Pages

Monday, July 13, 2015

రాజమండ్రి - 9

రాజమండ్రి - 9
 
అర మహా పుష్కరాలు

రచన: డి.వి.హనుమంత రావు.


రేపట్నించి ప్రారంభమయ్యే గోదావరీ పుష్కరాలు… అందరికీ మహా పుష్కరాలట. 
అయితే నాకు అర మహా పుష్కరాలు. అందరూ దీన్ని మహా పుష్కరమంటున్నారు …
అంటే 144ఏళ్ల క్రితం పుష్కరాలు లేవా.. గోదావరి లేదా.. ఆ చర్చ జోలికి మనం పోవద్దు. 
సరే - ఇది మహా పుష్కరమయితే నాకు ఇది అర మహా పుష్కరం. ఎలాగా…? 
చదివితే మీకే తెలుస్తుంది. చడవండి.


1943వ సంవత్సరంలో నేను పుట్టానండి. అప్పుడో పుష్కరమొచ్చిందటకదా ? నాకు గుర్తు లేదు. ఎందుకంటే నాకు పళ్లు లేవు .. అబద్ధాలాడే వయసు కాదన్నమాట. కాని అప్పుడు ప్రపంచ యుద్ధం టైమన్నమాట. నా జాతక చక్రంలో గంటో, గంటన్నరో కలుపుకోవాలి ఆర్ తీసేయాలి.

1955లో నేను హైస్కూల్ లో చదువుతున్నాను. భారత్ స్కౌట్ లో ఉన్నాను. శ్రీ కలగా కృష్ణమూర్తి గారు మా స్కౌట్ మాష్టారు. ఆయనని విత్తనాల మేష్టారనేవారు. ఎందుకంటే ఇంట్లో పండించుకునే బెండ,బీరా,చిక్కుడు లాంటి విత్తనాలు అడగకపోయినా ఇచ్చి పాదులు పెంచమనేవారు.వాళ్లింట్లో  తేనెటీగల పెంచే  పరిశ్రమ ఉండేది. మంచి మేష్టారు . పుష్కారాలకు నాకు డ్యూటీ వేసారు. కోటిలింగాల రేవు లోనే డ్యూటీ, ఉమా కోటి లింగేశ్వర స్వామి వారి ఆలయం వెనకాల దేవస్థానం వారి ఆఫీస్ ఉండేది. మేము మెడలో స్కార్ఫ్, చేతిలో కర్ర, నడుందగ్గర బెల్ట్ కి ఓ తాడు అన్నీ పెట్టుకుని, డ్యూటీకి వెళ్లగానే, దేవస్థానం ఆఫీసులో టిఫిన్, కాఫీ ఇచ్చేవారు. అక్కడనుంచి రేవులోకి వెళ్లేవాళ్లం. కర్రతో చెత్త ప్రక్కకు లాగుతూ, పెద్దవాళ్ళకి చెయ్యి పట్టుకొని రేవులో సాయం చేయడం ఇలా ఏవో చేసేవాళ్లం. అప్పుడు పిండ ప్రదానాలు అవీ గట్టు మీదే పెట్టేవారని గుర్తు. కళావెంకట్రావుగారు, అప్పుడు మంత్రి అనుకుంటా, వచ్చి రేవును చూస్తూ నాకు దగ్గరగా నించున్నారు. అది ఒక థ్రిల్. నాన్నగారికి ఆయన మంచి ఫ్రెండ్. అది తెలుసు. కానిఅలా అని చెప్పి పరిచయం చేసుకోడానికి ఏదో  బెరుకు. గట్టుమీంచి మెట్లు దిగాక ఎడమ వైపు ఒక బురుజులా ఉండేది. దానిపైన పోలీసులు అబ్సర్వేషన్ పోస్ట్ అని పెట్టి రేవు పరిశీలిస్తూ హెచ్చరికలు చేసేవారు. సీతంపేట నుంచి కోటిలింగాల రేవు వైపుకు పెద్ద పెద్ద కంపార్ట్మెంటులు వెదురుతో కట్టి క్రౌడ్ ను కంట్రోల్ చేయడం గుర్తు. అప్పుడు కూడా పుష్కరాలు రెండు పంచాంగాల పద్ధతిలోనే వచ్చినట్టున్నాయి.. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే .. స్కౌట్ డ్యూటీ కి రోజుకి పావలా ఇచ్చేవారు. నాకు 22 పావలాలు వచ్చాయి. అంటే అయిదు రూపాయల ఎనిమిదణాలు. అవి పెట్టి నేను ఒక బేబీ గొడుగు కొనుక్కున్నాను. చాలా కాలం వాడాను.

