‘నేను’ ‘నే’ నైతే
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము ఉదయాన్నే భక్తి ఛానల్ లో చూడడము ఒక అలవాటు. బంగారు వాకిలి తలుపులు తీసేటప్పటికి ఎదురుగా నిలుచుని, రెండు చేతులూ దోయిలించి, అశ్రుపూరిత నయనాల ఆ దివ్యమంగళ విగ్రహము నిత్యమూ - బుల్లి తెరపై దర్శించుకోగలగడం - ఆయన కరుణే కదా అనిపిస్తుంది. ఆ కాసేపూ తిరుమల కొండపైనే, ఆనందనిలయంలోని అంతరాలయంలోనే, స్వామి సమ్ముఖానే, ఉన్నాననిపిస్తుంది…. ఆ అనుభవము నిజమైతే ఎంత బాగుంటుందో అని కూడా అనిపిస్తుంది! ఆ కృపా సముద్రుని దయ లేక అంత భాగ్యము కలిగేనా !!!
********************
పూర్వాద్రిపై అరుణోదయం. బాలార్కుడు తన కాంతి కిరణాల మెలమెల్లగా విశ్వమంతా వ్యాపింప జేస్తున్నాడు. పునుగూ పిట్టా ప్రత్యక్ష భగవానునికి స్వాగత గీతాలు పాడాలని గొంతు సవరించుకుంటున్నాయి. తరుశాఖల పైనుండి వీచే చల్లటి గాలుల సవ్వడులు - వేదనాద ధ్వనుల ప్రతి ధ్వనిస్తున్నాయి. ఊర్ధ్వ పుండ్రములతో, శిఖోపవీతములతో, ధవళ వస్త్రములతో, హరినామ స్మరణతో - బ్రహ్మ వర్చస్సుతో అర్చక స్వామి మాడ వీధుల గుండా కదలి వస్తున్నారు. మనసున సప్తగిరి వాసుని తలపు నిండగా, భక్తి తేజముతో వదనము భాసింప, సన్నిధి గొల్ల వారికి ముందుగా నడుస్తున్నారు. ఆతడి భుజములపైనున్న స్వర్ణ పేటికలో
భద్రంగా ఉన్నాయి - బంగరు వాకిలి బీగములు ..
మంగళ తూర్యనాదములు - వేద పఠనములు - పసిడి పళ్ళెరముల మంగళ ద్రవ్యములు. వాతావరణము శోభస్కరముగా భాసిస్తున్నది. ముందుగా పెద్ద ముత్తైదువ ముందుకి నడచి, గర్భగుడి ముంగిట అందముగా రంగవల్లులు తీర్చిదిద్దింది. ఆ శోభ తిలకిస్తున్న శ్రీనివాసుని దయా దృష్టులనే - తన భావనలో - కనుల నింపుకుని ప్రక్కకు జరిగింది. ఆలయ అధికారుల పర్యవేక్షణలో, ద్విజ బృంద శ్రేణుల ముఖతా తొలిపలుకులు నినదింప, మంగళ వాద్యముల మ్రోగగా, అర్చక స్వామి చూస్తుండగా సన్నిధి గొల్ల - బంగరు పేటికలోని బీగముల గ్రహించి, విధి నిర్వహణలోనున్న అర్చక స్వామికి అందిస్తారు. వారు తాళపుకప్పల తొలగింప, సన్నిధి గొల్ల - తన వామ హస్తములోని కాగడా వెలుగులీన, కుడి చేతితో బంగరు వాకిలి మెలమెల్లగా తెరచి, దక్షిణ పాదము సుకుమారంగా, సవ్వడి లేకుండా లోపల పెట్టగానే.. నీల మేఘ శ్యాముడు, మందస్మిత వదనారవిందుడు – కరుణా సముద్రుడు - దివ్య మంగళ విగ్రహుడు – కనుల కందని ఎత్తు స్వామి - సన్నిధిగొల్ల కనులలో నిలబడి - కృపా వర్షము కురిపిస్తాడు. ప్రథమ దర్శన భాగ్యము నిత్యమూ పొందే సన్నిధి గొల్ల భాగ్యమే భాగ్యము .. ఆ అదృష్టమబ్బిన వంశములో జన్మమే జన్మము…
తాను విధి నిర్వహణకు వెళ్ళాలి. భక్త జనుల క్రమపద్ధతిలో నడిపించాలి. విధులలోకి వెళ్లేముందు, ఒక్కసారి, కనులారా శ్రీవారిని దర్శించుకుని, స్వామి అనుమతి గొని, ఆనందంగా విధుల నిర్వహిద్దామని నిలచి యున్నాడు ఆలయ సిబ్బందిలోని ఆ ఉద్యోగి. తాళములు తెరిచారు, సన్నిధి గొల్ల ప్రథమ దర్శనానికి వెళ్ళారు, ఇక వాకిలి తలుపులు తెరుస్తారు, స్వామి దర్శన భాగ్యము తనకు కలుగబోతోందని ఆనందోత్సాహముతో ఆ ఉద్యోగి మురిసిపోతున్న తరుణంలో - కార్యనిర్వహణ బాధ్యతలో ఉన్న మరో ఉద్యోగి - ఇతడికి కర్తవ్య బాధ్యతను గుర్తు చేసి, దర్శనము కొరకు ఆశపడే ఆ ఉద్యోగిని కదలిపొమ్మని సైగ చేసాడు. స్వామి దర్శనము పొందలేక, విధి నిర్వహణను కాదనలేక, వెళ్ళలేక వెళ్ళలేక, వెనక్కి వెనక్కి చూస్తూ కదిలాడు అ ఉద్యోగి.
నిత్యమూ నీ సన్నిధిలోనే ఉన్నా, సదా నీ సేవలోనే ఉన్నా, నీ కరుణ లేక నీ దర్శనము కాదుకదా స్వామీ. రెప్ప వేయక నిన్ను చూద్దామంటే రెప్ప పాటు కల్పిస్తావు… మనసు నిలిపి నీ మూర్తిని దర్శిద్దామంటే విషయాలవైపు మనసును త్రిప్పేస్తావు. అవీ, ఇవీ అపుడే వినపడతాయి చెవికి. ఏవేవో సువాసనలు పోటునుండి నాసికకు అప్పుడే తగులుతాయి. ప్రక్కవారి రాపిడులు దేహాన్ని ప్రక్క దారులు పట్టిస్తాయి. ఆలోచనలు గుంపులు గుంపులుగా మనసును క్రమ్మేస్తాయి. కనులారా నిను దర్శించి, కనులు గట్టిగా మూసి, మనసున నిన్ను కట్టగలిగితే …
ఆలోచనలు పారిపోతాయి…
అపుడు మనసు శూన్యమౌతుంది.
ఆ మనసంతా నీవే అవుతావు.
ఇక ఉన్నదేదీ? - లేనిదేదీ?
నేను నీలో జేరి 'నే'నవుతావు -
ఒకటి గా మిగిలిపోతావు
***** ***** ***** *****
6 comments:
ఒక్క చిన్ని మహావాక్యానికి ఎంత భాష్యం! ఎంత దృశ్యకావ్యం!
వ్రాసిన మీరు ధన్యులు చదివే అవకాశం దొఱకిన వారు ధన్యులు!
మీ అభినందనలు పొందిన నేను ధన్యుడను బావగారూ..
శ్రీ గురుభ్యోనమః 'మనసును కట్టగలిగితే' మాబోంట్ల కది. మీరు కట్టేశారు అందులో స్వామిని పెట్టేశారు రెండుని ఒకటిగా పట్టేశారు. ఆ దివ్యానుభూతి మీ బోంట్లకే సాధ్యం. నమో నమః.🙏
మధువు గ్రోలాలని, పద్మం చుట్టూ గోల చేస్తూ తిరిగే తుమ్మెద వంటి వారము మేము,
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పానమత్త చిత్త భ్రమరపు మౌనము మీది. అంతే ..
మీ అభిమానమునకు కృతజ్ఞతాంజలులు..
మీతో కలసి మళ్ళీ గొవిందుడిని చూసే అవకాశం కలగాలని కొరుకొంటున్నాము.
నాదీ అదే కోరిక, మీతో గోవిందుడిని చూడాలనే. మీరు తెలిసినా చాలు, గోవిందుడు దొరికేస్తాడు.
Post a Comment