గిఫ్ట్ ప్యాక్
( హేండిల్ విత్ కేర్ ) డి.వి.హనుమంతరావు..
దేముడున్నాడా? లేడా? ...
ఏ నాటినుంచో ఉన్న గొప్ప సందేహం.. నిజం చెప్పాలంటే
దేముడు కన్నా ముందే ఈ సందిగ్ధం పుట్టి, దేమునితో పాటు ఎదుగుతోందేమో.
"....సత్వరుడై యెందును లేడు లేడని..." రాక్షస రాజు హిరణ్యకశిపుడు చాలా స్పష్టంగా లేడు పొమ్మన్నాడు..
"కలండు కలండనువాడు కలడో లేడో" అని పురాణకాలంలోనే గజ రాజు మనలాగానే కొంచెం డౌటు పడ్డాడు...
"హరి సర్వాకృతులం గలం డనుచు.." భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు స్పష్టంగా చెప్పాడు...
అప్పటినుంచి ఇప్పటిదాకా లేడు అనేవారు కొందరైతే,
ఉన్నాడు అనేవారు మరికొందరు..
ఏదో లేడంటున్నారు గాని ఉన్నాడేమో; అనుకునేవారూ
ఆఁ.. ఉన్నాడంటారు గాని లేడేమో అని సందేహపడేవారూ ..
మన భాషలోచెప్పాలంటే... "గజ" సందేహులు కూడా బాగానే ఉన్నారు.
ఈ చివరి కేటగిరీ లోకి మనలో చాలామంది వచ్చేస్తాము కూడా..
ఎవరికి తగ్గ ఆర్గ్యుమెంట్స్ వాళ్లకి ఉన్నాయి..ఉంటాయి కూడా...
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో చూస్తూ ఉంటాము..
నియమ బద్ధంగా సూర్యోదయం.. అస్తమయం... పక్షాలననుసరించి చంద్రుడు పెరగడం .. తరగడం... పున్నమినాడు పూర్ణ కళలతో శోభించడం..
పున్నమి, అమావస్యలనాడు సముద్రం ఆటుపోటులు... మామిడి పూత తో కోకిలలు కుహు కుహు రావాలు చేయడం..
ఇవన్నీ ఇంత క్రమబద్ధంగా ఎలా జరుగుతున్నాయి.. ఎవరిదీ యాజమాన్యం...
ఇందులో గొప్పేముంది...నాచురల్ అంటారు కొందరు.
తెలియదుకాని ఏదో అతీత శక్తి అంటారు మరికొందరు..
ఆ అతీత శక్తికి "భగవంతుడు" అని పేరెట్టి కొలుస్తామంటారు కొందరు.
మా చిన్నతనంలో మాకు రేడియో ఒక వింత.. క్రొత్తగా మా ఇంటిలో పెట్టారు.. పెద్ద బ్యాటరీ మీద పనిజేసేది..
అలాగే టి.వి. మన ఊళ్లలో లేనప్పుడు, మద్రాసులో షాపు ముందు నించుని నోరెళ్లబెట్టుకుని చూడ్డం గుర్తుంది...
సైకిల్ రిక్షా మా ఊళ్లో తిరగడం మొదలెట్టడం నాకు తెలుసు.. ఎక్కితే అదో విచిత్రం...
మోటర్ సైకిల్ రిక్షా (ఆటో కాదండోయ్) మరో వింత..
మా మనవడికి చెప్తే నాన్ సెన్స్ తాతయ్యా.. నువ్వు మరీ ఎలిమెంటరీ అని కొట్టిపాడేస్తాడు..
తన అనుభవంతో స్టీమ్ కు శక్తి ఉంది అని జేమ్స్ వాట్ కనిపెట్టక ముందే స్టీమ్ కు శక్తి ఉంది.
శక్తి ఉండడం దాని ధర్మం..
ఒక లోహం తేలికగా ఉండడం దాని ధర్మం..
ఆ లోహం ఉపయోగించడంవలన విమానం ఎగురుతోంది...
