“రెండే రెండగు చిన్నియక్కరము లే లీలన్ జగంబంత తా
పండెన్ సర్వజనాంతరంగ హరమై, భాషా ప్రపంచంబునన్
నిండెన్నీ శుభ శబ్దమే, సహజమౌనే యాత్మకీ పేరు,బ్ర
హ్మాండంబంతట నిండు బ్రహ్మ మిది రామా! రామ చన్ద్ర ప్రభూ !”
{వ్యాఖ్య: ‘రామ’ అనే రెండక్షరాలు విశ్వమంతా నిండి ఉన్నాయి. ప్రపంచంలో సర్వ నాగరిక భాషల్లోనూ ‘రామ’నామం ఉంది. అనేక నాగరిక దేశాల్లో రామకథాగానం ఉంది. ప్రతిభాషా ‘రామ’ కథతో పునీతమైంది. ఎందుచేత ? ఆత్మకంటే ఇష్టమైన వస్తువు మరొకటి లేదు.తనకంటే ప్రియమైన వస్తువు ఏ వ్యక్తికీ ఉండదు. ఆ ఆత్మే ఆనందమయం. అదే బ్రహ్మం, అదే బ్రహ్మాండ వ్యాప్తం. ఆ ఆత్మకు ప్రియం కనుక ‘రామ’నామం సర్వజన ప్రియం.} --- (గురువుగారి
శ్రీరామ చన్ద్ర ప్రభూ శతకం.)
********* ******* ****** ********* ********* *********
మన్మథ నామ సంవత్సరం .. ఉత్తరాయణం … వసంత ఋతువు
చైత్ర మాసం …. శుక్ల పక్షం …. పాడ్యమి తిథి …. స్థిర వారం…
సాయం సమయం …
అంటే ఉగాది పర్వదినాన .. 21 మార్చి,2015 సాయంకాలం సుమారు 3 గంటలకు ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్, రాజమహేంద్రవర శాఖ కార్యాలయం నుండి 14కోట్ల “శ్రీరామ” నామం పసుపు-ఎరుపు వస్త్రములతో ముస్తాబై … భద్రాద్రి రాముని సన్నిధికి పయనమైంది.
సమన్వయ సరస్వతి, వాగ్దేవీ వరపుత్ర, ప్రవచన విరించి
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు 2015 మార్చి 3 వతేదీన ప్రారంభించి
ఆదిశంకర భగవత్పాద విరచిత “శ్రీరామ కర్ణామృతం” పై రాజమహేంద్రవరంలో
ప్రవచనము లనుగ్రహించారు.
ఆ నేపధ్యంలో గత 2014 శ్రీరామనవమికి భద్రాద్రి వెళ్ళిన - సతత శ్రీరామ ధ్యానైక నిరతులు .. డా॥టి.వి.నారాయణరావు గారికి .. భద్రాద్రి రాముని సన్నిధిలో ఉండగా కలిగిన
దివ్యమైన ఊహ --- పదికోట్ల రామనామాన్ని అందరం వ్రాసి … ‘శ్రీరామ కర్ణామృత’ ప్రవచన సమయంలో వేదికపై నుంచి, ఆ తరువాత భద్రాద్రి రాముని సన్నిధికి చేర్చాలని ..
ఆ ఊహలోని భక్తిని - నిజాయితీని - సుగ్రీవాజ్ఞగా భావించి .. శ్రీ రామ దండు కదిలింది. ఫేస్ బుక్ ద్వారానూ, ఫేస్ టు ఫేస్ గానూ, కరపత్రములద్వారానూ .. రకరకాలుగా తెలుగు రాముడికి భక్తులైనవారందరికీ విషయం తెలియజేయబడింది. భక్తుల మనస్సుల్లో శ్రీరాముడు కదిలాడు.. నిండుమనస్సుతో, రామ హృదయంతో, ఎంతోమంది.. స్పందించారు. శ్రీ వెంకట సుబ్బ రాఘవమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో - ప్రధాన ట్రస్టీ శ్రీ చలమయ్య గారు కోరినప్పుడల్లా … కోరినన్ని “శ్రీరామోపసన” కాగితాలు శాఖా కార్యాలయానికి పంపిస్తే అవి భక్తులకందజేయబడ్డాయి .
