అప్పట్లో BLITZ' అని ఓ వీక్లీ వచ్చేది. ఇపుడు వస్తోందో లేదో తెలియదు.
అందులోనే అనుకుంటా
'I don't know son' అని ఓ feature వచ్చేది.. అది గుర్తులో పెట్టుకుని వ్రాసింది..
****
నాకు తెల్వదు నాన్నా—-
రచన డి.వి.హనుమంతరావు
23-06-23
'నాన్నా! ఋతుపవనాలు అంటే యేమిటి నాన్నా?.'
"అంటే.. ఋతు పవనాలు అంటే…ఊ…
యెందు కొచ్చిందిరా, నీకా డౌటు?"
'ఆదే నాన్నా! నైరుతి ఋతుపవనాలు.. వస్తున్నాయి, వచ్చేసాయి.. ఆగిపోయాయి… అంటూ ఒకటే గోల. అంటే యేమిటి అని'
"ఆ.. అంటే నైరుతి ఋతుపవనాలు వస్తే వర్షాలు పడతాయి.."
'ఎవరు చెప్పారు?'
"వాతావరణం శాఖ వారు"
'వాళ్ళెవరూ?'
"వర్షాల గురించి చెప్పే వారు"
'మరి రాలేదేం?'
"నాకు తెల్వదు నాన్నా."
*************
'నైరుతి అంటే యేమిటి నాన్నా?'
"ఓ దిక్కు"
'తూర్పు పడమర నార్తు సౌతుల్లో లేదు మరి?'
"అంటే - నైరుతి అది ఓ మూల"
'గుర్తొచ్చింది నాన్నా! ఆ మూల బరువు పెట్టావు కదా'
"యస్!"
'దొడ్లో చెట్టు కొట్టించి షెల్ఫ్ చేయించి ఆ మూల పెట్టావు కదా?'
"అవును నాన్నా, బరువు పెట్తే మనకు మంచి జరుగుతుందని.."
'అంటే చెట్లన్నీ కొట్టేసి నైరుతిలో అందరూ బరువులు పెట్టేస్తే మంచి జరిగి పోతుందా నాన్నా?'
"అది - నాకు తెల్వదు నాన్నా"
'నైరుతి ఋతుపవనాలు వచ్చేది కేరళలో ముందు కదా నాన్నా'
"అవును కదా"
'అక్కడ చెట్లు యెక్కువనా'
"అయి ఉండొచ్చు"
'ఇక్కడ ప్రతి సంవత్సరం మన నాయకులూ, వాళ్ళూ చెట్లు నాటుతారు కదా?'
"అవును నాన్నా! వనమహోత్సవ దినం చేస్తారు"
'ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా యెప్పటి నుంచో లక్షల్లో మొక్కలు నాటుతున్నారేమో కదా'
"అవునూ"
'మరి అవన్నీ పెరిగి.. ఈ పాటికి బోల్డు వనాలు అయి పోవాలి కదా?'
"నిజమే"
'అలా పెరిగిన మొక్కలు యేవీ కనపడవేం నాన్నా?'
"నాకు తెల్వదు నాన్నా".
***************
*************
***************