హరాజీకా - 12
చేతిలో పేలిన జోకు.
---డి.వి. హనుమంత రావు
[దీపావళి వెళ్లి పోయింది, మళ్ళీవచ్చే నాగులచవితి వెళ్లి పోయింది… క్షీరాభ్ధి ద్వాదశి, కార్తిక పూర్ణిమ అన్నీ ఆనందంగా జరుపుకున్నాక ఈ పేలడాలేమిటనకండి. జోకులకి సమయ పాలన లేదు.. ఎప్పుడైనా వెయ్యచ్చు. కొన్ని మతాబుల్లా తెల్ల కాంతులు వెదజల్లుతాయి. కొన్ని ఇలా చేతుల్లోనే పేలిపోతాయి… చదవండి ]
ఒక్కోసారి మనం అతి తెలివికి పోతుంటాము. దానికి నేనేమీ ఎక్సెప్షన్ కాదు. పైగా నాకు అందర్నీ నవ్వించగలనని ఒక దుర్నమ్మకం. (ప్రయోగం రైటేనా ? ఏమో మరి !).
మాది ఓ పెంకుటిల్లు. నేను చిన్నవాడిగా ఉన్నప్పణ్ణుంచీ, పెద్దై బ్యాంకుద్యోగం వచ్చి, పెళ్ళయి, ఈ ఊరునుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఆ పెంకుటింట్లోనే నా జీవితం. మా అమ్మ నాన్నగారల దగ్గర అక్కడే పెరిగాను,. మా నాన్నగారు ఎప్పుడో కొన్న పెద్ద స్థలంలో ఓ పెంకుటిల్లు, పెద్ద దొడ్డి. అమ్మ రక రకాల మొక్కలు పెంచేది. బీర, బెండ,దొండ లాంటివి, అరటి అవీ కాసేవి. ఇప్పుడు అరవయ్యీ డెబ్భై పెట్టి కొనుక్కుంటున్న కాకరకాయలు దడిమీదకు ప్రాకిన పాదుకు తెగ కాసేసేవి. బయటి వాళ్ళు కూడా కోసుకునేవారు. ఆ పెంకుటింటికి చుట్టూ మామూలు దడి. పెద్ద రక్షణ కాదు కాని, అది ఒక హద్దు. రోడ్డుపైనుంచి ఇంట్లోకి వస్తూంటే .. ఓ ప్రక్కగా అరుగు. నాన్నగారు అక్కడ ఓ కర్ర కుర్చీలో కూర్చునే వారు. నాన్నగారికి రెండు కళ్ళకు నాలుగు ఆపరేషన్లయ్యాయి. అందుకని పేపర్లో పెద్ద లైనులు చదవగలిగేవారే కాని, చిన్న అక్షరాలు కనపడేవి కావు. మామూలుగా ఆయన పుస్తకాలు ఎక్కువ చదివే వారు. ఏదో పుస్తకం ఎప్పుడూ చదువుతూ ఉండేవారు. ఈ నేత్రావరోధము ఆయనకు ఇబ్బంది పెట్టేది కాని, ఆయన అదో ఇబ్బంది అని ఎప్పుడూ అనుకునేవారు కాదు. ఎంత కనపడితే అంతే చదివే ప్రయత్నం చేసేవారు. అమ్మ ఇంట్లో పనులయ్యాక ఆ అరుగుమీద చేరేది. ఆమెకు దరిమిలా చెవులకు వినికిడి బాగా తగ్గింది. ఆమె చదువుకున్నది అంతంత మాత్రం. ఐదో తరగతి కూడా కాదేమో .. అయితే భారత భాగవతాది గ్రంథాలలోని పద్యాలూ వచనాలు, అలవోకగా చదివేసిది. చదివి అర్థం చేసేసుకునేది.
రోజూ ఏ భారతమో, భాగవతమో తెచ్చుక్కూర్చునేది. నాన్నగారు కుర్చీలోనూ, అమ్మ క్రింద నేల మీద. అర్థం కానిచోట్ల నాన్నగారిని అడిగేది. నాన్నగారికి ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ఆ సందేహ నివృత్తి చేసేసేవారు. అవసరమైతే లోపలికెళ్ళి తన లైబ్రరీ లోని పుస్తకాల సాయంతో వివరించి చెప్పెవారు. నాన్నగారు చెప్పేది వినపడక అమ్మ మళ్లీ మళ్లీ అడిగేది. నాన్నగారు, ప్రేమ విసుగు కలబోసిన మాడ్యులేషన్ తో, ఈయన కుర్చీ పైనుంచి కొంచెం వంగి గట్టిగా చెప్పడం …ఆవిడ వినపడక మళ్లీ అడగడం, ఈయన ఓపిగ్గా చెప్పడం … ఆ సీన్ గుర్తుచేసుకుంటూంటే, ఈనాటికీ తెలియని ఆనందంతో కనులు చెమరుస్తాయి, ఇంట్లో వాళ్లకే కాదు, ముందే చెప్పాగా… అరుగు వీధి వైపు, వెదురు దడి అంతంత మాత్రం.. అంచేత ఈ వృద్ధ దంపతులు అలా సత్కాలక్షేపం చేయడం చూసి వీధిలో వెళ్ళేవాళ్ళు ఆగిపోయి, ఆరాధనగా చూస్తూ అలా ఉండిపోయేవారు. అప్పటికి నాన్నగారికి ఎనభై దగ్గర, అమ్మకు డెబ్భై పైన. కొందరు వీరికి గౌరవంతో నమస్కరించుకునేవారు కూడా . వీళ్లకు అవేమీ పట్టేవి కాదు. వారి ఆనందం వారిది.