నీకు ఆ ఆలోచన స్పురించిందంతే కాని అది లేనిది కాదు కదా ?
రేడియో, విమానం మరోటీ, మరోటీ మనం ఆవిష్కరించిన వింతలు ... ఇప్పుడు పాతబడిన వింతలు...
నిజానికి ఇవన్నీ కనిపెట్టినది మీరూ నేనూ కాదు,, మనలో ఒకరు..
అదిప్పుడు వింతగా చెప్తే నాన్ సెన్స్ అని మనం అంటాము.. అదీ మన విజ్ఞత..
"రేడియో తరంగాలు ఆకాశంలో వేలాది మైళ్లు ఎలా పయనిస్తాయి అని అలా కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు మార్కోనీని అడిగితే...ఈ తరంగాలు ఎలా పయనిస్తాయో శాస్త్రీయంగా చెప్పగలను .. కాని ఎందుకు అలా పయనిస్తాయి అంటే ఆ రహస్యం సృష్టించిన వానికే తెలియాలి... " అన్నాడట ..
అందుకని ఒక నిజం ఒప్పుకోవాలి.. ఎంతో తెలిసినవాడు.. తెలియనిది ఎంతో ఉంది అనుకుంటాడు..
కూసింత తెలిసిందనుకునేవాడు తనకు తెలియనిదేమీ లేదు అనుకుంటాడు..
మనం సృష్టించుకున్నవేవీ కొన్నాళ్ల తర్వాత వింతగా కనపడవు.. నిజమే కదా..
కాని రోజూ సూర్యోదయం చూస్తాము.. ఎప్పుడూ విసుగురాదు...చూస్తుంటే ఆకాశంలో ఎన్ని రంగులు.. ఎన్ని షేడ్స్.
శరత్కాలంలో నిండు పున్నమి చంద్రుడు.. ఆ నిర్మలమైన ఆకాశంలో అలా వెలిగిపోతుంటే.. ఎంత బాగుంటుంది..
"ఆఁ అదో గ్రహం అమెరికావాడు కాలు కూడా పెట్టాడు.." అన్నమాట ఆ ఆనందానుభవంలో గుర్తొస్తుందా ?
వర్షం పడగానే ఆరుద్ర పురుగులు పుట్టుకొస్తాయి.. వీపుమీద ఎర్రటి ముఖమల్ చర్మంతో.ఆ నేతగాడెవడు ?
చీకటి రాత్రులలో కాంతివంతం చేయడానికి ఎగిరే మిణుగురు పురుగులు కంటికెంత వెలుగు..?
వర్షపురాత్రుళ్లలో రోజుకో రకం పురుగులు అలా పుట్టి వెంటనే నశించిపోతాయి.. వేటికవే ప్రత్యేకం.. అవి ఎక్కడనుంచి వస్తాయి.. ఆ కాసేపటిలో ఎలా పుడ్తాయి..ఎవరు చెప్పగలరు..?
రోతపుట్టించే గొంగళీ పురుగునుంచి బయటికి వచ్చే అందమైన, కోమలమైన రంగురంగుల సీతా కోక చిలుకలు... ఒక సీతా కోక చిలుకకు మరోదానికీ పోలికే ఉండదు.. ఎవరు తయారుచేస్తున్నారు..
ఇలా చెప్పుకుంటూ పోతే..... అంతెక్కడ ?
ఒక్కసారి మనల్ని మనం చూసుకుందాం... లోపల ఎన్ని అరాంజ్ మెంట్స్ ? ఎముకలు, మజ్జ, మాంసం, రక్తం..
