హరాజీకాలు - 7
బోడితల(పు)లో చిన్నది..
రచన: డి.వి. హనుమంతరావు.
హలో సర్, మళ్లీ వచ్చానండి…
మా ఆఫీసులో కేశవరావుగారని ఒక అక్కౌటెంట్ ఉండేవారు .. ఆయన్ని మిత్రులందరూ… గుండూ రావుగారనే వారు.. అమ్మా నాన్నా ఆయనికాపేరు పెట్టేటప్పటికి ఆయనకి కేశ సంపద పుష్కలంగా ఉండేదేమో కాని, మాకు తెలిసేనాటికి పరిస్థితి వేరు. ప్రస్తుతం ఉన్న ఆయన ముంగురుల శోభ గురించి చెప్పాలంటే.. ఆయన తలపై దువ్వెన్న ఒకటి పెట్టామనుకోండి, అది … తారు రోడ్ పై రోల్స్ రాయిస్ కారు వెళ్లినట్టు ,,,చాలాసేపు స్మూద్ గా ప్రయాణం చేసి, తర్వాత ఆ తారు రోడ్ కంటిన్యుయేషన్ కచ్చా రోడ్ లా ఉన్ననాలుగు కేశములలోనూ సదరు దువ్వెన్న చిక్కుకి పోయినట్టు అనిపించి , వెంటనే జర్రున జారిపోతుంది. … ఆ నాలుగూ ఉన్నా లేనట్టే అని, కేశవరావుగారికి వారి మిత్రులు పెట్టుకున్న ముద్దు….. (అబ్బా! తర్వాత వ్రాసింది చదవకుండా ‘A’ సర్టిఫికేట్ అనడం అన్యాయం) పేరు గుండూ రావు.
మా గుండూరావుగారు తన దేహ సౌందర్యాన్నికూడా చక్కగా పోషించేవారు.. చూడండి .. అదేదో సబ్బు యాడ్ లో ఒక అమ్మాయి చాలా హుషార్ గా కనపడగానే, మహేష్ బాబంతటి వాడు హాశ్చర్య పడిపోయి లేచాక, మనసు పాడేసుకోబోతుంటే ‘మమ్మీ’ అంటూ ఓ చిన్న గుంట వస్తుంది.. ఎప్పటినుంచో కుర్రాడైన, అనుభవం పండిన మన మహేష్ బాబు పాడేసుకోబోతున్న మనసును వెనక్కిపట్టుకుని, ఆ సబ్బు గురించి .. ఆ యాడ్ గురించి అప్పుడే ఫ్రెష్ గా తెలిసినట్టు… మమ్మీ! అని హాశ్చర్య పడి పోయి, లేచాక ఆ సబ్బు యాడ్ పలుకుతాడు..
అలా మనగుండూరావ్ ఏ సబ్బు వాడతారో కాని .. శరీరం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. ఆఫీసుకొస్తుంటే అతడొచ్చేస్తున్నాడన్న వాసన --- అతనికన్నా ముందు వచ్చేస్తుంది. వాసన అంటే సినీమాల్లో హాస్యగాళ్లు చేతులెత్తితే (.. అదే, ఆ మాట నేననలేక) వచ్చే వాసనగా అపార్థం చేసుకోకండి.. గుండూరావు జుట్టు లేని తలపై ఉన్న నాలుగు జుత్తుపరకలకూ రాసిన అత్తరు నూనె, వంటికి రాసిన పెర్ఫ్యూమ్ ల అఫెక్ట్ అన్నమాట. నెక్ కి విధిగా టై, దానికో పిన్ ధరిస్తాడు. మన రాజమండ్రిలో కాసే మండుటెండల్లో కూడా ఫుల్ షూ.. తమాషా ఏంటంటే, ఒక పాకెట్ సైజ్ కూంబ్ కూడా జేబులో ఉంటుంది. ఏమో ఎప్పుడే అవసరమొస్తుందో .. ఏ కొత్త కంపెనీ వాడో ఇచ్చిన ఏ తలనూనో వాడాడనుకోండి, చటుక్కున కొత్తిమీర మడివచ్చినట్టు ఇన్ నో టైమ్ జుట్టు జల జలా వచ్చేసిందనుకోండి ..(జల జలా .. జుట్టు రాలినప్పుడు వాడాలేమో కదా.. కొంచెం సర్దుకోండి.), దువ్వుకోవలసిన అవసరం వస్తే అప్పటికప్పుడు దువ్వెన్న ఎక్కడ్నుంచి వస్తుంది. అందుకని ముందుచూపన్నమాట.
