హరాజీకాలు-6
రచన: డి.వి. హనుమంతరావు.
[చాలా కాలం అయిపోయింది.. నా హరాజీకాలు రాలేదంటున్నారు..(ఉత్తిదే ఎవరూ అనలేదు, కోస్తున్నాడు). అంచేత ఈ ఆరవ ఎపిసోడ్.. హరాజీకా అంటే అర్థం అంటారా.. ఇప్పటికే ఈ ఎపిసోడ్ చాలా పెద్దది వ్రాసాను, అంచేత గ్రంధ విస్తార భీతి. అంచేత మళ్లీ సా(రీ)రి చెప్తానేం?]
ఏప్రిల్ ఫస్ట్ .. ఎవరు కనిపెట్టారో కాని… (అబ్బే మీరు తొందరపడి చరిత్ర చెప్పే ప్రయత్నం చేయకండి .. మీరు చెప్పాలని కాదు, ఏదో .. ఊరికే ఊతపదంలా చెప్పాను) ఎవరి స్థాయిల్లో వాళ్లు సరదాగా ఏవో ఒకటి చేయడం.. ఏడిపించడం .. నవ్వుకోవడం.. నవ్వేసేయడం.. మన అనుభవాల్లో ఉన్నవే ..బాంకులో పనిచేసిన రోజుల్లో...మిత్రులు కొందరికి ఈ సరదా ఉండేది. మా బోంట్లు రైటో తప్పో తెలియని స్థితిలో , ఎంజోయ్ చేసేవాళ్లం.. ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో విక్టిమ్ కూడా అంతా అయ్యాక ఓ నవ్వు నవ్వేసాడు.. కేవలం మిత్రుని ఆ స్పోర్టివ్ నెస్ మీతో పంచుకొనే ప్రయత్నమే ఇది..ఇంకే ఉద్దేశ్యమూ లేదు నమ్మండి., జరిగింది కొంచెమే... నా కథనమే ఎక్కువ. ఈ ఎపిసోడ్ లోని ముఖ్యులు మన మధ్య లేరు. వారు నవ్వుల లోకాలకు వెళ్లిపోయారు.
--------------- ---------------------- ------------------- ----------------------
ఆరోజు ఏప్రిల్ ఫస్ట్ .. మూర్తి బ్యాంకులో హెడ్ క్లార్క్ . ఉదయం పదకొండు అవుతోంది.. పోస్ట్ మాన్.. బ్యాంక్ కు వచ్చిన టపా అతని టేబిల్ మీద పెట్టి వెళ్లాడు. బ్యాంక్ టపాతో పాటు ..అందులో తనకి అంటే మూర్తికి అడ్రస్ చేసిన కవరు ఒకటుంది.. చటుక్కున తీసుకున్నాడు మూర్తి .. పైన on I.G.S [అంటే ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్] అని రబ్బర్ స్టాంప్ ఉంది. సర్వీస్ స్టాంపులు అంటించ బడి ఉన్నాయి. కవర్ మీద తనపేరు, సన్ ఆఫ్ సో అండ్ సో అని తన తండ్రిగారి పేరు నిర్దుష్టంగా వ్రాయబడి ఉంది. కవర్ ఓపెన్ చేసాడు.. గబ గబా చదివాడు .. గాభరాగా చదివాడు ,,అలవాటుగా గోళ్ళు కొరికాడు..(తనవేనండి బాబు ) .. టెలిఫోన్ దగ్గరకి వెళ్లి కిష్టప్ప అనే తన మిత్రునికి ఫోన్ చేసాడు. అతను ఓ ఆర్.ఎం.పి డాక్టర్ .. అతను ఆఘ మేఘాల మీద వచ్చేసాడు.. ఇద్దరూ గోడ చాటుకెళ్లి మాట్లాడుకున్నారు..మూర్తి శలవు వ్రాసి, అక్కౌంటెంట్ టేబిల్ మీద పెట్టేసాడు .. బయటికి వెళ్లారు...ఇద్దరూ కలసి బ్యాంక్ ముందు పార్క్ చేసిన మూర్తి మోటర్ సైకిల్ నడిపించుకుంటూ, బాంక్ బిల్డింగ్ వెనక్కి తీసుకెళ్లి అక్కడ పెట్టి, లాక్ చేసి మళ్లీ ఒకసారి చెక్ చేసి, అక్కడున్న పాత గోనెలు రెండు దానిపై కప్పి మళ్లీ ఒకసారి చూసి, వచ్చారు. ఆయాసపడుతూ వచ్చి కూలర్ దగ్గర మంచినీళ్లు త్రాగుతుంటే .. చంద్రరావు, కృష్ణ [కొలీగ్స్] వచ్చి,
