పుష్కర సంవత్సరం
ఇంటి కొచ్చేటప్పటికి, చిట్టి తల్లి సోఫాలో మోకాళ్ళలో తలపెట్టుకుని కూర్చుంది.
నిజానికి, డోర్ బెల్ కొట్టినప్పుడు తలుపు తనే తీసింది.
నాకన్నా ముందు పరిగెత్తుకొచ్చి సోఫాలో కూర్చుని కోపం…
నటిస్తున్నదేమో అనుకున్నా..
కాని కోపం వినపడుతోంది.
వాళ్లమ్మనడిగా,“చిట్టితల్లి ఇలా మూడీగా ఉందేమి”టని..
“ఏమో నాకేం తెలుసు.. ఆ కంప్యూటర్ లో ఏం గొడవలొచ్చాయో “అంది ఆవిడ.
“అలా అని కాదు..”నసిగా .
“ఇందాకా వచ్చి నన్ను రేపు తారీఖు ఎంత అని ఆడిగింది. ‘ఆగస్ట్ 15 అని చెప్పా’ ఇండిపెండెన్స్ డే అని కూడా చెప్పా. “15 అంటే 2 తర్వాతనే కదా”అంది.
“అదేం ప్రశ్న వెర్రి ప్రశ్న అన్నా…అంతే దురుసుగా, చేతిలో ఉన్న పుస్తకాలక్కడ పాడేసి, ఇదిగో ఇలాగ“
అని విషయం చెప్పింది వాళ్లమ్మ.
నాకు లైట్ వెలిగింది.
“మరీ అలా చెప్పు.. “అన్నా
“అవును చదవేస్తే ఉన్న మతీ పోయిందన్నట్టు, అంకెలు తెలియవా ఆమాత్రం, అని అలా అన్నాను.
ఆమాత్రం నేననకూడదా..”అని సాగతీసిందావిడ గారు.
“ఇక్కడ అంకెలు తెలియడం, ... యకపోవడం కాదు సమస్య..2వ తారీఖు అంటే చిట్టితల్లికి స్పెషల్,
అది మనం మర్చిపోయామని కోపం అన్నమాట “అన్నా.
“మీ స్పెషల్లూ, ఆర్డినరీలూ నాకు తెలియవు బాబూ…”అంటూ వాళ్లమ్మ లోపలికి దారి తీసింది.
నెమ్మదిగా చిట్టితల్లి దగ్గరికెళ్లి బుజ్జగించడం మొదలెట్టా…
“నీ ఫ్రాక్ బావుందమ్మా,” అని చెయ్య భుజం పై వేయబోయా… గట్టిగా తోసేసింది.
దెబ్బ తగిలిందన్నట్టు.. “అబ్బా” అన్నాను.. చట్టున తల పైకెత్తింది.
అహ్హహ్హా అని నవ్వేసా… తను కూడా నాతో నవ్వు కలిపింది.
చిట్టితల్లికి కోపం పోయింది… అన్నా..
బుంగ మూతి పెట్టి
“మళ్లీ నా పుట్టిన రోజు ఎందుకు మరచిపోయావు..”అడిగింది చిట్టి తల్లి.
నా సంజాయిషీ చెప్పడం మొదలెట్టా …
“జులై 25దాకా గోదావరికి పుష్కరాలుకదా. ఇంటికొచ్చిన అతిథులతో ఇల్లంతా కళ కళలాడింది. .. ఊరంతా రాజమహేంద్రికి వచ్చిన పుష్కరయాత్రీకులతో సందడి సందడి.. గోదావరి స్నానాలు. పన్నెండేళ్లకోసారి ప్రత్యేకంగా అలంకరించుకునే నగరం.. ఊరంతా గోదావరి గల గలలు. నా గురించి ఆలోచించుకోడానికి కూడా నాకు ఖాళీ లేదు. అందుకని ఆగస్ట్ 2న నీ పుట్టినరోజు … అలా మనసులోనే ఉండిపోయింది.” అన్నా.
“సురేఖ హాసం అప్పారావ్ అంకుల్, జ్యోతి వలబోజు ఆంటీ,బులుసు సుబ్రహ్మణ్యం అంకుల్ .. వీళ్లెవరైనా ఫోనులు చేస్తారేమో అనుకున్నా… “అంది పసితనం.
“సురేఖ అంకుల్ - ముంబాయి వెళ్లి వచ్చారట. జ్యోతి ఆంటీ - పబ్లికేషన్స్, మాలికా మేగజైన్,సభలూ,సదస్సులు వీటితో బిజీట .. ఇక సుబ్రహ్మణ్యం అంకుల్ - మనం పలకరించటంలేదని అలిగారేమో..”అని సర్ది చెప్పబోయా.
...... ఎవరైనా మనల్ని పలకరించడానికి వారిని కూడా మనం పలకరిస్తూ ఉండాలిగా,
అయినా మనమేమీ వి.ఐ.పిల మా, సెలెబ్రిటీస్ మా ..... అని మనసులోనే అనుకున్నా,
చిట్టి తల్లి చిన్ని మనసు గాయపడుతుందని గట్టిగా అనలేదు..