కాళ్లు మడతపడడానికి, చేతులు మడతపడడానికి .. మడత బందుల్లా పెట్టాడు.. గుండ్రంగా తిరగడానికి బంతి గిన్నె కీలు... వేళ్లు ఎక్కడికక్కడ ముడవబడడానికి...ఏర్పాటు.. అవి పని చేయడానికి కావలసిన కాల్షియమ్. కుషన్
అఫెక్ట్ కు మాంసం.. ఇంకా ఏవేవో ధాతువులు.. రక్తం అందీయడానికి నరాలు.. మంచి రక్తానికి చెడ్డరక్తానికి సిరలు ధమనులు.. గుండెకు రక్త ప్రసరణకు అనుకూలంగా లోపలికి ముడుచుకునే తలుపులు, బయటికి తెరచుకునే తలుపులు.. తిన్నది అరగడానికి కావలసిన ఎంజిమ్స్.. రక్తం గడ్డ కుండా ఏర్పాటు.. చూడ్డానికి కన్ను, వినడానికి చెవి... మీరు చెప్పినా చెప్పకపోయినా మీ ప్రమేయం లేకుండా కొట్టుకునే గుండె.. ఆలోచిస్తే ఎంత వింత...? ఎప్పుడు దంతాలుండాలో, ఎప్పుడు పాల దంతాలు పోయి మంచి దంతాలు రావాలో...ఎప్పుడు అవి ఊడాలో అన్నీ చక్కగా ఏర్పాటు చేసాడు.. రక్తం బయటికి పడకుండా, ఎముకలు కనపడకుండా చర్మంతో దీనికో ప్యాకింగ్...చర్మానికి ఆ అతుకు ఎక్కడ వేసాడో ఎలా వేసాడో ... ఏమన్నా తెలుసా...
మన ఈ ఎదిగిన దేహానికి ఆరంభం ఎక్కడంటే.. తల్లిగర్భంలోకి ప్రవేశించిన ఒకే ఒక చుక్క..కదా... ఆ చుక్క తనంత తాను ఎదుగుతూ... ఎప్పుడు ఏంకావాలో సమకూర్చుకుంటూ... దాని పని అది చేసుకుంటు మనం నడిచేటట్టుగా చేస్తోందంటే ఎంత ఆశ్చర్యం...ఆ పరంధాముడు అలా చేయించే రిమోట్ తన దగ్గర పెట్టుకున్నాడు.. తెల్లారి లేస్తే సుగంధాలీనే సబ్బులతోటీ షాంపూలతోటీ స్నానాలు చేస్తాము.. అరంగుళం దళసరిని పౌడర్లు మెత్తుకుంటాం.. వళ్లంతా సెంటులు పూసుకుంటాం.. అలా షోకులు చేసుకునే ఆ చర్మం క్రిందేముందండీ.. ముఖం భాగంలో కళ్లకు రెండు కన్నాలు.. అటూ ఇటూ చెవులస్థలంలో రెండు కన్నాలు.. ముక్కుకి, నోటికి కన్నాలు.. మిగతా ఎముకల పంజరం.. లోతుల్లోకి వెళ్తే కనిపించే పాంచభౌతిక శరీరము... కనిపించని ఎముకలగూడు... చీమూ, నెత్తురూ.. కాని ఇవి ఏమీ తెలియనీయకుండా అందమైన చర్మంతో చక్కగా ప్యాక్ చేసి జన్మదిన కానుకగా మీకందించాడు.. అందుకున్నాము ... మామూలు గిఫ్ట్ ఇస్తేనే ఓఁ వందనాలు చేసేస్తాము కదా, ఇలాంటి అపురూప కానుక అందించిన వానికి కృతజ్ఞతలు చెప్పనక్కరలేదా మరి ? చెప్పాలి అంటే ఎక్కడకెళ్లాలి.. ఎక్కడకీ అక్కరలేదు...ఇదంతా చేస్తున్న ఒక అవ్యక్త స్వరూపం ఉంది అన్న ఎఱుకతో.......తెరచిచూసే ప్రయత్నం చేయకుండా ఆ గిఫ్ట్ ప్యాక్ ను కాపాడుకుంటూ ఈశ్వర విభూతితో ఉన్న ప్రాణికోటిని సేవిస్తే సరిపోతుంది..
ఎప్పటిదాకా అలా చెయ్యాలి అంటే ....... ఈ ప్యాక్ పంచభూతాలలో కలసి ఆయనను చేరేదాకా.....