“ఏంటి మూర్తీ.. .. అదోలా ఉన్నావు’ అన్నారు..కళా కాంతి లేని ముఖంతో, జేబులోని ఆ కవరూ, అందులోని కాగితం చూపాడు మూర్తి . దాని సారాంశం
“ఫలానా నెంబరు జావా మోటార్ సైకిల్ ఫలానా మోడల్ మీ దగ్గర ఉన్నట్టు తెలిసిందని, సదరు మోటారు సైకిల్ దొంగిలించబడిన సొమ్మని, మీకు అమ్మినవాడు మోసగాడని తమకు తెలిసినదని, దొంగ వస్తువు కొనడం నేరమని, అందుచేత ఇండియన్ పీనల్ కోడ్ ఫలానా, ఫలానా సెక్షన్స్ రెడ్ విత్ ఫలానా ఫలానా సెక్షన్స్ క్రింద మీ మీద చట్టరీత్యా చర్య తీసుకోదలచామని, మీరు చెప్పుకోదలచినదేమైనా ఉన్నట్లైతే .. ఈ సాయంత్రం 7గంటలకు, మునిసిపల్ ట్రావెలర్స్ బంగళాలో - ఆర్.టి.ఎ వారి రాజమండ్రి క్యాంపు కార్యాలయంలో ఆర్.టి.ఓ గార్ని కల్సి సంజాయిషీ ఇచ్చుకోవచ్చని” ఉంది.
“టైపు బాగా చేసారు..” అన్నాడు టైపిస్ట్ కూడా అయిన కృష్ణ.
“జోకులెయ్యకు గురూ” బేర్ మానడానికి రెడీగా ఉన్న మూర్తి , పాపం బాధపడుతూ అన్నాడు.
“నీ మోటార్ సైకిల్ సెకండ్ హాండ్ కదా” అన్నాడు చంద్రరావు.
“అమ్మిన వాడు దొంగంటావా?” అన్నడు కృష్ణ ..
“అదే భయంగా ఉంది” అన్నాడు గోళ్లు కొరుకుతూ మూర్తి .
“అందుకేనండీ .. ఒకసారి ఆ అమ్మినవాడికి ఫోన్ చేసి, దొంగో కాదో తెలుసుకుందామంటున్నాను” అన్నాడు ఆర్.ఎమ్.పి.
‘మంచి ఐడియా’ అన్నాడు చంద్రరావు
‘ఏమండోయ్! దొంగతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త .. ముక్కూ అవీ కొరికేయొచ్చు.. దొంగ కదా ?” అన్నాడు కృష్ణ నవ్వు దాచుకుంటూ…
కృష్ణ అన్నది విన్నాడో లేదో కాని, వెంటనే ముక్కట్టుకున్నాడు మూర్తి (తనదేనండీ). అలా ముక్కట్టుకుని, మూర్తి వెనకాల వెళ్లాడు. వెళ్లే దారిలో కోర్టుల దగ్గర మూర్తి ఎరుగున్న ప్లీడర్ కమలాకర్ - చెట్టుక్రింద క్లైంట్స్ తో మాట్లాడుతూ కనిపించాడు మూర్తికి.
“ఏంటి మూర్తిగారూ ఇలావచ్చారు ?”అడిగాడు కమలాకర్.
“అబ్బే ఏంలేదు గురుగారూ!”
అంటూ తటపటాయిస్తూనే తన దగ్గర ఉన్న కవరూ, దానిలోని కాగితం కమలాకర్ కు ఇచ్చాడు మూర్తి .
డిటెక్టివ్ టెంపోరావ్ లెవెల్లో దాన్ని కూలంకషంగా చదివాడు కమలాకర్.. మళ్లీ చదివాడు, ఒకటికి రెండు సార్లు చదివాడు. చదివి తన అభిప్రాయం చెప్పాడు..
‘అందులో పేర్కొనబడిన నేరాలన్నీ, ఐ.పి.సిలో పేర్కొనబడిన సెక్షన్స్ కి సంబంధించినవే అని, శిక్ష కూడా సదరు ఐ.పి.సి, ప్రకారం కఠినంగానే ఉంటుం’దని చెప్పిఅవసరమైతే తన సలహా తీసుకోవచ్చని కూడా చెప్పాడు.,
తన ఆఫీస్ - కోర్టు వేళల్లో, ఆ చెట్టుక్రింద తూర్పువైపు కొమ్మక్రింద ఉంటుందని .. చెప్పి
‘యూ ఆర్ ఆల్వేస్ వెల్కం మూర్తిగారు’ అని భరోసా కూడా ఇచ్చాడు.