అలా అమ్మనూ నాన్నగారిని చూడ్డానికి ఇష్టపడేవాళ్లలో తివారి ఒకరు. ఈయన రాజస్థాన్ వాస్తవ్యుడు. ఇక్కడి పేపర్ మిల్లులో ఉద్యోగం చేస్తూ రాజమండ్రిలో మా ఇంటికి దగ్గరగా ఉండేవారు. . మొదట్లో అరుగు మీద నాన్నగారిని, అమ్మను చూడడానికి అలవాటుపడి, క్రమేపీ నాన్నగారిదగ్గరకి వచ్చి, స్నేహం పెంచుకున్నారు. భక్తీ ప్రేమా పెంచుకున్న సౌజన్యుడు తివారీ. తరచూ వచ్చి నాన్నగారితోనూ మాతోను సరదాగా మాట్లాడేవారు. తెలుగులో కూడబల్కుని వచ్చీరాని భాషలో మాట్లాడుతూ ఉండేవారు. నాన్నగారు తెలుగులో వ్రాసిన తులసీ రామాయణానికి రెండవ ముద్రణ వేసిన రోజులవి. తివారీకి తెలుగు రాదు. కాని నాన్నగారు తెలుగులో వ్రాసిన తులసీరామాయణాన్ని సుమారు యాభై కాపీలు ఖరీదు చేసి తన తెలుగు మిత్రులకు ఉచితంగా పంచారు. అది ఆయన సంస్కారం.
ఒకసారి ఆయన వారం పది రోజులు కనపడలేదు. తర్వాత వచ్చి కలిసారు. గుండు చేయించుకుని కనపడ్డారు.. నెత్తిమీద టోపీ ఉంది. ఆయన్ని చూసి నేను…
“క్యా తివారీ సాబ్ !శిర్ పర్ టోపీ లగా క్యోం..”అన్నా. “
[ఏంటి.. తివారీ గారూ, నెత్తికి టోపీ తగిలించారు]
“తిరుపతి గయా భాయ్.. యే హాయ్ ప్రసాద్” అని ప్రసాదం ఇచ్చారు.
[తిరుపతెళ్లాను, తమ్ముడూ, ఇదిగో ప్రసాదం ]
నేను ఊరుకోకుండా … “అచ్ఛా .. టోపీ… చాహే .. ఆప్ రఖియే .. హమారే శిర్ పర్ మత్ రఖ్నా..”అని నవ్వా ..
[సంతోషం.. సరే టోపీ కావాలంటే మీరు పెట్టుకోండి, మా నెత్తిని పెట్టకండి]
అతనికి కనులలో నీరు నిండింది..
“హమ్ కో ఆప్ క్యా సమఝ్ తే రావ్ సాబ్. హమ్ ఆప్కో అప్నా చోటే భాయీ సమఝ్ తే. పితాజీ హమ్ కో భగవాన్ జైసే .. మైనే క్యా నఫరత్ కియా. ఆప్ ఐసే క్యోం బోల్తే .. మేరా క్యా కసూర్ హై.. “ అంటూ చాలా బాధపడ్తూ మాట్లాడారు.
[రావుగారు, నన్ను మీరేమనుకుంటున్నారు. మిమ్మల్ని నా తమ్మునిగా భావిస్తాను నాన్నగారు మాకు దైవ సమనులు. నేను మీకేం ఇబ్బంది కలిగించాను. ఎందుకలా అంటారు. నా తప్పు ఏంటి. ]
ఒక్క సారి గతుక్కుమన్నాను. నా తొందరపాటు తెలిసింది. నాన్నగారు నన్ను మందలించారు. తర్వాత తివారీ భుజం మీద చెయ్యేసి నాన్నగారు అతడ్ని అనునయించారు. తివారీ తర్వాత మామూలుగానే ఇంటికొచ్చేవారు కాని, నేనే ఎదరపడి మాట్లాడలేకపోయేవాణ్ణి .. ఏదో గిల్టీ కాన్షస్ ….
తర్వాత అయిదారేళ్లకు రాజమండ్రి వదిలేసి, నా ఉద్యోగం చాలా ఊర్లు తిప్పింది. పదేళ్ల తర్వాత నాన్నగారు నా దగ్గరే హైదరాబాదులో రామ నామం చేస్తూ .. శ్రీరాముణ్ణి చేరారు...నాన్నగారి అంత్యేష్టిక్రియలకు రాజమండ్రి వచ్చినప్పుడు తెలిసింది. అంతకు కొద్ది రోజులక్రితమే తివారి ఊర్థ్వలోకాలకు చేరారని. ఏ జన్మలలో బంధాలో ఇవన్నీ…
1 comment:
మీ 'హరాజీకాల' కి అంతు లేకుండా పోతోందండోయ్ :)
చాలా బాగుంది మీ ఎపిసోడ్; (ఆఖర్లో ఆ ట్రాజెడీ వాక్యాలు తప్పించి - జీవితం లో అది కూడా ఒక భాగమే కాబట్టి అదీ 'హరాజికమే;
చీర్స్
జిలేబి
Post a Comment