ఆఁ ఇది నాచురల్, దీనికీ ఇంత సీనుందా అంటారా మీరనుకునే ఆ నేచర్ కే నమస్కరిద్దాము, అప్పుడైనా అలా మీరు చెప్పిన కృతజ్ఞత చేరవలసిన చోటికి చేరుతుంది.. నాచురల్ కదా..!
20 comments:
మీరెన్ని చెప్పినా మాష్టారూ, నాకు దేముడు పక్కింటాయన కారు కొన్నప్పుడే గుర్తుకు వస్తాడు. ఆయనకే ఎందుకిచ్చావు నాకెందుకు ఇవ్వలేదు అని కోప్పడుతాను.......దహా.
Excellent Hanumantha Rao garu. I really enjoyed reading it. And, I must say, every one should read it. One should not simply read it and forget, but analyse and assimilate the essence of the message, so that we respect not only the gift but also the Gift Giver. May HE guide and bless every one. Love and Love alone ...
చాలా బాగుంది మీ టపా. . తెలియని ఆ శక్తి, దేవుడైనా, నేచర్ అయినా, నమస్కరించాలి.
బాగుంది .. దేవుడు అంటే సినిమాల్లో మేకప్ తో కనిపించినట్టు ఉండక పోవచ్చు .. కాని మనకు తెలియని శక్తి ఏదో ఉంది అది దేవుడు
chaalaa... chaalaa.. baavundi....
nice...
బాగా తేలిగ్గా అర్ధమయ్యేలా రాశారు. చాలా బాగుంది.
అద్భుతంగా వ్రాసారు సార్.
అభినందనలు.
"రేడియో తరంగాలు ఆకాశంలో వేలాది మైళ్లు ఎలా పయనిస్తాయి అని అలా కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు మార్కోనీని అడిగితే...ఈ తరంగాలు ఎలా పయనిస్తాయో శాస్త్రీయంగా చెప్పగలను .. కాని ఎందుకు అలా పయనిస్తాయి అంటే ఆ రహస్యం సృష్టించిన వానికే తెలియాలి..."
అక్షర సత్యం.
ఎవ్వని చే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వ రుడెవ్వడు మూల కారణం
బెవ్వ డనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానెయైన వా
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్..!
మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.
చాలా బావుంది హనుమంతరావు గారూ. మీ వర్ణన, స్పందన అభినందనీయం.
ఈ కాలం డబ్బు మనుషులకూ, నాస్తికులకూ, so called ఆస్తికులకూ కూడా మీ వ్యాసం అవసరం.
ముఖ్యంగా, Practical minded, Realistic అనే పదాలు అధికంగా వాడే (కేవలం వాడుకకు మాత్రమే వాడే, అవలంబనకు వాడే అవసరం లేదనుకునే)
జ్ఞానులకు మరింత అవసరం.
పూవు పుట్టగానే పరిమళించినట్టు
మీ రచన చదివీ చదవకుండానె చాలా నచ్చేసినది , హనుమంత రావు గారు ...
దేముణ్ణి గుర్తుకుతెచ్చిన ఆ స్ఫురణ శక్తికి నా నమోవాకములు.ధన్యవాదములు శ్రీ సుబ్రహ్మణ్యంగార !
Thankyou very much Sri Paritala
తెలియనిదేదో ఉంది అనే ఎఱుక.. అదే నిజం..
జలతారు వెన్నెల గారు ధన్యవాదములు
రాముడైతే ధనుర్బాణాలుండాలి, కృష్ణుడైతే మురళీ ఉండాలి, శివుడైతే పాములుండాలి అదే భగవంతుడనుకోవడం మనస్సు నిశ్చలమయ్యేదాకా దానికన్నా అతీతమైన శక్తి ఏదో ఉంది అన్న ఎఱుక కలగడం గొప్పకదా మురళిగారు. నా బ్లాగు చదివి స్పందించినందుకు ధన్యవాదములు
ఎగిసే అలలు.. అంత చైతన్యవంతమైన మీ సమయం నాకోసం నిశ్చలమై బ్లాగు చదివి స్పందించారు.. ధన్యవాదములు
తేజేశ్వరిగార్కి.. ధన్యవాదములు
రాధేశ్యామ్ గారు భగవంతుడి గురించి భాగవతం ఎంత చెప్పిందో కదా.. మీరు ఉదహరించిన తీరు అద్భుతము. ధన్యవాదములు
లలిత గారు చాలా చాలా సంతోషము.
