువుతూ హైదరాబాదు ఖవ్వాలి బృందాలతో సై అంటే సై అని తొడగట్టిన దమ్ము జిత్తుది. "ఈశ్వర్" హిందీ సినీమా రాజమండ్రి ప్రాంతంలో షూటింగ్ అవుతుంటే ఆ బృందాన్ని తన కిషోర్ కుమార్ పాటల ప్రోగ్రాముకు ఆహ్వానిస్తే... అందులో హీరో అనిల్ కపూర్.. రాజమండ్రిలో హిందీ పాటలా అని చప్పరించిన వాడు... ఇతడి పాట దమ్ము చూసి అవాక్కయి నాలిక్కర్చుకున్నాడు...ఇలా ఎన్ని అద్భుత సంఘటనలో....
తను గురువుగా భావించే కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారిని 'ఆదుర్తి సుబ్బారావు అవార్డ్' తో గౌరవించి అద్బుతమైన సన్మానం చేసాడు..దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ అందుకున్న అక్కినేని వార్ని సన్మానించాడు.. ఎవరి మాటా వినదు అని భావించే భానుమతీరామకృష్ణ ఇతడి ఆహ్వానాన్ని అభిమానంగా అందుకుని సన్మానం స్వీకరించింది..యస్.జానకి, కమల్ హసన్, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కోటి, నూతన్ ప్రసాద్.. జిత్ చే సన్మానింపబడినవారిలో కొందరు.
బాపు, ఇ.వి.వి., విశ్వనాధ్, జంధ్యాల వంటి ప్రఖ్యాత చలనచిత్ర దర్శకులందరికీ రాజమండ్రి అంటే జిత్తే..సినీమా యూనిట్ కి ఏ అవసరమొచ్చిన నిముషాల్లో ఏర్పాటు చేయగల దిట్ట మా జిత్ అంటారు కళాతపస్వి. ఈ రోజు ప్రముఖ హాస్యనటునిగా పేరు గడించిన ఆలీని వెండితెరకు పరిచయం చేసిన వాడు జిత్.. ఆ ఆలీకి అపురూపమైన సన్మానం చేసాడు ....తననింతవాణ్ణి చేసిన గురువుగారికి చర్మంతో చెప్పులు కుట్టి ఇచ్చినా  ఋణం తీర్చుకోలేనంటాడు కృతజ్ఞతతో ఆలీ..   జిత్ కు 'ముద్దమందారం' సినీమాలో "నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి" పాట పాడే అవకాశమిచ్చారు జంధ్యాల. "శంకరాభరణం" లో "హలో శంకరశాస్త్రి.. ఏరియల్ శాస్త్రీ" అంటూ స్వంత పాట పాడితే, టైటిల్స్ లో లిరిక్స్, పాట జిత్ మోహన్ మిత్ర అంటూ పరిచయం చేసారు కె.విశ్వనాథ్ గారు..సుమారు రెండువందల సినీమాల్లో, ఎన్నో టి.వి.సీరియల్స్ లో చక్కటి నటుడిగా రాణించాడు జిత్. .. భుజాలమీద తన బిడ్డ వంశీతో  "సప్తపది" చిత్రానికి జానకి గారి పాట  "గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన", పాటకు అభినయించిన జిత్... ఇప్పటికీ మరపుకు రాడు...
తన మిత్రులెందరికో టి.వి.సీరియల్స్ లోనూ, చలనచిత్రాలలోనూ నటించే అవకాశము ఆ యా యూనిట్స్ కు చెప్పి ఇప్పిస్తూనే ఉంటాడు జిత్. అందుకనే పసి పాప హృదయమన్నది.. ఈ ప్రేమ నేనూ పొందాను.
ఇంకో మంచిగుణ మీ మిత్రునిది.. మనసా కర్మణా సెక్యులర్ . అందుకనే 'నవాంబరాలు' ముసల్మానుల రంజాన్ పండుగల్లోనూ, 'డిశంబరాలు' క్రైస్తవసోదరుల క్రిస్ మస్ పండుగకాలంలోనూ, సంక్రాంతి సంబరాలుగా 'కనకాంబరాలు' నిర్వహించి సర్వమానవ సౌభ్రాతృత్వము ప్రకటించుకున్నాడు.
మన జిత్ డెబ్భైఒకటవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ముప్ఫైవతేదీ నాడు జరగబోయే సంగీత విభావరిలో పాడే గాయకులు దక్షిణ భారతంలో పేరెన్నికగన్న శ్రీ ఉస్మాన్ (ముస్లిమ్  సోదరుడు), శ్రీ శామ్ సన్ (క్రైస్తవ మతస్తులు)తో పాటు, తనూ(హిందువు) పాడి... పాటకు సంగీతానికి మతాల అడ్డుగోడలు లేవని తాను నమ్మిన సిద్ధాంతాన్ని మరొక్కసారి ప్రకటిస్తున్నాడు మన శ్రీపాద జిత్ మోహన మిత్ర.....


2 comments:

సుధామ said...

జిత్ మోహన్ మిత్ర గురించి మీ ఆత్మీయ వ్యాసం బాగుంది.

హనుమంత రావు said...

మీరు స్పందించి అభినందించినందుకు చాలా సంతోషము.. ఇది స్థానిక దినపత్రికలో (సమాచారమ్) నిన్నటిరోజు పూర్తిగా ముద్రింపబడింది. చదివినవారు బాగా వ్రాసారన్నారు.. ఇవి యువభారతి నేర్పిన పలుకులు..