1967లో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. చేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఉద్యోగం రిజైన్ చేసి, ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో -  పలాసాలో ఉద్యోగం. చేరి ఆరునెలలవకుండానే పుష్కారలొచ్చాయి. సెలవడిగితే ఏజెంట్ (అప్పుడు ఏజెంట్ అనేవారు )గారిని సెలవడిగితే, ఇంకా ప్రబేషన్ అవలేదు. ఇప్పుడిస్తే మీ సర్వీస్ కు ఇబ్బందవుతుందన్నారు. కాని మంచాయన,భగవత్ చింతన ఉన్నాయన, మిత్రులుకూడా నా అభ్యర్థనకు మద్దత్తిచ్చారు. ఆదివారము కలసొచ్చేటట్టు రెండు రోజులు సెలవిచ్చారు. పరుగెత్తుకుని రైలు బండిలో వచ్చేసాను. సుబ్రహ్మణ్య మైదానంలో స్టేజి మీద ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు. అప్పుడే వేదాంతంవారి స్త్రీ వేషధారణ చూసాను. టి.టి.డి. వాళ్లు అతి చవకగా పుస్తకాలమ్మారు.  మునిసిపల్ స్టేడియం లో ఎగ్జిబిషన్. లోపల డాన్స్ చేస్తున్న అమ్మాయి, బయట స్క్రీన్ పై కనపడడం ఒక వింత. అప్పుడే అనుకుంటా పది రూపాయలకో అయిదు రూపాయలకో విమానం నగరసౌందర్యాన్ని చూపేది. ఆఫ్ కోర్స్ నేనెక్కలేదు..

1979లో ఆఫీసర్ గా ప్రమోషన్, పాయకరావుపేటలో ఉద్యోగం. ఇనప్పెట్టి తాళాలు  పట్టుకునే ఉద్యోగం. సెలవంటే ప్రాబ్లం .. మొత్తం మీద ఒక రోజో రెండురోజులో వచ్చి వెళ్లాను. అప్పటికి పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. ఆనందం, ఉత్సాహం - నాకున్న ఉద్యోగ బాధ్యతల బరువుతో  అణగింది. యువభారతి, జంట నగరాల సాహితీ సంస్థ బుక్ స్టాల్ పెట్టింది. నాకున్న పరిచయం దృష్ట్యా కొంత మాట సాయం చేసాను ఉన్న రెండురోజులూ .