శృతి రవళిగారు, మీ ఆవేదన మనందరి ఆవేదన ఒకటే. ఈ రోజుల్లో ఒక రకమైన అబద్ధంలో బ్రతుకుతున్నాము. దేముణ్ని అంగీకరించడానికి నామోషీ కొంత. మీరు చెప్పినట్టు పదాలు వాడుతాము, కాని వాటి అర్థం తెలియదు.. తెలిసుకునే ప్రయత్నము చేయము.. మీరు చదివి స్పందించిన తీరు చాలా బాగుంది. ధన్యవాదములు.
Great Hanumantha Rao garu. You have put the entire gamut of the creation of the GOD and its omnipotence in a capsule and giftpacked to us all. Good work. Keep going.
Regards,
Murthy
Gftistooo andariki kanipimchemta peddaga perlu raaimche saampradayam appatikinkaa puttaledomo...........
Rojoo vadesukumtunna evarichumtaarabba anainaa alochimchani manalaamtivaallakosaamani giftichhana vaanni marchipotepoyaavu kaneesam adi o andmaina gaazu giftu...daani nuvvu bahujagrattaka vaadokovali samaa......
.anna cover note ni manakichhi rammani
Mimmalni blagu roopamlo puramaiinattunnadu aa parameswarudu..
...thx for reminding
thank you rajasekhar.. we are all after all instruments in His hands..He only knows whom to depute.
సాఫ్ట్ కవరులోన గిఫ్ట్ ప్యాకును జేసి
తెఫ్ట్ కాని రీతి దేవు డిచ్చె
మఫ్టి లోన నుండి మనల జూచెడినని
పల్కి నట్టి తీరు భవ్య మయ్య!
babai excellent really excellent mahaanubaavulu rojulu tharabadi cheppe manchi vishayilini gift pack chesi andamga SOOKSHMAMGA NAA LANTI VALLAKI ARDHAMAYYELA ....ichchinanduku. great babai anduke .....udayanne lechetappudu mariyu night padukune mundu devudiki janmanichchina thallidandruluki thanks cheppukuntu ........dinacharyani prarambinchalani/ nidraki upakaraminchalini peddalu chepppe maatalu..... THANQ VERY MUCH BABAI..... ANTARGATHAMGA CHAALA AALOCHANAATMAKAMGA VUNDI.....GOD IS GREAT............ALSO U.......
inko vishayam mee kodalu cheputhondi..... body functions lo idokati...... manchini grahinchadam.....cheduni vadileyadam....aaa mahanubhavuni science....
-Nagesh(message through my daughter's account)
హనుమంతరావు గారు,
మీరు నాకు చెప్పినదానికన్నా ఇంకా బాగా వ్రాసారు. అసలు భగవంతుడు ఉన్నాడన్న అలోచన బుధ్ధికి కలగడంతోనే ఈ జన్మ పవిత్రమవుతుంది. అలాంటిది ఇంకా ఉన్నాడా లేడా అనే సంధిగ్ధావస్థలో బ్రతికితే ఇంకా ఎన్ని జన్మలెత్తాలో ఈ సూక్ష్మం తెలుసుకోవడానికి..
ఒక ఆయనేమో రాముడు రామసేతుని నిర్మించడానికి ఏ ఇంజినీరింగ్ కాలేజీ డిగ్రీ తీసుకున్నాడు అంటాడు.ఇంకొకరేమో ఎక్కడున్నడు దేవుడు చూపించి అని అడుగుతారు..
వీరందరికీ తెలీదు, వారి బాడీని, అందులో ప్రాణాన్ని నిర్మించింది ఆ దేవుడేనని, వాటిని నిర్దేసిస్తున్నది ఆ దేవుడే నని.
బహు గొప్పగా చెప్పారు సార్..
--శ్రీ
Post a Comment