“శ్రీ రామ” పలుకుతూ, “శ్రీ రామ” వ్రాసారు.
“శ్రీ రామ” సౌందర్యం అక్షరాలలో తొణికసలాడేటట్లు “శ్రీ రామ” వ్రాసారు.
“శ్రీ రామ” కరుణ గుండెల్లో నింపుకొని “శ్రీ రామ” వ్రాసారు.
“శ్రీ రామ” దర్శనం మనో నేత్రాలతో చేస్తూ “శ్రీ రామ” వ్రాసారు..
‘రా’ కలుషంబులెల్ల బయలం బడద్రోచిన, ‘మా’ కవాటమై
డీ కొని ప్రోచు, నిక్కమని ధీయుతులెన్న తదీయ వర్ణముల్
గైకొని భక్తిచే నుడువగానరు గాక, విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ ! కరుణాపయోనిధీ ! --- [దాశరథీ శతకం]
******** ********** ********** ******** ************
“శ్రీ రామ కర్ణామృత”ప్రవచన సమయానికి, ఇంచుమించుగా పది కోట్ల సంఖ్యకు చేరువయ్యాం. తొమ్మిది రోజులు జరిగిన ఆ ప్రవచన మహాయజ్ఞ సమయంలో -
ఎంతోమంది కాగితాలు పట్టికెళ్లి ‘శ్రీరామ’ వ్రాసారు.. విదేశాలలో, తపోభూమి నైమిశారణ్యంలో, దేశంలోని పలుతావుల్లో “శ్రీ రామ” వ్రాసి నిర్వాహకులకు అందజేసారు. శ్రీమతి వాడ్రేవు ఉమా వేణుగోపాల్ గారి సన్నిహితులు కోటిన్నర ‘శ్రీరామ’ నామం శ్రీరామ ప్రేరణతో వ్రాసి అందజేసారు. … శ్రీరాముని అనుగ్రహం. ఇలా ఎంతోమంది వ్రాసారు … వ్రాయించారు … కనుకనే పదునాలుగు కోట్ల శ్రీరామనామం విశ్వరూపంగా దర్శనమైంది.
“శ్రీరామ”నామం అధిరోహించిన రెండు బస్సులలో ఉగాది పర్వదినం సాయంకాల వేళలో మనస్సులనిండా ‘శ్రీరాముని’ నింపుకొని భద్రాద్రి దిశగా మిత్రులు బయల్దేరారు. జయ జయ ధ్వానాలతో .. శ్రీరామ నామ సంకీర్తనలతో .. మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రయాణం సాగింది.
పచ్చటి అడవులు… గల గల పారే వాగులు… పశ్చిమాద్రి పై వెలిగే సూర్యకాంతిలో కనుల పండుగగా పచ్చటి అటవులు…ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే ,,, జగదానంద కారకుడైన శ్రీరాముడు సౌమిత్రీ సహితుడై, అమ్మ జానకమ్మతో కూడి .. ప్రసన్నాంజనేయుడు కొలుస్తుండగా ప్రకృతిలో పరచుకు పోయాడనే భావన.. మనస్సుకు తాకింది.
“ఇన్ని భాషలేల, ఇన్ని వర్ణములేల
‘రా’యు ‘మా’యును చాలు ‘రామ’ యనగ
‘రామ’యనుచు పిలువ, ‘రామా’యను జగతి
రాముడేలు జగము రమ్యముగను
************** ****************** ****************
రాత్రి 7-30గంటలకు … అదిగో భద్రాద్రి, ఇదిగో రాముడు చూడండి…
మా వస్తువులు బసలో పెట్టి, వామాంక స్థిత జానకీ రాముణ్ణి చూడడానికి పరిగెత్తాం.