‘అమ్మినతడు దొంగో కాదో తెలుసుకోమంటున్నాను, తప్పంటారా ‘ అన్నాడు ఆర్.ఎమ్.పి ..
“ఎంత మాత్రం కాదు .. దానివల్ల మా వాదన సులువౌవుతుంది, మనకి సాక్షులు తగ్గి, ఖర్చు తగ్గుతుంది కూడాను ‘ అన్నారు ప్లీడర్ గారు.
అక్కడనుంచి నేరుగా మునిసిపల్ టి.బి కి వెళ్లారు మిత్ర ద్వయం. అక్కడ ఏ సందడీ లేదు. వాచ్ మెన్, అక్కడ వయసులో ఉన్న పనిపిల్లతో కబుర్లు చెప్తున్నాడు. మూర్తి వెళ్లి వాచ్ మాన్ ను
“ఇవ్వాళ ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా, సాయంత్రం ఆర్.టి.ఎ గారు వస్తున్నారా … ఎన్నింటికొస్తారు..” అని అడిగాడు , వాచ్ మాన్ అయోమయంగా చూసాడు.
“ఇవ్వాళ ఏ ప్రోగ్రాము లేదండి, ఉంటే నాకు ముందరే కబురొస్తుంది. ఇవ్వాళ ఏమీ రాలేదు మరి ”.అన్నాడు.
“కాన్ఫిడెన్షియల్ ప్రోగ్రామ్స్ అయితే ఇతనికి చెప్పాలనెక్కడుంది.. రహస్యంగా వచ్చేస్తారు, సర్ప్రైసింగ్ గా.. ” లోపలనుకున్నట్టుగా అనబోయి ప్రకాశంగా అనేశాడు డాక్టర్.
ఆర్.ఎమ్.పి. తనను అవమానపరచి నట్టు భావించి, ఏదో చెప్పబోయాడు వాచ్ మన్, కాని అప్పటికే మిత్రులు బయటికి వచ్చేసారు.
కృష్ణా, చంద్రరావు ఎదురొచ్చారు..
“ఏంటి బాస్, ఏంటి పరిస్థితి” అడిగారు.
అప్పటిదాకా జరిగిన విషయాలు ఏకరువు పెట్టాడు మూర్తి.
‘మరేంచేద్దామని?’ ..
‘అదే గురూ. ఏంతోచటం లేదు’అన్నాడు మూర్తి.
‘డాక్టర్ గారు, ఇంతకీ అమ్మినవాణ్ణి దొంగ అవునో కాదో అడిగారా ?’అడిగాడు ఆర్.ఎమ్.పి ని కృష్ణ..
‘అదేనండీ.. ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తే బాగుంటుందనిపిస్తోంది ‘ అన్నాడు ఆర్.ఎమ్.పి.
‘అవును మూర్తి, ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇస్తే విషయాలన్నీ బయటికొస్తాయి ..’ అన్నాడు చంద్రరావు..
ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు కృష్ణ, తన గాభరాను తానే కవర్ చేసుకుంటూ
‘అది రిస్కేమో, మనల్నందర్నీ ఇరికిస్తారు పోలీసులు” డౌట్ వ్యక్త పరిచాడు కూడా ..
“లేదు నే మానేజ్ చేస్తా”నంటూ.. బయలుదేరాడు మూర్తి ..
పోలీస్ స్టేషన్ లో ఎంక్వైర్ చేస్తే సి.ఐ గారు లేరు, కాంప్ వెళ్లారన్నారు .. ఈలోగా లంచ్ టైమ్ అయింది. … ఇంటికేం వెళ్తామని హోటల్ కు చేరారు మూర్తి, డాక్టర్… అక్కడ లంచ్ కని వచ్చిన మనవాళ్లందరూ కనపడ్డారు ..
”ఏమైంది” అని ఒకరు అడిగారు,
“ఏంటిగురూ ఏదో కేసులో ఇరుక్కున్నావట” అన్నారు మరొకరు.
భయపడ్డాడు మూర్తి ..”పోలీస్ స్తేషన్ కు వెళ్లారా” అడిగాడు చంద్రరావు..
కృష్ణ కొంచెం జంకి “గురూ ఇవ్వాళ ఏప్రిల్ ఫస్ట్ కదా, ఎవరైనా ఏడిపించడానికి అలా చేసారేమో “ అన్నాడు..
“నిజమే అనుకోండి, కాని ఒకవేళ అది దొంగసొమ్ము అన్న నిజం ఋజువైపోతే మరి కష్టం కదండీ” అన్నాడు ఆర్ ఎం పి.
