క్షేత్ర దర్శనం - మూడవ (ఆఖరి) భాగం
ఎన్నిసార్లు చూసినా తనివితీరని స్వామిని మళ్లీ మళ్లీ చూసాము. ఇక గురువాయుర్ లోను .. ఆ చుట్టుప్రక్కల ఉన్న విశేషాలను కూడా చూసాము..’
దగ్గరలోనే పునత్తూర్ కొట్ట .. మా తావునుండి సుమారు 3 కి.మీ.లో ఉంది. అక్కడ గురువాయుర్ దేవస్వాం వారి నిర్వహణలో ఒక ఏనుగులశాల ఉంది. విశాలమైన తోటలో సుమారు 60 లేక 70 ఏనుగుల సంరక్షణ అక్కడ జరుగుతున్నది. ఏనుగుల సంరక్షణకై సలహా సంప్రతింపులకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆఫీస్ ఒకటి ఆ లోపల ఉంది. ప్రత్యేక ఉత్సవాలలో .. కేరళలో ఏనుగులను అలంకరించి ముందు నడిపిస్తారు.. అలాగే నిత్యమూ గురువాయురప్ప మూడు నాలుగు సమయాలలో శ్రీ వెల్లి అనే తిరువీధి ఉత్సవంలో ఏనుగు మీదనే కదులుతాడు కదా. అలా గురువాయుర్ దెవస్వాంలోనూ, ఇతర ఆలయాలకు ఈ గజరాజులు వెళ్తూ ఉంటాయి. అలా స్వామి సేవ చేసిన ఒక గజరాజు చనిపోతే దానికి గురువాయుర్ లో ఆలయానికి దగ్గర్లో సమాధి కట్టి .. పెద్ద ఏనుగు విగ్రహం పెట్టారు. ప్రతి సంవత్సరము ఏనుగులకు పరుగు పందాలు పెట్టి నెగ్గిన ఏనుగుకు ఈ గజరాజు పేర అవార్డ్ ఇస్తారట.
గురువాయుర్ ఆలయానికి ఒక కి. మీ. దూరంలో మమ్మియూర్ శివాలయం ఉంది. అది చూసాం.. ప్రాచీనమైన ఆలయం. చక్కటి దీపాలంకరణతో శోభిస్తున్నది. కేరళలో దీపానికి చాలా ప్రత్యెకత. సాయం సంధ్యలో నియమంగా ప్రతి ఇంట్లోనూ దీపం పెట్తారు. ప్రతి ఆలయం లోనూ ఎత్తైన దీపం కుందెలు, వరుస దీపాలకు ఏర్పాటు- విధిగా ఉంటుంది. నేను చూసిన ఆలయాలలో సభావేదికలు కనపడ్డాయి. ఆ వేదికల మీద ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం నిత్యమూ జరుగుతూ ఉంటుంది. మేము వెళ్ళిన శివాలయం లో అవకాశం ఇస్తే మా ఆవిడ రెండు పాటలు పాడింది .. సంస్కృత పదాలతో ఉన్న ఒక పాటను పాడినప్పుడు వారు ఆస్వాదించారు. కాని తెలుగు పదాలతో పాడిన పాటకు వారి బుర్రలు ఊగలేదు.
3 కి. మీ దూరంలో ఉన్న అతి ప్రాచీనమైన చౌయల్లుర్ ఆలయం చూసాం. కేరళ బాలాజీ గా చెప్పబడే వేంకటాచలపతి ఆలయం, పార్థసారథి ఆలయం, నారాయణి ఆలయం చూసాం. మహా మహిమగల చాముండేశ్వరి ఆలయం చూసాం. బలరామునికి కట్టిన గుడి చూసాం. అది ప్రస్తుతం పునర్నిర్మాణం చేస్తున్నారు.