ముందుగా శ్రీరామదూతకు “మేం వచ్చామయ్యా స్వామి, అయ్యకు కొంచెం చెప్పవా ?” అని అర్థించాము..
“మీరు రాలేదు, ఆయన రప్పించాడు” అన్నట్టు నవ్వుతూ చూసాడు స్వామి..
నిజమే .. ఆయన అనుగ్రహం లేకుండా .. ఇంతటి భాగ్యమా…
స్వామిదగ్గర లెంపలు వేసుకుని, భద్రుని శిఖరం పై కొలువై ఉన్న కోదండ రాముని, చతుర్భుజ రాముని, చూడడానికి త్వరపడ్డాం. స్వామి అద్భుత దర్శనం..
వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండం, కరే
చక్రం చోర్ధ్వకరేణ, బాహుయుగళే శంఖం శరం దక్షిణే,
బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్థ్ని స్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం
[ఎడమ తొడయందున్న సీత సేవింప, శోభించుచున్న ధనువు నొక చేతను, పై చేత
చక్రమును, కుడిచేతుల రెంటి యందు శంఖమును, బాణమును ధరించుచున్నట్టియు, భుజకీర్తుల మొదలగు వానిచే నలంకరింపబడినట్టియు, భద్రాచల శిఖరమందున్నట్టియు, నల్లనైన రఘురాజశ్రేష్టుడైనట్టియు రాముని సేవించుచున్నాను] (శ్రీ రామ కర్ణామృతం.)
**************** ****************** **************
“స్వామీ అనుగ్రహించావా … అద్భుత దర్శనం అనుగ్రహించావా స్వామీ! .. అనురాగ పూరిత దృక్కుల మా పై అనుగ్రహించావా స్వామీ…” -
శిరసు వంచి, కేలు మోడ్చి-- “రప్పించావు స్వామి, రప్పించుకున్నావు ” అంటూ మౌనంగా రోదించాము.
భద్రాచల పురంలో -- శ్రీ సీతా రాముల కల్యాణ వేడుకలు.. నిత్య కళ్యాణమూర్తులు
శ్రీ సీతారాముల పెళ్లికి … చలువ పందిళ్ళు … పచ్చ తోరణాలు. దగ్గరకి వస్తున్నది కదా మరి శ్రీరామనవమి పండుగ. .. వసంత నవరాత్రుల శోభతో అప్పుడే వధూవరులు వెలిగిపోతున్నారు... ఊరంతా పందిళ్ళు వేసారు..మామిడి తోరణాలు కట్తున్నారు .. పెళ్ళికి ప్రతి ఇంటికి బంధు మిత్రులు తరలి వస్తున్నారు.. వీధులన్నీ సందడి సందడిగా ఉన్నాయి … అంగళ్ళన్నీ క్రొత్త క్రొత్త వస్తువులతో సుందరంగా అలంకరించబడి శ్రీరాముని సేవించే భక్తుల రాకకోసం ఎదురుచూస్తున్నాయి… ఎక్కడ చూసినా కల్యాణ శోభ కనపడుతున్నది… వేదాంత వీధుల్లో విహరించే కోదండ చాప దారి ఏ మౌనివెంట రానున్నాడో … విదేహ రాజు వెనుకాల సిగ్గులొలికే సీతమ్మ కోమల హస్తాన్ని ఎప్పుడు గ్రహించనున్నాడో … ఆ పెళ్లి వేడుక చూసినవారిదె భాగ్యం…
************** ************** ************** *************
మాకు - ‘అంబా’ సత్రానికి ఎదురుగా .. శృంగేరి శంకర మఠం వారి నిర్వహణలో గల కాటేజెస్ లో బస, అంబా సత్రంలో భోజనం ఏర్పాటు చేసారు. అక్కడ మేనేజర్ శ్రీ మధు గారు మాకు చాలా సాయ పడ్డారు.
ఆదివారం ఉదయం మా నిత్య విధులు పూర్తి చేసుకుని, అంబా సత్రంలో కొలువైన బాలాత్రిపుర సుందరి ఆలయానికి చేరి, శ్రీరామ నామాన్నిముందుగా జగన్మాత సన్నిధిలో ఉంచాం. “శ్రీరామో లలితాంబికా” అని అంటారు కదా..
శ్రీరాముని యందు భక్తిగల సహృదయులు ఎంతోమంది వ్రాసిన రామకోటిపత్రాలను అరుణ పసుపు వర్ణాల వస్త్రాలతో కట్టిన మూటలను అందరం శిరస్సుపై పెట్టుకుని - అంబా సత్రం నుంచి భద్రాద్రి రాముని సన్నిథికి కదిలాం. పసుపు రంగు చీరలతో స్త్రీ మూర్తులు, సాంప్రదాయ దుస్తులతో మగవారు…రెండు లైనులలో కదులుతూ, ‘శ్రీ రామ జయ రామ, జయ జయ రామ’ అంటూ జయఘోష చేస్తూ … భద్రాద్రి వీధులలో ఊరేగింపుగా నడిచాం .. అలా నడుస్తూ ఆలయానికి చేరి అక్కడ శ్రీ రామచంద్రమూర్తి కొలువై ఉన్న ప్రధాన ఆలయానికి ముమ్మారు ప్రదక్షిణ చేసాం. … మమ్మల్ని ఆలాయాదికారులు అనుమతించే దాకా .. ఆలయ ప్రాంగణంలో “శ్రీరాముని” మధ్యలో ఉంచుకుని,చుట్టూ కూర్చుని రఘునాథ కీర్తనం చేసాం - అక్కడ తిరుగుతున్న భక్తులు భాష్పవారి పరిపూర్ణలోచనులై పీతాంబరధారియైన శ్రీరామనామానికి .. శిరసా అంజలి ఘటించారు.
రెండు గుంపులుగా మమ్మల్ని లోపల అంతరాలయంలోనికి అనుమతించారు. వీర వైష్ణవాచార జనం, మా గోత్ర నామాలతో పూజచేసి, వేద మంత్రాలతో శ్రీరమయైన
సీతా మహాలక్ష్మికి , చేతనోద్ధారకుడైన శ్రీరామునికి, పదునాలుగుకోట్ల శ్రీ రామ నామాన్ని సమర్పించారు. ఆయనది ఆయనకే..
పలుకే బంగారమైన స్వామి ఒక్క నామానికి బదులిచ్చినా చాలును కదా ? జన్మలు అర్థవంతమౌతాయి.
అక్కడ ఆలయంలో ఈ నామాల ప్రతులనుంచే భాండాగారం పూర్తిగా నిండినదట, అంచేత మరల అంబా సత్రానికి తెచ్చి అక్కడ ప్రత్యేకంగా నిర్మింపబడిన స్థూపంలో-నామంవ్రాసినవారి తరఫున- ఒక్కరొక్కరుగా వెళ్లి, నిక్షిప్తం చేసాం.
‘అంబా సత్రం’ 1877సం॥లో కీ.శే పమిడిఘంటం వెంకట రమణ హరిదాసు గారు నిర్మించారు. .. వారు బాలాత్రిపురసుందరీ దేవి ఉపాసకులు..రామ భక్తులు. యోగి. శ్రీ చక్రార్చకులు...‘అంబా’ అని పిలిస్తే జగదంబ పలికేదట. అందుకే ఈ సత్రం ‘అంబా సత్రం’. ఆయన నిత్యం అన్నదానం చేసేవారట. ఆయన జలాన్ని ముట్టుకుంటే అవసరమైనప్పుడు నెయ్యిలా మారిపోయేదట. ఒకసారి శ్రీ రామనవమికి భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయాలంటే వంట బ్రాహ్మణులు రాలేదట. అంబను నమ్మిన దాసు గారికి ఏ విధమైన ఆందోళనా లేదు. మేం చేసి పెడ్తామంటూ ఇద్దరు అపరిచిత వ్యక్తులు వచ్చి అన్ని పదార్థాలు వండి వెళ్లారు. .. “మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, మేం మళ్లీ వస్తా” మని చెప్పి, మరి రాలేదట.. వారు వంట చేసిన పెద్ద పెద్ద గుండిగలు(రామ లక్ష్మణ గుండెగలు) ఈ నాటికి అక్కడ మనకు దర్శనమౌతాయి.. అంత మహిమాన్వితమైన స్థల విశేషంగల ప్రదేశంలో ‘శ్రీరామ’ ఉంచబడింది.
అక్కడనే మధ్యాహ్నం భోజనం చేసి మరల ఘాట్ రోడ్ లో రాజమండ్రి చేరాం.
శ్రీ వల్లభ గణపతి ఆలయం దగ్గర మాకు రాత్రి ఫలహారాలు ఏర్పాటు చేసారు..
భద్రాద్రి రాముని, ఆనంద రాముని, సీతా లక్ష్మణ సహిత శ్రీరాముని, హనుమత్సేవిత కోదండ రాముని,మనసారా దర్శించుకుని, ఆనందంగా రాత్రి 9 ప్రాంతంలో ఇంటికి చేరాం..
తన ప్రవచనాల ద్వారా భగవత్ తత్త్వాన్ని సుబోధకం చేస్తూ .. ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తున్న గురువర్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి అనుగ్రహ విశేషం…
ఒక శుభవేళలో, ఒక శుభ సంకల్పం చేసి, ఒక శుభప్రయత్నానికి భాగస్వాములమయ్యే అవకాశం కల్పించిన సౌజన్యమూర్తి, శ్రీరామభక్తులు డా॥టి.వి.నారాయణరావుగారి సంకల్పబలం…
ఉండడానికి గూడు, స్వచ్చమైన భోజనం .. ఇవి లేనిదే యాత్రలు చేయలేని ఈ జీవులకు, చక్కటి వసతి, కడుపునిండా చక్కటి భోజనమే కాక, ఉత్సవ సమయాలలో కూడ భద్రాద్రి రామ మూర్తిని కన్నులారా చూసి, మనసారా స్తుతించే అవకాశం,
చక్కటి, సంతృప్తికరమైన దర్శనం-- ఏర్పాటు చేసిన మిత్రులు చి॥ వరప్రసాద్ మంచితనం.
అన్నింటికీ మించి, ఎంతో భక్తిశ్రద్ధలతో “శ్రీ రామ” వ్రాసి .. సకాలంలో నిర్వాహకులకు అందజేసిన ..’శ్రీరామ’ నామం వ్రాసిన అశేష భక్తుల - అనన్య రామ భక్తీ, .. అనురాగ పూరిత ఆశీసుల వలననే ఈ కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం కలిగింది.
శ్రీ సీతా రాముల సన్నిధిలోనిలబడే అదృష్టం కలిగింది.…
గురువు గార్కి సాష్టాంగ ప్రణామములు …
శుభ సంకల్పానికి, సాకారం చేసిన మంచితనానికి …
మా యాత్ర సఫలం చేసిన మిత్రులకు…
శిరసు వంచి పాదాభివందనము చేస్తున్నాను.
గడప మీద దీప కళిక నుంచి నటుల
నాల్క చివర ‘రామ’ నామముంచు
చిత్త శుద్ధి చేసి జీవుని ముక్తికి
దారి చూపు తారక మది.
నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమధికం నీటి సుజ్ఞాన మంత్రం
సత్యం శ్రీరామ మంత్రం సదమలహృదయే సర్వదారోగ్య మంత్రమ్
స్తుత్యం శ్రీరామ మంత్రం సులలిత సుమనస్సౌఖ్య సౌభాగ్య మంత్రం
పఠ్యం శ్రీరామమంత్రం పవనజ వరదం పాతుమాం రామ మంత్రమ్
No comments:
Post a Comment