Pages

Monday, October 21, 2013

ఎన్ని కలలో … ఎంతెంత కలలో



 ఎన్ని కలలో … ఎంతెంత కలలో
                                              ----------------------------------------

                                                                                     రచన: డి.వి. హనుమంత రావు.


ఒక సర్వ సంగ పరిత్యాగి కి కల వచ్చింది.
ఆ కలలో ఆ సాధు మహారాజ్ కు బంగారు రాశులు కనపడ్డాయి..
ఏంచేసుకుంటాడు ఆయన సర్వ సంగ పరిత్యాగి కదా.
కలలో కూడా అంతంత బంగారు రాశులను చూడని ఆ సర్వ సంగ పరిత్యాగి,
కలలో చూసిన ఆ బంగారు రాశులను
కలలో కూడా   ముట్టుకోకుండా లోపాయికారీగా యువరాజావార్కి  కబురు చేరవేసాడు.

అప్పటికే హస్తినాపురి గద్దె నెలా ఎక్కాలా అని ఆలోచిస్తూ, కలలు కంటున్నారు యువరాజా వారు.  
యు.రా. వార్కి బంగారం(లాంటి) కబురు అందింది… ఆ బంగారు కల తనకెందుకు రాలేదా అని కొంచంసేపు సోచాయించి, ఇదేమైనా ప్రతిపక్షాల కుట్రా అని కూడా ఆలోచించిన వారై, ఎందుకైనా మంచిది అని లోపాయికారీగానే వెళ్లి బంగారు రాశులు ఎక్కడ ఉన్నట్టు కలవచ్చిందో తెలుసుకున్నారు.. అది ఏదో ఆలయ ప్రాంతం. అక్కడ తవ్వితే ఆ బంగారు రాశులు స్వంతమవుతాయి. కాని  గునపాలు,పారలు ఉపయోగించాలి,...
గుడి ప్రాంతం అంటే   .. మడిగా వుండాలి కదా .. తను సెక్యులర్.. పాపం  మడికి పనికి రాడు..
అదీ కాక, తనకు పెళ్ళంటే ఖర్మ కాలి అవలేదు కాని,  తను అప్పుడే తాత వయసుకు వచ్చేస్తున్నాడు. ఆ గునపాలు, పారలు పట్టుకుని శారీరక శ్రమ అంటే కష్టం.. అందుకని రాజమాతకు చెబ్తే సరి. ఆమె చూసుకుంటుంది..
ఆవిడదగ్గర ఎంత అడ్డమైన పనులున్నా చెప్పండమ్మా చేస్తామంటూ జుత్తూడిపోయినవారు, గెడ్డాలు మీసాలు పెంచుకున్నవారు  చాలా మంది ఉన్నారు… వాళ్లకి తనంటే కూడా చాలా వినయమూ భక్తీ కలవారు. .. అని బంగారం కబురు  రాజమాతకు చెప్పడానికి వెళ్లారు  యువరాజా వారు..  

అక్కడకు వెళ్లేటప్పటికి అక్కడ జైలు నుంచి వచ్చిన కిష్టన్నయ్య ఉన్నాడు..
” ఏంటన్నయ్యా ఇలా వచ్చావు.” అన్నారు  యు. రా.
“తమ్మూ ! నీ మీద నాకు చాలా కోపం గా ఉంది. “ అన్నాడు కిష్ట్
“ఏమైంది ?”
“ఎప్పటికైనా మనం మనం ఒకటి.. అలాంటప్పుడు ఎవరికో తిండి లేదని రాజమాత ఏడిచినారట  ?”
“అవును.. నేను.. అక్కడెక్కడో చెప్పాను కదా ?”
“అదే.. అదే… ఎక్కడో చెప్పడమేమిటి , నాకు చెప్పొచ్చుకదా ? ఎప్పటికైనా మనం మనం ఒకటి కదా?”
“నువ్వేం చేస్తావన్నయ్యా”
“ఏడుస్తుంటే ఓదార్చడంలో నేను చాలా పరిశోధన చేసాను, నేనొచ్చి క్షణంలో ఓదార్చగలను..ఆమాత్రం అమ్మని ఓదార్చలేనా.. ఎప్పటికైనా మనం మనం ఒకటి. నీకు తెలియదా?  “
“నిజమే అన్నా .. నువ్వెంతోమందిని  ఓదార్చావు కదా.. మరచిపోయాను, సారీ…”
“ఇక ఎప్పుడూ అలా చేయకు తమ్మూ,నా దగ్గర ఎప్పుడూ బిక్క మొహం రెడీగా ఉంటుంది. అదేసుకుని వెంటనే వచ్చెయ్యగలను.. ఎంత చెడ్డా మనం మనం ఎప్పటికైనా ఒక్కటే కదా..  “ అన్నాడు క్రిష్ట్.