1991లో రాజమండ్రికి దగ్గరగా ఇందుకూరుపేటలో బి.యమ్ గా వేసారు. ప్రొద్దున్న పోతే సాయంత్రమే తిరిగి రావడం. అయినా వచ్చాక ఉత్సాహం తెచ్చుకుని ఊరు చూసేవాణ్ణి. మా మేనమామగారబ్బాయి శ్రీరామనగర్ లో ఇల్లు తీసుకుని వచ్చిన వాళ్లందరికీ భోజానాలు ఏర్పాటు చేసాడు. మా ఆవిడా పిల్లలూ వడ్డనలో  సాయపడేవారు. నాకు ఆదివారాలలాంటి శలవుదినాలలో కుదిరేది. అప్పుడు పాల్గొని ఆనందాన్ననుభవించాను. ఇంతకు ముందు పుష్కరాలకు హోటల్ వాళ్లు చాలా సొమ్ము చేసుకున్నారట. మనుషులు నడచే రాంప్ మీదకూడా ఆకులేసి పెట్టేసే వారట. అయితే నాకు తెలిసి 1991 పుష్కారాలలో రాజమండ్రి ఒక అన్నపూర్ణ -- ఒక డొక్కా సీతమ్మ అందరిళ్లల్లోనూ భోజనాలు యథా శక్తి పెట్టేవారు. అప్పుడు మేం రాజా టాకీస్ ప్రక్క నూనె మిల్లు కాంపౌండ్ లో ఉండేవాళ్లం. శ్రీకాకుళం జిల్లాలనుంచి ఒక కాంట్రాక్టర్ బస్సు వేసి ఒక batch జనాన్ని తీసుకొచ్చి ఇంకో batchని తీసుకువెళ్ళే వాడు. అందులో వచ్చిన ఒకరిద్దరు బ్రాహ్మణులు మా ఇంటికొచ్చి భోంచేసారు. స్కూల్ పిల్లల చేత అన్య మత  ప్రచారం. ఓ రోజు నేను నదీ స్నానం చేసి భస్మ ధారణ తో ఇంటికొస్తుంటే అన్య మత సాహిత్యం పట్టుకొచ్చి చేతిలో పెట్టబోయాడు. వెనక్కి త్రిప్పమన్నాను. చూస్తే అర్థంఅయిపోయింది. చాలాకోపం వచ్చి, అసలు నీకు బుద్ధుందా, ఇదేం పనంటే .. విదేశీ పైసలతో ఆత్మ ద్రోహం చేసుకుంటున్న ఆ ఆసామీ.. థాంక్యూ సర్ అంటూ పారిపోయాడు. ఇలాంటివి చూస్తుంటే చాలా బాధ కలిగేది.. ఇవన్నీ ప్రక్కనెట్తే ఆ పుష్కరాలు చాలా ఆనందాన్నిచ్చాయి.  ఈ ఆనందానుభవం నాతో 2003 పుష్కరాలదాకా ప్రయాణం చేసింది.    

ఇక 2003 పుష్కరం. 2003 జనవరిలో నాకు షష్ట్యాబ్ది పూర్తి. 2001లో వి.ఆర్.యస్ తీసుకున్నాను. అప్పటికి వైజాగ్ లో ఉన్నా పుష్కరాలకు రాజమండ్రి చేరాలని గట్టిగా నిర్ణయించుకుని, రాజమండ్రి మకాం మార్చేసాను. నేనూ మా మేనమామ గారబ్బాయి కలసి ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాము. అంతా అయ్యాక ఆ ఇంటివారు అద్దె ఏమీ తీసుకోకుండా తమ సౌజన్యం చూపారు. వైజాగ్ నుంచి ఒక చక్కని వంటాయన (చక్కదనం వంటలో) మాకు తన నైపుణ్యం చూపాడు .. రోజుకి మిత్రులు, బంధువులు 100కి తక్కువకాకుండా భోంచేసారు. ఆచార్య తిరుమల, అక్కిరాజు సుందరరామకృష్ణ, వడ్డె శ్రీకృష్ణ వంటి ప్రముఖులు తమ పుష్కర స్నానం చేసి, తీర్థ విథులు పూర్తి చేసుకుని, మా తావులో భోంచేసి వెళ్ళేవారు. అప్పటి పరిచయాలు కొన్ని ఇప్పటికి కొనసాగుతున్నాయి అంటే అది మా దంపతుల అదృష్టం. రోజూ మా చిన్న ఇంటిలో 15మందైనా విశ్రమించేవారు. రాత్రి వారికి ఫలహారం మా శ్రీమతి ఏర్పాటు చేసేది. ఉదయం కాఫీ మా ఇంట్లో, పుష్కరస్నానం, తరువాత మా తావులొ భోజనం. మరొక ఇల్లు అద్దెకి తీసుకుంటే దూరాలనుంచి వచ్చిన పురోహితులు మకాం చేసి, వారు కార్యక్రమములు నిర్వర్తించి నాలుగు రూకలు సంపాదించుకునేవారు. సమయం దొరికినప్పుడు ఊరు చూసేవాళ్లం. తెలుగుదేశం నేతృత్వంలో ఊరు సర్వాంగ సుందరంగా తయారైంది. అప్పుడే ఘాట్లన్నింటికి టైల్స్ వేసారు. రోడ్లన్నీచదును చేసారు. పచ్చటి మొక్కలు పాతారు. ఎన్నో స్వచ్చంద సంస్థలు టిఫిన్స్, భోజనాలు ఉదారంగా పంచారు. యాత్రీకులు ఎంతో తృప్తి పడ్డారు.
పుట్టుకనుంచి, షష్టి పూర్తి దాకా ఆరు పుష్కరాలు … అర మహా పుష్కరాలు. మొదటిది పాపం చిన్నపిల్లాడ్నని వదిలేస్తే ఇది ఆరవ పుష్కరం..