“అయినా నువ్వు ఫేస్ బుక్, స్కైపు, వాట్సప్పూ అంటూ బిజీ అయిపోయావు.”అని నిష్టూరమాడింది.
“అదికూడా నిజమే అనుకో”అని ఒప్పుకున్నా.
“మొన్న ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చూసా .. అది ప్రపంచ జోకులు దినోత్సవం మీద, ఎవరో పోస్ట్ చేసారు.. చదివితే అది మనం పెట్టినదే. ఎప్పుడో 2011లో పెట్టాము కదా మనం.. అదే పోస్ట్ పేరు లేకుండా, మళ్లీ ..”అని కొంచెం బాధగా చెప్పింది.
“ఇదివరలో కూడా అదేతంతు“ నా బాధ చెప్పా …
“కాపీ రైటు .. అంటే కాపీ చేసే రైటన్నమాట... “అని నవ్వింది.
“అయినా చిట్టి తల్లీ! ఈ మధ్యనే సూర్య ప్రకాష్ ఫేస్ బుక్ లో చూసా .. కాపీ కొట్టడం కూడా ఒక కళే అని, అలాంటి కళా నిష్ణాతులుంటారుగా, ఏం చేస్తాం.. “అన్నా నేను.
“ఆమధ్య సరసి గారు నా దగ్గర బాధపడ్డారు, తన కార్టూన్స్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి, ఆయన పేరున్న చోట వ్హైట్ పెయింట్ పూస్తున్నారుట, ఎవరిదో తెలియకుండా.”అంది మా చిట్టి తల్లి..
“నీకో ముళ్లపూడి వారి జోకు చెప్తాను విను…
ఒక పత్రికా సంపాదకుడి దగ్గరకు ఒక కాగితాల కట్ట పట్టుకుని, ఇలాంటి కాపీరైటర్ వచ్చాడుట.
ఆ కాగితాలు ఓపిగ్గా చదివి,
“ఎవరు వ్రాసారు” అన్నాట్ట సంపాదకుడు అనుమానం వచ్చి,
“నేనే” అన్నాడట ఈ కాపీ రైటర్
“మీరేనా… అరె! అడివి బాపిరాజు గారు పోయారనుకుంటున్నాము, ఇంకా బ్రతికే ఉన్నారన్నమాట.”
వ్యంగ్యంగా అని నమస్కారం పెట్టాడట …ఆ సంపాదకుడు.
ఇంతకీ ఆ కాపీ . రైటర్ తెచ్చినది … ప్రఖ్యాత రచయిత అడివి బాపిరాజుగారు వ్రాసిన ‘నారాయణ రావు’ నవల.
ఆ నవలకు సాహిత్య పురస్కారం కూడా వచ్చింది.”అని చెప్పగానే
జోకు విని… పక పకా నవ్వేసింది చిట్టి తల్లి, నవ్వుతూ
“అందుకే జోస్యుల సూర్య ప్రకాష్ గారన్నట్టు కాపీ చేయడం కూడా ఒక కళ”. అంది.
మూడ్ లోకి వచ్చింది కదా.. అని
“బిలేటెడ్ గ్రీటింగ్స్ ఫర్ ఏ హేపీ బర్త్ డే …” అని షేక్ హేండ్ ఇచ్చా …
“థాంక్యూ “అంది.
“పుట్టిన రోజుకి ప్రెజెంటేషన్, ఏం కావాలి నీకు తల్లీ, అడుగు” అంటే …
గోదావరి పుష్కరాలకు ముస్తాబైన కోటిలింగాల ఘాట్ చూపించమంది.
తీసుకెళ్లా… గోదావరి పుష్కరాల సందర్భంగా కోటిలింగాల రేవును నవీకరించి,
భారత దేశంలోనే మొదటి పెద్ద ఘాట్ గా తీర్చి దిద్దారు.
ఆ పెద్ద ఘాట్ చూసి .. చిట్టి తల్లి చాలా ఆనందపడిపోయింది. ఆ విశాలమైన రేవులో అటూ ఇటూ పరుగులు పెట్టింది. నీళ్లదాకా వెళ్లి, శిరస్సు పై పవిత్ర జలాలు జల్లుకొంది. అరచేతిలోకి నీటిని తీసుకుని భక్తితో పానం చేసింది.
గోదావరీ తీర వాసుల రచనలకు ప్రాణం పోసే అఖండ గౌతమీ జలాలకు ప్రణమిల్లింది.. నా చిట్టి తల్లి.
“బ్లాగాభివృద్ధిరస్తు” అంటూ ఆ “నీటి సిరి” గలా గలా దీవించింది.
నా చిట్టి తల్లిని మరి మీరూ దీవిస్తారు కదూ ?
1 comment:
కొంచెం ఏమిటి బాగా ఆలస్యంగానే చెబుతున్నాను.
మీ బ్లాగు ఆరవ జన్మదిన శుభాకాంక్షలు.
Post a Comment