మరో ప్రముఖ దేవాలయం… వడక్కునాథన్ శివాలయం.. ఇది త్రిసూర్ లో ఉంది. సాధారణంగా రైలులో ప్రయాణం చేసేవారు త్రిసూర్ లో దిగి అక్కడనుంచి బస్సులో నలభై అయిదునిముషాల ప్రయాణ దూరంలో గురువయ్యూర్ చేరుకోవచ్చు. . మొన్న వచ్చినప్పుడు మేమూ త్రిసూరులో దిగి గురువయ్యూర్ వెళ్లాము..ఒకరోజు గురువయ్యూర్ నుంచి త్రిసూర్ వచ్చి మేము స్వామిని దర్శించుకున్నాము. ఈ ఆలయం ఒక ఎత్తైన గుట్టపై, ఊరుకి మధ్యస్తంగా ఉంది. చుట్టూ చక్కని ఆకుపచ్చదనం అందంగా కనపడుతుంది. పరశురామ క్షేత్రంగా ఈ ఆలయం చెప్పబడుతున్నది. అలాగే శంకరాచార్యుల తల్లి ఆర్యాంబ ఈ స్వామిని సేవించి, పుత్రుని బడసినట్లు చెప్తారు. ఆమె కాలడి నుండి ఈ క్షేత్రానికి నడచి వచ్చెడిదట. ఈ ఆలయ ప్రాంగణంలో .. వడక్కునాథుడు, విష్ణుమూర్తి, హరిహరుడు .. ఆలయాలు కలిగి ఉన్నారు. ప్రధాన ఆలయమైన వడక్కునాథుడు.. శివలింగం.. దానిపై నిత్యము ఆవునెయ్యి అభిషేకం చేస్తారు.. అది తీయరు.. అలా గడ్డకట్టుకుపోయి ఉంటుంది. శతాబ్దాలుగా ఆ శివలింగ మూర్తిని చూసినవారు లేరు. ఘనీభవించిన నేతి పిరమిడ్ లా ఉన్నది మాత్రము చూడగలము .. నిత్యమూ గర్భగుడిలో వెలుగుతున్న దీపాల వేడికి కాని, తీవ్రవేసవిలోని ఎండవేడికి గాని ఆ నేయి కరగదట. పైనుంచి గోకిన నేయినే ప్రసాదంగా ఇస్తారు. అంత నేయితో కప్పబడినా.. అక్కడెక్కడా చీమలు చేరవు. అది మరో విశేషం.. తెల్లవారుఝామున అయితే నేతితో కప్పబడిన మూర్తిని చూడగలమట. మేము పొద్దెక్కి వెళ్ళాము, అంచేత భూషణాలంకృతుడయినాడు వడక్కునాథుడు దర్శనమిచ్చాడు, అక్కడ ప్రసాదంగా నేతి అప్పాలు అమ్మారు. చూడ్డానికి అంత బాగో లేదు కాని తింటే బాగానే ఉన్నాయి..
ఆ మరునాడు సుమారు వారం రోజులుగా సాగిన మా గురువయ్యూర్ యాత్ర పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణం .. గురువయ్యూర్ నుంచి ట్రైన్ లో త్రిసూర్ 35 నిముషాలు … దారి పొడుగుతా చక్కని పచ్చటి తోటలు.. త్రిసూర్ లో మద్రాసు ఎక్స్ ప్రెస్ ఎక్కి చెన్నై చేరాము అక్కడనుంచి రాత్రి, సర్కార్ లో బయల్దేరి మరునాటికి రాజమండ్రి చేరాము. .
మంజీరం ముంజనాదైరివ పదభజనం శ్రేయ ఇత్యాలపంతం
పాదాగ్రం భ్రాంతి మజ్జత్ ప్రణతజన మనోమందరోద్ధార కూర్మమ్।
ఉత్తుంగాతామ్రరాజ న్నఖరహి మకర జ్యోత్స్నయా చాశ్రితానాం
సంతపధ్వాంత హంత్రీం తతిమనుకలయే మంగళామంగుళీనామ్ ॥
గురువాయురప్పా ! నీ చరణములను సేవించుటవలన ఎల్లరకును మోక్షముతో కూడా .. సర్వశ్రేయస్సులు కలుగును-
అని తెలుపునట్లు నీ కాలి అందెలు సవ్వడిచేయుచున్నవి. అజ్ఞానమనెడి మహాసముద్రమున మునిగియున్ననీ సేవకులను ఉద్ధరించుటయందు నీ పాదాగ్రభాగము పరమసాధనముగా విలసిల్లుచు, క్షీరసాగరమును మధించు సమయమున మందర పర్వతమును ఉద్ధరించిన కూర్మమును తలపింప జేయుచున్నది. నీ చరణ నఖ శోభలనెడి అరుణకాంతులు చంద్రకాంతులవలె నిన్ను ఆశ్రయించెడి వారియొక్క సంతాపములనెడి చీకట్లను పోద్రోలునవియై విలసిల్లుచున్నవి. అట్టి నీ పాదములను నేను భక్తి పూర్వకముగా సేవించుచున్నాను… (నారాయణీయము నుండి)
No comments:
Post a Comment