{ శ్రీ దినవహి సత్యనారాయణ }
ఈరోజు నాన్నగారి జయంతి..
నాన్నగారి గురించి --
నాన్నగారికి ఆత్మీయ మిత్రులు మహా పండితులు
కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారి మాటలలో --
సీ|| ఆబాల్యముగా నాంధ్రమందు గవిత్వంబు
నిర్మింప నేర్చిన నిపుణ బుద్ధి,
యాంగ్ల విద్యార్థి రాజ్యమునందు బట్ట భ
ద్రతకు భంగము గన్న రాఘవుండు,
హిందీ సరస్వతీ సౌందర్య సింథు వా
కంఠమ్ము గోలిన కలశభవుడు
పాళీ వచోదేవతా లీల లొకకొంత
చవిచూచినట్టి విజ్ఞానశీలి
తే.గీ || దినవహి పవిత్ర వంశ మౌక్తిక లలామ
మమల చరితుండు సత్యనారాయణుండు
అస్మదాప్త సుహృద్వర్యుడగుట నా య
దృష్ట వైశిష్ట్య మనుచుగర్వింపవలదె !
చం|| అతడు కవీంద్రుడై తెలుగు, నాంగ్లము, హిందియు బ్రాకృతంబులన్
మతి గ్రహించు పుణ్య మహిమంబు ఫలింపగ, రామ మానసో
ర్జిత పరమార్థవేత్త, తులసీకవి మంజుల శారదన్, యథా
స్థితముగ నాంధ్ర శారదగ దీరిచి దిద్దెను రాము పేరనే
గోస్వామి తులసీదాసు కృత శ్రీరామచరిత మానసమును తెలుగు వచనంలో అనువదించి పండిత పామరుల అభిమానము సంపాదించారు. ఈ గ్రంథం మూడు ముద్రణలు పొందింది. బెంగాలీ భాషలో ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన ‘షాజహాన్’ నాటకాన్ని తెలుగులో వ్రాసారు. ఇది కాక ‘ప్రేమచంద్ కథలు’, ‘మేవాడు పతనం’ అనే గ్రంధాలు వ్రాసారు పాళీ భాషలో గ్రామరు వ్రాసారు. గాంధీమహాత్ముని పిలుపుకు స్పందించి బి.ఏ చదువును మధ్యలో వదిలేసి జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొని … హిందీ భాషావ్యాప్తికి విపరీతంగా కృషి చేసారు.. జాతీయ పాఠశాలలో బోధకునిగా పని చేసారు. అప్పుడే నాన్నగారికి శ్రీ వెంపరాల వారితో ఆత్మీయస్నేహం …తర్వాత గుజరాత్ విద్యాపీఠ్ వారి బి.ఏ పట్టా పుచ్చుకుని అసిస్టెంట్ పంచాయత్ ఆఫీసర్ గా, కాటేజ్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ గా ఉద్యోగాలు చేసారు..
ఉన్నత వ్యక్తిత్వం..శ్రీరామ భక్తి .. మూర్తీభవించిన సౌజన్యం అదే నాన్నగారు --- ఈ మహనీయ మూర్తికి తనయునిగా గర్వపడుతూ వారి 123వ జయంతి నాడు సభక్తికంగా వినయాంజలి ఘటిస్తున్నాను.
((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((o0o))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
1 comment:
విద్యాభాస్కరులకు వినమ్రాంజలులు.
Post a Comment