2015 .. 6 x 12 = 72 పూర్తి అయ్యాక వచ్చిన పుష్కరం. ఇది అరమహాపుష్కరం … పనులు లేట్ గా మొదలయ్యాయి, విపరీతమైన ఎండలు, అకాల వర్షాలు పనుల వేగాన్ని తగ్గించాయి. కోటిలింగాల ఘాట్ పెద్దది చేయడం, నిత్య గోదావరి హారతి కొన్ని విశేషాలు. గోదావరి హారతి అన్నది క్రితం పుష్కరాలలో ప్రారంభమైంది. కాని మ్రొక్కుబడి. అప్పుడు మేమున్న సంస్థద్వారా, ప్రతి పున్నమికి పుష్కర ఘాట్ లో హారతి  2005లో మే లో ప్రారంభించాము. సామవేదం వారు హారతి పాట కూడా వ్రాసారు. అయితే ఆత్మీయంగా, నిరాడంబరంగా సాగేది. రాజకీయనాయకుల ప్రవేశం లేదు. ఆ తర్వాత ప్రస్తుతం చేస్తున్న సంస్థ అదే రేవులో అదే పున్నమి నాడు భారీగా కార్యక్రమం మొదలెట్టారు. రాజకీయ నాయకులు ఓహో అద్భుతమైన ఆలోచన అన్నారు, మాది తగ్గింది.. ఇప్పుడు అందరూ ఆనందించేవిధంగా నిత్య హారతి గా గోదావరీ మాత నీరాజనాలు అందుకోవడం శుభ పరిణామం. విషయ పరిజ్ఞానంతో మహనీయులు  తమ ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మికత సామాన్య జనులలో పెంచడం వలన, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన లక్షల్లో యాత్రీకులు వస్తారని అంచనా..
పన్నేండేళ్లకోసారి వచ్చే ఈ పండుగకు,,
కడియం మొక్కల పచ్చదనంతో, విద్యుత్ కాంతుల ప్రకాశంతో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాతావరణంలో  
ఊరు సన్నధ్ధమైంది. యాత్రీకులను ఆహ్వానించడానికి, అట్టహాసంగా --

హృదయాలు తెరిచి యాత్రీకులను ఆహ్వానిస్తున్నాము ఆత్మీయంగా ….  

2 comments:

Anonymous said...

శుభోదయం మీ ఆత్మీయ ఆహ్వానం తో గత ఆరు పుష్కరాల మీ అనుభవాల సంగ్రహ వివరణలు
చాలా బాగున్నాయి.

డా.ఆచార్య ఫణీంద్ర said...

మొదట 'బ్రిటిష్ ఇండియా'లో పుష్కరాలు .. తరువాత 'ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం'లో .. ఆ పైన 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం'లో 4 సార్లు ... ఇప్పుడు నవ్య 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం'లో ... ఇలా 7 సార్లు గోదావరి పుష్కరాలకు సాక్షిగా నిలిచిన మీరు ధన్యులు. మీకు నా పాదాభివందనం!