ఇక విషయంలోకి వద్దాం. ఆ రోజు మానేజర్ గారు శలవు పెట్టారు.. నెక్స్ట్ సీనియర్ గుండూరావే కనుక ఈయన మానేజర్ గారి సీట్ లో కూర్చున్నాడు. ఆ సీట్ లో కూర్చున్నాడంటే తన రెగ్యులర్ సీట్ వర్క్ ససేమీరా (మీరా కాకపొతే సక్కుబాయి) పొరపాటున కూడా ముట్టుకోడు. అలా అని మెసెంజర్ కికూడా చెప్పేసాడు.
“మానేజర్ గారి సీటు వర్కే నే చూస్తా , అడ్డమైన పనీ పట్రాకు” అని…
ఎవరైనా వి. ఐ. పీ లు వస్తే వారిని మాత్రం ….చక్కగా టై సర్దుకుని ఎంటర్ టైన్ చేస్తాడు.
ఇంతలో ఒక ప్రౌఢ యాభైల్లో ఉంటుందేమో లోపలికి వచ్చింది… చింతామణి నాటకంలో శ్రీహరిలా ఉంది. విపరీతంగా మేకప్పు, ముక్కులదిరే సెంటు కొట్టుకుని ముందు ఆమె నడవగా, ఆమె వెనకాల టీనేజ్ లో నాజూకుగా, వయ్యారంగా, ఉన్న ఒక సుకుమారి వచ్చింది. గుండూ రావు అటెంక్షన్ లోకి వచ్చేసాడు. వారికన్నా ముందే ఇతడే వందనం చేసాడు. ఎదురుగా రెండు కుర్చీలలో కూర్చోపెట్టాడు.
“యస్ మేడమ్, వ్హాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడమ్” అని టై వెనకాల దాచుకున్న గొంతులోంచి మృదువుగా ఆంగ్లంలో అడిగాడు..
“ఆయ్ .. దణ్ణాలండీ!” అని ఆవిడ మాత్రం తెలుగు నమస్కారమే చేసింది.
“మా దగ్గర డబ్బులున్నాయండి.. అవి ఫిక్సీ చెయ్యాలండి.. ఆయ్”అని అంటూండగానే
అక్కడే ఉన్న మెసెంజర్ వెంకయ్య
“రండి ఆ గుమాస్తా గారి దగ్గరికి తీసుకెడతా”నన్నాడు ఇది విన్న గుండూరావ్ వెంటనే
“పాపం వాళ్లేం వెడతారు, వెంకయ్యా.. ఆ ఫారమ్స్ తే .. ఇక్కడే చేసేద్దాము” అన్నాడు.
“తన సీటువర్క్ తప్ప మరేదీ ముట్టుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేసిన గుండూ రావుకు ఇదేం పొయ్యే కాలం”, అనే భావంతో గౌరవమైన భాషలో ముక్కు మీద వేలేసుకుని మరీ అనుకున్నాడు వెంకయ్య.. ఆ ఫారాలు తెచ్చి ఇచ్చాడు.
కలాపోసకులైన మిగతా స్టాఫ్ అంతా, మానేజర్ గారి ఎదురి సీట్ లో ఉన్న చింతామణిని అప్పటికే వేటగాళ్ల చూపులతో త్రాగేస్తున్నారు.
