Pages

Sunday, January 12, 2014


             ఋషి పీఠం ఛారిటబుల్ ట్రస్ట్,
                రాజమహేంద్రవర శాఖ…
              ఏజెన్సీ గ్రామంలో ఒక రోజు
రచన: డి.వి. హనుమంత రావు


రాజమండ్రీకి 90 కి.మీ దూరంలో ‘అడ్డతీగల’ ఒక ఏజెన్సీ గ్రామం. ఊరు పెద్దదే. ఊరులోకి ఎడమవైపు  తిరగ్గానే  మొదటనే కుడి  ప్రక్కగా ‘పవనగిరి ఆలయ సముదాయం’ బోర్డ్ దర్శనమిస్తుంది. పవన గిరి ఒక చాలా ఎత్తైన చిన్న కొండ. కొండ మొదట్లో చిన్న శివాలయం, అందులో పెద్ద శివ లింగం, దాన్ని ఆనుకొని చిన్న మందిరంలో పార్వతీ పరమేశ్వర విగ్రహం. అక్కడ దర్శనం చేసుకుని, కొండ పైకి వెళ్తుంటే మీ కుడి చేతి పక్క పెద్ద రాయిపై  తమాషాగా చెక్కిన గజాననుని మూర్తి యొక్క విస్తారంగా ఉన్న ముఖం మాత్రం  ఆశీర్వాదిస్తుంది. . ఇంకొన్ని మెట్లు ఎక్కి ఎడమ వైపు తిరిగితే ముందు దత్తాత్రేయుని శిలా విగ్రహం, తర్వాత సాయిబాబా, తర్వాత అయ్యప్ప.. అవి అన్ని ఒక టెంపుల్ కాంప్లెక్స్ లో ఉంటాయి.. ఆ ఆలయాలు ప్రదక్షిణగా తిరిగి మరల మెట్ల మీదికి వచ్చి రెండు మెట్లు ఎక్కగానే “సదానంద గురు పీఠం”. అక్కడ దర్శించుకుని రెండు మెట్లు ఎక్కి ఎడమవైపుకు వెళ్తే తిరుమల వారు ఇచ్చిన మూర్తి.. కలియుగ దైవం వెంకన్న సామి. దానికి ఎదురుగా గరుడాళ్వార్ మూర్తి ఈ మధ్యనే ప్రతిష్టించారు.


మళ్లీ వెనక్కి రండి.. ఆ కుడి వైపు ఉన్న నివాసం .. ఎవరిది.. క్రిందకొచ్చేటప్పుడు చెప్తా..


అక్కడ నుంచి మరల పైకి వెళ్లి కుడి వైపుకి తిరిగితే మీ ఎడమ చేతి వైపు రాతిలో ‘పవన గిరి’ అని సిమెంట్ అక్షరాలతో అమర్చబడి  ఉంటుంది.. మీ కుడి చేతివైపుగా క్రిందకు చూస్తే చిన్న వంటశాల.. (రేకుల ఆచ్చాదన మాత్రం). 
కుడివైపు తిరిగి వెళ్తే ఊరు వైపుకు చూస్తూ ఎత్తుగా  పవనగిరి నాథుడు.. ఆంజనేయ స్వామి చక్కటి మూర్తి దర్శనమిస్తాడు. దాని ముందు భక్తులు నిలబడడానికి వీలుగా చిన్న ప్లాట్ ఫాం నిర్మించ బడింది. ఆ ఎత్తైన కొండమీద నుంచి.. ప్రకృతి సోయగాలు చాలా బాగా కనపడతాయి.. చెట్ల మధ్యనుంచి ఊరు, రహదారులు, వాగులు,, ఓహ్ ఏమందం?  దర్శించుకుని మరల పైకి బయల్దేరుదాం. కొంచెం వెళ్లాక కుడి వైపు గాయత్రీ మాత.. ఎదురుగా హోమ గుండం.. దాని దగ్గర గురువుగారిద్వారా అందిన త్రిశూలం గుచ్చ బడి ఉంటుంది.కొంచెం పైకి వెళ్తే  ఎడమవైపు కోదండరామస్వామి ఆలయం, దాని ఎదురుగా గ్రామ దేవత గంగాలమ్మ. కొంచెం ముందుకెళ్తే సువర్చలా సమేత ఆంజనేయస్వామి.. ఇంకా పైకే వెళ్తే కుడివైపు సరస్వతీ దేవి.. దానికి ఈ మధ్యనే రేకులతో షెడ్ వేసారు.. అక్కడనుంచి ఇంకా పైకి పది పదిహేను మెట్లు ఎక్కితే పరమశివుని ఆలయం.. పురాతనమైన శివ లింగం.. ఆ రోజుల్లో ఇక్కడ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అర్చన చేసేవారట. శివాలయం ముందర రాళ్లూరప్పలు, లోతుగా ఉండి  శివాలయం ఎత్తుగా ఉంటుంది...


ఇప్పటిదాకా వర్ణించిన ఈ కొండా , ఆలయాలు 2003వ సంవత్సరానికి ముందు లేవు. అప్పుడు ఇది చెత్త మొక్కలు, రాళ్లూరప్పలూ నిండిన ఒక కొండ మాత్రమే. ఇందాకా ఆలయాలు చూసుకుంటూ వెళ్తుంటే ఒక నివాసం చూపించాను. పేరుకు అది నివాసం అంతే .. చాలా సింపుల్ గా రెండు గదులు అనబడే వాటితో కేవలం స్లాబు వేసి నిర్మించారు.. చాలాకాలం క్రితం అది ఒక పూరి పాక. దాని యజమాని శ్రీ తణుకు వేంకట్రామయ్య గారు. ఏదో అంతరాత్మ ప్రబోధంలా ,  రాజమండ్రి  పేపర్ మిల్లులో తను చేసే చక్కని  ఉద్యోగం అర్థాంతరంగా వదిలేసి, భార్యా సమేతంగా 2003లో ఇక్కడకు వచ్చి, తనకి వచ్చిన పి.యఫ్ మొత్తాన్ని ఈ కొండ అభివృద్ధికి ఖర్చుపెట్టి ఇదే స్థిరనివాసముగా చేసుకున్న వ్యక్తి. అంతటితో ఊరుకోలేదు.. మన్యం ప్రజలతో మమేకమై వారికి వ్యక్తిత్వమీయడంలో అహరహము కృషి చేస్తున్నారు. తిరుపతి దేవస్థానం వారితో చర్చలు జరిపి మన్యగ్రామాలలో వ్యక్తులకు టి.టి.డి వారిద్వారా శిక్షణ ఇప్పించి వారిని మన్య గ్రామాలలోని గ్రామదేవతల ఆలయాలలో అర్చకులుగా నియోగింపజేసారు.. వారందరికీ సమాజంలో చక్కటి గుర్తింపు ఉంది. సీతా రామ కళ్యాణంలాంటివి వారే చక్కగా చేయిస్తారు. అడపా తడపా వారిని పరిసర ప్రాంతాలలో జరిగే దైవ కార్యక్రమాలలో పాల్గొన జేసి, అవసారాన్ని బట్టి వారికి ఊహించని విధంగా అన్ని సదుపాయాలూ గల హోటల్స్ లో బసదగ్గరనుంచి ఏర్పాటు చేయిస్తారు. మన్యజనాలకు హిందూ ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని సవివరంగా వివరిస్తూ..ఎవరి ధర్మం వారికి అనుసరణీయం, పరధర్మం గౌరవించదగినది మాత్రమే అని ఎరుక పరుస్తున్నారు. ఏడు మండలాల జనాభా అంతటికీ  ఆయన కేవలం గురువు.. అంత మాత్రమే కాదు, వారి కుటుంబ పెద్ద, వారితో.. వారి కష్టసుఖాలు పంచుకుంటూ సహజీవనం చేసే కొండంత అండ.. .. పెద్దలు చెప్పే ధర్మ శాస్త్రాల  సారాన్ని చేతల్లో చేసి చూపిస్తున్నారు.. వేంకట్రామయ్యగారు…   ఇప్పుడు ఆ మన్య ప్రజలకు మన ధర్మం తెలుసు. ఏది మంచో , ఏది చెడ్డో  తెలుసు.. వేదికలమీద చక్కటి మాటలతో నిజాయితీగా, స్పష్టంగా తమ మనస్సులను వివరించగలరు. పెద్దలను  గౌరవిస్తారు... గురువుగారిపట్ల పూర్తి నమ్మకం కలవారు.   