“మరే మరే” అన్నాడు మూర్తి ..
“మరే మరే” అన్నాడు మూర్తి ..
“నిజమే గురూ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి” అన్నాడు చంద్రరావు.
“ఇంతకీ పోలీసులు ఏమన్నారు” అన్నాడు కృష్ణ.
“సి. ఐ గారు కాంప్ వెళ్లారుట “ అన్నాడు మూర్తి ..
“హమ్మయ్య” అనుకున్నాడు కృష్ణ. అందరూ కదిలారు..
మళ్లీ టి.బి కెళ్లారు.. అక్కడ ఏ అలికిడీ లేదు.. ఆ చెట్ల క్రింద కాసేపు కూర్చున్నారు.. ఈలోగా ప్రక్కనే ఉన్న బ్యాంక్ నుంచి మిత్రులు ఒక్కరొక్కరే రావడం… ఏమైంది అనడం.. ఏప్రిల్ ఫస్టేమో అనడం.. అబ్బెబ్బే మనజాగ్రత్తలో మనం ఉండాలండం… ఇలా జరుగుతుండగా చీకటి పడ్తోంది..
ఆఖరి ప్రయత్నంగా మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు, మూర్తి, ఆర్.ఎమ్.పి. అప్పటికి సి.ఐ. గారు వచ్చారు. మూర్తి లోపలకి వెళ్లాడు. ఆర్.ఎమ్.పి గారు బయట ఉండిపోయారు. తనని పరిచయం చేసుకుని, కవరూ, అందులోని కాగితం సి.ఐ గార్కి చూపాడు మూర్తి .. ఆయన అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు..
“మూర్తి గారూ.. ఇలా దొంగ సొమ్ములైతే ముందు కంప్లైంట్ మాకొస్తుంది. మేము ఇన్వెస్ట్ గేట్ చేసి రిపోర్ట్ ఇయ్యాలి. అరెస్ట్ అవీ మేం చేయాలి. ఇది సరిగా లేదు.. గవర్నమెంట్ ఉత్తరాలు ఇలా ఉండవు” అంటూ టెక్నికల్ గా ఉండవలసిన విషయాలన్నీ ఓపిగ్గా చెప్పారు..
“ఇవ్వాళ ఏప్రిల్ ఫస్ట్ కదా.. ఎవరో మిమ్మల్ని అల్లరి పెట్టడానికి చేసినట్టనిపిస్తుంది నాకు. మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి.. మేం టేకప్ చేస్తాము…” అన్నారు సి.ఐ.
షాకో, రిలీఫో తెలియని స్థితికి వెళ్లిపోయాడు మూర్తి ..
“ఎక్స్క్యూజ్ మీ” అని సి ఐ గారి బల్లమీద ఉన్న గాజు గ్లాస్ లో నీళ్లు గట గట తాగేసాడు..
జేబులోంచి రుమాలు తీసుకుని మొహం తుడుచు కున్నాడు.. గాలి గట్టిగా పీల్చి ఒదిలాడు..
“చెప్పండి, కంప్లైంట్ ఇస్తారా ?” అన్నాడు సి ఐ ..
“వద్దులెండి, మా వాళ్ళేదో సరదాకి చేసుంటారు” అని హాయిగా నవ్వేసాడు ...
దటీజ్ ద స్పిరిట్….
మూర్తీ! యు ఆర్ రియల్లీ గ్రేట్…
8 comments:
టోపీలు తీసివేసి (హాట్స్ ఆఫ్ అని నా భావన ) అభినందనలు తెలియచెస్తూన్నా .ఆ నాటి ఆ ఆనందకరమయిన సంఘటన
కళ్లకు కట్టినట్టు మీ ఈ బ్లాగ్ ద్వారా చూపించారు .జోహార్.
mee title April first ani pettakundaa undi unte nenu kooda gollu korikesthoo chadivedaanni ..antha chakkagaa suspense maintain cesthoo vraasaaru. abhinandanalu , Rao garu.
మీ శైలి అద్భుతంగా ఉంది సర్
Thank you for your affectionate response and comments on my post in the blog, dear sri sastry garu, madam lalitha garu, madam fathima garu..
కధ చక్కగా ఉంది. కాని కధలో హీరో మనం అవకుంటేనే ఆనందిస్తాము. మనమే అయితే మనకి
విషాదం మిగతావారికి వినోదం.
హరాజీకాలు రాస్తూ ఉండండి. ఆనందించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.
kanulaku kattinatlu undi.wonderful
abinandanalatho Mani Nagesh
thank u sri prasad garu and smt mani garu for having read my post and responded.
Post a Comment