పుష్కర ప్రారంభంలో
చందమామలో ఎప్పుడో ఒక కథ చదివాను.. మీకూ గుర్తుండే ఉంటుంది....
బ్రతుకుతెరువుకోసం ఒకామె పాలమ్ముకుని జీవిస్తోంది.. ఆ పాలమ్ముకునే స్త్రీ గంపలో పాలతో ఉన్న చెంబులు పెట్టుకుని నగరంలో అమ్మడానికి తీసుకువెళ్తోందోసారి. ఆ పాల చెంబులపై పల్చటి వస్త్రం కప్పిఉంది.. ఇంతలో వచ్చిన గాలికి ఆ పైనున్న వస్త్రం తొలగి కొన్ని పాలచెంబులకు ఆచ్చాదన తొలగింది. అదే సమయంలో పైన ఆకాసంలో ఒక గ్రద్ద ఆహారంకోసం ఒక పామును కాళ్లతో పట్టుకుని ఎగురుతోంది. ప్రాణ భయం చేత ఆ విషనాగు నోరుతెరచి గరళం క్రక్కుతుంది.. అది సరిగా అచ్చాదన తొలగిన పాలచెంబులో పడింది. ఆ పాలు కొనుక్కున్న వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు..
ఇప్పుడు ఆ పాపం ఎవరి ఖాతాకు వెయ్యాలి.. బ్రతుకుతెరువుకోసం పాలమ్ముకుని జీవిస్తున్న ఆ స్త్రీకా... గాలిని వీచి వస్త్రం తొలగజేసిన తన ఉనికి చేత లోకరక్షణ చేస్తున్న వాయుదేవుడికా... భయంతో విషం కక్కిన విషనాగుకా.. తన పొట్ట నింపుకునే కనీసధర్మంతో ఆహారాన్ని పట్టుకుపోతున్న గరుత్మంతుడికా అని..దేవలోకంలో సంబంధిత దేవతలు క్రిందామీదా పడుతున్నారు.. ధర్మశాస్త్రాలు తిరగేస్తున్నారు.
ఈ విషయం గురించి దేవలోకానికి చెందిన రెండు పక్షులు భూలోకంలో ఓ చెట్టు మీద కూర్చుని చర్చించుకుంటున్నాయి.. ఆ చెట్టు నీడలో ఇద్దరు వ్యక్తులు విశ్రమిస్తున్నారు.. అందులో ఒకనికి పక్షి భాష తెలుసు. అతను విషయం విని పెద్దగా నవ్వి మిత్రుడికీ విషయం తెలియజెప్పి చేతకాని దేవతలని దేవతలను నిందించాడు. దేవదూతలొచ్చి అతన్ని పట్టుకుపోయారు... ఇతన్ని నిలదీశారు..నోటికొచ్చిన సమాధానం చెప్పి గేలిచేసాడు ఈ వ్యక్తి.. అంతా విన్న ఆ సమవర్తి "ఇతని సమాధానం ధర్మ బద్ధంకాదు..దేవతలనే ధిక్కరిస్తున్న ఈ అతితెలివిమంతుడిఖాతాలో ... ధిక్కరించిన పాపం, ప్లస్ మనకు తెగని సమస్యకు సంబంధించిన పాపం జమకట్టండి" అని తీర్పు ఇచ్చాడు...
రాజమండ్రి ఆహ్వానిస్తే వచ్చారు భక్తితో యాత్రీకులు.. వారికు రాజమండ్రి సరియైన సదుపాయాలు చేయడంలో విఫలమైంది..
ముఖ్యమంత్రా, అతనికి సరియైన ఆలోచనలు అందీయలేకపోయిన మంత్రిగణమా, రక్షణ వైఫల్యమా, బాధలు పడేవాళ్లు దొరికితే చాలు, ఓదార్చేద్దామని మాటా ముల్లూ సర్దుక్కూర్చున్న విపక్ష పార్టీలా .. బాధ్యతారహితంగా విస్తృత ప్రచారం కల్పించే న్యూస్ మాధ్యమాలా… తమ వంతు క్రమశిక్షణ తాము పాటించక ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన క్రమశిక్షణ లేని ప్రజలా… గోదావరికి పుష్కరకాలం 12 రోజులూ పవిత్రమని ముందే చెప్పని జ్ఞానులా…ఎప్పుడూ లేని విధంగా ఒక ముహుర్తం చెప్పి అదే పవిత్రమంటూ విశేష ప్రచారం చేయడమా … ఎవరిదీ తప్పిదం.
రాజమండ్రి గృహస్తుగా నాదే తప్పేమోననిపిస్తోంది … చాలా బాధ కలుగుతోంది…. శిరస్సు వంచి బాధాతప్త హృదయంతో సోదర ప్రజానీకానికి క్షమార్పణలు తెలుపుకుంటున్నాను.. జరిగిన నష్టం దీనివలన తీరదని తెలుసు… మిగిలిన రోజులు యాత్రికులకు ఆనందకరమైన అనుభవాన్ని కలిగించమని ఆ గోదావరీ మాతను కోరుకుంటున్నాను. పైనున్నదేవతలను ప్రార్థిస్తున్నాను.
No comments:
Post a Comment