సరే తాను విన్న బంగారు కల, ఆ అన్న ముందు చెప్పడమా మానడమా.. అని ఆలోచించారు యు. రా. వారు. లక్షలకోట్లు సునాయాసంగా  లాగడానికి ఎన్నో ఉపాయాలు తెలుసున్నవాడు, అనుభవజ్ఞుడు, కనుక చెప్తేనే మంచిది అని నిర్ణయించుకుని, రాజమాతకు  బంగారు రాశులు గురించి చెప్పారు.. యు.రా వారు…
“పవిత్ర ప్రదేశమంటున్నావు.. అక్కడ వారి సెంటిమెంట్ కు ఏమీ ఫర్వాలేదుగా మరి” అన్నారు రాజమాత.
”ఫర్వాలేదు మాతా,.. ఏదైనా తేడా వస్తే..మరల మనం కట్టించి ఇద్దాము..”
అన్నారు యు. రా.
కిష్ట్ అందుకుని..” కావాలంటే.. మా బామ్మర్ది ఉన్నాడు.. తనదైన శైలిలో ప్రార్థనా మందిరాలు అవీ కట్టించిన అనుభవమున్నవాడు, వాడిని రప్పిస్తాన”న్నాడు.

రాజమాత గారు వెంటనే కార్య రంగంలోకి దిగారు. చిరంజీవి చెప్పిన కల ఎపిసోడ్ తనలోనే దాచుకుని, మంత్రిపుంగవులకి పనులు పురమాయించారు. అధికారులకు ఆదేశాలందాయి.. క్రింద ఉద్యోగులు అనేకానేక సాంకేతిక కారణాలు చెప్పినా.. ఎవరికీ వినపడలేదు. ప్రతి పక్షాలలో కొందరు  ఇదేమి సెక్యులర్ దేశం.. అన్నారు…మరికొందరు మేము కొత్త ఊరు కట్టుకుంటాము,మాకు మేజర్ షేర్ కావాలన్నారు. మరికొందరు, అది మాద్వారా బడుగు వర్గాలకు పంచాలి.. అది మేం నొక్కుడంటున్నాము అన్నారు.. ఇలా అనేక విధంగా ముక్త కంఠం తో అందరూ   ప్రతిఘటించారు..
ప్రజలు వంటలు, వార్పులూ చేసి నిరసనలు తెలియజేసారు. బట్టలుతికి, ఆరేసి, మిరపకాయ బజ్జీలు వేసి, అర్థ గుండులు పావు గుండులూ చేయించుకుని నిరసనలు ఉవ్వెత్తున.. తెలియపర్చారు. దిష్టి బొమ్మలు అందమైనవి తెప్పించి అంత్యేష్టి క్రియలు చేయించారు. ఈ ఉద్యమ సమయాన కొత్త కొత్త నాయకులు పుట్టుకొచ్చారు. వారికి తొత్తుగా కొందరు నాయకులు పుట్టారు.

రాజమాత ఆలోచించారు. వృద్ధరాజమాత ఫొటోకు దండేసి.. నమస్కారము పెట్టి.. కళ్లు మూసుకుని ధ్యానం చేసుకున్నారు.. ఏమి స్ఫూర్తి పొందారో.. మంత్రివర్యులను కేకేసారు.. ఉద్యమాలలోకి చొచ్చుకుపొమ్మన్నారు. చొచ్చుకుపోయి విచ్చిన్నం చేయండి అన్నారు. బంగారం ఆలోచన  యువరాజా వారి డ్రీమ్ ప్రాజెక్ట్.  అని లోపాయికారీగా చెప్పారు.
వెంటనే హవేలీని నమ్ముకు బ్రతుకుతున్న  భజనపరులైన మంత్రిగణం.. “అమ్మమ్మా ..అతడే మా భావి మహరాజు.. “ అని వంగి వంగి దణ్ణాలు పెట్టారు, కళ్ల నీళ్లు కూడా పెట్టుకున్నారు..   తామూ ఉద్యమంలోకి రహస్యంగా చొరబడ్డారు..బజ్జీలు వేసే మూకుళ్ళు, చట్రాలు మాయంచేసారు. బట్టలుతికే బండలు మాయమయ్యాయి. పెద్ద నాయకులయితే లాభంలేదని, చోటా నాయకులను పిలిచారు.  సామ, ధన, లాభోపాయాలు ఉపయోగించారు..  అంతే… నిరసనకారులు ఐకమత్యంగా, మిగిలిన బజ్జీలపిండీ, ఉతకాల్సిన బట్టలు పట్టుకుని ఇళ్ళకు పోయారు.. చిరుగేతప్ప, బట్ట కనపట్టంలేదని .. బట్టలిచ్చిన ధర్మపత్నులు..పతులను .. ఉతికి ఆరేసి, ఇస్త్రీ చేసేస్తున్నారు. బొత్తిగా ఖారంలేని బజ్జీలను వేసారని పిండి తిని రుచి చూసిన  వారు  తమ అయిష్టాన్ని తెలియబరచారు.

అక్కడ కేంద్ర స్థానంలో గోతులు తవ్వడం యదేచ్చగా సాగుతోంది…బంగారు రాశులకోసం.  ఇది ఇలా ఉండగా  ఇంకా పలు ప్రాంతాలలో కళ్లు మూసుకుని సర్వసంగ పరిత్యాగులు నిద్ర పోతున్నారు… వారితో పాటు సర్వ సంగ భోగులూ కూడ నిద్ర పోడం మొదలెట్టారు, పక్కలో గునపాలు, పారలు రెడీగా పెట్టుకుని. -- బంగారు రాశులను కలలో కనడానికి. ఇక చూడండి… ఎన్నికలలో…  

No comments: