Pages

Thursday, March 30, 2023

శ్రీ రామనవమి శోభకృత్ {2023}

  

    శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మము


రచన: దినవహి వేంకట హనుమంత రావు. 



కం. హరితత్త్వము గూటి పఱచి,

నరునిగ భువిపై నయమున నడచితివే, కిం

కరులకు శాపము బాపగ,

హరిమూకల సాయముగొని యచ్యుత రామా!


తన నారాయణత్వాన్ని దాచిపెట్టి నరునిగా మనమధ్య తిరిగిన వాడు శ్రీ రాముడు. 


'రా' 'మ'  - ఈ రెండక్కరములు చాలు - భవసాగరము దాటడానికి. 

కం.      రామా రామా రామా

           రామా యనుచహము రేయి రాజీ వాక్షా!

           రామా! నిన్నే దలతును

           నామము భవజలధి దాట నావయె రామా!  


ఆ సలలిత రామ నామ జపసారము కాశికాపురి నిలయునకు తెలియునట. కాశీలో మరణించిన వారికి శివుడుపదేశించే తారక మంత్రమదే!


ద్వి. శ్రీ రామ మంత్రము శివుడిచ్చు కూర్మి,

తారకమగునది తరియింపజేయ!

'శ్రీ రామ రామ’ అంటూ ఆ మంత్రాన్నే ఈశ్వరుడు - అమ్మ భవానికి ఉపదేశించాడు. పైగా సహస్రనామతత్తుల్యము అనికూడా చెప్పాడు. 


అష్టాక్షరి - నారాయణ మంత్రంలో 'రా' ప్రాణాక్షరము. అది తీసేస్తే అర్థం మారిపోతుంది. అలాగే పంచాక్షరి - నమశ్శివాయలో 'మ' కూడా.. ఆయా మంత్రాల లోని ప్రాణాక్షరాల సంపుటి 'రామ' - ఆ రెండు మంత్రాల ప్రాణమూ - సారమూ  రామ.… అని పెద్దలు చెప్తారు. శివకేశవుల అబేధము కూడా ఇక్కడ సూచితమౌతున్నది. 


కం.  ఇనుడొక బీజము 'రేఫ'గ,

       అనలుడు కలియగ 'అ' కారమందున యికహా

       సనుడు 'మ'బీజముగా నిను

       గనెదము బీజాక్షరముల కాంతిని రామా!     

సూర్య అగ్ని చంద్రుల బీజాక్షరముల సంపుటియే 'రా మ' నామమని శాస్త్ర వచనం.


ఆ మంత్రాన్ని పట్టుకుని హనుమ శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటాడు. 

"ప్రభు ముద్రికా మేలి ముఖ్ మాహీ జలధి లాంఘ్ గయే…"

రామనామాంకిత అంగుళీయకము పట్టుకుని పయోధి దాటిన మేటి.


"జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలాః.." అంటూ రామలక్ష్మణులకు సుగ్రీవునకూ జయమని జయఘోష సలుపుతూ తానొక్కడూ, ఎంతోమంది మహావీరులైన  రాక్షసులను హనుమ సంహరించాడు. 

రామమంత్రం జపించి విభీషణుడు లంకేశ్వరుడయ్యాడని హనుమాన్ చాలీసా అంటోంది. 'శ్రీరామ' అని వ్రాసిన శిలలు సాగరంపై తేలితే  సేతు నిర్మాణం జరిగింది.

మతంగమహాముని ఆనతిమేరకు శబరిమాత రామనామ చింతనతో రామదర్శనం పొంది రామానుగ్రహం పొందింది. సప్తర్షులు చేసిన రామ నామోపదేశంతో సిద్ధి పొందిన ఆదికవి వాల్మీకి అజరామరమైన శ్రీమద్రామాయణ మహా కావ్యాన్ని లోకానికి అందించాడు. 


ఇంటి ద్వారంలో దీపముంచితే ఇంటా బయటా వెలుగు ప్రసరించినటుల నాల్క చివర 'రామ'నామ ముంచితే, అంతశ్శుద్ధికూడా జరిగి ఆ అనంత తత్త్వము తెలుసుకోగల మంటారు.


ఆ.వె. గడపమీద దీపకళికనుంచి నటుల,

నాల్కచివర రామనామముంచు,

చిత్తశుద్ధి చేసి, జీవుని ముక్తికి 

దారిజూపు రామతారక మదె!


దశరథమహారాజు పుత్రకామేష్టి చేసిన తర్వాత యాగఫలముగా ముగ్గురు రాణులూ నలుగురు పుత్రులను ప్రసవించారు. కులగురువులు వశిష్ట మహర్షి వారికి పేర్లు పెట్టారు - రామ భరత లక్ష్మణ శతృఘ్నులని.

'రామ' రెండే అక్షరాల పేరు జ్యేష్ట కుమారునిది. 

'రామ' అంటే అందర్నీ ఆనందింప చేసేవాడని అర్థంచెప్తారు. 'రామా' అని పలికితే ఆనందం. 'రామా' అని మనసులో అనుకుంటే ఆనందం.  'రామా' అంటూ ధ్యానిస్తే ఆనందం. 'రామా' అని కీర్తిగానం చేస్తే ఆనందం. "ఆనందం" అంటే …. ఆనందమే బ్రహ్మమని వేదం చెప్తోంది. అందుకని - "రామా యన బ్రహ్మమునకు పేరు" - అంటారు త్యాగయ్యగారు. 


కం.      అరయగ తత్త్వము - బ్రహ్మము,

           సరయూ తటిని జనియించె సత్యము నిల్పన్,

           సురవైరిఁ జంపి లీలగ,

           ధరపై ధర్మము నిలిపిన దశరథ రామా!      


రామా అంటే వేదములో చెప్పబడిన నామమే.. ఆ బ్రహ్మమే… నరునిగా అవతరించాడు.

కం.   వేదముల మెలగు నామము,

        వేదశిఖల వెలుగు తత్త్వ విజ్ఞానమిదే!

        వేదములే  నీ రూపము,

        వేదము తెలుపు నిను వేదవేద్యా రామా!     


–శ్రీసీతారామచంద్ర పరబ్రహ్మణే నమః–






2 comments:

మిస్సన్న said...

చాలా తేలికైన మాటలతో తేటతెనుగు పద్యాలతో రామ తత్త్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. రామదూత బంటులైన మీకు రామ తత్త్వం కరతలామలకం అనడం అతిశయోక్తి కాదు. రామాయ నమః 🙏

హనుమంత రావు said...

డియర్ డీవీయన్ ఆనందం కలిగించే మీ స్పందనకు ధన్యవాదములు.