గత సంవత్సరం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఈ ఆలయసముదాయం చూసి ముచ్చటపడ్డారు.. మన సంస్కృతిని తమ కట్టు బొట్టుతో కాపాడుతున్న స్త్రీ మూర్తులను చూసారు. మన్యవాసుల నిష్కల్మషమైన ప్రేమాభిమానాలకు ముగ్ధులయ్యారు. శివాలయం ముందర ఒక సభా మంటపం కట్టించడానికి ఋషిపీఠం పక్షాన
ఆర్ధిక సహాయం ఆనాడు వాగ్దానం చేసారు.. ఋషిపీఠం రాజమహెంద్రవరశాఖ ఆ సహాయాన్ని అందించింది. ఆ సభా మంటపం పూర్తయింది. ఈ రోజు 12-1-13 ఉదయం ఋషిపీఠం రాజమహేంద్రవర శాఖలో  ముఖ్యులైన డా॥టి.వి.నారాయణ రావుగారు ఆ సభా మంటపాన్ని లాంఛనంగా ప్రారంభించారు.. “ప్రజా సేవ అంటే నారాయణ సేవ” అని చాటి చెప్పిన స్వామీ వివేకానంద 150వ జయంతి ఈ రోజు.. ఈ ముహూర్తం యాదృచ్ఛికం.
డా॥ నారాయణరావుగారు వివేకానందస్వాముల జీవిత చరిత్రలోని సంఘటనలను, మరికొన్ని పురాణ కథలను ఉదహరిస్తూ గురువు గొప్పతనాన్ని, గురువు గారిని కొలిచే ఆవశ్యకతను చక్కగా వివరించారు..


అక్కడనుంచి అడ్డతీగలకు 20 కి.మీ దూరంలో ఉన్న మర్రిపాలం గ్రామానికి ఋషిపీఠం వెళ్లింది. ఈ గ్రామంలో పరమతస్థులు తమ నీచబుద్ధితో చాలా మతమార్పిడులు చేయించారు . వెంకట్రామయ్య గారి కృషివలన, ఆ గ్రామస్తుల అవగాహన, అంకిత భావంవలన మొత్తం గ్రామం.. ఒక కుటుంబం మినహా.. మరల హిందూ ధర్మంలోకి వచ్చేసింది. అక్కడ కోదండరామ స్వామి ఆలయంలో డా॥ నారాయణరావు గారు ప్రసంగించారు.. శ్రీ మద్రామయణంలోని ఆటవిక కాంత శబరి చేసిన గురుశుశ్రూష.. ఆమెకు కలిగిన రామానుగ్రహం గురించి చక్కటి ప్రసంగం చేయగా.. ఆ గిరిజనులు సజల నయనాలతో ఎంతో ఆసక్తిగా విన్నారు..
క్కటి కోలాట నృత్యంతో ఆ మన్యవాసులు ఋషిపీఠానికి చక్కని వీడ్కోలు పలికారు…ఋషిపీఠం తరఫున ఐదుగురు సభ్యులం ఈ కార్యక్రమాలలో పాల్గొన్నాం. వేంకట్రామయ్యగారి  పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు. తలిదండ్రులపట్ల గౌరవం కలవారు.. అయినా వారికి దూరంగా అరవై దాటిన వయస్సులో ఆ దంపతులు చేసే నిస్వార్థమైన నారాయణ సేవ స్వయంగా చూసినవారెవ్వరైనా అభినందించకుండా ఉండలేరు శ్రీవెంకట్రామయ్యగారి కమిట్ మెంట్ మెచ్చుకోదగింది. అనుసరణీయం కూడా .. వారు చేస్తున్న మహత్కృషికి మరికొంత ఆర్ధిక సహాయం ఋషిపీఠం ఈ సందర్భంగా వాగ్దానం చేసింది.


No comments: