Pages

Tuesday, January 7, 2014

హరాజీకాలు -1 - బాల వాక్కు





మీ జీవితంలో ఏవో సంఘటనలు మీకు నచ్చుతాయి. అలాగే పాపం నాకూ నచ్చుతాయిగా, అబ్బా మీ జీవితంలోవి నాకు నచ్చడం కాదండి బాబూ, నా జీవితములోనివి, నాకూ నచ్చుతాయిగా అని నా భావమ్. .. అవి గుర్తొచ్చినప్పుడు నాకు ఇప్పటికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి .. అలాంటివి, అందులోని పంచ్ మీతో పంచుకోవాలనిపించింది. నేననుకున్న ‘పంచ్’ నాకు నవ్వు తెప్పించికదా అని మీకూ నవ్వు పుట్టించాలని రూలేం లేదుగా…అని మీరనొచ్చు.. మీరు నిజం మాట్లాడుతారు . అందుకే మీరంటే నాకు చాలా ఇదన్నమాట … వీడేం రాస్తాడులే అనుకోకుండా వీడూ రాస్తాడు అని చదవండి .. స్పందించండి .. మీ స్పందన తెలియజేయండి.. కొన్నాళ్ళు నా బ్లాగులో ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాను... .. పాపం మీకు తప్పదు.. స్పందన పోస్ట్ చేయడం.....



హరాజీకా  .. 1
బాల వాక్కు


మన మనవలు (అంటే మీ మనవలు మీకు, నా మనుమలు నాకూ) కొంచెం మాటలు నేర్చాక, పెద్దవాళ్ల మాటలని గమనిస్తూ ఉంటారు కదా.. .. సందర్భం కాకపోయినా ఏదో  మాట్లాడేస్తూ ఉంటారు  కదా.. అవి ఒకసారి మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు.. వారి అమాయకత్వానికి నవ్వూ పుట్టించవచ్చు.


మా మనుమడికి అప్పుడే రెండు నిండి మూడో ఏడులోకి అడుగుపెడ్తున్నాడు. వాళ్ల అమ్మ ఏదైన పని పూర్తిచేసాక ‘అమ్మయ్యా’ అనుకోవడం వింటూ ఉంటాడు. ఒకసారి వాళ్లింటికి వాళ్ల పెదనాన్న వచ్చారు. . రెండు రోజులుండి మూడో రోజు పొద్దున్నే వెళ్లిపోయారు. ఆయన వెళ్లే సమయానికి వీడు లేవలేదు. వీడు లేచాక పెద్దనాన్న కనపడలేదు.. తండ్రిని అడిగాడు 
“నాన్నా పెదనాన్న ఏరి ?” ..
“వెళ్లి పోయారురా, నువ్వు అప్పటికి లేవలేదు”అన్నాడు తండ్రి..
“అమ్మయ్యా” అని నిట్టూర్చాడు.. వీడు…
“వెధవా.. మా అన్నయ్య వెళ్లిపోవడం, నీకు అంత రిలీఫా” అని నవ్వుతూ ఒకటేశాడు తండ్రి .. లౌక్యాలు తెలియని వయస్సది..

                           >>>>>>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<


బ్యాంకులో పనిచేసే రోజుల్లో మా ఫ్రెండూ నేనూ జోకులు పంచుకునే వాళ్లం.. అంటే అతడి అబ్జర్వేషన్ లో దొరికిన జోక్ నాకు చేప్పేవాడు, నేనూ అలాగే నాకు దొరికిన జోక్ అతనికి చెప్పడం అలా సాగేది. …
తన మూడేళ్ల కొడుకుని స్కూటర్ మీద ముందు నిలబెట్టుకుని అలా బయల్దేరేడు. పోస్టాఫీస్ ముందు నుంచి వెడుతున్నారు.. ఆఫీస్ ముందు ఎర్రగా ఎత్తుగా వింతగా కనపడింది ఈ చిరంజీవికి. అది చూపించి నాన్నని అడిగాడు.
“అది ఏమీ”టని…
వాడు అడిగింది పోస్ట్ బాక్స్ గురించి..  తనయుని ఎడుకేట్ చెయ్యాలని  
“దాన్ని పోస్టాఫీస్ అంటార్రా.. అక్కడ …”
ఇంకా పూర్తి చెయ్యలా..
వెంటనే
“ఎవరిది ?” అని సందేహం వెలిబుచ్చాడు చిరంజీవి..


(నిక్కర్ కు ముందు బొత్తాలు పెట్టుకోపోతే.. పోస్టాఫీస్ అంటాంగా… )

>>>>>>>>>>               <<<<<<<<<>>>>>>                  >>>>>>>>>>


ఉద్యోగరీత్యా కొన్నాళ్లు ఓ పల్లెటూరిలో పని చేయాల్సి వచ్చింది. మేం ఉన్న అద్దె ఇంటికి పెద్ద పెరడుండేది. నూతిలోంచి నీళ్లు తెచ్చుకుని వాడుకోవడం, స్నానాలు నూద్దగ్గరనే.. … మా రెండవ అమ్మాయికి అప్పుడు రెండేళ్లుంటాయేమో.. వర్షాకాలం .. మట్టిలో రక రకాల పురుగులూ అవీ పుట్టి పెరుగుతూ ఉండే రోజులు. ఇప్పుడీ కాంక్రెట్ జంగిల్ లో ఇందులో చాలా మాటలు ఇప్పటివాళ్లకి అర్థం కావు. మా అమ్మాయి వెనకవైపు వెళ్లి, వెంటనే గబ గబా   లోపలికి వచ్చి వాళ్ల అమ్మతో “అమ్మా! అమ్మా! దొడ్లో ఇన్ని తేళ్లున్నాయి” అంటూ చేతులు, కళ్ళు చక్కగా త్రిప్పుతూ చెప్పింది.. వాళ్లమ్మ తేళ్లు అనగానే విషయం ఊహించింది. ఏవో పురుగుల్ని చూసి ఉంటుంది అని తెలిసి..
“తేళ్లంటున్నావు, తేళ్లు ఎలా ఉంటాయి” అని అడిగింది..
మా అమ్మాయి వాళ్ళమ్మకేసి ఒకసారి చూసింది.. ఇక  మాట్లాడలేదు.
“చెప్పు తేళ్లు ఎలా ఉంటాయి” అని వాళ్లమ్మ రెట్టించి అడిగింది.
మా అమ్మాయి డ్రమెటికల్ గా నవ్వుతూ “హుం మనమేమన్నా తింటామా ఏంటి” అని అక్కడనుంచి వెళ్లిపోయింది.  

(కూర చేసి ఎలా ఉంది అంటాం కదా .. అది దాని ఆలోచన..)


[ ‘హరాజీకా’ అంటే ... తర్వాత పోస్ట్ లో వివరింప బడును….]

3 comments:

TVS SASTRY said...

'హరాజీకా' అంటే ఏమిటో చెప్పకుండా ఊరిస్తూ,హరాజీకా-1 ఆసక్తికరంగా చదివించారు. మనలో మన మాట!బొత్తాలు పెట్టుకోకపోతే పోస్ట్ ఆఫీసు అని ఎందుకంటారో!

టీవీయస్.శాస్త్రి

హనుమంత రావు said...

sastry jee, thank u for ur response..
పోస్ట్ డబ్బాకు పైనో కన్నం ఉత్తరాలు వేయడానికి,
క్రింద పెద్ద కన్నం ఉత్తరాలు తీయడానికి.. అలాగే ముందర బొత్తాలు వదిలేసిన కన్నం, నిక్కరు క్రిందకి పెద్దకన్నం.. అందులో వేసినవి ఇందులోంచి వచ్చేస్తాయి. అందకని అలా అంటారు అనుకుంటా...

మిస్సన్న said...

మా చిన్నప్పుడు కూడా ఎవరికైనా లాగుకు బొత్తాలు లేకపోతే పోస్తాఫీసురా ఉత్తరాలు వేసుకోండి అని ఏడిపించుకొనే వాళ్ళం. హరాజీకాలు బాగున్నాయి.