గుండూ రావ్ ఇన్ నో టైమ్ …వాళ్ల పని పూ ర్తిచేసేసి, వాళ్లకి టర్మ్ డిపాజిట్ రిసీట్ వ్రాసి ఇచ్చేసాడు..గుండూరావుకు బోల్డ్ థాంక్స్ చెప్పి శ్రీ హరి, చింతామణీ వెళ్లి పోయారు… గుండూరావ్ మెలికలు తిరిగాడు. ఆ చిన్ని చింతామణి తనతో ఏమీ మాట్లాడలేదనుకున్నాడు కాని వెళ్లేటపుదు చింతామణి ఇచ్చిన లుక్కుకి ఫ్లాట్ అయిపోయాడు..
దూరాన్నించి ఇదంతా చూస్తున్న రసజ్ఞులైన తోటి ఉద్యోగులకు ఇది నచ్చలేదు.. అందరికీ నచ్చిన సదరు చింతామణితో ఒక్కసారి మాట్లాడే అవకాశం తమకీయనందుకు చాలా కోపం వచ్చింది. టర్మ్ డిపాజిట్ వ్రాసే మూర్తికైతే, తనకు దక్కవలసిన అదృష్టాన్ని తన్నుకుపోయిన గుండూరావ్ జుత్తులేని గుండు పై తన్నేస్తానన్నాడు..
కట్ చేస్తే…
నాలుగవుతుంటే, గుండూరావ్ టేబిల్ మీద ఫోన్ ‘ట్రింగ్ … ట్రింగ్’ అని మోగింది.
“హలో .. మానేజర్ గుండూరావ్ స్పీకింగ్..”
“ఆయ్, నేనండి .. శ్రీహరి నండి.. ఇందాకల ఆఫీస్ కొచ్చాను కదండీ .. ఆయ్”
“ఓ మీరా, అవునవును, ఇందాక మీరూ, చింతామణి గారూ వచ్చేరు కదా.. ఏం కావాలమ్మా?”
“మరేటి లేదండి…” నసుగుతోంది
“ఫర్వాలేదు .. చెప్పండమ్మా…” అని కొంచెం ఆగి,
“మీరు చెప్పలేకపోతే … చింతామణి గార్ని చెప్పమనండి” జేబులోంచి రుమాలు తీసి చెమట తుడుచుకున్నాడు గుండూరావ్.
“అదేం కాదండి, ఇందాకల వచ్చినప్పుడు, అమ్మాయి మీతో ఎక్కువ మాట్లాడ లేకపోయింది.. మీరు చాలా మంచివారిలా ఉన్నారు, ఒక్కసారి మాట్లాడాలని ఉందిటండి .. ఏటనుకోపోతే, ఒక్కసారి అప్సరా హోటల్ కాడికొస్తారా..”
గుండూరావ్ కి రక్తం వేడెక్కింది ..
“.. అప్సరా .. ఇప్పుడే… హోటల్ … వస్తా… ష్యూర్ …” తబ్బిబ్బయిపోయి, తడబడుతూ మాట్లాడేసాడు.. వెంటనే బాత్ రూమ్ కి వెళ్లి, దువ్వెన్నతో కేశాలు దిద్దుకుని, బాగ్ లో ఉన్న స్ప్రే కొట్టుకుని,
“వెంకయ్యా.. అర్జంటుగా బయటికెడుతున్నాను.. ఎవరైనా అడిగితే …” ఓ సారి చేతి వాచ్ చూసుకుని,
“ఊ … ఓ గంట పైన పట్టొచ్చు .. అలా అని చెప్పు..”
అని స్కూటర్ తీసి హడావుడిగా బయటికెళ్లిపోయాడు గుండూరావ్ …
రసజ్ఞులందరూ … “ఏం జరిగిందేం జరిగిం” దంటూ వెంకయ్యను చుట్టుముట్టారు …
కట్ చేస్తే….
టర్మ్ డిపాజిట్ రిసీట్ తీసుకుని వెళ్లిపోతూ చూసిన .. ఆ గ్రేట్ లుక్ తలచుకుంటూ, వెంటనే అప్సరా హోటల్ కు చేరాడు. బయట స్కూటర్ పార్క్ చేసాడు.. లోపలికి వెళ్ళాడు. ముందు లాడ్జింగ్ సెక్షన్ లోకి వెళ్లాడు. ఒకరిద్దరు అక్కడ లాంజ్ లో కూర్చుని ఉన్నారు కాని, వారిద్దరూ మగాళ్లు.. అటూ, ఇటూ కారిడార్లలో చూసాడు … ఎవరూ కనపడలేదు. రెస్టారెంట్ కు వచ్చాడు .. లోపలంతా చూసాడు . ఎవరూ కనపడలేదు. ఎ.సి. రూమ్ లోకి వెళ్లాడు.. ఎవరూ కనపడలేదు.. మళ్ళీ లాడ్జింగ్ సెక్షన్ కు వెళ్లి రెసెప్షన్ లో వాళ్లతో ఏదో మాట్లాడాడు. ఫలితం సున్నా.. కాసేపు అక్కడ సోఫాలో కూర్చున్నాడు.. మరల మరల వెతికాడు… నిరాశ వచ్చేసింది .. బయటికొచ్చేసి తిరుగు ముఖం పట్టాడు..
ఆఫీస్ ఇంకా అంత దూరంలో ఉండగానే … స్టాఫ్ ఎదురొచ్చారు ..
“హలో” అన్నాడు చప్పగా..
“ఎక్కడకెళ్లారు బాస్”
“అబ్బే ఇక్కడకే, ఎవరో డిపాజిటర్ బిజినెస్సిస్తానంటే..”నసిగాడు
“బిజినెస్ అంటే… యూ మీన్ చింతామణి”
“అబ్బే అబ్బే అబ్బెబ్బే …” తడబడ్డాడు గుండూరావ్ …
“హలో నేనండి, ఇందాకల మిమ్మల్ని అప్సరాకు రమ్మన్నాను కదండి, పాప అర్జంటంటావుంటే ఇంటికాడకొచ్చేసమండి. మా ఇల్లు మెరకీధిలోనండి .. ఒకపాలి రాగలరా ?”
“... ఆ వచ్చేస్తున్నాను” అని కదలబోయిన గుండూరావ్ ఆ మాట్లెవరా అని అప్పుడు చూసాడు ..
అది మా వెంకట్ … అతను గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ …
ఘొల్లు మన్నారు… మిత్ర బృందం.
నవ్వులతో నవ్వు కలపక తప్పలేదు గుండూరావుకి.
5 comments:
Hahahahaaaaa
ఈ డిపాజిట్టు 'తిరకాల్సు' బానే ఉన్నాయండి !
ఆ అప్సరా హోటల్ ఓ గుండూ రావు కి వాళ్ళు ఫేక్ నోట్స్ ఇచ్చారన్న వాస్తవం తెలుస్తున్దనుకున్నా !!
జూపెర్!!
జిలేబి
CHALA BAVUNDI HANUMANTHARAO GARU.CONGRATS. PL CONTINUE WRITING. ASALE MULLAPUDI VARU LEKA CHASTUNNAMU- MONNTI NUNCHI BAPU GARI CARTOONS KUDA LEVU.DID WE EVER WORK TOGETHER-MAY BE IN LHO.
-KUMARA SARMA
రావుగార్కి,జిలేబిగార్కి,జ్యోతిబాబుగార్కి కృతజ్ఞతలు. జిలేబిగారూ!విరాళలకొచ్చినవాళ్లకి లేదనకుండా చందా ఇచ్చేవాడని, denomination అడిగి సదరు చట్రాన్ని బిగించి, అవి తడారాక పట్టుకెళ్లమనేవాడని మా స్నేహితులు జోకేసేవారు. నిజానిజాలు తెలియవనుకోండి.. జ్యోతిబాబుగారు నా పోస్ట్ పట్ల మీరు నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎంతవరకూ అర్హుణ్ణో తెలియదు కాని.. మంచివి వ్రాసే ప్రయత్నం కొనసాగిస్తాను. మరొక్కసారి ధన్యవాదాలు. ఇక నేను LHOలో 1980-86లో OMDept.లో చేసాను.. కుమారశర్మ అంటే నాకు స్ఫురించటం లేదు. మీరు ఎక్కడ సెటిల్ అయ్యారు.. వివరం వ్రాయండి.. నమస్కరిస్తూ...
👍😃😀😃😀
Post a Comment